"నిన్న మీ అమ్మ కనబడింది" అంది సితార మామూలు తెలుగులోకి వచ్చేస్తూ.
"అయితే?" అన్నాడు అతను.
కానీ అప్పటికే అతనికి ముప్పాతిక మూడొంతుల కథ అర్ధమైపోయింది.
అయినా అది సితార నోటెంబడే వినదల్చుకున్నాడు అతను.
ఒక టన్ను భారంగా నిట్టూర్చి, చెప్పడం మొదలెట్టింది సితార.
శేషు కూడా పేషెంటు అవతారం వదిలేసి లేచి కూర్చుని వినడం మొదలెట్టాడు.
నిన్న సాయంత్రం సితార ఒకళ్లింట్లో ఒకమ్మాయి పెళ్ళి జరుగుతుంటే మెహిందీ పెట్టడానికి వెళ్ళిందట.
అక్కడుంది లేడీ డాక్టర్ సునీతాసుందరి.
సితార అక్కడికొస్తుందని ఆమెకి ముందే తెలుసు.
అంతే కాదు!
సితార గురించి యింకా అనేకమైన విషయాలు తెలుసుకుందట ఆమె.
నిజం చెప్పాలంటే, సితార గురించి ఆ డాక్టర్ గారు సంపాదించిన సమాచారంలో సగం పైగా సితారకే తెలీదు.
మచ్చుకి తన బ్లడ్ గ్రూపు ఏమిటో తనకే తెలీదు సితారకి. కానీ సితార బ్లడ్ గ్రూపు ఏమిటో డాక్టర్ సునీతాసుందరికి ఒకటో ఎక్కం అంత తెలుసు.
అదే చెప్పింది సితార.
"మీ అమ్మ నన్ను చూడగానే అంది, నీ సంగతంతా నాకు తెలుసే. నీ రక్తం ఏ గ్రూఫో కూడా నాకు తెలుసు. నీ జాతకం, నీ నక్షత్రం అన్నీ కూడానాకు తెలుసు" అంది.
"అమ్మ నిజంగా అలా అందా?" అన్నాడు జెయ్ చంద్ర సాలోచనగా.
"నా రక్తం గ్రూపు సాక్షిగా" అంది సితార వ్యంగ్యంగా.
"నీ రక్తం గ్రూపు ఎట్లా కనుక్కుందబ్బా!" అని ఆలోచించాడు అతను. తర్వాత ఫ్లాష్ వెలిగినట్లయింది అతని బుర్రలో.
"హా తెలిసింది! నువ్వెప్పుడో మా అమ్మ దగ్గరికి రక్త పరీక్షకెళ్ళి వుంటావు" అన్నాడు ఆనందంగా.
"నేనా! మీ అమ్మ దగ్గరకా? రక్తపరీక్షకా? ఇంకానయం" అంది సితార. "హోరి పిచ్చోడా!" అన్నట్లు అతని వైపు చూస్తూ.
"మరి అది కాదా?" అని మళ్ళీ దీర్ఘంగా ఆలోచించాడు జెయ్ చంద్ర.
ఆ తర్వాత "యురేకా" అనబోయి -
"హాఁ! తెలిసింది!" అన్నాడు మళ్ళీ.
"ఏమిటి తెలిసింది? ఎలా తెలిసింది?" అంది సితార.
"నాకు ఏం తెలిసిందో, ఎలా తెలిసిందో నీకు తెలియాలంటే నీకు ఒక ఫ్లాష్ బ్యాకు తెలియాలి" అన్నాడు అతను.
అదేమిటని ఆ అమ్మడు అడక్కుండానే అతనే చెప్పెయ్యడం మొదలెట్టాడు.
"కొన్నేళ్ళక్రితం ఓ సంఘటన జరిగింది" అని మొదలెట్టాడు జెయ్ చంద్ర.
"అప్పట్లో అమెరికా, రష్యాలు ఎప్పుడూ ఓ వంటమనిషినిపెట్టి కారాలూ, మిరియాలూ నూరుకుంటూ వుండేవి.
అప్పట్లోనే జాన్ ఎఫ్. కెన్నెడీ గారు అమెరికాకి అధ్యక్షుడుగా వుండేవాడు.
సరిగ్గా అదే టైంలో నికితా కృశ్చేవ్ గారు రష్యా హోల్ మొత్తానికి బాస్ గా వుండేవాడు.
ఓసారి కృశ్చేవ్ అమెరికాలో పర్యటించడానికి వచ్చాడు. (కారాలూ, మిరియాలూ నూరడం కాసేపు ఆపేయించేసి.)
