Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 28


    
    సీత అతనిని చూడగానే మనసు పరేసుకోలేదు. ముఖం చిట్లించుకోను లేదు. అలా అని ఓ అభిప్రాయానికి రాలేదు.

 

    "ఎలగున్నాడో చెప్పనేలేదు చెప్పు అక్కా" మరోసారి రెట్టించి అడిగాడు రాజు.

 

    "ఎందుకురా నీకింత ఆతృత" నెమ్మదిగా నవ్వి అడిగింది సీత.

 

    కారణం వివరించటానికి నోరు తెరిచాడు రాజు. సరిగ్గా అప్పుడే రామచంద్రం రావటంతో టకీమని నోరు మూసుకున్నాడు.

 

    "రాజూ! నువు ముందు గదిలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చో, జయా, నీవు కాస్త అవతలికి వెళ్లు." అని రాజుని, జయని గదిలోంచి పంపేశాడు రామచంద్రం.

 

    "సీతా!"

 

    "ఊ"

 

    "వాళ్ళకి నువు నచ్చావుట. నీ అభిప్రాయం కూడా కనుక్కుని వెంటనే చెప్పమన్నారు. మన శక్తి కొద్ది తోచిన లాంచనాలు ఇమ్మన్నారు. కట్నం ఇంత కావాలంటూ పేచి లేదు. పిల్లవాడు బుద్ధిమంతుడు. సరిసరి! నిన్ను కనుక్కోవడానికి వచ్చి నా అభిప్రాయం చెప్పుతున్నాను. నీ అభిప్రాయం చెపితే...."

 

    "అభిప్రాయనికేముందిగాని...."

 

    "నా కొద్దమ్మా, చెప్పెయ్యి."

 

    "ఇప్పటికిప్పుడే చెప్పటం...."

 

    "ఇప్పుడు చెప్పినా, వారంరోజులాగి చెప్పినా అతన్ని చూడటం అయిపోయింది కాదమ్మా, మగపెళ్ళి వారయినా భేషజాలుపోక వాళ్ళ అభిప్రాయం వెంటనే చెప్పరా లేదా!"

 

    "సీత మాట్లాడలేదు. తలమాత్రం ఊపింది నిజమేనన్నట్లు.

 

    "అత్తపోరు ఆడపడుచు పో...లేదు ఈ అమ్మాయి పెళ్ళి చూపులకి వచ్చింది గాని, భర్త వుద్యోగ రిత్యా వేరే వూళ్ళో వుంటున్నది. వాళ్ళు తొందర పడటానికి కూడా కారణం లేకపోలేదు. ఇతను మాత్రం ప్రతిసారి అక్కా బావ నెక్కడ పిలుస్తాడు. అలా అని వంటికాయ సొంటి కొమ్ములా పిల్లలని చూడటానికి బయలు దేరతాడు! చూడంగానే నీ మీద ఓ అభిప్రాయం ఏర్పడింది. నీవు నచ్చవు. పోనీ మనం ఓ వారం రోజులగండి మా అభిపప్రాయం చెపుతాము అన్నామనుకో ఏ ఆడపిల్ల తండ్రో గద్దలావాలి అతణ్ణి కాస్తా ఎగరేసుకు పోతాడు. అదిగాక మేం ముందే చెప్పాము, వీళ్ళకింత యిదేమిటని వాళ్లు మన సంబంధం మానుకోవచ్చు. చేతులారా అందుబాటుకి వస్తే చెరుపుకొనే ముర్ఖులుంటారా అమ్మా" తనూ చెప్పవలసింది చెప్పి సీత అభిప్రాయం కోసం ఆగాడు రామచంద్రం.

 

    "మీ అబిప్రాయం ఏమిటి నాన్నా?"

