"దేనికి?"
"నావల్ల మీకు చాలా ఇబ్బందులు, అన్ ప్లెజెంట్ నెస్, అవమానాలు..."
"ఇట్సాల్ రైట్! ఇట్సాల్ రైట్!" అన్నాడు శ్రీరాం.
ఒక్క క్షణం ఆగి, "నేనొకటి అడగనా?" అంది ప్రతిమ సందేహంగా.
"బై ఆల్ మీన్స్ అడుగు."
"మీరు నన్నే ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు?"
నవ్వాడు శ్రీరాం. "అది మళ్ళీ వేరే చెప్పాలా? కారణం స్పష్టంగా కనబడటం లేదూ? నీ అందం!"
"అంతేనా?" అంది ప్రతిమ. ఆమె గొంతులో కొద్దిగా నిరాశ ధ్వనించింది.
"అది చాలదేమిటి? అందరికీ ఉంటుందా ఇంత అందం? అందరికీ దొరుకుతుందా ఇంత అందమైన పెళ్ళాం?"
కాసేపు మౌనం.
"వోకే! నేనింత స్పష్టంగా చెప్పాను కదా! నువ్వు కూడా చెప్పు. నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు?"
"నిజమే చెప్పనా?"
"బ్రూటల్ గా, ఫ్రాంక్ గా చెప్పు! నాకు పచ్చి నిజాలంటే ఇష్టం!" నవ్వింది ప్రతిమ.
"మిమ్మల్ని చేసుకోకపోవడానికి తగినంత అభ్యంతరం కనబడలేదు. అందుకని....." అంది.
"అంతేనా? నేను అందగాన్ని కానా? నాలో ఆడపిల్లలు లైక్ చేసే లక్షణాలేమీ లేవా?" అన్నాడు శ్రీరాం, ఆవేదన పడిపోతున్నట్లు ఫోజు పెట్టి.
పెదిమలు చిరునవ్వుతో విచ్చుకుంటూ ఉంటే, చెయ్యి నోటికి అడ్డం పెట్టుకుంది ప్రతిమ.
"పచ్చి నిజమే చెప్పమన్నాను గానీ, మరీ నువ్వు కాలకూట విషం లాంటి చేదు నిజం చెప్పావు! నన్ను చేసుకోవడానికి అభ్యంతరం ఏమీ కనబడలేదా? అంతేగానీ, నాలో ప్లస్ పాయింట్సు ఏమీ లేవంటావు!"
"అప్పుడే ఎలా తెలుస్తుందీ? మనం కొన్ని రోజులు దగ్గరగా కలిసి ఉన్న తర్వాత అప్పుడు మీలో ఉన్న ప్లస్ పాయింట్సు ఒక్కొక్కటిగా నాకు అర్ధమవుతాయి. అప్పుడు ఇంకా...ఇంకా...లైక్ చేస్తాను మిమ్మల్ని!"
మరో అరగంట గడిచాక -
"డాక్టరువై ఉండీ, ఇంత సిగ్గేమిటీ! కుచ్చెళ్ళు దగ్గర ఈ పిన్ను తియ్యి! రావట్లేదు! ప్లీజ్!" అంటున్నాడు అతను బతిమాలుతూ, బెదిరిస్తూ.
"డాక్టరునైతే ఆడపిల్లను కానా?" అంది ప్రతిమ - అతని చేతిని ఇష్టంగానే నెట్టేస్తూ.
ఆమె చెయ్యి అతని చేతిని రెండు అంగుళాలు వెనక్కి తోసేసినప్పుడల్లా, మళ్ళీ రెండు రెళ్ళ నాలుగు అంగుళాలు ముందుకి వచ్చెయ్యడానికి కూడా 'తనకి తెలియకుండానే' అవకాశమిస్తోంది.
ఉన్నట్లుండి ఆమె వెన్నుకింద చల్లటిగాలి సోకినట్లయింది. చీర జారిపోయింది.
