Previous Page Next Page 
యమదూత పేజి 28


    
    రఘునందన్ బతికి ఉండగా తనని పెళ్ళి చేసుకోదు జానకి.
    
    అలాంటపుడు రఘునందన్నే ఈ లోకంలో లేకుండా చేస్తే?
    
    ఆ ఆలోచనే ఎగ్జయిట్ మెంట్ కలిగించింది మహాజన్ కి.
    
    యుద్దంలో, ప్రేమ వ్యవహారాల్లో ఏం చేసినా తప్పు కాదని అన్నారెవరో!
    
    రఘునందన్ ని చంపి జానకిని తన సొంతం చేసుకోవడం ఒక విధంగా జానకికి కూడా మంచి చెయ్యడమే అవుతుందేమో!
    
    జానకి అందానికి గానీ, జానకి పర్సనాలిటీకి గానీ, జానకి వ్యక్తిత్వానికి గానీ, జానకి తెలివితేటలకి గానీ, జానకి మంచితనానికి గానీ ఏ విధంగానూ తగినవాడు కాడు రఘునందన్.
    
    జానకీ రఘునందన్ గా ఉండటం కంటే. జానకీ మహాజన్ గా ఉండటం జానకికి గొప్ప కాదూ?
    
    ఆ విధంగా తనకు తాను వెయ్యి విధాలుగా నచ్చచెప్పుకున్నాడు మహాజన్, తన దుష్టబుద్దిని తనే సమర్ధించుకుంటూ.
    
    ఆ తర్వాత తనకు అతి నమ్మకస్తుడయిన ఒక అండర్ వరల్డ్ మనిషిని పిలిపించి సలహా అడిగాడు.
    
    ఆ గూండా అన్నాడు.
    
    "మామూలు మనుషుల్ని చంపడానికైతే మామూలు మనుషుల్ని పంపొచ్చు. కానీ రఘునందన్ మీ అంత గొప్పవాడు కాకపోయినా, మా అంత తక్కువ వాడు కూడా కాడు. అంరుకని, ఈ పనిని ఎవరన్నా ఏ క్లాస్ హిట్ మాన్ కి వప్పగించడం మంచిది!"
    
    "ఎవరా ఏ క్లాస్ హిట్ మాన్?" అన్నాడు మహాజన్.    

 

    చిన్నగా నవ్వి అన్నాడు గూండా, "మీకు తెలిసే వుండొచ్చు, మెకానిక్ అని"

 

    "పేరు విన్నాను" అన్నాడు మహాజన్. "సరే! అయితే అతనికే అప్పగిద్దాం పని! అయితే ఒక్క షరతుమీద!"
    
    "చెప్పండి!"
    
    "పని చాలా స్మూత్ గా జరిగిపోవాలి. ఆ తర్వాత ఇంకేం గొడవలూ, కాంప్లికేషన్సూ వుండకూడదు. పని చేయలేకపోయానని సంజాయిషీలు చెప్పకూడదు. రఘునందన్ చనిపోవాలి. అంతే! అందరూ ఇచ్చే ఫీజుకి మనం రెట్టింపు పే చేస్తాం! ఈ సంగతి బాగా అర్ధమయ్యేటట్లు చెప్పు మెకానిక్ కి.
    
    సరేనని తల పంకించి, శెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ గూండా.  

 

    ఆ క్షణం నుంచి అతను ప్రతి క్షణం ఒక యుగంలాగా ఎదురు చూడడం మొదలెట్టాడు రఘునందన్ చావుకోసం.
    
    ప్రతిరోజూ ఆ గూండా దగ్గర నుంచి రిపోర్టు వచ్చేది.
    
    'మెకానిక్ మన పనిమీదే ఉన్నాడు. ఏ నిమిషంలోనైనా రఘునందన్ చావు వార్త రావచ్చు!" అని.
    
    మహాజన్ కి టెంపరరీగా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. పొద్దస్తమానం అతని ఆలోచనలన్నీ జానకి చుట్టూ పరిభ్రమించడం మొదలెట్టాయి. రఘునందన్ చనిపోయాక పెళ్లికోసం ఎన్నాళ్ళు ఆగితే బాగుంటుంది? పెళ్ళి ఎక్కడ చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? హనీమూన్ ఎక్కడ?
    
