Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 28

ఎక్కడున్నాడు హరీన్? ఆ లోయలోనే ఉండి వుంటాడా?
లేక
అందరూ ఉహిస్తున్నట్లు మరణించి వుంటాడా?
ఆమెకి ఎదురుగా బ్లాంక్ స్క్రీన్ వుంది.
దానిమీద హరీన్ మొహం దర్శనిమిస్తున్నట్లు భ్రాంతి కలిగింది మధుమతికి. కళ్ళార్పకుండా ఆటే చుస్తుండిపోయింది తను.
నిద్రా , మెలకువా కాని మగతలోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తోంది తనకి.
ఆ మగతలోనే -
ఈ రెండు నెలలో జరిగిపోయిన సంఘటనలన్నీ వడివడిగా మనోఫలకం మీద మెదిలాయి.
తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతోంది.
కిశోర్ నటించిన అతని మొదటి చిత్రం ఈ నెలలోనే రిలీజ్ అయింది. దాని నిర్మాత రఘుపతి కాదు. ఎవరో చాలా చిన్న ప్రొడ్యూసర్, అతి తక్కువ బడ్జెట్ తో తీసిన "క్విక్" అది.
అయినా కూడా, కిశోర్ ఇప్పుడు తన హీరో కాబట్టి, ఆ చిత్రాన్ని మూడు పెద్ద ఎరియాలకి తనే కొన్నాడు రఘుపతి. కానీ అతను దాన్ని కళ్ళు మూసుకుని కొనేయ్యలేదు. కొనేముందు తన కోసమే ప్రత్యేకంగా నాలుగు షోలు వేయించుకుని జాగ్రత్తగా చూశాడు. చిత్రంలో కధ భాగుంది, పాటలు బాగున్నాయి, మొదటి అవకాశం లభించిన ఆ యువదర్శకుడు అప్పటిదాకా తన బ్రెయిన్ లో ఉన్న అయిడియాలన్నిటినీ ఆ చిత్రంలో గుప్పించేశాడు.
సినిమాకి మినిమమ్ గ్యారంటీ వుంటుంది.
అయితే -
ఆ ప్లస్ పాయింట్స్ అన్నిటినీ కూడా కిశోర్ హీరో ఇమేజ్ ని బూస్టప్ చెయ్యడానికి ఏక్స్ ప్లాయిట్ చేయవచ్చని రఘుపతికి తెలుసు.
అందుకని ఆ చిత్రాన్ని అన్ని ముఖ్యనగరాలలోనూ వున్న తన సొంత లగ్జరీ దియేటర్లలో విడుదల చేశాడు. అయన కేవలం నిర్మాత కాక పంపిణీదారుడు, ఎగ్జిబిటరు కూడా.
ఆ చిత్రం విడుదలకి వారంరోజులు అటూ ఇటూ మరే చిత్రమూ పోటీగా రిలీజ్ కాకుండా జాగ్రత్తపడ్డాడు. పోటీ అవుతుందనుకున్న తన సొంత చిత్రాన్నే మరోదాన్ని విడుదల చెయ్యకుండా వాయిదా వేశాడు. అతని చిత్రంతో  పోటీపడటం ఇష్టంలేని మరికొందరు తమ చిత్రాల విడుదల ఆపేశారు.
ఇండస్ట్రిలో రఘుపతికి వున్న పరపతి అలాంటిది.
దానికి తోడు లక్ష,లు వెదజల్లి పబ్లిసిటీ కాంపెయిన్. పత్రికలలో ఫుల్పేజ్ కలర్ అడ్వర్ టేయిజ్ మెంట్స్. కళ్ళు చెదిరే పోస్టర్సు. తాటి ఎత్తున కట్ అవుట్స్.
ఏ పోటీ లేకుండా వారంరోజులు ఆడాక చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఇక పుంజుకుంది సినిమా! ఇసకవేస్తె రాలనట్లు విరగబడి చూశారు జనం.
హరీన్ లేనిలోటుని తీర్చగలవాడు ఇక కిశోర్ ఒక్కడే అని తీర్మానించుకుంది పరిశ్రమ.
ఈలోగా మరొకటి కూడా జరిగింది.
హరీన్ కి మంచితనం మరీ ఎక్కువ. దానివల్ల చాలాసార్లు అతనికి కష్టనష్టాలు ఎదురయ్యాయి. అయినా అతను తన పద్దతి మార్చుకోలేదు. తను ఒక నిర్మాతకి ఒక సినిమా చేసినప్పుడు, ఏ కారణం వల్లనన్నా ఆనిర్మాతకు ఆశించినంత లాభం చేకురకపోతే , ఆ నిర్మాత నెక్స్ ట్ పిక్చర్ కి వెంటనే కాల్షీట్లు అడ్జెస్ట్ చేసి ఇచ్చేవాడు హరీన్. తను మామూలుగా తీసుకునే రెమ్యునరేషన్లో సగమే తీసుకునేవాడు. ఆ నిర్మాత మళ్ళీ కోలుకుని నిలబడేదాకా తను తోడుగా నిలబడేవాడు.
అలా, పరోపకారం చేద్దామన్న చింతతో అతను ముందూ వెనకా చూడకుండా ఒప్పేసుకున్న చిత్రాలు చాలా వున్నాయి.
వాటిలో సగం పైగా చిత్రాలకి అర్ధంపర్ధం కాని కధలు.
అలాంటి చిత్రాలు నాలుగు వరసగా ఇదే నెలలో రిలీజయ్యాయి.
హరీన్ మీద ఉన్న సానుభూతితో మొదటి చిత్రాన్ని తిర్ధయాత్రకు వచ్చినట్లు చూశారు జనం.
రెండో వారం మొదట్లో ప్రేక్షకులు పల్చబడ్డారు. వారం చివర్లో ఎత్తేశారు సినిమా.
మిగతా మూడు చిత్రాలు రికార్డు లెవెల్లో ప్లాప్ అయ్యాయి.
దానితో -
ఓడలు బళ్లయ్యాయి- బళ్ళు ఓడలయ్యాయి - ఒకే ఒక్క నెలలో.
ఇప్పుడు కిశోర్ మధ్యాహ్నమార్తాండుడిలాగా ప్రజ్వరిల్లిపోతున్న హీరో.
హరీన్ నాలుగు సూపర్ ఫ్లాప్ చిత్రాల నాయకుడు.
తన తొలి చిత్రమే అంతటి అఖండవిజయం సాధించడంతో, కన్నూ మిన్నూ కానరానంత అహంకారం పెరిగిపోయింది కిశోర్ కి.
అతని చూపులన్నీ ఇప్పుడు చుక్కల్లోనే.
లేకపోతే - చక్కని చుక్కలమీదే.
ఆ చుక్కలలో తను కూడా ఒకతి.
వెనకనుంచి హటాత్తుగా రెండు చేతులు మధుమతి భుజం మీద పడ్డాయి.
ఉలికిపడి తిరిగి చూసింది తను.
అక్కడ నిలబడి వున్నాడు కిశోర్.
అతని కళ్ళలో కనబడుతున్న కాంక్ష ఆమెని కలవర పరచింది
    
