Previous Page Next Page 
ఖజురహో పేజి 28


    'రోజూ వుండేదానికి కూడా వీళ్ళు ఎందుకంత కంగారుపడటం!' అనుకుంది టిఫిన్ తింటూ చాయ.
    
    కాసేపటికి డాక్టర్ వచ్చాడు.
    
    ఇంట్లో చాలా హడావుడి జరిగింది.
    
    సంధ్య దిగులుగా- "నువ్వు ఈ రోజుకి ఇక్కడే వుండిపో చాయా.....ప్లీజ్!" అంది.
    
    చాయ సంధ్య తలమీదుగా కాంచన బెడ్ మీద కూర్చున్న జయచంద్రని చూసింది.
    
    అతను ముందుకి ఒంగి భార్య ముంగురులు ప్రేమగా సవరిస్తున్నాడు.
    
    'ప్లీజ్.....చాయ వుండవూ!" బ్రతిమాలుతున్నట్లు అంది సంధ్య.
    
    "ఉంటాను" స్థిరంగా అంది చాయ.
    
    సంధ్య ఆనందంగా "థాంక్యూ...." నాయి చాయని తన రూంలోకి తీసుకెళ్ళింది.
    
    "స్నానంచేసి ఆ వార్డ్ రోబ్ లోంచి నీకిష్టమైన డ్రెస్ తీసుకుని వేసుకో!" అంది.
    
    చాయ కళ్ళు పెద్దవయ్యాయి.
    
    సంధ్య ఆ రూంలోంచి వెళ్ళగానే చాయ లేని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ చాలా ఖరీదైన కాస్మోటిక్స్ వున్నాయి. ఇంపోర్టెడ్ ఫెర్ ఫ్యూమ్ బాటిల్ ఒకటి చేతిలోకి తీసుకుని వాసన చూసింది. మనసు ఎక్కడికో తేలిపోయినట్లుగా అనిపించింది.
    
    అది చాలా చిన్నగా, గుప్పెట్లో ఇమిడే అంత చిన్నగా వుంది. 'ఇది జాకెట్లో వేసుకుని తీసుకుపోదామా!' అనుకుంది ఆమెకు పైన పెట్టిన రకరకాల పౌడర్లూ, స్నోలూ, లిప్ స్టిక్ లూ కనిపించాయి. 'ఇవన్నీ ఈ మొద్దు ఎప్పుడూ వాడదే!' అనుకుంటూ వార్డ్ రోబ్ దగ్గరకు వెళ్ళి తలుపు తీసింది.
    
    చాయ కళ్ళు చెదిరిపోయాయి. సంధ్యకి అన్నిరకాల డ్రెసెస్ ఉంటాయని ఆమె ఊహించలేదు. హేంగర్ల నిండా వున్న చీరలే ఓ రెండు వందల దాకా వున్నాయి. చాలా ఖరీదైనవి! ఒక్కొక్క డ్రస్ తడుముతూ చాయ తదాత్మ్యత అనుభవించింది.
    
    జరీ పువ్వులూ, బుటా వున్న కాపర్ సల్ఫేట్ కలర్ ఫ్యూర్ సిల్క్ శారీని చేత్తో తడుముతూ 'దీన్ని ఎలాగైనా నాతో తీసుకుపోగలిగితేనో!' అనుకుంది.
    
    ఆమెకు ఫోటోలోని కాంచన రూపం.....ఆమె ధరించిన నగలూ కళ్ళల్లో మెదిలాయి. 'ఈ చీర కట్టుకుని, ఆ ముత్యాల సెట్టు పెట్టుకుంటే......ఆ కాంచన కాదు.....కాదు! ప్రపంచ సుందరీమణులు.....కాదు.....స్వర్గం నుండి అప్సరసలు దిగొచ్చినా నా ముందు బలాదూరే!' అని చిన్నగా నవ్వుకుంది.
    
    లాకర్ కి తాళంవేసి లేదు. చాయ తియ్యగానే తలుపు తెరుచుకుంది. లోపల బ్లూ కలర్ వెల్వెట్ బాక్స్ కనిపించింది. చూడగానే అది నగల పెట్టె అని తెలిసిపోతోంది. చాయ ఓసారి తలతిప్పి తలుపుకేసి చూసింది. ఎవరూ వస్తున్న అలికిడిలేదు. నెమ్మదిగా వణుకుతున్న చేత్తో దాని మూత తీసింది. లోపల తను కోరుకున్నలాంటిదే ముత్యాలసెట్టు వుంది. చయకి ఒక్కక్షణం దాన్ని మెడలో వేసేసుకోవాలన్న కోరిక బలంగా కలిగింది. ఇంతలోనే బయట అడుగుల చప్పుడైంది. వెంటనే పెట్టె యధాస్థానంలో పెట్టేసి, గబగబా వెళ్ళి మంచంమీద కూర్చుంది.
    
    సంధ్య లోపలికి వచ్చి- "ఇంకా స్నానం చెయ్యలేదా? ఏం? డ్రెస్ ఏదీ నచ్చలేదా? పోనీ చీర కట్టుకో" అంది.
    
