Previous Page Next Page 
సృష్టి పేజి 29


    "నందిని ట్రీట్ మెంటు కోసం మీరు అమెరికా తప్పనిసరిగా వెళ్లాలి. అప్పుడయినా మీకు డబ్బు అవసరం వస్తుంది. రాదంటారా?" తనకన్నా తక్కువస్థాయి మనుషుల్ని నచ్చితే మచ్చిక చేసుకోవడం, నచ్చకపొతే వాళ్ళ మనసుల్తో ఆడుకోవడం చీనాంబరకు పుట్టుకతో వచ్చిన సరదా.

 

    "నందిని గురించి మీకెలాతెల్సు?"

 

    " నాకు అవసరమయిన విషయాలన్నీ నేను తెలుసుకుంటాను. అది నా హాబీ. మీకిప్పుడు డబ్బు అవసరం కూడా వుందని నాకు తెలుసు. చూడండి మిస్టర్  అభినవ్! ఫాల్స్ ప్రెస్టేజ్ కి వెళితే మనతోపాటు మన ప్రతిభ కూడా  మరుగున పడుతుంది. అందుకే మరోసారి అడుగుతున్నాను. జీవితం గురించి తెలుసుకోండి. డబ్బు అవసరం గుర్తించండి. ఒక అవకాశాన్ని వదులుకుంటే మరొక అవకాశం చచ్చినా రాదు."

 

    ఆమె మాటలకు  ఎందుకో అభినవ్  వళ్లు  కుతకుతలాడిపోయింది.

 

    "నాకు ఏ అవకాశమూ రానప్పుడు డబ్బు కోసమే నా కళను అమ్ముకోవాల్సినపరిస్థితి వచ్చినప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను. గుడ్ నైట్" అసహనంగా చెప్పేసి వేగంగా కారిడార్లోంచి నడుచుకుంటూ మెయిన్ గేట్ దాటి రోడ్డు మీదకెళ్ళాడు అభినవ్. చాలా సేపు అతను వెళ్ళిన వైపే చూస్తూ నిశ్శబ్దంగా వుండిపోయింది చీనాంబర.

 

    అత ప్రతిభే కాదు అతని వ్యక్తిత్వం కూడా ఆమెకు నచ్చాయి.

 

    మిస్టర్ అభినవ్ మీకు ఏ  అవకాశం రాణి పరిస్థితి రాణి నేను కల్పిస్తాను. మీ కళను మీ చేతులతో అమ్ముకోవాల్సిన పరిస్థితిని నేను కల్పిస్తాను. డోన్ట్  అండర్ ఎస్టిమేట్ మి మైడియర్ ఫ్రెండ్- మనసులోనే  అనుకుని లేచి నిలబడింది చీనంబర. కొన్ని రోజులపాటు తను మద్రాసులోనే వుండాలని నిర్ణయించుకుంది ఆమె ఆ క్షణంలోనే.

 

                                         *    *    *


    గోడ గడియారం టంగ్, టంగ్ మని గంటలు కొట్టడంతో డ్యూటీ రూంలో కూర్చున్న లిపి చటుక్కున తలెత్తి గోడవైపు చూసి స్టెత్ స్కోప్ సర్దుకుని లేచి, రౌండ్స్ కి వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది.

 

    అరగంట తరువాత రౌండ్స్ నుంచి తిరిగొస్తున్నప్పుడు ఎదురుఫడ్డ సూపరింటెండెంట్ పద్మనాభన్ ని చూసి తల తిప్పుకుని పక్కకు వెళ్ళబోయింది లిపి.

 

    "నీ కోసం డ్యూటీ రూమ్ కి వెళ్ళాను మిస్ లిపి" అన్నాడు పద్మనాభాన్.

 

    "రౌండ్స్ కి వెళ్ళాను సార్" నెమ్మదిగా చెప్పింది ఆమె.

 

    "ఆ పోర్టీన్ బెడ్ పేషెంట్ కి ఎలా వుంది?" అడిగాడతను.

 

    "నథింగ్ సీరియస్ సార్! ఆమెను పంపించెయ్యొచ్చు" క్యాజువల్ గా  అంది లిపి.

 

    "పంపించెయ్యొచ్చా? ఎక్కడికి! పైకా?' జోకు వేసి  పగలబడి నవ్వాడతను.

 

    లిపి కూడా ఆ నవ్వులో శృతి కలిపింది.

 

    "బైదిబై! ఇవాళ నువ్వు నాతో డిన్నర్ చేస్తున్నావు" సడన్ గా  అన్నాడతను.

 

    "నేను డిన్నర్ చేసేశాను సార్" టక్కున అంది ఆమె.

 

    "నథింగ్ డూయింగ్. ఇవాళ డిన్నర్ లో నువ్వు కంపెనీ ఇస్తావని హోటల్ రెసిడెన్సీ  నుంచి తెప్పించాను. కమాన్" మరో మాటకు అవకాశం యివ్వకుండా తన రూమ్ వైపు కదిలాడతను.

 

    అప్రయత్నంగా అతన్ని అనుసరించింది లిపి.

