"మీరు తొందరపడ్డారేమో అనిపిస్తుంది వాడితో అలా మాట్లాడకపోయి ఉండవలసింది. వాడసలే విషపు వెధవ. వాడన్నట్టు పాముతో చెలగాటమేవాడితో కయ్యం" సాలోచనగా అన్నాడు సుబ్బారావు.
సాయంత్రం సుబ్బారావుగారి తోటలోకి వెళ్ళినప్పుడు ఉదయం జరిగిన భాగవతం అంతా చెప్పుకొచ్చింది అరుణ. సుబ్బారావు ప్రెసిడెంట్ కి భయపడుతున్నట్టు మాట్లాడడం చూసి అరుణకి కోపం వచ్చింది.
"మీరు అల అంటారేమిటి? ప్రెసిడెంట్ అయినంత మాత్రాన నన్ను బెదిరించడానికి ఆయనెవడు?
ఆయనకి భయపడుతూ సలాములు పెట్టి చెప్పిన పని చేయవలసిన అవసరం నాకేం లేదు."
"అవుననుకోండి కానీ, నేననేదేమిటంటే ఈ కక్ష మనసులో పెట్టుకునివాడేం చేసినా చేస్తాడు. అందుకని అన్నాను."
"ఏంచేస్తాడు, వాడిమొహం? ఇలాంటిబెదిరింపులకి మీరందరు భయపడుతూండబట్టేవాడలా రాజ్యం ఏలుతున్నాడు. అతనికి భయపడవలసిన అవసరం నాకేం లేదు."
సుబ్బారావు, అరుణ మాటలని ఖండించలేకపోయినా అతను అరుణలా అంతధైర్యంగా ఏం చేస్తాడు?' అని అనుకోలేక పోయాడు ప్రెసిడెంట్ మనస్తత్వం తెలిసిన వాడవడం చేత అరుణ మీద కసి తీర్చుకోవడానికి ఏవో పనులు వేస్తూనే ఉంటాడని అతనికి నమ్మకంఉంది. అరుణని అనవసరంగా భయపెట్టడం ఇష్టంలేక నిశ్శబ్దంగా కాసేపు ఊరుకున్నాడు.
"అవుననుకోండి. అయినా ఎందుకైనా మంచిది. కాస్త జాగ్రత్తగా ఉండండి. వీలయినంతవరకుదుష్టులకి దూరంగా ఉండడంమంచిది."
"మీది మరీ చాదస్తం" అరుణ తేలిగ్గా నవ్వేసిలేచింది.
ఆ మర్నాడు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు రెడ్డిగారి అమ్మాయి వెంకు, అరుణ దగ్గరికి గాభరాగా వచ్చింది. అప్పుడే నిద్రలేచిన అరుణ ఆ అమ్మాయిని చూసివిస్తుబోయింది. "డాక్టరమ్మగారూ మీరో సిన్న సాయం సేసి పెట్టాలి. మా నాన్న ఈ పొద్దూరికి వెళ్ళాడు. పట్నంవెళ్ళి డాక్టరుకాడనించి మందట్టుకొస్తాడట."
"అసలునీవెలా వచ్చావు ఇక్కడికి? మీ అమ్మవాళ్ళు రానిచ్చారా?" అరుణ ఆదుర్దాగా అడిగింది.
"మా అమ్మ నా తలుపుగొళ్ళెం పెట్టి సావిట్లో పడుకుని నిద్దరోతుంది. మా పనిమనిషి నా పక్షం, నెమ్మదిగా దానిచేత తలుపులు తీయించి వచ్చాను. మా అమ్మ నిద్దర్లేచేలోపల ఎల్లిపోతాను. డాక్టరమ్మగారూ, వీరడు ఉత్తరం పంపించాడు. నేను ఎలాగైనా ఇల్లుదాటివస్తే నన్నే ఊరన్నా తీసుకెళ్ళిపోతానని పెళ్ళి సేసుకుందాం పట్నం ఆఫీసుకి ఎల్లి అని రాశాడు. ఆడికెవరో ఆఫీసులో పెళ్ళి చేసుకోవచ్చునని చెప్పారట పెళ్ళికేర్పాట్లు సేశాను. నీ వెలాగైనా ఇంట్లోంచి వచ్చేయి అంటూ రాశాడు.
