శ్రీమతి సుమతిగారి వాదనని మేము వ్యక్తిగతంగా సమర్ధించినా, అలాంటి సంతానం మీద మా సానుభూతి వున్నా యీ న్యాయస్థానంలో కూర్చుని అలాంటి బిడ్డలకి మేము జరిపే న్యాయం ఏమి వుండదని చెప్పడానికి విచారిస్తున్నాను. సుమతిగారి వాదనలోని పాయింట్లు పరిశీలించి నీతి సూత్రాలు, న్యాయ సూత్రాలు మర్చి రాసి ఈనాడైనా స్రీకి న్యాయం జరిగేటట్టు చూడమని మేమూ మన రాజ్యాంగాన్ని అర్ధిస్తున్నాము. వాది కుమారి రూపకి పుట్టబోయే బిడ్డకి లీగల్ గా ప్రతివాది సురేష్ కుమార్ ఆస్థి పాస్తుల మీద ఎలాంటి హక్కులుండకపోయినా మానవతా దృష్ట్యా ఆ బిడ్డకు ఆస్థిలో ఒక భాగం ఇవ్వడం న్యాయమని కోర్టు భావిస్తూ కోరుతుంది.
"ప్రతివాది సురేష్ కుమార్ వాది రూపని నెలరోజుల లోపల వివాహం ఆడాలి. వివాహం ఆడని పక్షంలో వారం లోపల అతను జైలు శిక్ష అనుభవించడానికి సిద్దపడాలాని కోర్టు తీర్పు చెప్పుతుంది."
జడ్జిగారు జడ్జిమెంటు చదివి, కేసు పోలీసులకి హేండవర్ చేస్తున్నట్లు చెప్పగానే కోర్టు హాలంతా చప్పట్లతో దద్దరిల్లింది. జడ్జి చాంబర్స్ లోకి వెళ్ళిపోయారు. సురేష్, రామనాధం మొహాలు నల్లగా మాడిపోయాయి. సుమతి సంతోషంగా రూపని కౌగలించుకుంది. పద్మావతి సంతోషం పట్టలేనట్టు సుమతి చేతులు పట్టుకుంది.
న్యూస్ రిపోర్టర్స్ రూప, సుమతి చుట్టూ గుమిగూడారు. రూప ఫ్రెండ్సు...... హుర్రే రూపా - అంటూ ఆడపిల్లలు రూపని చుట్టుముట్టి అభినందనలు తెలుపుతూ సంబరంగా అరిచారు మగపిల్లలు సురేష్ ని చుట్టుముట్టి రూప వైపు లక్కోచ్చారు బలవంతంగా గింజుకుంటున్నా వినకుండా.
"కాంప్రమైజ్ బాయ్! రూపని పెళ్ళిచేసుకో. అన్ని అభిప్రాయ బేధాలు పోతాయి. వుయ్ అల్ వాంట్ యూ బొత్ హేపీ" అంటూ ఇద్దరి చేతులు కలపబోయారు స్నేహితులు. సురేష్ విసురుగా చెయ్యి లాక్కుని తిరస్కారంగా రూప వంక తీవ్రంగా చూస్తూ "పెళ్ళా!? దీన్నా!? అంతకంటే జైలు శిక్ష సంతోషంగా అనుభవిస్తాను. నన్నింత చేసిన.....ఇంత అవమానం చేసిన దీన్ని పెళ్ళడతానా? కంఠంలో ప్రాణం ఉండగా చెయ్యను" పౌరషంగా, ఆవేశంగా రూపని మింగేసేట్టు చూస్తూ అన్నాడు.
ఆ తిరస్కారం చూసి రూప కూడా ఏహ్యంగా సురేష్ ని చూసింది.
"నీవు పెళ్ళాడతానన్నా నిన్ను చేసుకోడానికి నేను సిద్దంగా లేను మిస్టర్. నిన్ను పెళ్ళాడాలని ఈ కోర్టు కెక్కలేదు. నీకు బుద్ది చెప్పడానికి ఎక్కాను. నా కోరిక తీరింది. నౌ, యు గోటు హెల్ ఐ హేట్ టు టాక్ టు యూ ఎస్ మోర్" అంది రూప ఏహ్యంగా చూస్తూ.