    అవే....అవే....అవే ఆలోచనలు!
    
    అలా మధురోహల్లో తాను తేలిపోతూ ఉండగా ఒకరోజు ఆ గూండా వచ్చాడు. అతని మొహంలో చిరునవ్వు కనబడుతోంది.
    
    "ఏమిటీ? పనయిందా? కాలేదా?" అన్నాడు మహాజన్ ఆత్రం పట్టలేక.
    
    "పనయింది"
    
    "రఘునందన్ చచ్చిపోయాడా?"
    
    "ఆహా! రివాల్వర్ తో కాల్చేశాడు మెకానిక్.
    
    'కాంప్లేకేషన్స్ ఏమీ లేవుగదా? హత్యని ఎవరూ చూడటం, సాక్ష్యాలూ అలాంటివి!"
    
    గూండా కొద్దిగా ఇబ్బందిగా కదిలాడు.
    
    "అక్కడే చిన్న కాంప్లికేషన్ వచ్చింది." అన్నాడు నానుస్తూ.
    
    "అంటే?" అన్నాడు మహాజన్ అలర్టుగా అయిపోతూ.

   
    "చాలా పకడ్బందీగా ప్లాన్ వేశాడు మెకానిక్. ఆ ఇంటినీ, పరిసరాలనీ, ఆ ఇంట్లోని వ్యక్తుల అలవాట్లనీ, దినచర్యనీ బాగా గమనించాడు. ప్రతి మంగళవారంనాడు మహిళామండలి మీటింగ్ కి వెళుతుంది రఘునందన్ భార్య. వాళ్ళ ఇంట్లో ఎక్కువగా నౌకర్లూ చాకర్లూ లేరు. పనులన్నీ థానే స్వయంగా చేసుకోవడం ఆమెకి ఇష్టం. ఉన్న ఒక్క పనిమనిషీ కూడా సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోతుంది. మంగళవారాలు ఎక్కువగా రఘునందన్ ఇంట్లోనే గడుపుతాడు.
    
    "అయితే?" అన్నాడు మహాజన్ అసహనంగా.
    
    "అందుకని మంగళవారం సాయంత్రం ఏడున్నరకి పెట్టాడు మెకానిక్ ముహూర్తం. ఆ సమయంలో అతను ఊహించినట్లే రఘునందన్ తన స్టడీరూంలో కూర్చుని విస్కీ సిప్ చేస్తూ మ్యూజిక్ వింటున్నాడు. చడీచప్పుడూ కాకుండా వెనకనించి వెళ్ళి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో రఘునందన్ తలకి రివాల్వర్ ఆనించి మూడుగుళ్ళు పేల్చాడు మెకానిక్. రఘునందన్ మెదడు తరిగిన కాలీఫ్లవర్ కూరలా టేబుల్ మీద అంతా చిందింది.
    
    రఘునందన్ ని కాల్చేశాక గుమ్మం దగ్గర అడుగుల చప్పుడయితే తలెత్తి చూశాడు మెకానిక్.
    
    ఎదురుగా రఘునందన్ భార్య నిలబడి వుంది. ఆమె మొహంలో షాక్ కనబడుతోంది.
    
    మహిళామండలి మీటింగ్ నుంచి ఆరోజు ఎందుకోగానీ తొందరగా తిరిగి వచ్చేసింది ఆమె."
    
    ఊపిరి బిగబట్టి వింటున్నాడు మహాజన్.
    
    గూండా అన్నాడు -
    
    "అయినా ప్రమాదమేమీ లేదులెండి. హత్యకు సాక్ష్యాధారాలేవీ లేకుండా చేశాడు మెకానిక్."
    
    "అంటే..." అన్నాడు మహాజన్ కంపిస్తున్న స్వరంతో.    

