"బాబ్బాబు.....ముందు నేనడిగిన క్వచ్చనుకో జవాబు చెప్పు......ఆ తర్వాత నాకొ ఇన్ఫర్మేషన్ చెపుదువుగానీ"
"నేన్నీకు అడ్డమైన ప్రశ్నలకూ జవాబు చెప్పేవాడిలా కన్పిస్తున్నానా?" అన్నాడు హనుమాన్ లు బింకంగా.
"అలా కోప్పడిపోకురా.....బిడ్డా....నాకు కుక్కలంటే బయ్యం-అందుకే" ఏదో చెప్పబోయాడు ఆ ఖాకీనిక్కరు మనిషి.
వాడివేపు ఎగాదిగా చూస్తూ-
"నువ్వు రౌడీవి, విలన్ వీ కాదా!?"
"నేనా.....రౌడీనా?" పెద్దగా నవ్వాడు ఆ నిక్కరు మనిషి.
"నేను రౌడీని కాదురా బాబూ. పెద్ద మనిషిని. మా వూరు మొండిపాలేం.....అక్కడనుంచి వచ్చాను. నేను చాలా డేరింగ్ అండ్ డేషింగ్ మనిషినేకానీ.....ఒక్క కుక్కల దగ్గరతప్ప అందుకే ఇన్ని కార్లతో వస్తుంటాను...."
అంటే, ఈ కుక్కలా వీధిలోకి రావడానికి అన్ని కార్లతో వచ్చావా.....ఆ కార్లన్నీ నీ సొంత కార్లేనా?"
"కాదులేరా అబ్బాయ్.....సిటీలో కారు మెకానిక్కులందరూ మా దోస్తులే....ఆ నల్ల కారే నాది. అద్సరే గానీ పాయింట్ కొచ్చేస్తున్నాను. చూడు.....ఇక్కడ నారాయణరావని.....పెళ్ళిళ్ళూ అవీ చెడగొట్టే వాడొకడుంటాట్ట. వాడెక్కడుంటాడో చెపుతావా?" మీసాలు దువ్వుకుంటూ అడిగాడు.
"ఎందుకూ.....?" దీర్ఘం తీసాడు హనుమాన్ లు.
"చిన్నపని బడిందిలే...." అని నిక్కరు మనిషి చెపుతున్న లోపలే లోపల్నించి గబుక్కున వచ్చేశాడు నారాయణరావు టైమ్ కి బేరం తగిలిందనే సంతోషంతో.
ఠీవిగా, వాలుకుర్చీలో కూర్చుని స్టోరీనంతా చెప్పాడు ఆ ఖాకీ నిక్కరు మనిషి. అతగాడి నామధేయం జాబాలి నాయుడు.
"అదేం పేరు....." అతని పేరు వినగానే మొహం అదోలా పెట్టి అన్నాడు నారాయణరావు.
"మాది జాబాలి అనే పురాణ పురుషుడి వంశం. అందుకని మా పెద్దలు నాక ఆపేరు పెట్టారు."
"కానీ....మా నాయుడుగారికి, జాలెక్కువ కాబట్టి, ఊళ్ళో ఆయన్ని జాలి నాయుడుగారని పిలుస్తారు. ఊళ్ళోకి నువ్వొచ్చినప్పుడు జాలినాయుడని అడిగితేనే ఆయన గురించి ఎవరయినా చెప్తారు....." జాలి నాయుడు అసిస్టెంట్ ఒకడు చెప్పాడు మధ్యలోకి దూరిపోయి.
"అదిసరే నేనిప్పుడేం చెయ్యాలి?" పెన్నూ, పేపరూ తీసుకుని అడిగాడు నారాయణరావు.