"రూపా" పద్మావతి విశ్వనాధం ఏదో చెప్పబోయారు. "రూపా దిసీజ్ బాడ్! పుట్టబోయే బిడ్డకోసం అన్నా మీరిద్దరూ కాంప్రమైజ్ అయి అవడం మంచిది" మరో లాయరు సుమతి వంక చూస్తూ సలహా చెప్పమన్నట్టు చూశాడు. విశ్వనాధంగారు కూడా అవునన్నట్టు చూశారు.
"దిసీజ్ ఆఫ్ టు హర్ వివాహం అంటే జన్మంతా కల్సి మెల్సి వుండే బంధం. ఇలా ఒకరిపట్ల ఒకరికింత తిరస్కారం, కసి వున్న వివాహం సక్సెస్ ఎలా అవుతుంది? ఈ పెళ్ళి చేసుకోమని నేను ఎలా చెప్పను. బిడ్డకోసం కాంప్రమైజ్ అవగల్గితే మంచిదే. ఇది వాళ్ళిద్దరూ ఆలోచించుకోవల్సింది" అంది సుమతి గంభీరంగా.
"కమాన్ సురేష్" స్నేహితులు సంధి కుదర్చబోయారు. సురేష్ విసురుగా "సారీ, నన్ను బలవంత పెట్టకండి. ఐ హేట్ హర్. నో కొశ్చన్ ఆఫ్ మారేజ్ ఆర్నెల్లు జైలు శిక్ష అంతకంటే నయం - ఆజన్మాంతం అనుభవించే శిక్ష కంటే" అంటూ విసురుగా వెళ్ళిపోయాడు.
అంతా నిట్టుర్చారు. రూపా చాలా నిర్లక్ష్యంగా చూసింది. ప్రెస్ రిపోర్టర్లు రూపని ఏవేవో ప్రశ్నలడిగారు. రూప అభిప్రాయాలు వ్యాసంగా రాసివమని కోరారు.
"ఈ కేసు వల్ల మీరు సాధించింది ఏమిటి? కోర్టు కేక్కడం మీరు నష్టపోయింది ఎక్కువ కాదా?' అన్నాడో రిపోర్టరు.
"ఏమి సాధించానా? ఆ ప్రశ్న ఇంకా అడుగుతున్నారా! నేను, నా జీవితం అయిపోయినా కనీసం కొన్నాళ్ళు ఎ సంఘటన గుర్తున్నంతవరకేనా ఏ యువకుడూ ఓ స్రీ ని మోసం చేసేముందు కాస్త భయపడి ఆలోచిస్తాడు కాదంటారా? నాలాంటి ఒక యువతినన్నా ఈ మోసానికి గురికాకుండా కాపాడగలిగానన్న తృప్తి నాకు చాలు. ఆడదాన్ని వాడుకుని మోసం చేసి వదిలేసే పురుషులకి ఈ కేసు ఒక పాఠంగా కొన్నాళ్ళయినా గుర్తుంటుంది. ఇంతకంటే ఏం సాధించాలి? నాలా మరో ఆడపిల్ల ఆలోచించి ధైర్యంగా ముందుకు అడుగు వేసేందుకు తోవ చూపాను. ఆడపిల్లలు ఇంక మన మోసాన్ని సహించారు- అని పురుషులకి తెలియ చెప్పేందుకు ఈ సంఘటన తోడ్పడదు! ఇలా ప్రతి వూరిలో ఒక్క ఆడపిల్లయినా ఆలోచించి ధైర్యంగా ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటే, కొన్నాళ్ళకి ఇదో ఉద్యమం అయి యీ పురుషుల అట కట్టదా? దీనికి పునాది నేను వేశానన్న తృప్తికంటే ఇంకేం కావాలి నాకు!?" రూప గరంగా, ఆవేశంగా అంది.
"మీరిలా పెళ్ళి కాకుండా బిడ్డని కంటే అవివాహిత మాతృత్వాన్నిప్రోత్సహించినట్లు గదా! రేపు యిలాగే కొందరైనా ఆలోచిస్తే వివాహ వ్యవస్థ దెబ్బతినదా? ఇలా ప్రతివారూ పెళ్ళికాకుండా బిడ్డలని కంటే సంసార జీవితానికి తావు ఎక్కడ వుంటుంది? కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే పుట్టబోయే బిడ్డలకి రక్షణ ఏముంది. మీలా అందరూ ఆలోచిస్తే సహితం మెచ్చుకుంటున్న మన సాంఘిక వ్యవస్థ దెబ్బతినదా?" ఒక విలేఖరి తెలివిగా ప్రశ్నించాడు. దానికి జవాబు రూప చెప్పబోయేలోగానే సుమతి అందుకుంది.
