Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 29

  

     ఎదురుగా మధు కన్పించలేదు.

 

    అప్పటికే అతను హీరో హోండా స్టార్ట్ చేస్తున్నాడు.

 

    మరో రెండు నిమిషాల తర్వాత మధు హీరో హోండా రయ్ మని మెయిన్ రోడ్డు మీద దూసుకుపోతుంది.

 

    
                                             *    *    *

 

    అదే రోజు రాత్రి మధు సుల్తాన్ తో సహా ట్రైన్ లో విశాఖపట్నానికి బయలుదేరాడు.

 

    
                                             *    *    *

 

    డాబా గార్డెన్ హొటల్ వీనస్.

 

    దిగిన అరగంటలోనే ఫ్రెషప్ అయిపోయి, రూమ్ బాయ్ చేత టిఫిన్ తెప్పించుకుని తిని, కాఫీ తాగి-

 

    ఆరోజు ప్రోగ్రాం గురించి ఆలోచించుకోసాగారు మధు, సుల్తాన్.

 

    "మనం ఇక్కడికెందుకొచ్చాం?" అడిగాడు సుల్తాన్.

 

    "అన్విత కోసం" చెప్పాడు మధు.

 

    "కాదు" వెంటనే అన్నాడు సుల్తాన్.

 

    "ఏలూరు చాప్టర్ నువ్వు  వదిలెయ్. సైంటిఫిక్ గా ఆలోచించు. నువ్వు మాస్టర్ డిగ్రీ ఎందుకు చేస్తున్నావ్? అంటే..... ఎగ్జామ్స్ కోసం అని చెప్పడం తప్పు. జీవితంలో బాగా బతకడానికి, ఎగ్జామ్స్  ఒక గోడ. ఆ గోడ దాటితే నిన్ను సెక్సెస్ వరిస్తుంది. ఇక్కడ అన్విత కూడా ఒక గోడే. అంతే నీ మానసిక లక్ష్యం, ఇష్టపడిన అమ్మాయిని చేజిక్కించుకోవడం ఎందుకు? నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి. డబ్బు, ఆస్థి, ఐశ్వర్యం నీ సోషల్ ప్రిస్టేజిని పెంచడానికి వుపయోగపడతాయి. జీవితంలో అదొక సగభాగం. రెండో సగభాగం నీ మానసికమైన ఆనందం. ఈ రెండూ కలిస్తేనే జీవితం. ప్రేమించే ప్రతి యువతీ, యువకుడూ ఈ దిశగానే ఆలోచించాలి" చెప్పాడు సుల్తాన్.

 

    "ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు?" తన లోపాన్ని అతను సవరించుకోడానికి సిద్ధంగా వున్నాడు.

 

    "ఏలూరులో చేసిన తప్పు మళ్ళీ చెయ్యొద్దు. నేను నా ఆలోచనా విధానంతో ధైర్యంగా 'కరెక్ట్ వే' లో వెళ్ళగలను. నిన్ను నువ్వు హిప్నటైజ్ చేసుకో. నీకిప్పుడు ఫోటోలూ అక్కర్లేదు. ప్రేమలేఖలూ అక్కర్లేదు. డైరెక్ట్ గా అన్విత ఇంటికి వెళ్ళు. నువ్వెందుకొచ్చావో చెప్పు? ఆమె రియాక్షన్ ని గమనించు. తర్వాత. ఏం చెయ్యాలో నేను చెప్తాను."

 

    సుల్తాన్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాడు మధు.

 

    అందుకు మానసికంగా సిద్ధమవుతున్నాడతను.

 

    అరగంట తర్వాత యిద్దరూ కిందకొచ్చి ఆటో ఎక్కారు.

 

    "పెద వాల్తేరు" చెప్పాడు సుల్తాన్.

 


                                              *    *    *

 

    సరిగ్గా ఉదయం పదిన్నరయింది.

 

    శ్రావణితోపాటు బైటకొచ్చి కారెక్కింది అన్విత.

 

    "ముందు ఫ్రూట్ మార్కెట్ కి వెళదాం. అక్కడ నుంచి హోమ్ ఫర్ ఏజ్ డ్..... ఎక్కడుందన్నావ్?" అడిగింది ఇగ్నీషన్ కీ తిప్పుతూ అన్విత.

 

    "గాజువాక"లో చెప్పింది శ్రావణి.

 

    "ఇక్కడికి ఎంత దూరం?"

 

    "ఇరవై కిలోమీటర్లుంటుంది" చెప్పింది శ్రావణి.

 

    కారు స్పీడందుకుంది.

 

    
                                           *    *    *    

 

    సన్ అండ్ సీకి కొంచెం ఎడమవైపునున్న ఉడా పార్కులో జపాన్ విసనకర్రలా విచ్చుకున్న అందమయిన చెట్టుకింద సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు మధు.

