Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 28

    "ఇప్పుడేం చేద్దాం. రా" వీర్రాజు జేబులోని చిల్లరను పైకితీసి, లెక్కబెట్టి, "రూపాయి అఠణా" అని అన్నాడు.

    "చిల్లర జేబులో పెట్టవోయ్. హాయిగా ఆ రెస్టారెంట్లో కెళ్ళి చికెన్ బిర్యానీ తిందాం రండి"

    "చికెన్ బిర్యానీకి పైసలేవీ?"

    జేబులోంచి వందరూపాయలు తీసి, గాల్లో ఊపాడు హుషారుగా పోతురాజు.

    "ఎక్కడిదీ"

    జైలరు భయ్యా కోపంగా నన్ను బయటికి లాక్కొచ్చాడా....దానికి ఫైన్ వేస్తానన్నమాట. అప్పుడే ఆందోళనరావు జేబులోంచి కొట్టేసా" కిచకిచమంటూ నవ్వాడు పోతురాజు.

    మిగతా ఇద్దరు ఆ నవ్వుతో శృతి కలిపారు.
   
                                                                        ౦    ౦    ౦

    నల్లకుంటలో, వాళ్ళ అద్దెకున్న ఇల్లున్న వీధిలోకి వెళ్ళబోతున్న ముగ్గురిలో వీర్రాజు సీరియస్ గా ఆలోచిస్తూ నెమ్మదిగా అడుగులేస్తున్నాడు.

    "ఏమిట్రా పెళ్ళి నడక.....జల్దీగా ఉరుకు" హెచ్చరించాడు పోతురాజు.

    "పెళ్ళి నడక కాదురా పైలా పచ్చీసూ. మనం ఆ వాలేశ్వరర్రావు గాడికి మూడు వందలు అక్షరాలా బాకీపడ్డాం. మనం కనబడగానే ముందు ఆ మూడొందలూ కక్కమంటాడు. ఆ తర్వాత మేడ మెట్లెక్కమంటాడు ఆ విషయమే ఆలోచిస్తున్నాను. ఎవడైనా దొంగ మొహంవాడు కనబడతాడేమోనని"

    వాలి అని ముద్దుగా పిలవబడే వాలేస్వర్రావు మేడమీద గదిలో ముగ్గురు మిత్రులు చాలా కాలంగా, సర్వే డిపార్టుమెంటులో, రోడ్డు సర్వేయర్స్ గా పనిచేస్తున్నామని చెప్పి, ఆ యింట్లో అద్దెకు దిగారు. ఆ రూమ్ అద్దె వంద రూపాయలు. అయినా ఏనాడూ సరిగ్గా కట్టిన పాపానపోలేదు.

    "మన హౌస్ ఓనర్ పేరుకే వాలి. పోలిక్లాన్నీ కుంభకర్ణుడివేగదా అంచేత డోన్ట్ వర్రీ. వాడు ఈ టైములో నిద్రపోతుంటాడు. మనం హాయిగా గోడెక్కి, అక్కడ్నించి మేడెక్కెద్దాం"

    "వాడికి అడుగుల్ని పసికట్టే జబ్బుందిరా బాబూ" సేతురాజు అన్నాడు.

    "అంతగా డేంజర్ సిట్యువేషన్ ఏర్పడితే నేన్చూసుకుంటాను గదా పద" పోతురాజు హామీతో, ఇరవై అడుగుల దూరం నడిచాక-

    ఒక విపరీత దృశ్యం వారికి కనబడడంతో, అవాక్కయిపోయి ముగ్గురూ చూడసాగారు.
   
                                                              ౦    ౦    ౦

    ఆ డాబాయిల్లు ముట్టుకుంటే కూలిపోయేదశలో వుంది. ఆ యింటిపైన ఒక వ్యక్తి ఎక్కి నిలుచున్నాడు. అక్కడనుంచి అతనేదో గట్టిగా అరుస్తున్నాడు. కిందవాళ్ళకి అతనిమాటలేమీ వినబడటంలెదు.

    ఆ డాబా యింటిమీదున్న వ్యక్తి వాలేశ్వరరావు. అతను కీచు గొంతుతో అరుస్తున్నాడు.