మానాన్న ఊళ్ళో లేడు. ఎల్లుండికి గాని రాడు మా అమ్మ కన్నుగప్పి ఎలాగైనా వెళ్ళిపోతాను. రేపు రాత్రికి ఆన్ని ఈడకి రమ్మంటాను. మా నాన్న వచ్చేసరకి ఎల్లిపోతాను. లేకపోతే మరి మా నాన్న ఎలాగో ఆ మందు మింగిస్తాడు ఈ సంగతేమన్నా తెలిస్తే అసలు ఎల్లనీయడు. డాక్టరమ్మ గారూ ఆడికి ఉత్తరం ముక్కరాసి పంపించాలి. రేపు రాత్రి పదిగంటలు దాటాక మీ ఇంటికాడకి వచ్చి ఆన్నీ ఉండమనండి. నేను అర్ధరాత్రి కాడ ఎలాగో అలాగ ఈడకి వస్తాను. ఇద్దరం ఎల్లిపోతాం ఆడికి సైకిలుంది ఉత్తరంఅందితే సాలు, సైకిలేసుకువస్తాడు. ఇద్దరం తెల్లారేసరికి పట్నం ఎల్లిపోతాం ఎలాగో.
మానాన్న వచ్చేసరికి పెళ్ళి సేసేసుకుంటాం ఇంక ఏం చేస్తాడప్పుడు? డాక్టరమ్మగారూ నేను ఎల్లిపోతాను ఇంటికి అమ్మకనుమానం వచ్చిందంటే, మా అమ్మకి తెలిసిందంటే సంపేస్తుంది. ఉత్తరం రాయడానికి ఈలులేక పోయింది. మీరు సంగతిదని ఓ ఉత్తరం ముక్క రాసి ఉంచండి. చీకటడ్డాక మా పనిమనిషి మొగుడువచ్చి అట్టుకెళ్ళి ఆడికి ఇచ్చొస్తాడు...... రేపురాత్రికి తప్పక రమ్మనిరాయండి. మరి లేకపోతే నేనిలాగే పడి ఏడవాలి బతుకంతా. డాక్టరమ్మగారూ, ఈసాయం సేశారంటే సచ్చి మీ కడుపునుడతాను."
ఒక్కనిమిషంలో పాఠం అప్పచెప్పినట్లు గడగడ ఆయాసంతో అన్నవెంకు మాటలు అర్ధంఅవడానికి అరుణకి రెండునిమిషాలు పట్టింది. పథకం బాగుంది. తెలివిగలవాళ్ళే ఇద్దరు కానీ, ఇందులో తను ఇరుక్కోవడం ఎంతవరకు సమంజసం? అసలే కోపంగా ఉన్న ప్రెసిడెంట్ కి కూతురు పలాయసంలో తనకూ భాగం ఉందని తెలిస్తే?
"రాస్తారుకదూ డాక్టరమ్మగారూ? నేను ఎల్లిపోతున్నాను. మా అమ్మ లేసిందంటే సస్తాను." అరుణకి నమస్కారం పెట్టేసి వచ్సినంతవేగంగా వెళ్ళడానికి బయలుదేరింది వెంకు.
"ఆ ఉత్తరం ఏదో నీవే రాయకూడదూ? అనవసరంగా నేను ఇబ్బందిపడాలి.....మీ నాన్నకి తెలిస్తే" సందేహిస్తూ అంది అరుణ.