 

    పావుగంటలో సుల్తాన్ అక్కడకొచ్చాడు.

 

    "అదే యిల్లు..... కానీ మీ క్యాండిడేట్ లేదు. అరగంటక్రితం బయటికి వెళ్ళిందట. ఎప్పుడొస్తుందో తెలీదుట. గేట్ మాన్ చెప్పాడు."

 

    నిరీక్షణ బావుంటుంది. నిరీక్షణకు నిష్కల్మషమయిన హృదయం కావాలి. మనసుకో దృఢత్వం కావాలి.

 

    నిద్రకైనా విరామమెరుగని హృదయయాత్ర నీ కోసమని తెలుస్తూనే వుంది. మరల్చి, మత్తెక్కించి, స్వప్నాలతో లాలించి, మధురగానాల్లో ఊగించిన నీ వలపుకోసం-

 

    స్వప్నంలో అనుభవించిన నీ కుంతలాల కొసల స్పర్శకోసం,

 

    ఏ యుగాల అవతల తీరానో సంయోగమనే వాగ్దానం, నాకు మిగిలే ఆశ ఇదేనా!

 

    ఎండమావుల సౌందర్యానికై తపించి, ఒదిలి ఎండిలయమయ్యే మనిషిని చూసి దిక్కులు నవ్వుతాయి.

 

    యోగులు హృదయాల్లో వెలిగించే కాంతిలాంటి నీ చిరునవ్వు-

 

    నాకెట్లా దొరుకుతుంది?

 

    ఎప్పుడో, ఎక్కడో చదివిన చలం వాక్యాలు చప్పున గుర్తుకొచ్చాయి మధుకి.

 

    మనసు, బావిలోంచి ఎవరో తోడే నీళ్ళచప్పుడు, మనస్సుకి తప్ప  మరో మనిషికి విన్పించదు.

 

    అది ప్రేమ!

 

    కళ్ళముందు కదులుతున్న అన్విత ఆకారం, అతని కనుబొమ్మల్లో ప్రతిఫలిస్తున్న అన్విత చిరునవ్వు.

 

    "ఏమిటీ...... డే డ్రీమ్స్ లో కెళ్ళి పోయావా.........?" అన్నాడు సుల్తాన్ నవ్వుతూ.

 

    "Dreams are the fulfilment of some Repressed Infantile     Wish" ఫ్రాయిడ్ కొటేషన్ జ్ఞాపకానికొచ్చింది

మధుకు.

 

    ప్రతికోరిక పసికోరికే. మరీ ముఖ్యంగా ప్రేమ. కాసేపయ్యాక ఇద్దరూ లేచి పక్కనే వున్న రెస్టారెంట్లో కూర్చుని సముద్రాన్ని చూడసాగారు. భవిష్యత్ ని తలుచుకుంటూ.

 

        
                                          *    *    *

 

    గాజువాకాలో వృద్ధ అనాధశ్రమంలో అన్విత విజిటర్స్ రూమ్ లో శ్రావణి కూర్చుంది.

 

    విశాలమైన హాలులో  అందరూ అరవైకి పైబడిన వృద్ధులే.

 

    పిల్లల మమతాను రాగాలకు దూరమైన వృద్ధులు కొందరైతే, ఎవరూ లేని అనాధలు ఇంకొందరు.

 

    వాళ్ళ ఒక్కొక్కరి చేతిలోనూ రెండేసి యాపిల్స్ పెట్టి, స్వీట్ పాకెట్ ను అందిస్తూ వివరాలు కనుక్కుంటోంది ఆసక్తిగా. అపరిచితమైన వ్యక్తి చూపిస్తున్న అనురాగపు స్పర్శ, ఆ వృద్ధుల్ని పులకితుల్ని చేస్తోంది.

 

    "ఎవరమ్మా నువ్వు?" ఒక వృద్దురాలు అడిగింది.

 

    "మీ మనవరాలిననుకోండి......." అంది అన్విత. ఆ వృద్దురాలి కళ్ళల్లో ఒక కన్నీటిచుక్క పెల్లుబికి చర్మపు మడతల మీద పడింది.

 

    "గ్లాడ్ బ్లెస్ యూ బేబీ....."

 

    నలభై నిమిషాల తరువాత ఆ ఆశ్రమంలోంచి బయటికొచ్చింది అన్విత.

 

    కారు గాజువాక మెయిన్ రోడ్డుమీద, శ్రీహరిపురం రోడ్డువేపు వెళుతోంది.

 

    "మీలోని అరుదైన క్వాలిటీస్ నాకు నచ్చాయి" అంది శ్రావణి.

