Previous Page Next Page 
ఖజురహో పేజి 29


    ఆ మాట చాయ గుండెల్లో మంటలు రేపింది.
    
    "పద.....డాబా మీదకి వెళదాం. మా రూఫ్ గార్డెన్ చాలా బావుంటుంది. మమ్మీ చాలా రకాల రోజెస్ ప్లాంట్ చేసింది. పైగా ఈవేళ పౌర్ణమి కూడాను" అంది సంధ్య.
    
    చాయకి కూడా ఆ రూం దాటి బయటికి వెళ్ళాలనే వుంది.
    
    ఇద్దరూ కలిసి మెట్లు ఎక్కుతుండగా, సంధ్య ఆగి- "నువ్వు వెళుతూ వుండు, నేను వెళ్ళి రికార్డ్ ప్లేయర్, క్యాసెట్స్ పట్టుకొస్తాను. వెన్నెల రాత్రి మెహదీ హసన్ గజల్స్ వింటూ వుంటే భలేగా వుంటుందిలే" అని క్రిందికి వెళ్ళిపోయింది.
    
    చాయ ఒక్కతే డాబామీదకి వెళ్ళింది.
    
    జయచంద్ర సిగరెట్ నోట్లో పెట్టుకుని, పిట్టగోడకి ఆనుకుని నిలబడి తదేకంగా ఆకాశాన్ని చూస్తున్నాడు. పాపం.....వెన్నెల బాధిస్తున్నట్లుంది. అతన్ని అలా చూడగానే ఆమెకి కాస్త జంకు కలిగి వెనక్కి తిరిగి వెళ్ళబోయింది.
    
    ఆ అలికిడికి తల తిప్పిన జయచంద్ర "సంధ్యా...." అని పిలుస్తూ దగ్గరకి వచ్చాడు.
    
    చాయ చీకట్లో నిలబడి వుంది! అతను తనను సంధ్య అనుకుంటున్నాడని ఆమెకి అర్ధమైపోయింది.
    
    "ఏమిటీ స్పెషల్ గా తయారయ్యావు?" అంటూ అతను భుజంమీద చెయ్యి వేసాడు.
    
    చాయ టక్కున అతనికి అభిముఖంగా తిరిగింది.
    
    జయచంద్ర అవాక్కయిపోయాడు. ఆమె భుజంమీద వున్న అతని చెయ్యి తీసెయ్యాలన్న ధ్యాస కూడా లేకుండా ఆమెని అలాగే చూస్తుండిపోయాడు.
    
    'కుందర మెందునుందొరమె కొమ్మనిగారపు మేని ఛాయకున్' అన్నట్లు వెన్నెల వెలవెలబోతోంది ఆమె ముందు.
    
    ఏటవాలుగా పడ్తున్న వెన్నెల కిరణం అదురుతున్న ఆమె లేలేత అధరాల్ని, ఎదపొంగుల్నీ తాకి మెరుపు సంతరించుకుంటోంది. హిమస్నాతమాలదీలత చిరునవ్వులు వెదజల్లినట్లు సుగంధాలు విరజిమ్ముతోంది! కిటుకు తెలిసిన గువ్వల జంట ఒకటి కువకువలాడ్తూ దూరంగా ఎగిరిపోయింది.
    
    పిల్లగాలి చెలరేగింది! పలుచని ఆమె పైట కొంగు నిర్దాక్షిణ్యంగా ఖైదు చేస్తున్నట్లుగా అతని ముఖాన్ని కప్పింది.
    
    జయచంద్ర ఉలిక్కిపడి, ముఖంమీద పడిన అడ్డు తొలగించుకోజూసాడు. నీలిమబ్బుల పరదాల మాటున దాగిన పూర్ణ చంద్రబింబంలా ఆమె వదనం అతనికి గోచరించింది. ఆ కన్నులలోని కాంతి అతన్ని ఒక్క లిప్తపాటు ఆపాదమస్తకం వణికించింది.
    
    ఆ క్రీగంటి చూపు కొన్నివందల ఓల్టుల విధ్యుచ్చక్తి సరఫరా చేసినట్లుగా అనిపించింది. ఆమె సౌందర్యం చూస్తుంటే అతనికి ఒళ్ళు గగుర్పొడిచింది.
    
    చాయ అలవోకగా తలతిప్పి భుజంమీద వున్న అతని చేతివంక చూసింది. జయచంద్ర అప్పుడే స్పృహలోకి వచ్చినట్లుగా బిగించిన తన పట్టు సడలించాడు.
    
    అతని వేళ్ళు బిగిసిన చోట ఆమె శరీరం ఎర్రగా కంది, పాలల్లో కుంకుమపువ్వు కలిపినట్లుగా అయింది.
    
    జయచంద్ర తల విదిలిస్తూ "సారీ......నేను మిమ్మల్ని...." అన్నాడు.
    