    చాయ ఇబ్బందిగా ముఖంపెట్టి "నువ్వే ఇయ్యి సంధ్యా.....నాకు మొహమాటం" అంది.
    
    సంధ్య చిరుకోపంగా- "ఆ మొహమాటాలవీ నా దగ్గర కుదరవు.....రా....నీకిష్టమైనవి తీసుకో" అని వార్డ్ రోబ్ తీసి "ఇదీ.....ఇదీ....." అంటూ చీరలు చూపించసాగింది.
    
    "ఇదో!"
    
    చాయ కళ్ళు మెరిశాయి.
    
    సంధ్య చేతిలో కాపర్ సల్ఫేట్ క్రిష్టల్స్ కలర్ చీర వుంది!
    
    "ఇంత మంచి చీర.....రాత్రిపూటా?" నసుగుతూ అంది చాయ.
    
    "అబ్బా.....ఏదో ఒకటి....మంచేమిటి? మామూలు చీరేలే! ఒక్కసారి కూడా నేను కట్టలేదని మా మమ్మీ నామీద అలిగింది కూడాను!" అని చాయ మీదవేసి, గొంతు తగ్గించి- "మా డాడీ సెలక్షన్ బావుందా? మైసూర్ నుంచి తెచ్చారు" అంది.
    
    చాయ తన భుజంమీద వున్న చీరని గట్టిగా ఒడిసి పట్టుకుంది. అది మెత్తగా జారిపోతోంది.
    
    "వెళ్ళు.....నేను మళ్ళీ వచ్చేలోగా స్నానం చేసి రెడీగా వుండు" అని సంధ్య వెళ్ళిపోయింది.
    
    చాయ బాత్ రూంలో అడుగుపెట్టి నోరు తెరిచేసింది! పాలరాతి ఫ్లోరింగ్ మీద అడుగుపెడుతుంటే, తన కలలు ఫలించినట్లనిపించాయి. పెద్ద బాత్ టబ్ చూడగానే వళ్ళు పులకరించింది. బట్టలు విప్పుతూ పైకి చూసి అప్రయత్నంగా 'కెవ్వు' మంది పైన రూఫ్ కి ఫిక్స్ చేసిన అద్దంలో ఆమె అందం కన్నులవిందుగా కనిపిస్తోంది. ఆనందంతో తనకి మతిపోతుందేమో అనిపించింది ఆమెకు.
    
    గోరువెచ్చని నీళ్ళు వదలి బాత్ టబ్ లో పడుకుంటే 'హాయ్! స్వర్గం అంటే ఇదేనేమో!' అనిపించసాగింది.
    
    కళ్ళు మూసుకోగానే బాత్ రూం దగ్గర క్యూలూ, అల్లరి, లోపల రొచ్చు వాసనా, నాచూ గుర్తొచ్చాయి. అదిరిపది కళ్ళు తెరిచేసింది.
    
    "చాయా.....చాయా.....ఇంకా ఊడిపడవా?" సంధ్య బాత్ రూం తలుపుమీద టకటకా కొడుతూ అంది. "ఇదొక్కర్తీ" విసుక్కుంటూ లేచింది చాయ.
    
    "ఓహ్.....మార్వలెస్.....సింప్లీ సూపర్బ్! ఎంత బావున్నావో తెలుసా ఈ చీరలో! అద్దంలో చూసుకో" సంధ్య అబ్బురంగా చూస్తూ అంది.
    
    'అద్దంలో చూసుకోనక్కరలేదు. నా అందం సంగతి నాకు తెలుసు!' అనుకుంది చాయ.
    
    అద్దం ముందు కూర్చుని చాయ తన పొడవాటి కురులు దువ్వుకుంటూ వుంటే, వెనుకనుండి వచ్చి మెడలో ముత్యాల నెక్లెస్ పెట్టింది సంధ్య.
    
    "అరె.....ఇదేమిటి?" ఆనందం, ఆశ్చర్యం కలగలిపి అంది చాయ.
    
    "ఉష్! మాట్లాడకు మెడ బోసిగా వుంటే బాలేదు. చెవులకీ, చేతులకీ కూడా వేసుకో" అధికారంగా అంటూ బాక్స్ చేతికి అందించింది సంధ్య.
    
    చాయకి అవి పెట్టుకుని అద్దంలో చూసుకోగానే ఏడుపొచ్చింది. ఇవన్నీ రేపు ఇచ్చేసి వెళ్ళిపోవాలికదా! అన్న తలంపే ఆమెకి భరించరానిదిగా అనిపించింది.
    
    "చాయా! నిన్ను చూస్తుంటే మతిపోతోంది తెలుసా? ఎంత ముద్దొస్తున్నావో" ఆమె చెంపమీద ముద్దుపెడుతూ అంది సంధ్య.
    
    చాయ నవ్వి- "నీ ముచ్చట తీరిందిగా ఇంక తీసెయ్యనా?" అంది.
    
    "ఒద్దు.....ఒద్దు....ఈ ఒక్కరోజుకీ వుండనీ" అంది సంధ్య.

 Previous Page Next Page