 

    "ఇది అరుదైన క్వాలిటీ అని నేను అనుకోవడం లేదు" క్యాజువల్ గా అంది అన్విత.

 

    "సర్వీస్ ఈజ్ ద లవ్, లవ్ ఈజ్ గాడ్..... కాదా?" అంది శ్రావణి.

 

    "మనం దేవుడ్ని చూడలేదు...... వేర్వేరు పేర్లతో మనం పిల్చుకునే ఈ  దేవుళ్ళందరూ మనుషులే..... మామూలు మనుషులకన్నా భిన్నంగా, మానవత్వంతో, సేవాభావంతో, అపారమయిన కరుణతో బతికారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళంటున్నాం..... అని నా నమ్మకం" అంది అన్విత.

 

    ఇంత మోడ్రన్ గా కన్పించే అమ్మాయి ఇంత ఫిలాసఫీయా? ఆశ్చర్య పోతోంది శ్రావణి.

 

    "మీ ఏలూరు కాలేజీలో అందరూ ఇంత ఫిలాసాఫికల్ గానే ఆలోచిస్తారా?" ప్రశ్నించింది.

 

    "ఏం?"

 

    "ఇక్కడ కాలేజీల్లో మాకు అలాంటి వాతావరణం వుండదు. ఎంతసేపూ..... లవ్వులు, లవ్ లెటర్స్.... నూన్ షోలకి జగదాంబకెళ్ళి ఇంగ్లీషు సినిమాలు చూడడం..... లేకపోతే కైలాసగిరి బీచ్ ఒడ్డుకి వెళ్ళిపోవడం- ఇక్కడంతా గమ్మత్తయిన రొమాంటిక్ వాతావరణం...." అంది శ్రావణి.

 

    ఆమె మాటలకి ఎందుకో అకస్మాత్తుగా మధు గుర్తుకొచ్చాడు అన్వితకు.

 

    మొదటిరోజు తనవేపు చూసిన మధు కనుచూపుల్లోని భావన వేరు.

 

    రైల్వే ప్లాట్ ఫారమ్మీద చూపుల్లోని భావన వేరు.

 

    "మధు నన్ను ప్రేమిస్తున్నాడా?" మొట్టమొదటిసారి అన్విత ఆలోచనల్లో ఆ ఊహ మొదలవగానే, క్షణకాలం విచకితురాలైందామె.

 

    కళ్ళల్లో వజ్రాల మెరుపు మెరుపు మెరిసింది.

 

    మరి తనకెందుకు చెప్పలేదు?

 

    అదే సమయంలో రవి, రమణ గుర్తుకొచ్చారు. వాళ్ళ సంభాషణలు గుర్తుకొచ్చాయి. రవి ఆ రోజెందుకు అంతగా ఎక్సయిట్  అయ్యాడు. మధు మీద ఎందుకంత కోపం?

 

    రవిని నమ్మొద్దని రమణ ఇన్ డైరెక్ట్ గా  ఎందుకు చెప్పాడు?

 

    అంచెలంచెలుగా  కొన్ని దృశ్యాలు ఆమె కళ్ళ ముందు కొస్తున్నాయి.

 

    అన్ని దృశ్యాలను కలిపే సూత్రబంధంలా మధు.

 

    మధుని కేవలం స్నేహితుడిగానే ఎందుకు చూసింది?

 

    నిజంగా అతను తనని ప్రేమిస్తే, తనకా విషయం ఎందుకు చెప్పలేదు? మళ్ళీ తనని తాను ప్రశ్నించుకుంది ఆమె.

 

    "ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నారు?" అడిగింది శ్రావణి.

 

    "ఏం లేదు" అంది అన్విత.

 


                                          *    *    *

 

    కారు లాసన్స్ బే కాలనీవేపు మలుపు తిరుగుతున్నప్పుడు స్టీరింగ్ ముందు కూర్చున్న అన్వితను చూడగానే 'అదిగో అన్విత' ఎక్సయింటింగ్ గా అన్నాడు మధు.

 

    "నువ్వెంత గట్టిగా అరిచి పిలవగలవో...... పిలు" అన్నాడు టెస్ట్ చెయ్యడానికి.

 

    చాలా గట్టిగా 'అన్వితా!' అని అరిచాడు నిస్సంకోచంగా మధు.

 

    "ఒకవేళ ఆమెకు వినపడి, కారాపితే....."

 

    అప్పటికే కారు ఆగకుండా ఆ ఇంటివైపు వెళ్ళిపోయింది.

 

    "అటు సముద్రం హోరు.... ఇటు సిటీబస్సుల హోరు..... విన్పించదని తెలిసే నీకు టెస్ట్ పెట్టాను" అన్నాడు సుల్తాన్.

 

 Previous Page Next Page