    ఆపైన ఆమె కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడడం ఎంత కష్టమో గ్రహించాడు. అవి అదోరకంగా నవ్వుతున్నాయి. ఆ నవ్వులో కొంటెదనం వుంది. కవ్వింత వుంది! ఆహ్వానం వుంది! అదోరకం అలజడి కలిగించే గుణం వుంది! ఇవన్నీ వుండి కూడా ఆ కనులు అమాయకంగా కనపడడం అత్యంత విచిత్రమైన విషయం!    
    
    చాయ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. "ఇషలీ బదు...." అంది.
    
    "ఆ!" అన్నాడు అర్ధంకానట్లు జయచంద్ర.
    
    "చాయా!" అన్న సంధ్య గొంతు వినిపించింది. ఆమె పైకి వస్తున్న చప్పుడైంది.
    
    "ఇష్ లీ బదూ...." ఈసారి ఇంకా క్లియర్ గా అంది చాయ.
    
    "అంటే?"
    
    "ఫిర్ మజే సంగ్ లేకే.....నయే, నయే రంగ్ లేకే.....సప్ నోంకె మెహఫిల్ మే...."
    
    సంధ్య చేతిలోవున్న టేప్ లోంచి పాత విన్పిస్తోంది.
    
    సంధ్య వస్తూనే "ఓ డాడీ ఇక్కడే వున్నారా? చాయ ఒక్కతే బోర్ అయివుంటుంది అనుకున్నాను" అంది ఆనందంగా.
    
    ఎప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా వుండగలగడం ఒక వరం!
    
    జయచంద్ర ముఖంలో కూతుర్ని చూడగానే గాంభీర్యం వచ్చేసింది.
    
    "మంచు కురుస్తోంది......త్వరగా క్రిందకి వచ్చేయండి. భోజనానికి నాకోసం ఎదురుచూడద్దు.....గుడ్ నైట్" అని క్రిందికి వెళ్ళిపోయాడు.
    
    "చాయా! నీకు ఏ పాటంటే ఇష్టం?" సంధ్య అడిగింది.
    
    "సాపాటు!" చెప్పి పకపకా నవ్వింది చాయ. "తలనొప్పిగా వుంది! మనమూ క్రిందకి పోదాం సంధ్యా" అంది చాయ.
    
    సంధ్య ఆశ్చర్యంగా చూసి- "దిష్టి కొట్టిందేమో....అందుకే తలనొప్పి" అని నవ్వింది.
    
    "ఎవరి దిష్టి?" అడిగింది చాయ.
    
    సంధ్య ఒక్కనిముషం ఆలోచన చేసి "ఊ.....తప్పకుండా ఆయనదే" అంది.
    
    "ఎవరిది?" కళ్ళు ఆర్పుతూ అడిగింది చాయ.
    
    "ఆయనది!" పైకి చూపిస్తూ అంది సంధ్య. "చంద్రుడు చూడు ఇందాకట్నుంచీ కళ్ళు ఆర్పకుండా నిన్నే చూస్తున్నాడు. పాపం ఆ తరాల ముఖాలు ఎలా చిన్నబుచ్చుకున్నాయో చూశావా" అని నవ్వేసింది.
    
    చాయ కూడా నవ్వి "పద వెళదాం" అంది.
    
    ఆకాశంలో చుక్కలు పెట్టి ముగ్గు పూర్తి చెయ్యకుండా వెళ్ళిన నిశికన్యని చూసి బుంగమూతి పెట్టి అలిగినట్లున్నాడు చందమామ!
    
    సంధ్యకి కాసేపు తియ్యని పాటలు వింటూ, హాయిగా ప్రకృతిని ఆస్వాదించాలని వున్నా, విధి లేక చాయ వెంట నడిచింది!
    
    స్వర్ణప్రతిమకు ప్రాణం వచ్చి అడుగులు వేస్తున్నట్లుగా వున్న చాయని చూసి- "ఇంత అందమైన అమ్మాయిలో భావుకత్వం పెట్టడం మర్చిపోయాడేమిటో ఆ దేవుడు" అనుకుంది బాధగా సంధ్య.
    
                                            * * *
    
    "ఇష్ లీబదూ!" మరోసారి మననం చేసుకున్నాడు జయచంద్ర. అంతలోనే మర్చిపోతానేమోనని కాగితం మీద వ్రాసుకుని చదువుకున్నాడు. ఏమీ అర్ధంకాలేదు!
    
    ఫోన్ మ్రోగింది.
    
    అతనికి లిఫ్ట్ చెయ్యాలనిపించలేదు. అది ఆగకుండా మ్రోగుతూనే వుంది.
    
    విసుగ్గా ఫోన్ తీసి "హలో...." అన్నాడు.

 Previous Page Next Page