ఖంగుమంది శ్రీదేవి కంఠం.
ఇంతవరకూ ఏ స్వరమయితే వినిపించలేదని ఆతురతతో ఎదురుచూస్తూ యివన్నీ మౌనంగా వింటూ వుంటున్నాడో ఆ కోకిల కంఠం వినిపించే సరికి ఆబగా అటు చూశాడు.
ఎంత అందంగా వుంది శ్రీదేవి?
అయినా ఎంత కాఠఠిన్యం ఆ ముఖంలో!!
తలకి నల్లటి కొంగుతో నిండుగా పైట కప్పుకుని పసుపు పచ్చని ముఖంతో కంటి నిండా కాటుకతో ముఖాన పెద్ద కుంకుమ బొట్టుతో చెక్కిలిపై దిష్టిచుక్కతో--నిండుగా పండిన పసుపు తోటలా.....
"ఏంటి అమ్మాయ్! "దీర్ఘకరించి తన అధికారాన్ని నిలుపుకోవాలని ప్రశ్నించింది బామ్మగారు.
"నీవు నా భర్తని దండించవలసిన అవసరం లేదు బామ్మా. అయన యిష్టం ఎప్పుడయినా రావచ్చు ఎప్పుడయినా తిరిగి వెళ్ళొచ్చు, రాలేదని కానీ వచ్చారని కాని దెప్పి పొడిచి దండించే హక్కు అధికారం మీకు లేదు. ఎవరికి లేదు. అయన యీ యింటి పెద్ద అల్లుడు అంటే ఏమిటో తెలుసా! యీ యింటి చక్రవర్తి."
నివ్వెరపోయారు అందరూ మాధవ్ తో సహా--
అతడికి యిదంతా ఏదో చిత్రంగా వుంది.
శ్రీదేవి తనంటే యింకా అంత అభిమానమా? అబ్బ! ఎలా చెప్పింది....చ.....క్ర....వ...ర్తి.
ముందుగా తేరుకుని బామ్మగారే అడిగింది "ఏమిటేమిటి? నిన్న మొన్నటిదాకా ఆతగాడు రాలేదని రోజుకి యిరవై సార్లు సణుగుతూ వుండిన దానవు-నీవు- నాకు- చెప్పొచ్చావా? ఇహ చాలు వెళ్లు అవతలకి- నేను యీ యింటికి పెద్దదాన్ని అల్లుడైనా మరెవరైనా తప్పు చేస్తే దండిస్తాను."
పెదవుల బింకాన మామ్మగారు అన్న మాటని క్షణంలో తృణికరిస్తు కఠి నంగా అంది. "నీవేచాలించుకో-లే వెళ్ళి హాయిగా నీ పీఠంపై పడుకో, ఎందుకు యింకా నీకి అనవసర అధికారాలు అవసరం లేని విషయాల్లో నీకు జోక్యం ఎందుకు? ఏళ్ళు వచ్చాయ్, రిటైరయ్యావు- ఇంకా నీ అధికారం ఏమిటి? మా అమ్మలా అందరూ పిచ్చాళ్ళనుకుంటున్నావా? నీ గంప గయ్యాళితనానికి జడిసి నోరు ముసుకోవటానికి."
కూచున్నవిడల్లా బలవంతాన శక్తిని కూడదీసుకుని లేచి నుంచుని వణుకుతున్న స్వరంతో అంది. "ఎమిటేవ్? శ్రీదేవి! ఏమిటిది? గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లు నామీదే దండయాత్రకి తయారవుతున్నావ్, అసలు నిన్నింత దాన్ని చెసిందేవరనుకున్నావే? నేనే-నేనే- అలాంటి నన్ను, నన్నా ఎదిర్చి మాటాడతావా? పో- అవతలకి పో-పో ముందిక్కడ నుంచి పో- వినపట్టంలా వెళ్ళమంటుంటే."
"అబ్బబ్బ! ఎమిటర్రా మీ వాదులాట! తరువాత తీరిగ్గా పోట్లాడుకోవచ్చు. ముందు ఆయనకేం కావాలో విచారించండి. ఆ తర్వాత మీ యిష్టం."