 

    "రివాల్వర్ లో మిగిలిన మిగతా మూడుగుళ్ళు రఘునందన్ భార్య గుండెకి గురిపెట్టి కాల్చేశాడు."      

 
    "అంటే ..." అన్నాడు మహాజన్ బొంగురుపోతున్న గొంతుతో.
    
    "రఘునందన్, అతని భార్య ఇద్దరూ ఒకేసారి మరణించారు" అన్నాడు గూండా చాలా మామూలుగా.
    
    ఆ తర్వాత వరం రోజులకిగానీ ఆ షాక్ లోంచి కోలుకొని మామూలు మనిషి కాలేకపోయాడు మహాజన్. అప్పట్నుంచీ బతుకంటేనే విరక్తి పుట్టింది అతనికి. ప్రపంచమంటే చీదర కలిగింది.
    
    వారం రోజుల తర్వాత...
    
    జరిగినదంతా మర్చిపోయి తను మళ్ళీ మనుషుల్లో పడాలంటే తనని తను మర్చిపోయేలా చేసే సాధనం ఏదన్నా కావాలనిపించింది అతనికి.
    
    తనని తాను మర్చిపోవడానికి కొంతమంది తప్పతాగుతారు. ఇంకోళ్ళు ఇంకోటి చేస్తారు. మరొకళ్ళు మరొకటి చేస్తారు.
    
    కానీ మహాజన్ కి అన్నిటికంటే మైకం కలిగించేది పైకాన్ని సంపాదించే వ్యాపకం!
    
    అందుకని శివమెత్తిన వాడిలా బిజినెస్ లోకి దూకాడు మళ్ళీ! బుల్ డోజర్లా ప్రత్యర్ధులని కుమ్మేస్తూ ముందుకు వెళ్ళిపోయి తన బిజినెస్ ఎంపైర్ ని పదింతలు పెద్దది చేశాడు.
    
    కానీ ఎంత చేసినా ఎంత సంపాదించినా కూడా అది జానకి క్రీగంటి చూపులకి, పెదిమలు దాటని చిరునవ్వుకీ సరికాదని ఎప్పటికప్పుడు అర్ధమవుతూనే వుంది అతనికి.    

 

    జానకి బతికే లేదన్న బాధ ఒకవైపు.
    
    జానకి లేకుండా చేసిన మెకానిక్ ఇంకా బతికే వున్నాడన్న బాధ మరో వైపు!
    
    ఈ రెండు విషయాలూ తన మెదడులో గుచ్చుకున్న ముళ్ళలా తనను బాధ పెడుతూనే ఉంటాయి తను బతికినన్నాళ్ళూ.
    
    ఆ దారుణం జరిగినప్పటినుంచి మెకానిక్ అంటే మహా అలర్జీ కలిగింది అతనికి. మెకానిక్ ని చంపాలని తనకి ఎంతగానో వుంది.
    
    కానీ సులభంగా చంపటానికి మెకానిక్ మామూలు మనిషి కాడు. మనుషుల్ని చంపే మనిషి అతను! తాచుపాములాంటివాడు! కాదు! తాచుపాములనే మింగే కింగ్ కోబ్రాలాంటి వాడు!
    
    మంచి అవకాశం కోసం కాచుకుని ఉండి, ఊహించని విధంగా చావుదెబ్బ కొట్టాలి మెకానిక్ ని!
    
    అంతే తప్ప మరో మార్గం లేదు!
    
    అలా తను మధనపడుతూ రోజులు గడుపుతూ ఉండగా తనదగ్గరికి వచ్చింది వైశాలి.
    
    వైశాలి చిరునవ్వో, వైశాలి పర్సనాలిటీనో, వైశాలి తెలివితేటలో, మరేదోగానీ, తనకి జానకినే గుర్తు వచ్చేటట్లు చేస్తాయి.
    
    జానకే మళ్ళీ పుట్టి వచ్చినట్లుగా!
    
    వైశాలితో పరిచయం అయిన ఈ కొద్ది రోజుల్లోనూ తన సంకల్పం లేకుండానే తన మనసు మూడురకాల ఆలోచనలు చేసింది. 

 Previous Page Next Page