Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 28

    అమల తన్నటానికి రెడీ అయింది.

    సరీగ అప్పుడే రామచంద్రం గదిలోకి వచ్చాడు. "అదేంటి?" అన్నాడు ఆశ్చర్యంగ.

    శంకరం గోల్డెన్ ఛాన్స్ పోయినందుకు విచారిస్తూ నా ఖర్మ, కాలిలో బంగారు ముల్లు విరిగిందట తీయాలిట." అన్నాడు.

    "తొండముదిరి వూసరవిల్లిలా కాకముందే మందో మాకో చూడాలి." గొణిగాడు రామచంద్రం.

    "నా బంగారు ముల్లేది!" అంది అమల.

    "కాకెత్తుకుపోయింది." అన్నాడు శంకరం.

    "కాకి ఎక్కడుంది?"

    "పెరట్లో వుంది."

    "అయితే పెరట్లోకి వెళ్ళి కాకిని ఎత్తుకువస్తాను. కాకి కాల్లో ముల్లు తీయాలి. కాదంటే చావగోడతాను." అంది అమల.

    "కాకిని తీసుకురా ముల్లు తీసి యిస్తాను." హాయిగా చేతులు దులుపుకుంటూ అన్నాడు శంకరం.

    బంగారు ముల్లు గింగారు కాకి" అంటూ అమల అక్కడనుంచి లేచి వెళ్ళింది.

    ఇదే సందు, అదే మందు అన్నట్లు ఎక్కడెక్కడో చేయివేసి తడమాలనుకున్న శంకరం గోల్డెన్ ఛాన్స్ పోయిందని విచారిస్తే అంతకన్నా పదిరెట్లు విచారించింది అమల. శంకరం మూతి పగలగొట్టాలనుకున్న గోల్డెన్ ఛాన్స్ అమలకి కూడా పోయింది.

    చేయిజారిపోయిందనుకున్న ఛాన్స్ ఆ సాయంత్రమే అమలకి లభించింది.

    శంకరం ఆఫీసు రూంలో కుర్చీలో అటు తిరిగి కూర్చుని ఏదో వర్క్ చేసుకుంటున్నాడు.

    అమల అది చూసింది. పిల్లిలా నడిచి అతని వెనుకకి చేరింది.

    అమల చేతిలో పదునైన పెద్ద కత్తెర వుంది.

    అమల వెనుకనుంచి శంకరం జుట్టు గట్టిగా పట్టేసింది.

    శంకరం మెడదాకా జుట్టు పెంచాడు. అది అమలకి బాగా అందింది.

    "బాబోయ్!" అన్నాడు శంకరం.

    "అరవకు. నా చేతిలో కత్తెర వుంది. అరిచావో చెవి లటుక్కున కత్తిరిస్తాను" అంది అమల చేయిజాపి కత్తెర చూపిస్తూ.

    శంకరం పై ప్రాణాలు పైనే పోయినట్లు అయాయి.

    లేచి పారిపోదామా అంటే అమల చేతిలో తన జుట్టు వుంది. పోనీ అరుద్దామా అంటే చెవి కత్తిరించినా కత్తిరిస్తుంది ఈ పిచ్చిది" అనుకుని నోరు మూసుకుని వణుకుతూ కూర్చున్నాడు శంకరం.

    "కాకిని తెమ్మని పంపించి పారిపోతావా! కాకిని తెస్తే కాలులో ముల్లు తియ్యనంటావా? నా బంగారు ముల్లు నా కాల్లోనే వుంటే కాకి కాల్లో వుందని చెపుతావా ఇడియట్. గిడియట్, బ్రూట్, గ్రీట్, టక్ టమారం" అమల పిచ్చిగా వాగుతూ శంకరం క్రాపుని ఇష్టమొచ్చినట్లు కత్తిరించి పారేసింది. శంకరం కదిలినప్పుడల్లా చిన్న చిన్న గాట్లు కూడా పెట్టింది.

    "అదేమిటమ్మా!" అంటూ భుజంగరావుగారు గదిలో కాలుపెట్టారు.

    అమల వులిక్కిపడి అంతలోనే సర్దుకుని కత్తెరతో శంకరం బుగ్గమీద గాటుపడేలా పొడిచి "ఇదా! ఇహిహీ, వీడేమో మరేమో నాజుట్టు దువ్వుతావా అని అడిగాడు కత్తెర తెచ్చి దువ్వాను అంతే" అంటూ శంకరాన్ని వదిలేసింది.

    "నాకేం తెలియదు బాబోయ్! అమ్మాయిగారు చంపేశారు బాబోయ్. పొలం లెక్కలు చూస్తుంటే వెనుకనుంచి వచ్చి నా భరతం పట్టారు." తల, బుగ్గ తడుముకుంటూ అన్నాడు శంకరం ఏడ్పు ఒక్కటే తక్కువగ.

    "ముందు వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళిరా" పిచ్చి కూతురిని ఏమనాలో తెలియక శంకరంతో బాధగా అన్నాడు భుజంగరావు.   

 Previous Page Next Page