విసుగ్గా అన్న సరోజ మాటలకి మండిపడుతూ అంది "సరోజా! నికేన్ని పర్యాయాలు చెప్పాను నా విషయంలో జోక్యం కల్పించుకోవద్దని, నా యిష్టం నా భర్తకి నేనేమైనా యిస్తాను, ఇవను, గౌరవిస్తాను, గౌరవించను. ఈ ఇంట్లోనయినా, నా యింట్లో నయినా అయన వసతులు చూసే హక్కు బాధ్యత నావి.......నావి కానీ నీవి కావు."
జవాబివ్వకుండా రుసరుసలాడుతూ విసవిసా తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది సరోజ.
తనలో తానే ఏదో గొణుక్కుంటువెళ్ళింది బామ్మగారు. బహుశా ఈ కాలం అమ్మాయిల చిత్తవృత్తిని గురించి ఆశ్చర్యపడి అందులోంచి తేరుకోలేక పోయి వుండొచ్చు.
ఇహ అ హల్లో వాళ్ళిద్దరే మిగిలారు.
సూటిగా ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకోలేక పోతున్నారు.
చివరికి శ్రీదేవి "రండి" అని మెల్లిగా పిలిచి తన గదివేపు దారి తీసింది.
మౌనంగా ఆమె వెంటనే వెళ్ళబోతున్న వాడల్లా మామగారు పిలవటంతో ఆగిపోయాడు.
"ఓ మాధవ్.....ఎప్పుడూరావటం? కులాసా?"
ఇంట్లోకి ప్రవేశిస్తూనే పలకరించాడు అల్లుడిని.
"ఇప్పుడేనండి, కులాసానే."
"ఆ ఏమిటి విశేషాలు? ఆఫీసు విషయాలు ఎలా వున్నాయ్? వర్క్ ఏమిటి ఎక్కువైందా తక్కువైందా?"
మనసులోనే నాన్నని విసుక్కుంటూ, చురుగ్గా ఆయనవేపు చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది ఏదో భర్తకి సైగ చేసి.
"అలాగే వుందండి, పెరగలేదు, తరగలేదు" అన్నాడు మాధవ్.
అయన తరహయే అంత. ఎప్పుడూ వచ్చినా అవే ప్రశ్నలు, అదే పలకరింపు, అంతకుమించిన ఆప్యాయత కనబరచడు. దానికి లోటు లేదు.
తర్వాత ఆ విషయం యీ విషయం మరో పది నిమిషాలు మాటాడక హటాత్తుగా ప్రశ్నించారు "ఏమిటి నీవు యింకా యీ వేషం మార్చుకోనేలేదా? వెళ్ళువెళ్ళు"
తనూ లేచి వెళ్ళటానికి సిద్దమయ్యాడు.
మాధవ్ తన సూట్ కేస్ అందుకుని శ్రీదేవి గదివైపు వెళ్లాడు.
"ఏమేవ్! అబ్బాయొచ్చాడు. ఏదన్నా మాంచి టిఫినుందా? ఏమిటి మెనోలో"
నవ్వుతూ వంటింట్లోకి ప్రవేశిస్తూ ప్రశ్నించాడు.
"పోదురు మీ దొక వేళాకోళం"
"అదికాదే-- అల్లుడొచ్చినపుడే కాదా నాకు ఏదో కాస్త మంచి మంచి వంటలు దొరికేది. అందుకనే ముందుగానే భోజనంలో స్పెషల్ ఏమిటా అని అడుగుతున్నాను"
"ఏముంది మీరే చెప్పండి?"
"ఏం చేస్తావబ్బా! బెండకాయ దొండకాయ వేపుడు చెయ్. చుక్కకూర పప్పు సరేసరి-ఇహ అప్పడాలు వడియాలు మాములే- ఇహ పోతే మిగడతో పెరుగు- ఆవకాయ తీసి మరువకుండా తిరగమోత వెయ్-ఇంకేమిటబ్బా"
"సరే!సరే!" ముసిముసి నవ్వులు నవ్విందామె.
ఆమె నవ్వు చూసి "ఆ ఆ ఇవన్నీ నా కనుకుంటున్నావా? నీ కోసం కూడా- అబ్బాయి పేరు చెప్పి మన మూతినేద్దాం- తర్వాత మళ్ళీ చాన్స్ ఎన్నేళ్ళకో"
అంతలో సరోజ రావటం గమనించి ఆవిడ జవాబు యివలేదిక, అయన బయటికి వెళ్ళిపోయాడు.
16