ఆయన అట్లా అమెరికా వచ్చాడు. కొన్నాళ్ళున్నాడు. ఆ తర్వాత తిరిగి వెళ్ళాడు కూడా.
కానీ ఆ వెళ్ళేలోపలే అమెరికన్ గూఢచారులు కృశ్చేవ్ గారి టాయిలెట్లో అనేక రకాల గాడ్జెట్స్ పెట్టేసి మొత్తానికి ఆయనకీ అనుమానం రాకుండానే ఆయన తాలూకు శాంపిల్సు వగైరా పట్టేసి, ఆయనగారి ఆరోగ్య పరిస్థితి ఎలా వుందీ, ఆయన ఎన్నాళ్ళు ఢోకా లేకుండా బతకొచ్చో, ఆయనకేమేం జబ్బులూ గిబ్బులూ వున్నాయో వగైరా వగైరా భోగట్టా అంతా గప్ చిప్ గా లాగేశారు.
ఆ కృశ్చేవ్ గారు కూడా తక్కువవాడేం కాదు కదా!
ఆయన్ని అప్పట్లో ఆరుద్రగారు కూనలమ్మ పదాల్లో ఏం రాశారూ?
"సూక్ష్మ బుద్దికిలేవు,
సూటిమాటల ప్రోవు,
సోవియెట్ కృశ్చేవ్,
ఓ కూనలమ్మా!" అని ఔనా?
తను గొప్ప గుంటనక్కలాంటి వాడినని కృశ్చేవ్ గారికి గొప్ప నమ్మకం వుండేది. బాబ్ హోప్ అనే విదూషకుడుగారు జోకిన ప్రకారం కృశ్చేవ్ గారు అమెరికా వచ్చీ రాగానే "ట్వెంటీ యాల్ సెంచురీ ఫాక్స్ స్టూడియో"ని చూడాలని వుర్రూతలూగి పోయాట్ట. కారణమేమిటీ అని విచారిస్తే, ఆ ఇరవయ్యో శతాబ్దపు గుంటనక్క తనేననీ, తన గౌరవార్ధమే ఆ స్టూడియో కట్టి వుంటారని అనుకున్నాననీ అన్నాట్ట.
అలాంటి సూక్ష్మబుద్దికిలేవూ, సూటిమాటలప్రోవు అయిన కృశ్చేవ్ గారు కూడా తను టాయిలెట్ కి వెళ్ళినప్పుడల్లా తన మీద దారుణమైన రీసెర్చి జరిగిపోతోందని గ్రహించలేదు పాపం.
అదలా వుండగా అమెరికన్ ప్రెసిడెంటు జాన్ ఎఫ్ కెన్నెడీగారూ, ఈ రష్యన్ కృశ్చేవ్ మీద వరసబెట్టి రష్యన్ జోకులు వదల్డం మొదలెట్టారు.
వాటిల్లో మచ్చుకి ఒక జోక్.
ఓ రష్యన్ కుక్క అధాట్టుగా అమెరికాకి వచ్చిందట. వచ్చీరాగానే ఓ అమెరికన్ కుక్కతో సావాసం చేసి, వెంటనే తన దేశపు గొప్పలు లిస్టు చదివెయ్యడం మొదలు పెట్టేసిందట.
"మా దేశం ఎంత ఘొప్పదో తెలుసా?" అంది రష్యన్ కుక్క గొప్పగా.
"ఎంచేత?" అంది అమెరికన్ కుక్క సహనంగా.
"ఓ! మా దేశంలో మాకు మంచి రొట్టెలు పెడతారు, రొట్టెల్లోకి వోడ్కపోస్తారు. వారం వారం చికెనూ! ప్రతాదివారం స్పెషల్ డిన్నర్. ఓ అదీ! ఓ ఇదీ! ఓ....."అంటూ గొప్పలు చెప్పడం మొదలెట్టింది రష్యన్ కుక్క.
అంతా విన్న అమెరికన్ కుక్క అర్ధం కానట్లు చూసింది.
"మరి మీ రష్యా అంత భూలోకస్వర్గంలా వుంటే నువ్వు అమెరికాకి ఎందుకువచ్చావూ?" అంది అయోమయంగా.
రష్యన్ కుక్క మొహమాటంగా అంది -
"నాకు అప్పుడప్పుడు అరవాలనిపిస్తుంది. అందుకే వచ్చా అంది" అని చెప్పి తనొక్కడే గట్టిగా నవ్వాడు జెయ్ చంద్ర.
అతను నవ్వాపేసరికి సితార, శేషు అతన్ని ముద్దాయిని చూస్తున్నట్లు చూస్తూ నిశ్శబ్దంగా నిలబడి వున్నారు.