శ్రీరాం విజయగర్వంతో నవ్వుతూ, ఆమె చేతులు రెండూ కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు.
* * * * *
ఆ రోజు హఠాత్తుగా వెళ్ళిపోయిన సౌందర్య మళ్ళీ తిరిగి రాలేదు - వారం రోజులు గడిచినా!
మేరేజ్ రిసెప్షనుకి కూడా రాలేదు?
'ఏమయి ఉంటుంది? ఎందుకని?' అనుకున్నాడు శ్రీరాం.
చిత్రంగా, మేనేజర్ అనిల్ కూడా కనబడటం మానేశాడు!
ఇది కాకతాళీయమా? లేక...?
మనసు ఉగ్గబట్టుకోలేక, స్టెనో శేషగిరిరావుని పిలిచి సౌందర్యా వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయం కనుక్కు రమ్మన్నాడు శ్రీరాం.
గంట తర్వాత తెల్ల మొహం వేసుకుని వచ్చాడు శేషగిరిరావు. సౌందర్య వారం రోజుల క్రితమే ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోయిందట! ఎక్కడికి వెళ్లిందో అడ్రసు తెలియదుట!
అనిల్ కూడా అంతే! ఆచూకీ లేకుండా మాయమై పోయాడు.
ఈ రెండు సంఘటనలనీ ఎలా ముడిపెట్టాలో అర్ధంకాక అయోమయంలో పడిపోయాడు శ్రీరాం. అతనికి జరిగినదంతా అర్ధమయినట్లే అనిపిస్తోంది.
కానీ, ఆ అర్ధమైన విషయాన్ని నమ్మశక్యం కావటం లేదు!
* * * * *
డాక్టర్ గా తన పేరు రిజిస్టర్ చేయించుకుంది ప్రతిమ శృతి సాయంతో.
ఆ రాత్రి శ్రీరాం అడిగాడు. "అయిపోయిందా ఆ పని?"
"అయిపోయింది."
"గుడ్! అయితే ఇకనుంచీ నువ్వు పూర్తి డాక్టరువన్నమాట!"
"అవును! ఇక రేపటినుంచీ జాబ్ స్ కి అప్లయ్ చెయ్యడం మొదలెట్టాలి. ఇవాళ ఒక హాస్పిటల్ అడ్వర్ టయిజ్ మెంట్ పడింది, చూశారా?"
శ్రీరాం స్ప్రింగులా పరుపుమీద లేచి కూర్చుని, ప్రతిమని చిత్రంగా చూశాడు.
"ఏమిటీ? నువ్వు జాబ్ చేస్తావా? ఎందుకూ?" అన్నాడు. అతని గొంతులో పట్టరాని ఆశ్చర్యం ధ్వనిస్తోంది.
అంత ఆశ్చర్యంగానూ అతన్ని చూసింది ప్రతిమ. "అదేమిటి? జాబ్ చెయ్యొద్దా మరి?"
"అదే అడుగుతున్నాను. ఎందుకూ అని?"
"బావుంది!" అంది ప్రతిమ. "మెడిసిన్ చదివి వూరికే ఇంట్లో కూర్చుంటారా ఎవరన్నా?"
"సారీ, ప్రతిమా!" అన్నాడు శ్రీరాం సీరియస్ గా. "ఈ విషయం ఇంతవరకూ డిస్కస్ చెయ్యలేదు కదూ మనం! నువ్వు ఉద్యోగం చెయ్యడం నాకిష్టం లేదు. అసలు ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యడమే నాకు నచ్చదు. అందులోనూ నా భార్య బయటికి వెళ్ళి ఉద్యోగం చెయ్యడం అసలు సహించను."
"ఎందువల్ల?" అంది ప్రతిమ దెబ్బతిన్నట్లు చూస్తూ.
"ఉద్యోగం చేసి పోషించాల్సింది భర్త. సంపాదించి భరించేవాడు కావడం వల్లనే భర్త అనే పేరు వచ్చింది. అవునా?"