 

    "చెప్పాకదమ్మ! నామటుకు నాకు వాళ్ళలో ఏలోపం కనిపించలేదు. పెద్దఅందగాడని కాకపోయినా సామాన్యంగా బాగున్నాడు. రవిని చూడంగానే ఆకర్షణ కనపడుతుంది. అలా ఇతనిలో లేదు. అంతమాత్రం చేత వికారంగా లేదు కదా! నాకు అన్నివిధాలా ఈ సంబంధం నచ్చింది."

 

    సీత ఆలోచనలో పడింది.

 

    "నీకు నచ్చలేదా తల్లీ" భయపడుతూ అడిగాడు రామచంద్రం.

 

    తండ్రి అడిగే తీరులో ఆతృత, తన జవాబు నచ్చలేదు అని వస్తుందనే భయం. ఈ సంబంధంపొతే మళ్లి యిలాంటిది రాదనే విచారంలాంటివి ఎన్నో కనిపించాయి సీతకి.

 

     "అలోచించమ్మా! పరిస్థితులు తెలియనివి దానివి కాదు బలవంతంగా వప్పించే తండ్రిని కాదు. అన్నివిధాలా నీ కిష్టమయితేనే...." అంటూ ఆగాడు రామచంద్రం.

 

    పెళ్ళంటే నూరేళ్ళపంట, ఎన్నో చూసుకోవాలి. ఎంతో ఆలోచించాలి అలా చేసినా కొన్ని సంసారాలలో సుఖశాంతులు కరువవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఆలోచించినా, పెళ్లివారు వెళ్ళిపోయి పదిరోజులు టైమిచ్చినా, కొత్తగా తెలిసే విషయాలు లేవు. అలోచించి ఏదో ఒక అభిప్రాయానికి రావాల్సిందే స్నేహితులు, తెలిసినవాళ్ల ద్వారా మంచి చెడు స్థితిగతులు ముందే తెలిశాయి. అబ్బాయి కూడా కష్టపడి పైకొచ్చి తన కాళ్ళ మీద తాను నిలబడ్డాడు. కష్టం, సుఖం అనిభావించినవాడు కాబట్టి మంచి చెడు తెలిసినవాడు అయివుంటాడు. లోపం కనిపించటం లేదు.

 

    సీత ఆలోచించటం అయిపోయింది. తలొంచుకుని "మీ యిష్టం నాన్నా!" అంది.

 

    ఈ మాటకే పొంగిపోయాడు రామచంద్రం. "నా యిష్టం కాదమ్మా! నీ యిష్టం చెప్పమంటున్నాను." అన్నాడు. సీత ఓ నిర్ణయానికి తొందరగా రాదు. వస్తే తిరుగుండదు అని తెలుసు. అయినా సీత నోట్లోంచి సరిఅయిన మాటవస్తే పూర్తి తృప్తి.

 

    'ఇష్టమే' అంది సీత.

 

    'అనుమానాలేవి లేవు కదమ్మా"

 

    'ఉహూ'

 

    'అక్కడికొచ్చి కూచుంటావా? మాట్లాడాల్సినవి చాలా వుంటాయి కదా!

 

    'మీరు మాట్లాడకండి చాలు.'

 

    'మీ అమ్మే వుంటే ఈ సమయంలో ఎంత సంతోషించెదమ్మా" సావిత్రి గుర్తుకురాగా పెదవులు వణికాయి. 'హ్హూ నీకూ నాకూ ప్రాప్తం ఆ అదృష్టము లేవు. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో కనపడినందరితో చెప్పి ఈ సంతోషం, ఈ అనందం పంచుకోవాలనిపిస్తుంది, బంగారు తల్లి అప్పుడే నీ ముఖంలో పెళ్ళి కళ వచ్చేసింది. కళగల ముఖం ఎప్పుడు కళకళ లాడుతుంటునే వుంటుంది. భగవంతుడు ఇన్నాళ్ళు చిన్న చూపు చూసి ఇప్పుడు పొరపాటు తెలుసుకుని కళ్ళు తెరిచాడు" రామచంద్రం కళ్ళు తడికాగా  పిచ్చి ఆనందంతో అన్నాడు.    

 Previous Page Next Page