Previous Page Next Page 
మొగలిబాకు పేజి 2

   

     "బాత్ రూమ్ లో తను టూత్ పేస్టు పెట్టుకోలేదు....మరి....ఈ పేస్టు.....ఆఁ....అంటే, ఇది అంకుల్ గెడ్డాం గీసుకోడానికి పెట్టుకున్న షేవింగ్ క్రీమ్ అన్నమాట.....అయ్యబాబోయ్....." గట్టిగా కేకలేస్తూ_
   
    "పళ్ళకు జుత్తుచ్చేస్తుంది.....జుత్తోచ్చేస్తుంది...." అని అనుకుంటూ గబగబా తన రూమ్ వేపు పరుగెత్తి నోరంతా నీళ్ళతో పుక్కిలించి- టూత్ పౌడర్ ని తీసి శుభ్రంగా మొహం కడుక్కుని వరండా మీద నుంచున్నాడు నారాయణరావు.
   
    షేవింగ్ క్రీమ్ లో పొరపాటున ఎప్పుడయినా పళ్ళను తోముకుంటే పళ్ళకు జుత్తు మొలుస్తుందని. ఎప్పుడో ఎవరో చెప్పారట! ఆ సమయంలో అది జ్ఞాపకం రావడంతో తన జ్ఞాపకశక్తిని తలచుకుని, మరొక్కసారి పొంగిపోయాడు నారాయణరావు.
   
                                           *    *    *    *
   
    నారాయణరావుకి పాతికేళ్ళు. ప్రస్తుతం తీవ్రంగా ఉద్యోగాన్వేషణలో వున్నాడు.
   
    పల్లెటూరు నుంచి విశాఖపట్నానికి అందుకే వచ్చాడు__అనకాపల్లి పక్కనున్న పల్లెటూళ్ళో అతనికి అమ్మ, నాన్న, ఇద్దరు చెల్లెళ్ళు వున్నారు. తండ్రి వ్యవసాయం చేస్తాడు.
   
    "మనకు పదెకరాల భూమి, పుట్రా వుంది కదరా.....నువ్వెందుకు ఉద్యోగానికి వైజాగ్ వెళ్ళడం__" నారాయణరావు ఉద్యోగానికి వెళతాననగానే తండ్రి వేసిన మొదటి ప్రశ్న అది.
   
    "భూమి, పుట్రా ఉంది__దాని మీద బోర్లా పడుకోవడం తప్ప, నాకేం చేతకాదు__కదా__పైగా రోజుకో సంబంధం చొప్పున ఇప్పటికే వంద సంబంధాలు చూశాడు. ఒక్కటీ పైసలయి చావటం లేదుగా? బుద్ధిలేక ఏదో డ్రామా ఆడి దొరికిపోయాను. కనుక నాకిప్పుడప్పుడే పెళ్ళయ్యే దురదృష్టం లేదు__అందుకే వైజాగ్ వెళ్ళి ఉద్యోగం చూసుకుంటాను." పక్కనే ఉన్న అరవైయేళ్ళ నానమ్మవేపు చూస్తూ అన్నాడతను.
   
    నాన్నమ్మ కాంతమ్మ మొదటి నుండీ నారాయణరావు పక్షమే__ఆవిడ వెంటనే తన కొడుకు సుబ్బడు అనే సుబ్బారావు వేపు కోపంగా చూసి__
   
    "ఒరే.... సుబ్బడూ.... ఆడు కలెక్టరు కావాల్రా....పట్టణం వెళ్ళనీరా....." అంది దీర్ఘం తీస్తూ.
   
    "పట్టణం వెళితే....కలెక్టర్ అవుతారేంటే.....నీ పిచ్చిగానీ..... నీ గారాభంతో వాడ్ని చెడగొట్టేస్తున్నావ్. చదువుకోరా అని కాలేజీకి పంపిస్తే ప్రేమలు- డ్రామాలు అని వెర్రివేషా లేసాడు. అందుకే సంబంధం కుదిరి చావడంలేదు..... మళ్ళీ వైజాగ్ వెళ్ళి ఏం చేస్తాడో?" అరిచాడు సుబ్బారావు.
   
    "మీ నాన్న ఆ రోజుల్లో పట్నం వెళ్ళేవాడే....." మళ్ళీ అంది కాంతమ్మ.
   
    "కలెక్టర్ అవడానికి కాదు.....కలెక్టర్ని కలవడానికి.....అంతే....కలెక్టరంటే చిన్నా, చితకా చదువు కాదు.....కేవలం బి.కామ్....పాసై నోడికి కలెక్టర్ గిరీ ఇవ్వరు...." చేతికర్ర తీసుకుని ముందుకు నడుస్తూ అన్నాడాయన.
   
    "ఒరేయ్.... సుబ్బడూ.... అపభ్రంశం మాటలు ఆపరా......అదృష్టం వుంటే, కలెక్టర్ గిరి దాని మట్టుకు అదే వస్తుంది. నువ్వెళ్ళరా చిట్టీ.... కలెక్టర్ గిరీ దొరక్కపోతే.... అ గవర్నర్ గిరీ పట్టుకో..... నీకేం తక్కువ" అందామె అమాయకంగా.
   
    "అవును..... నాకేం తక్కువ....అలాగేలే నాన్నమ్మ" అన్నాడు నారాయణరావు ఆనందంగా.
   
    ఆ తర్వాత తండ్రి ఇచ్చిన రెండువేల రూపాయల్ని తీసుకుని విశాఖపట్నం బస్సెక్కాడు.
   
    తెచ్చుకున్న రెండువేలూ....మూడు నెలల్లోనే అయిపోయాయి. అప్పట్నుంచీ డబ్బు కోసం, కిందా మీదా పడడం మొదలెట్టాడు.
   