"మా పాయింట్ మీరు సరిగా అర్ధం చేసుకోలేకపోయారన్నమాట. ఏ స్రీ కావాలని, వివాహ జీవితానికి, దూరం అవదు. ప్రతి స్రీ సంతోషంగా అన్యోన్య దాంపత్యం గడపాలని, ఇల్లాలిగా, తల్లిగా సుఖమయ సంసారం చేసుకోవాలనే కోరుతుంది. కావాలని చేతులారా భవిష్యత్తు నాశనం చేసుకుని, మోడులా జీవిస్తూ, లోకుల దృష్టిలో హీనంగా, చులకన అయి, బిడ్డని కాని తిరస్కారాలు, హేలనల మధ్య పెంచుకోవాలని ఏ స్రీ కోరదు. మేం అలా స్రీ విచ్చలవిడిగా తిరిగి, అక్రమ సంతానాన్ని కనాలని ఎన్నడూ చెప్పలేదు.
స్త్రీ కూడా పురుషునిలా మనిషే. కనక ఆమె కూడ కోరికలకి బానిసే కనక, ఏ బలహీన క్షణంలోనైనా తనని ప్రేమిస్తున్నాడని భ్రమించి పురుషునికి తనను తాను అర్పించుకోవచ్చు. పురుషునిలో ఆ బలహినతలని క్షమించే సమాజం స్ర్తీని ఎందుకు క్షమించదు అన్నది మా ప్రశ్న? చేసిన తప్పునించి పురుషుడు తప్పించుకుని పెద్దమనిషిగా చెలామణి అవగా స్త్రీ ఎందుకు అన్ని విధాల శిక్షింపబడాలన్నది మా వాదన ! ప్రకృతి స్త్రీ పట్ల అన్యాయం చూపి మాతృత్వం అనే శిక్ష ఆమెకి విధించింది కనక, ప్రతి స్త్రీ తనని తాను రక్షించుకోడానికి పురుషుని మాటలని నమ్మి పెళ్ళికి ముందే బలహీనతకి లోబడకుడదనే మేమూ అంటున్నాము. కాని అలా బలహీనతకి లోబడిన ఒక స్త్రీ క్షమించరాని నేరం చేసినట్లు భావించరాదని ఆ నేరమే చేసిన పురుషుడు శిక్షింపబడాలనే, అన్యాయం కోసమే కోర్టు కెక్కింది నా క్లయింట్" అంది సుమతి.
కేసు తీర్పు విన్నాక అందరూ రూప భవిష్యత్తులో ఏం చేస్తుందని ఊహగానాలు చేస్తూ ఇళ్ళకు మళ్ళారు.
సుమతి , విశ్వనాధం, పద్మావతి, అందరూ ఇల్లు చేరారు.
"ఇప్పుడింకా ఏం చేద్దాం. ఇంతవరకు కేసు పూర్తీ అయ్యాక సురేష్ దారికి వచ్చి పెళ్ళాడుతాడని ఆశించాను. ఇప్పుడిక ఆ పెళ్ళి జరగదు కదా! రూప సంగతి ఏమిటి? ఎలా దీని సంగతి బట్టబయలు అయ్యాక మరేవాడు పెళ్లాడడానికి ముందుకి రాడు గదా. ఇప్పుడింకా ఏం చేస్తుంది?" విశ్వనాధంగారు సందేహాలు బయటపెట్టారు.
"నాన్నగారు! పెళ్ళి...పెళ్ళి.....పెళ్ళి జీవితంలో ముఖ్య ఘటన కావచ్చు. కానీ పెళ్ళి లేనిదే జీవితం కాదనడం సరికాదు. నేను ముందే చెప్పాను ఎవరిని పెళ్ళాడే ఉద్దేశం లేదని, రిజల్ట్సు వచ్చాయి. బి.ఏ. పాసయ్యాను. మీరు నా చదువుకి సరిపోయే ఉద్యోగం ఏదన్నా చూపించగల్గితే నన్ను కన్నందుకు మీ బాధ్యత తీరిపోతుంది. ఆ సహాయం చెయ్యగల్గితే మంచిదే, లేదంటే నా దారి నేను వెతుక్కుంటాను. నేను సెటిల్ అయ్యేవరకు ఆంటీ అండగా వుంటారని ప్రామిస్ చేశారు. ఆవిడ సహాయంతో ఏదో ఉద్యోగం చూసుకుంటాను."