 

    ఆఫీస్ రూమ్ కి రెండో వైపునున్న డోరులోంచి లోపలికి నడుస్తూ "కమాన్ లిపి" అన్నాడు తల తిప్పకుండానే.

 

    లోపల విశాలమైన హాలు -  ఒకవైపు డబుల్ బెడ్, రెండో వైపు రెండు సోఫాలు, డైనింగ్ టేబుల్ మీద రెండు పెద్ద క్యారేజీలు, పింగాణీ ప్లేట్లున్నాయి.

 

    లిపి లోపలకు అడుగుపెట్టాక  నెమ్మదిగా డోర్ దగ్గరగా వేశాడు అతను.

 

    ఆ విషయాన్ని లిపి గమనించలేదు.

 

    "లిపీ! నువ్వు కొత్తతనాన్ని ఫీలవుతున్నట్లున్నావు కదూ? నాకలాంటిదేం లేదు. మన స్టాఫ్ నా దగ్గర ఎంత క్లోజ్ గా వుంటారో చూశావా...... మన ప్రొఫెషన్లో మనం హేపీగా కనిపించాలి. మొహమాటంగానూ, మూడీగానూ వుండకూడదు' చెపుతూ ఫ్రిజ్ లోంచి ఓ బాటిల్ తీశాడు పద్మనాభన్.

 

    ఒక గ్లాసులోకి ఆ డ్రింక్ ని వంపుకుంటూ "భోంచేసే ముందు  ప్రతిరోజూ నేను వైన్ తీసుకుంటాను. ఇట్స్ లేడీస్ డ్రింక్. తీసుకుంటావా." నిజానికి అది వైన్ కాదు.

 

    "నో సార్! నాకు అలాంటి వాసన పడదు" భయంగా అంది లిపి..

 

    "అన్నిరకాల వాసనకీ అలవాటు పడాలి మిస్ లిపి. రేపు నీకు పెళ్ళయ్యాక నీ భర్త నిన్ను తాగమన్నాడనుకో తాగావా. అప్పుడు కంగారుపడడం బాగోదు కాబట్టి నువ్వు అన్ని విషయాలూ ఇప్పుడే నేర్చుకోవాలి" చాలా జోవియల్ గా  అన్నాడు పద్మనాభాన్.

 

    తన ఎదురుగా కూర్చుని, తనవైపే చూస్తూ గ్లాస్ తాగుతున్న పద్మనాభన్ వైపు చూడలేక తల దించుకుంది ఆమె.

 

    వెంటనే ఆ జాబ్ ని  వదిలేసి వెళ్ళిపోదామన్నంత కోపంగా వుంది ఆమెకు.

 

    కానీ ఒక్కసారి తల్లి, తండ్రి గుర్తుకొచ్చారు.

 

    సడన్ గా వుద్యోగం మానేసి పూర్తిగా తమ్ముడు భాస్కరం మీద ఆధారపడడం ఇష్టంలేదామెకు.

 

    నాలుగు పెగ్గులు పూర్తయ్యాయి.

 

    "మీరు డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోండి సార్" అంతకన్నా ఎక్కువ సేపు అక్కడ వుండలేక లేచి నిలబడింది లిపి.

 

    "మగవాళ్ళని చూసి అంత భయపడతావెందుకు.... ఇద్దరం వున్నప్పుడు ఒక్కరే రెస్ట్  తీసుకుంటే బావుంటుందా చెప్పు..... ఇక్కడ మన స్టాఫ్ లో అందరూ నాతో డిన్నర్  చేసినవాళ్ళే. ఏం  తప్పులేదు రా నీకు చాలా విషయాలు నేర్పుతాను కదా" లేచి గబుక్కున  లిపి చెయ్యి పట్టుకున్నాడు పద్మనాభన్.

 

    అంత త్వరగా అలాంటి సంఘటన ఎదురౌతుందని వూహించని లిపి-

 

    "సార్! నేనలాంటి దాన్ని కాదు సార్" గబుక్కున చెయ్యి విదిల్చికొట్టి డోరువైపు పరుగెత్తింది ఆమె - ఆ షాక్ లోనే.

 

    "ఏయ్ లిపీ ఆగు" అరుస్తూ వెళ్ళి పైటచెంగు పట్టుకుని బలంగా లాగాడు పద్మనాభాన్.

 

    ఆ విసురుకి పైటచెంగు ఫర్ర్ మని చినిగిపోయింది.

 

    గబుక్కున ఆమెని రెండు చేతులతో పొదివి పట్టుకుని బలవంతంగా బెడ్ వైపు లాగుతూ-

 

    "చూడూ- టెన్ మినిట్స్ గొడవ చెయ్యకు. గొడవ చేస్తే నీకే నష్టం. ఒప్పుకున్నావనుకో....నిన్ను ఈ నర్సింగ్ హోం కి ఇన్ ఛార్జిని చేస్తాను కాదనకు."

 

    అంతవరకూ ఓపిక పట్టిన లిపిలో ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది.

 

 Previous Page Next Page