"మానాన్న అంత తెలివితక్కువోడు కాదు. ఇలాంటి ఉత్తరాలు అవి ఎక్కడ రాస్తానో నని కాగితం, కలం, కార్డులు వగైరా నాకా ఇంట్లో అందుబాటులో లేనట్టుంచాడు. అసలు మా అమ్మ సూసిందంటే సంపేస్తుంది. అందుకే మీ కాడకి పరుగెట్టుకు వచ్చాను. ఫరవాలేదు మానాన్నకి అసలు తెలియదు. పాలేర్లు పనిమనుషులు అంతా నా పచ్చమేలెండి, పీక తెగినా చెప్పరు వీరన్ని ఎవరూ సూడకుండా అందుకే మీ కాడికి వచ్చి ఉండమన్నాను. రాస్తారుగదమ్మా? మా పనిమనిషి మొగుడుతో సెప్పితే ఆడు మొద్దు ఎదవ...... ఓటి సెప్పితే మరోటి సెప్పివస్తాడు. అందుకే ఇవరంగా రాసి పంపడమ్మా." ప్రాధేయపడినట్లంది.
అరుణకేం పాలుపోలేదు. రాస్తే ప్రెసిడెంట్ ముందు దోషిలా నిలుచోవలసివస్తుందేమో? రాయకపోతేపాపం దొరక్క దొరికిన ఈ అవకాశం వాళ్ళకి జారిపోతుంది ఈ ఒక్కపని తను చేస్తే తన పేరు చెప్పుకుని వాళ్ళిద్దరూ జీవితాంతం సుఖంగా ఉంటారు: ఓ ఆడ పిల్లని ఈ కూపంలోంచి లాగిన పుణ్యం లభిస్తుంది. తను రాయనన్నా ఏదోవిధంగా అరుణ. పిల్లఏదో ఉపాయంతో వెళ్ళిపోతుంది. తన చేతుల్లో ఈ చిన్న సాయం చేసినందువల్ల తనకేం నష్టం రాదు:
"ఊరాస్తాలే కానీ జాగ్రత్తగా ఉండు, ఈ సంగతి బయటపడితే నా సంగతెలా ఉన్నా నీకు అన్ని వేపులనించి దారి మూసుకుంటుంది. రేపు తొందరపడి ఎవరూ చూస్తూండగా రాకు. జాగ్రత్తగా వెళ్ళు."
వెంకు పరుగులాంటి నడకతోవెళ్ళిపోయింది. ఉప్పెనలావచ్చి వెళ్ళిపోయిన అరుణ యువతి ధైర్యసాహసాలు చూస్తుంటే అరుణకి చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా తనే ఇలాంటిపరిస్థితుల్లో ఉంటే దిక్కుతోచక గాభరాపడడం మినహా ఈ ప్లాన్లు అవి ఇంత ధైర్యంగా చేయలేదు. అరుణ అమ్మాయి అన్నింటికి తెగించిన దానిలా ఉంది. ఈ అయిదు నెలలనించి ఈ బందీఖానాలో నుంచి బయటపడ్డానికి అనేక ఉపాయాలు ఆలోచిస్తూనే ఉండి ఉంటుంది. ఇన్నాళ్ళకి దొరికిన ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగ పరుచుకుంటుంది. సందేహం లేదు, పోనీ ఇన్ని ఇబ్బందులు పడినందుకు వాళ్ళిద్దరూ ఓ ఇంటివారయి హాయిగా ఉంటే అదే చాలు.
అరుణ ఆలోచించి వివరంగా వీరడు చేయవలసినదంతా రాసింది. రాత్రి చీకటిలో వచ్చిన మనిషికి ఆ కాగితం అందించింది.
అనుకున్న ప్లాను ప్రకారం వీరడు వచ్చాడు. వీరడు మంచి ఒడ్డు పొడుగుతో బలంగా ఉన్నాడు. ముఖంలో తెలివితేటలు కనిపిస్తున్నాయి. కాస్తో కూస్తో చదువుకున్నాడు. కనీసం ఉత్తరం ముక్కరాయడం వచ్చును. చేతికి బలముంది. ఈ ఊరు కాకపోతే మరో ఊరువెళ్ళి రెక్కల కష్టంతో భార్యాబిడ్డలని సుఖపెట్టగలడు. మనిషిని చూస్తే ఆ మనిషిని నమ్మవచ్చు అని అనిపిస్తుంది. వెంకు ఎన్ని తెలివైన ఎన్నికే అనిపించింది. అరుణకి. వీరన్నిచూడగానే.
