Previous Page Next Page 
మధుమాసవేళలో ... పేజి 28


    
    "ఆ దెయ్యాల కధలు రాస్తే! దెయ్యాలు తమాషాలు చేయటం హీరోహీరోయిన్ లకి సాయం చేయటం..."
    
    "ఇది అచ్చమయిన తెలుగు నవలా, లేక విఠలాచార్య సినిమాయా!"
    
    "నీకంతా వేళాకోళంగా వుంది. నేను కధలు రాయటం ఇష్టంలేదని వక్కమాట చెప్పరాదూ? అలాంటి నవలలు రాసే కదా క్షురకులు పైకి వచ్చింది."
    
    క్షురకులు వాళ్ళెవరే?" అంది త్రిలోకసుందరి.
    
    వైజయంతితో సమానంగా అన్ని వారమాసపత్రికలూ చదువుతుంది త్రిలోకసుందరి. అయినా క్షురకులు ఎవరో తెలియలేదు.
    
    " 'క్షు' అంటే క్షుద్ర. 'ఠ' అంటే రైటరు. 'క్షులు' అంటే చేసేవాళ్ళని అర్ధం. దెయ్యాల కధలు రాసేవాళ్ళని క్షుద్రరచయితలని. తేళ్ళూ, జెర్రులు పెట్టి కధలు రాసే వాళ్ళని బురకులు అని..."
    
    "ఆగాగు, బురకులు అంటే ఏమిటి?"
    
    "క్షుర కర్ధం చెప్పాకదా. బురకు అర్ధం నీవు తీసుకో. సాధారణంగా కాస్త సెక్స్ పాలు ఎక్కువ రాస్తే సెక్స్ రచయిత అంటారు. అంతా ప్రేమ రాయబట్టేకదా నీ అభిమాన రచయిత్రి ప్రేమమూర్తి అయింది. అట్లాగే తిరగబడు అని రాసినవాళ్ళని విప్లవరచయితలని. సగంమంది పురుషులు, వెధవలు అని రాసిన ఆవిడని పురుషద్వేషిణి అని తలోపేరు తగిలించారు ఆంధ్రపాఠకులు. అందుకే ఏదో కొత్తరకం రాసి వెల్లికిలా పడేబదులు ప్రేమరాస్తే పోలేదా అని...?"
    
    "పోనీ ఓ పనిచెయ్యి ఈమధ్య కొందరు రైటర్స్ కంప్యూటర్స్ మీద ఇతర గ్రహవాసులమీద రాస్తున్నారు కదా! నీవు అంద హ్ పాతాళ కధలు రాయి."
    
    "అప్పుడుగాని పాఠకులు నన్ను పాతాళానికి తొక్కరు."
    
    "అన్నింటికీ అన్నీ అంటే ఎలాగే వైజయంతీ! పోనీ నీ అభిమాన రచయిత్రి రాసినట్లు రాయి."
    
    "నా అభిమాన రచయిత్రా!"
    
    "ఆ..."
    
    "మహారచయిత్రి లతలాగానా?"
    
    "మరే!"
    
    "అమ్మో?" గుండెమీద చేయి వేసుకుని కళ్ళు పెద్దవి చేసింది వైజయంతి.
    
    "ఏ, నీమీద యుద్ధం ప్రకటిస్తుందని భయమా?" త్రిలోకసుందరి అడిగింది.
    
    "భయంకాదు."
    
    "మరింకేం కొట్టెయ్యి కాపీ!"
    
    "నీ ముఖం అదికాదే. లతలాగా రాయటానికి కనీసం వేయి జన్మలెత్తాలి. ఏదయినా రాయగలశక్తి సంపన్నురాలు. ఆ విజ్ఞానం అందరికీ రాదు."
    
    "ఏమో బాబూ, నాకు యద్దనపూడే యిష్టం."
    
    "కావచ్చు. లత అందరికీ అర్ధంకాదు. అయినా నేను నా అభిమాన రచయిత్రి గురించి మాట్లాడుతుంటే మధ్యలో నీ అభిమాన రచయిత్రిని లాక్కొస్తావు ఏమిటి?'
    
    "అభిమానం."
    
    "అభిమానానికి కూడా ఓ హద్దు వుండాలి."
    
    "సరేలే."
    
    "నేను ప్రేమకధలే రాస్తాను."
    
    "మళ్ళీ మొదలు నాఅభిమాన రచయిత్రి యద్దనపూడిలా రాస్తానంటావేమిటి?"
    
    "ఆమెలాగా రాస్తానన్నాగా!" కయ్యిమంది వైజయంతి.
    
    "మరి ప్రేమ!" నాన్చుతూ ఆగింది త్రిలోకసుందరి.
    
    "ప్రేమ నిత్యనూతనం అని మొదటే చెప్పాను. ప్రేమ నవలలే రాస్తాను. అవయితే చాలాతేలిక. ముందు ప్రేమతో మొదలుపెట్టి ఆ తర్వాత వెరైటీకోసం వేరే రాస్తాను" అంది వైజయంతి.
    
    "ఆంద్రపాఠకుల ఖర్మ" అంది త్రిలోకసుందరి అక్కడ నుంచి పారిపోతూ.
    
    "నీ ఏడుపు నాకు తెలుసులేవే లోకసుందరీ! నేను ప్రేమ నవలలురాస్తే నీ అభిమాన రచయిత్రి రచనలు ఎవరూ చదవరని నీ బాధ. కుళ్ళు..." పెద్దగా అరిచి చెప్పింది జయంతి.

 Previous Page Next Page