    "చూడండి చూడండి....బాగా చూడండి. అక్కడ నిలబడిన వాడ్ని ఇక్కడ్నుంచి వెళ్ళిపోమనండి ఈ ఏరియాకిగాని, నా యింటికిగాని ఎప్పుడూ రానని, ప్రమాణంచేసి వెళ్ళమనండి లేకపోతే, ఈ డాబామీద నుంచి నేను దూకుతా"

    ఆ డాబాచుట్టూ దాదాపు యాబైమంది వరకూ మూగారు. అందులో ఒకడు-

    "బాబ్బూబూ! నువ్వు దూకమాక....మా గొర్రెలు చస్తాయి" అని ప్రాధేయపడుతున్నాడు.

    ఆ డాబాకింద ఎడమవేపుకి ఓ పాక, దానిలో గొర్రెలు వున్నాయి.

    ముగ్గురూ గబగబా ఆ మంధలోకి చొరబడిపోయి, డాబామీదున్న వాలేశ్వరర్రావు వేపు, క్రింద అయోమయంగా చూస్తున్న ఓ పిడత ఫేసు ఫెలోని చూస్తున్నారు. కింద నుంచున్న పిడత మొహం ఆసామి చేతిలో ఓ పింగాణీ పళ్ళెం. అందులో పేడ ముద్దతో చేసిన గ్లోబులాంటి వస్తువు ఉన్నాయి.

    "ఆ పిడతమొహం వాడెవడు. వాడిచేతిలో పళ్ళెం, పళ్ళెంలో గ్లోబు...వాడికి వాలేస్వరరావు ఎందుకలా భయపడుతున్నాడు" పక్కన నిలబడిన వాడిచెవిని గిల్లుతూ అన్నాడు వీర్రాజు.

    వాడు కోపంగా వీర్రాజువేపు చూశాడు.

    "ఇంతోటి దానికి చెవిని గిల్లి అడగాలా. నాకు తెల్సినా, నేను చెప్పను" వాడు కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

    "వీడెవడండీ బాబూ ఒరేయ్ నువ్వయినా చెప్పరా" ఇంకో చింపిరి జుత్తువాడ్ని అడిగాడు సేతురాజు.

    వాడు వెంటనే చెప్పాడు-

    "డాబామీద ఎక్కినవాడు హౌస్ ఓనర్ వాలేశ్వరర్రావు, కిందనున్న ఆ పింగాణీ ప్లేట్ వాడు డాక్టర్ మతిమరుపు"

    "ఆ ప్లేట్లో ఏంటది. గ్లోబా" ఆసక్తిగా కళ్ళు చిట్లించి చూస్తూ అడిగాడు పోతురాజు.

    "గ్లోబా. భలేవాడివయ్యా బాబూ. మెదడయ్యా బాబూ. ఒర్జినల్ బ్రెయిన్."

    "ఒర్జినల్ బ్రెయినా.....ఎవరిది?" ఆశ్చర్యంగా అడిగాడు సేతురాజు.

    "అదిగో ఆ వాలేశ్వరర్రావుదే!"

    "అతని బ్రెయిన్ ఇతని చేతుల్లోకి ఎలా వచ్చింది? ఇతను బ్రెయిన్ల వ్యాపారా?" మరింత సందేహాస్పదంగా అడిగాడు వీర్రాజు.

    ఇదేం ప్రశ్నయ్యా  బాబూ. అసలు కథేంటంటే, ఈ డాక్టర్ వారం రోజులక్రితం వాలేస్వరర్రావుకి బ్రెయిన్ ఆపరేషను చేశాడు. ఎవరికయినా మతిమరుపు సహజమే కదా. ఆ టైమ్ లో ఏదో బిజీగా వుండి, బ్రెయిను లేకుండా కుట్లు వేసేశాడు. వాలేస్వరరావు డిస్ చార్జి అయి ఇంటికొచ్చేశాడు తన దగ్గరే వున్న బ్రెయిన్ను తీసుకోమని ఫ్రీగా ఆపరేషన్ చేసి, కుట్టేస్తానయ్యా అని మతిమరుపు అంటుంటే, ఆ బ్రెయిను నాకక్కర్లేదని నువ్విక్కడ నుంచి వెళ్ళకపోతే. దూకి చస్తానని వాలేస్వరరావు బెదిరిస్తున్నాడు"

 Previous Page Next Page