ఆ మధ్య ఢిల్లీలో రాజా రవివర్మ పెయింటింగ్స్ ప్రదర్శన జరిగింది. అప్పటి ప్రధాని ప్రారంభించిన ఆ ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఒక చిత్రకారుడి చిత్రాలు జీవితం మీద ఒక ప్రభుత్వం ప్రదర్శన నిర్వహించడం అరుదైన విషయం.
అసలు రవివర్మ చిత్రకారుడు కాడని ఎమ్.ఎఫ్.హుస్సేన్ ప్రదర్శన విషయంలో ధ్వజం ఎత్తాడు. ఆయన సొంతంగా ఊహించి ఒక్క బొమ్మను కూడా చిత్రించలేదని, మోడల్స్ పెట్టుకుని చిత్రించడం వల్ల రవివర్మలో అనుకరణ చిత్రీకరణే కానీ అనుసృజన కాదని హుస్సేన్ ధ్వజమెత్తారు. అందరూ పూజిస్తున్న రవివర్మ చిత్రించిన 'సరస్వతీదేవి' చిత్రాన్ని పరిశీలిస్తే ఇటలీదేశపు వనితకు భారతీయ అలంకరణ చేసినట్టుగా కనిపిస్తుందని హుస్సేన్ ఆరోపణ. ఈ విషయంలో సమకాలీన భారతీయ చిత్రకారులు లలితలాజ్మి తయ్యబ్ మోహతా, అక్బర్ పద్మసే, లక్ష్మిణశేష్ట, గులామ్ మహమ్మద్ షేక్ ల మధ్య తీవ్రమయిన వాదోపవాదాలు కొన్ని సంవత్సరాల క్రితం జరిగాయి.
ఇదిలా వుండగా-
రవివర్మలోని కళాకారుని గురించి ఆయన చిత్రాల గురించిన వివాదం అలా కొనసాగుతుండగానే రవివర్మకి సంబంధించిణ మరో కొత్త విషయము వెలుగులోకి వచ్చింది.
రవివర్మ పేకముక్కల కోసం ప్రత్యేకంగా చిత్రాలను చిత్రీకరించాడని చెపుతూ ఆ పేకముక్కలను బయటపెట్టారు. అవి రవివర్మ స్థాపించిన ప్రెస్ లోనే ప్రింటయ్యాయని నిరూపించే గుర్తులున్నాయి. పేకముక్కల మీద బొమ్మలుకూడా రాజా రవివర్మ చిత్రాలనే పోలి వున్నాయి. కాబట్టి పేక ముక్కలమీద చిత్రాలను ప్రాణప్రదంగా, పవిత్రంగా భావించే రవివర్మ పేకముక్కలకోసంప్రత్యేకంగా బొమ్మలు గీస్తాడా అని కొందరు వాదిస్తుండగా మహారాజుల కోరిక మేరకు రవివర్మ అలా చిత్రంచి వుంటాడని కొందరు ఊహిస్తున్నారు.
ఆ పేక ముక్కల మీద విస్తృతమయిన పరిశోధనలు కూడా జరిగాయి.
ఆ బొమ్మలు ఆయన గీసినవే అని, అయితే అవి పేకల కోసం గీసినవి కాదని, విడిగా ఆయన గీసిన బొమ్మలను ఆయన మరణం తరువాత పేకముక్కలమీద ప్రింట్ చేశారని తేల్చారు. ఆ పేకముక్కలు 1910-1915 మధ్య కాలంలో ప్రింట్ అయినట్టు ఊహిస్తున్నారు.
రాజా రవివర్మ చిత్రాలతో తయారైన పేక సెట్స్లో రాజు కార్డు మీద రాజులు, లేదా చరిత్ర పురుషుల బొమ్మ. రాణిస్థానంలో వారి రాణులు, జాకీ స్థానంలో అదే చారిత్రాత్మక, లేదా పురాణగాథకు సంబంధించిన బొమ్మలు వున్నాయి. అక్బర్, షాజహాన్, ఔరంగజేబులను రాజులుగా పేకముక్కలమీద చిత్రిస్తే వారి నిజమైన భార్యలనే రాణులుగా చిత్రీకరించడం విశేషం.
మరొక పేక సెట్ లో కళావర్ రాజు, రాణి, జాకీ బొమ్మల స్థానంలో దుష్యంతుడు, శకుంతల సూత్రధారుల బొమ్మలను వాడారు. ఇస్పేట్ రాజు, రాణి, జాకీలుగా రాముడు, సీత, హనుమంతుడు బొమ్మలను, డైమన్ రాజు, రాణులుగా నలుడు, దమయంతిలను, అఠీన్ రాజు, రాణి జాకీలుగా హరిశ్చంద్రుడు, చంద్రమతి, విశ్వామిత్రుడ్ని చిత్రించడం జరిగింది.