"ఈ కుర్రాళ్ళున్నారు చూసావూ.....లవ్వు ముందుపుట్టి, తర్వాత వాళ్ళు పుట్టినట్లు మాట్లాడతారు. మా పిచ్చిగుంటడున్నాడు.....ఎం.బి.బి.యస్ చదివించాను. అక్కడ ఒక పిల్ల ప్రేమలో పడ్డాడు. అదీ ఒన్ సైడ్ లవ్ రేపాడు, అఫీషియల్ గా పెళ్ళిచూపులకెళుతున్నాడు-నాకు తెలీకుండాకానీ నాకది తెల్సి పోయిందిలే....." మీసాలు మెలివేసుకుంటూ గర్వంగా అన్నాడు జాలినాయుడు.
"పిచ్చిగుంటడంటున్నారు.....మీవాడికి పిచ్చా?" అడిగాడు హనుమాన్లు.
"పిచ్చా, నయం వెర్రన్నావుకాదు.....పిచ్చిగుంటడని, నేను ప్రేమగా పిలుచుకునే పేరు..... రేపు ఆడు వెళ్ళే.....పెళ్ళిచూపులకు నువ్వెళ్ళి, ఆ చూపుల్ని చెడగొట్టేయాలన్నమాట."
"మరి మీ పిచ్చి గుంటడ్ని ఏం చేస్తారు?" అడిగాడు నారాయణ రావు.
"రేపు నాకు హార్ట్ ఎటాక్ వస్తుందయ్యా.....నువ్వు సిన్మాలు చూడవా?" కసిగా అడిగాడు జాలినాయుడు.
"అంటే.....మీ పిచ్చి గుంటడ్ని.....మీ ఇంటినుంచి కదలకుండా మీరు చేస్తే, నేను ఆ అమ్మాయి ఇంటికివెళ్ళి, ఆ అమ్మాయిని అఫీషియల్ గా చూసి, నాకు నచ్చలేదని చెప్పేయాలన్నమాట.....అంతేనా" గబగబా ఆ విషయాల్ని నోట్స్ లాగా రాసుకొంటూ అన్నాడు నారాయణరావు.
"మరి, మావాడు పిచ్చిగుంటడు కాదని, ఆ అమ్మాయి పోల్చేస్తుంది కదండీ" అనుమానంగా అడిగాడు హనుమాన్లు.
"మావాడ్ని పిచ్చిగుంటడని ముద్దుగా నేను పిలుచుకుంటూ నయ్యా బాబూ.....నువ్వూ ఆ పేరుతో పిలిస్తే ఎలా....వాడిపేరు అరుణ్ కుమార్" కొంచెం కోపంగా అన్నాడు జాలినాయుడు.
"అదేదో హిందీ హీరో పేరులా వుందే....సరే ఆ అమ్మాయి నన్ను పోల్చుకోలేదంటారా?"
"పోల్చుకోలేదు....ఎందుకో తెలుసా.....మావాడు దుబ్బుగా పెరిగిన జులపాల జుత్తుతో, ముఖమే కనబడకుండా వుంటాడు. దానికితోడు నల్ల కళ్ళద్దాలు.....నిన్నాపిల్ల పెళ్ళిచూపుల్లో చూసిందనుకో....శుభ్రంగా క్షవరమూ అదీ చేసుకొని వచ్చాడేమో అనుకుంటుంది....అంతే" ఇంతకీ నీ ఫీజెంతన్నావ్?" జేబులో చెయ్యి పెడుతూ అడిగాడు జాలినాయుడు,
నారాయణరావు తలత్రిప్పి హనుమాన్లు వేపు చూశాడు.
హనుమాన్లు ఠీవీగా, ఓ ఫైల్లోంచి ఓ కాగితాన్ని తీసి జాలినాయుడి కిచ్చాడు.
"ఏంటిదంతా?"
"మా సంస్థ రూల్సూ, రెగ్యులేషన్సూ తదితర వివరాలన్న మాట" చెప్పాడు హనుమాన్లు.
"అంటే, ఫీజులేదా...." నవ్వు ముఖంతో అడిగాడు జాలినాయుడు.
"ఫీజెందుకు కదూ....ఏదో నామకా....వెయ్యి రూపాయలు మాత్రం వసూలు చేస్తాం" చెప్పాడు నారాయణరావు.
