Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 28

    "అక్కా! ఇక్కడ ఎంతమంది వున్నారో తెలుసా? పురోహితుడితో కలిపి మొత్తం యాభై ఆరుమంది వున్నారు. నేను లెక్కవేశాను" అంది ఉత్సాహంగా కళ్ళు వూపుతూ ప్రవీణ.

    "అవునా.....భలే భలే" చిట్టి పెద్దగా చప్పట్లు చరుస్తూ అన్నాడు.

    "లేవండి భోజనాలకి" చలపతి పిలవడంతో ముగ్గురూ లేచారు.

    "రా అక్కా అటు వెళదాం. ఇటంతా మగవాళ్ళు. మగవాళ్ళ పక్కన ఆడవాళ్ళు కూర్చోవడం పాపం" అంది అమాయకంగా.
    "పాపమని ఎవరు చెప్పారు?"

    "అమ్మా నాన్నా"

    చిట్టి మగవాళ్ళతో కూర్చుంటే వాళ్ళు స్త్రీలబంతిలో కూర్చున్నారు. బెంచీలు, కుర్చీలు అరేంజ్ చేశారు"

    "ఏర్పాట్లు బాగానే వున్నాయి" అంది చంద్రరేఖ అన్ని వైపులకు కలయజూస్తూ.

    "ఆ- అన్నీ చలపతన్నయ్య చేశాడు .మొత్తం పదహారు బల్లలు నలభై కుర్చీలు లెక్కవేశాను" ఉత్సాహంగా చెప్పింది ప్రవీణ.

    ఆమె మాటలు వింతగా అనిపించాయి చంద్రరేఖకి.

    భోజనాల వడ్డన ప్రారంభమైంది.

    జాంగిరీ, వడ, అప్పడంతోపాటు ఓ కర్రీ, పచ్చడి వేశారు. కూరలన్నీ బాగున్నాయి.

    ఓ పక్క భోజనాలు జరుగుతుండగా, మరోపక్క పెళ్ళి ఏర్పాట్లు నడుస్తున్నాయి.
 
    పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు నలుగు కార్యక్రమం పూర్తయి రెండో ఘట్టంలోకి ప్రవేశించారు.

    భోజనాలయాక అంతా షామియానాకింద చేరారు. దానికింద పెళ్ళి మంటపం ఏర్పాటు చేశారు.

    పెళ్ళిమంటపం అంటే బల్లలు వేసి, దానిమీద దుప్పట్లు పరిచారు. నాలుగువైపులా వేలాడేలా పూలదండల్ని అలంకరించారు.

    ప్రవీణ, చంద్రరేఖ అక్కడ చివరగా వేసివున్న కుర్చీలో కూర్చున్నారు. వాళ్ళని చూసి తాంబూలం వేసుకుంటున్న చిట్టి అక్కడికి వచ్చి వాళ్ళ వెనకనున్న కుర్చీలో ఆశీనుడయ్యాడు.

    వెంకటాచలం ఊర్మిళ మెడలో మంగళసూత్రం కట్టాడు. మంగళ వాయిద్యాలు తారాస్థాయికి చేరి ఆ తరువాత పాటలకు దిగాయి. దంపతులిద్దరూ హోమంచుట్టూ తిరుగుతున్నారు.

    భోజనాలు అయిపోవడంతో పాత్రలను పనివాళ్లు కడుగుతున్నారు.

    "గ్లాసులు మొత్తం ఏభై తెచ్చినట్టు వున్నారే"

    ప్రవీణ అలా అనడంతో చంద్రరేఖ ఆమెవైపు తల తిప్పింది.

    "ఏమిటి గ్లాసులు లెక్కపెట్టావా?"

    అవునన్నట్లు తల వూపింది.
 

 Previous Page Next Page