ప్రస్తుతం రవివర్మ పేరుతో వున్న ప్లేయింగ్ కార్డు మార్కెట్లో లేవు. పురాణ పురుషుల్ని పేకముక్కలపై చిత్రించడం వల్ల వాటిని రాజులు ఆదరించినా, ప్రజలు ఆదరించలేదని అంటారు.
1873లో పూలు అమర్చుకొంటున్న నాయర్ యువతి అనే చిత్రానికి ఆనాటి గవర్నర్ సువర్ణ పతాకాన్నిచ్చారు. 1904లో మద్రాసు ప్రభుత్వ భవనంలో అలంకరించేందుకు సర్ ఆర్థర్ హెలాక్ చిత్రాన్ని చిత్రించడానికి ఆనాటి మద్రాసు ప్రభుత్వం రవివర్మను నియమించింది. ఆ తర్వాత కైజర్- ఇ- హింద్ బిరుదుతో సత్కరించబడ్డాడతను.
పునరుజ్జీవోద్యమ సమయంలో రినైజాన్స్ అని పిలవబడే కాలంలో స్తబంగా వున్న భారతీయ చిత్రకళారంగానికి కొత్త ఊపునిచ్చి సంప్రదాయ పద్ధతికి హారతిపట్టి, అత్యాధునిక కళా విప్లవానికి దోహదం చేసిన చిత్రచరిత్ర నిర్మాత రాజా రవివర్మ."
"ఏంటి ఆలోచిస్తున్నారు?" అడిగింది చీనాంబర.
"మీరీ విషయాన్ని చెప్పడానికే ఢిల్లీ నుంచి వచ్చారా?" చేతి వాచీవేపు చూసుకుంటూ అడిగాడు అభినవ్.
"స్పష్టంగా చెప్పమంటారా! అందుకే వచ్చాను. నాతో చేతులు కలపండి. కేవలం ఒక పరిధికి మాత్రమే తెల్సిన మీ ప్రతిభను ఈ దేశాన్ని దాటిస్తాను. అమెరికా, రష్యా, పెయింటర్స్ పెరడైజ్ ప్యారిస్ లో మీకు పట్టం కట్టడానికి నేను ఏర్పాట్లు చేస్తాను."
" నాగురించి మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారనుకుంటాను" అన్నాడు అభినవ్ ఒకింత విస్మయంగా.
వెంటనే జవాబు చెప్పలేదు చీనాంబర.
"ఇష్టపడే వ్యక్తుల గురించే మనుషులు ఎక్కువసేపు ఆలోచిస్తారు కాదంటారా?"
అంటే చీనాంబర తనంటే ఇష్టపడుతోందా? ఆశ్చర్యపోయాడొక్క క్షణం ఆ యిష్టం ఎలాంటి ఇష్టం? వ్యక్తిగానా? కళాకారుడిగానా? ఆ ప్రశ్న అడగాలనుకుని నోటివరకూ వచ్చిన ప్రశ్న అక్కడే ఆగిపోయింది. బయటకు రాలేదు.
"నేనిప్పటివరకూ నా సంతృప్తి కోసం చిత్రాలు వేశాను. కళను నడిపించాలి తప్ప కల మనల్ని నడిపించకూడదన్నది నా అభిమతం . నాకు పెయింటింగ్స్ ను అమ్ముకుని కోట్లు సంపాదించుకోవాలనే కోర్కె లేదు" నిష్కర్షగా చెప్పి లేచి నిలబడ్డాడు. అప్పటికే ఆమె ఉద్దేశ్యం పూర్తిగా అర్థమయిన అతనికి అక్కడుండడం ముళ్ళమీద వున్నట్టుగా వుంది.
"వెళ్ళిపోడానికి లేచిపోయారు. ఏం కోపం వచ్చిందా?" తనూ లేస్తూ అడిగింది చీనాంబర.
మసక చీకట్లో అతని ముఖంలోని ఫీలింగ్స్ ఏవీ ఆమెకు కనిపించలేదు.
"బాగా ఆలస్యమైంది. నా కోసం ఎదురుచూసే వ్యక్తులున్నారు" ముందుకు కదిలాడు అభినవ్.
"ఎవరు? ఆ యాడ్ ఏజెన్సీ అమ్మాయా?" ఆ మాటకు చటుక్కున తలతిప్పి ఆమె వేపు చూశాడు అభినవ్.
అంటే చీనాంబర తన గురించే కాకుండా తనకు సన్నిహితంగా మెలిగే వ్యక్తుల గురించి కూడా తెలుసుకుందా? ఎందుకు?
"నా కోసం ఎదురుచూసే వ్యక్తి నా చెల్లెలు నందిని" అతని గొంతులోని తీవ్రతను గుర్తించింది చీనాంబర.