                                                                    23

"మనం త్వరగా ఈ లోయలో నుంచి బయటపడాలి కరుణా ......పద వెళ్దాం" అన్నాడు హరీన్.
అతని చేతిలో కొవ్వుతో నిండిన కాగదాలాంటి జంతువుతోక ఒకటి వుంది. దాని చుట్టూ ఎండునారా బిగించి కట్టివుంది.
ఇద్దరూ కలిసి నడవడం మొదలెట్టారు.
గుహద్వారం చేరుకోవాలంటే దాదాపు ఒక గంటసేపు నడవాలి. ఆ లోపల ఎవరు తనను చుసేస్తారో అన్న ఆందోళన.
ఎలాగైతేనేం. గుహద్వారం చేరుకున్నారు. అది ఎవరికి కూడా చూసీ చూడాగానే కనబడేటట్లులేదు. దానికి అడ్డంగా ఆకాశాన్ని అంటేటట్లున్న మహావ్రుక్షాలెన్నో దట్టంగా పెరిగివున్నాయి.
గుహలోపలికి అడుగుపెట్టగానే అదోరకం వాసన సోకింది హరీన్ నాసికపుటాలకు. ఆగి పరిశీలనగా చూశాడు. అతనికి కనబడింది ఒక పెద్ద ఎలుగుబంటి. వెనక కాళ్ళమీద నిలబడి , ముందు కాళ్ళను చేతుల్లా అటూ ఇటూ తూగుతోంది.
"కరుణా! నువ్వు దూరంగా వెళ్ళు!" అన్నాడు హరీన్ నెమ్మదిగా.
అతని వాక్యం పూర్తికాకముందే , ఎలుగుబంటి అతని మీదికి దూకింది. బలంగా విసిరింది తన పంజాని. ఆ దెబ్బకు హరీన్ భుజం మీద రెండంగుళాల మేర కండ ఉడి వచ్చేసింది.
బాధని సహిస్తూ పళ్ళు బిగపెట్టాడు హరీన్.
మళ్ళీ చెయ్యి విసిరింది ఏలుగ్గొడ్డు. ఈసారి ఆ దెబ్బ తనకి తాకకుండా ఒడుపుగా పక్కకి జరిగాడు హరీన్.

 Previous Page Next Page