    పల్లెటూరు నుంచి పట్నం వచ్చాక తెల్సింది నారాయణరావుకి__గవర్నర్ గిరీ మామూలు ఆఫీసుల్లో, మామూలు పోస్టు కాదని- ఇంకా చాలా విషయాలు తెల్సుకొన్నాడు. పట్నం రాకపోతే తనకలాంటి అరుదయిన, అద్భుతమయిన విషయాలు తెలియవు కదాని తెల్సుకొని, ఆ సంతోషంలో కన్నీళ్ళు పెట్టుకున్నాడతను.
   
    భారంగా ఎనిమిది నెలలు గడిచిపోయాయి.
   
    చెయ్యడానికి ఉద్యోగం, చేతిలోకి డబ్బు లేకపోవడంతో నానా ఇబ్బందులూ పడ్డాడు నారాయణరావు.
   
    డబ్బుల్లేక పోవడంవల్ల, హోటల్ పక్కన నిలబడి, ఆ హాయైన గాలిని పీల్చి, ఆకలిని మర్చిపోయిన రోజులున్నాయతనికి.
   
    అలాంటి సమయంలోనే- ఓ రోజు ఆ ఆఫీస్ కి ఇంటర్వ్యూ కి వెళ్ళాడు- ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి యువకుడే.
   
    ఆ ఉద్యోగం అయితే ఇవ్వలేను- వేరే ఉద్యోగం ఇస్తాం- అదీ ఒక రోజు ఉద్యోగం- జీతం వెయ్యి రూపాయలు అని చెప్పగా నారాయణరావుకి వెయ్యి వాట్స్ కరెంట్ షాక్ తగిలినట్లయిపోయాడు.
   
    అయినా డబ్బు అవసరం గనుక ఆ ఏక్ దిన్ కా జాబ్ ఒప్పేసుకున్నాడు.
   
    కుదరబోతున్న పెళ్ళి సంబంధాన్ని చెడగొట్టడమే ఆ ఉద్యోగం. తనను ఇంటర్వ్యూ చేసిన యువకుడి పేరుతో - అతని ఐడెంటిఫికేషన్ తో పెళ్ళికూతుర్ని చూట్టానికి వెళ్ళి తన సహజ ధోరణిలో తికమకగా వ్యవహరించాడు నారాయణరావు.
   
    దాంతో సదరు పెళ్ళికూతురు నాకీ సంబంధం వద్దంటూ పెళ్ళి చూపుల సోఫాలోంచి లేచెళ్ళిపోయింది.
   
    ఇంటర్వ్యూ ఆఫీసర్ కి ఆ సంబంధం నచ్చకే అందుకు నారాయణరావుని వినియోగించుకున్నాడు.
   
    ఏదయితేనేం నారాయణరావుకు వెయ్యి రూపాయలతోపాటు ఒక వింత వృత్తి అతని బ్రెయిన్ లో ఫ్లాష్ లా మెరిసింది.       
   
    గాఢమయిన ప్రేమలు, భారమయిన పెళ్ళి సంబంధాలూ చెడగొట్టడం__ నెమ్మది, నేమందిగా ఆ వృత్తిలో మెళుకువలు నేర్చుకుని, తనుండే సీతమ్మ ధార కాలనీలో మొదలెట్టి విశాఖపట్నం సిటీ అంతా ప్రాకిపోయాడు.
   
    పక్క పక్క ఊళ్ళ నుంచి కూడా ఎడ్లబండి మీద వచ్చి- అతని సలహా తీసుకుని ఫీజిచ్చి వెళ్ళిపోతుంటారు__ఇంపార్టెంట్ కేసుల విషయంలో తనే అటెండ్ అవుతాడు. చిన్న చిన్న మనస్పర్ధలు, డిఫరెన్స్ల కేసులకు శిష్యుల్ని పంపుతుంటాడు.
   
    ప్రస్తుతం నారాయణరావు కింద అయిదుగురు ఫుల్ టైమ్, ఆరుగురు పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్నారు __అందులో ముగ్గురు అమ్మాయిలు కూడా వుండడం విశేషం. సీతమ్మధార జంక్షన్ లో చిన్న ఆఫీసు కూడా తీసుకున్నాడు.
   
    గత వారం రోజులుగా ఒక్క కేసు కూడా లేకపోవడంతో చాలా దిగాలుగా వున్నాడు నారాయణరావు. కొన్ని అనివార్య కారణాల వల్ల గత మూడు నెలలుగా ఇంటి అద్దె ఇవ్వలేకపోయాడు. ప్రస్తుతం కాఫీ పౌడర్ కొనడానిక్కూడా డబ్బుల్లేవు.
   
    ఠంచన్ గా ఉదయం తొమ్మిది గంటలకల్లా కాఫీ కడుపులో పడకపోతే విలవిల్లాడిపోతాడు నారాయణరావు. తన ప్రియతమ అసిస్టెంట్ కూడా అంతవరకూ రాకపోవడంతో సీరియస్ గా వంటగదిలో పచార్లు చేస్తున్నాడు.
   
    సరిగ్గా అదే సమయంలో__
   
    ఆంటీగారి కిచెన్ రూమ్ లోంచి కాఫీ వాసన గాల్లో తేలుతూ రావడంతో ముఖం సూర్యకాంతం పువ్వులా వికసింపా చేసుకొని అటువేపు నడిచాడు.
   
    కొన్ని విషయాల్లో మనం అసలు మొహమాటపడకూడదు....పడితే దెబ్బ తినేస్తాం.....అన్నది అతగాడి సిద్దాంతాల్లో ఒకటి.
   
    "ఆంటీగారూ....."

 Previous Page Next Page