"వెయ్యి రూపాయలా?" ఆవలించినట్లుగా గొంతు తెరచుకొని అన్నాడు జాలినాయుడు.
"దీనికే మీరు అంత ఆశ్చర్యపోతారెందుకండీ బాబూ.....వెయ్యి అబద్దాలాడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు ....మా సంస్థది కూడా అదే సూత్రం...వెయ్యి రూపాయల ఫీజుతో ఒక పెళ్ళి చెడగొట్టడం అంతే."
"బావుంది.... బావుంది.... ఇది జాగ్రత్తగా చెడిపోయేటట్టు చేయండి.....మా వూళ్ళో కేసులన్నిట్నీ మీ దగ్గరికే పంపిస్తాను....." అంటూ వెయ్యి రూపాయల్ని నారాయణరావు చేతిలో పెట్టాడు గాలి నాయుడు. ఆ రూపాయల కాగితాల్ని, రెండుసార్లు లెక్కపెట్టుకొని, హనుమాన్లు వేపు చూశాడు నారాయణరావు.
హనుమానులు ఒక దగ్గుదగ్గి, చెప్పడం ప్రారంభించాడు__
"చూడండి నాయుడుగారూ.....మావాడు మామూలుగానే అక్కడకు వెళ్ళాలా? మారువేషంలో వెళ్ళాలా?"
"మామూలుగా వెళితే చాలు."
"వెనకమందీ మార్బలం వుండాలా.....ఒక్కడూ వెళ్తే చాలా?"
"ఒకరిద్దరు ఫ్రెండ్స్ లా వుంటే బావుంటుంది"
"కారులో వెళ్ళాలా, ఎడ్లబండిమీద?"
"ఎడ్లబండేమిటి.....అసహ్యంగా....కారయితే.....బావుంటూంది"
"అదే, ఏకారు.....మారుతీనా, అంబాసిడరా, ఫియట్టా"
"మారుతీ అయితే షోగ్గా వుంటుందబ్బాయ్"
"ఓకే.....ఓకే...." హనుమానున్లు ఒక పేపర్ మీద లెక్కలేసి-
"మొత్తం పదివేలు" అని గట్టిగా బయటికన్నాడు.
"పదివేలా.....దేనికీ?"
"ఖర్చులండీ బాబూ......మిస్ వీనియన్స్ ఎక్స్ పెండేచర్" అన్నాడు హనుమాన్లు.
"ఫీజిచ్చాను కదా!"
"మీరిచ్చిన ఫీజు మెయిన్ కేరక్టర్ కన్నమాట....మిగతా టెన్ థౌజెండ్....కారుకీ, వెనకొచ్చే మనుషులకీ....వాళ్ళు వేసుకొనివచ్చే అద్దె డ్రెస్సులకూ.....మేకప్పులకూ"
"ఈ తతంగమంతా వుంటుందా?" మళ్ళీ ఆశ్చర్య పడ్డాడు జాలినాయుడు.
"వుంటుందా ఏమిటి....వుంటుంది....ఆ మధ్య బొంబాయిలోని హర్షన్ మెహతా గారింట్లో, ఓ పెళ్ళి చూపుల్ని చెడగొట్టాలని వచ్చింది. మెహతా-మా నారాయణరావు కాళ్ళావేళ్ళా పడ్డాడు. అంతే.....రేమండ్స్ సూట్స్ అద్దెకు తీసుకున్నాం.....ఓ ఫ్లయిట్ అద్దెకు తీసుకున్నాం.....అక్కడ ఫ్లయిట్ దిగాక, పది మారుతీకార్లు, సీన్ ఫర్ ఫెక్ట్ గా రావాలంటే, ముత్తయిదువులూ వగైరా వుండాలికదా.....మావాడు అనూ అగర్వాల్ కీ, పూజాబేడీకి, మమతాకులకర్ణికి, ఫోన్ లు చేశాడు......అందరూ పట్టుచీరలు కట్టుకొని వచ్చేసారు. మరి వాటి ఖర్చులు"