పన్నెండు గంట్ల తరవాత వెంకు నల్లటిదుప్పటి ఆపాద మస్తకం కప్పుకుని వచ్చింది. ఒంటిని నగలు, చేతుల్లో చిన్న మూటఉంది. ఓ నిమిషం వీరడు, వెంకు ఒకర్నొకరు ఆప్యాయంగా చూసుకున్నారు. "పద పద వీరా ఎల్లిపోదాం, ఎవరన్న చూడకుండదాటి పోవాల" అంది వెంకు ఆరాటంతో. "డాక్టరమ్మ గారూ మీ మేలు మరిచిపోలేము. మీ సాయం లేకుంటే" వీరడు వెంకు ఇద్దరూ దండంపెట్టారు. కష్టాలని ఎదిరించిధైర్యంగా నిలబడ్డ ఆ ప్రేమికులను చూస్తూంటే ముచ్చట అనిపించింది అరుణకి. "వెళ్ళండి, ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్ళి చేసేసుకోండి, గుళ్ళో పెళ్ళి అయితే మీ నాన్న నిన్ను వెతుక్కొచ్చిరెక్కలు విరిచి పడేస్తాడు. ఆఫీసులోనే పెళ్ళి చేసుకోండి."
"ఆ ఏర్పాటంతా నేసేశానమ్మగారూ, పట్నంలో చిన్నప్పుడు నాతో సదుకున్న ఓ సాంగాడు ఉద్యోగం సేస్తున్నాడు. ఆన్ని అడిగి అన్ని రెడీ సేసేశాను. ఆడు సెప్పకపోతే నాకీయన్ని ఎలా తెలుస్తాయి? రేపు ఎల్లగానే తిన్నగా ఆఫీసు కెళ్ళిపోతాం. రాత్రంతా సైకిలు తొక్కేశానంటే తెల్లారేసరికి ఎల్లిపోతాము."
అరుణ ఓ ఏభయి రూపాయలుతీసి వెంకు చేతిలో పెట్టింది" ఉంచుపరవాలేదు. వెళ్ళగానే చాలా వాటికి డబ్బు అవసరం ఉంటుంది."
"వద్దండమ్మగారూ నేనో నూరు రూపాయలుకూడేశాను రెక్కల్లో బలం ఉన్నవాడికి పనికేం లోటు?" అని మర్యాదగా తిరస్కరించాడు వీరడు.
"వద్దమ్మా నా నగలున్నాయి. వీరడుపని కుదురుకునే వరకు సాలినంత డబ్బుంది మాకాడ" అంది వెంకు.
"ఫరవాలేదు తీసుకో నీ పెళ్ళి బహుమతి ఇది" అంది అరుణ నవ్వుతూ.
చీకట్లోకలిసిపోయిన అరుణ జంటనిచూస్తూ అలా కొన్ని క్షణాలు నిలబడిపోయింది అరుణ. వాళ్ళిద్దరూ ఏ ఆటంకం లేకుండా ఒకటి అయ్యేట్టు చూడమని ఆ చీకటిలో నిలబడి మనసారా దేవుణ్ణివేడుకుంది అరుణ.
* * *
"పెళ్ళి పెద్ద అవుతున్నారన్నమాట మీరు. సరే, ఊళ్ళో వాళ్ళ పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు, బాగానే ఉంది. కానీ డాక్టరమ్మగారి పెళ్లెప్పుడో?" సుబ్బారావునవ్వుతూ అడిగాడు. ఏం జరిగినా ఏ విశేషమున్నా సాయంత్రం అయ్యేసరికి సుబ్బారావుతో చెప్పడం ఓ అలవాటయింది అరుణకి. సుబ్బారావు సాయంత్రం అయ్యే సరికి పని ముగించుకుని అరుణ వస్తుందేమోనని ఎదురుచూసేంతలోనే అరుణ వస్తుంది తోటకి. ఎప్పుడో, ఏదో మరి ఎక్కువ పేషెంట్లు ఉన్న రోజున తప్ప సాయంత్రం బిజీగా తోటవైపుకి షికారు వెడుతుంది అరుణ.