Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 28


    రాత్రి 'కిడ్నాపింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్' క్యాసెట్ పెట్టుకుని చూసి కబుర్లాడుకుంటూ నిద్రపోయారు అన్విత, శ్రావణి.

 

    
                                          *    *    *

 

    రాత్రి తొమ్మిది గంటలు దాటింది.

 

    డాబా మీద కుర్చీలో కూర్చున్నాడు మధు.

 

    అప్పుడే మెట్లెక్కి చేతిలో బ్యాగ్ తో వచ్చాడు సుల్తాన్.

 

    బ్యాగ్ లోంచి రాయల్ ఛాలెంజ్ బాటిల్ ని తీసి టీపాయ్ మీద పెట్టాడు. షోడాల్ని ఓపెన్ చేసి. డ్రింక్ ని గ్లాసుల్లో పోసి, షోడాని మిక్స్ చేసి ఐస్ క్యూబ్స్ వేశాడు.

 

    వెజిటబుల్ సలాడ్ ని ప్లేటులో సర్దాడు.

 

    మౌనంగా వున్నాడు మధు.

 

    అతని చేతిలో తను అన్వితకు రాసిన ఉత్తరం వుంది. ఆ ఉత్తరాన్ని అతను ఎన్నిసార్లు చదువుకున్నాడో తెలీదు. తను లెటర్ని ఇవ్వలేకపోయాడు. ఫోటోని ఇవ్వలేకపోయాడు. ఏకాంతం దొరికినా తన ప్రేమను వ్యక్తం చేయలేక పోయాడు.

 

    "అన్ ఫిట్" పదోసారి అనుకున్నాడు. తనమీద తనకే అసహ్యంగా వుంది మధుకి. డిప్రెషన్లో వున్నాడతను.

 

    గ్లాసు తీసుకుని డ్రింక్ ని గడగబా తాగేసి, గ్లాస్ ని టీపాయ్ మీద పెట్టేశాడు మధు.

 

    "నాకు కాలేజీకి వెళ్ళాలని లేదు...... అసలు ఈ ఊళ్ళోనే వుండాలని లేదు...... ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాను..." భారంగా వున్నాయి ఆ మాటలు.

 

    "ఇంకా?" సిప్ చేస్తూ ప్రశ్నించాడు సుల్తాన్.

 

    "చచ్చిపోను..... నాది టీనేజ్ లవ్ కాదు" అన్నాడతను.

 

    పెద్దగా నవ్వాడు సుల్తాన్.

 

    "ఒరే బాబూ! నీ ప్రేమ సక్సెస్ అవుతుంది...... కొంచెం ఓపిక పట్టు....."

 

    "అన్విత వెళ్ళిపోయింది. ఇంకా ఓపికెందుకురా..... నేను ఓడిపోయాను."

 

    "లేదు..... గెలిచే మెట్టుమీదే ఉన్నావ్. జరిగిన సంఘటనలేమీ నీ  అసమర్థత వల్ల జరగలేదనే విషయం నువ్వెందుకు గుర్తించవు? ఆలస్యంవల్ల జరిగాయి. ప్రేమలో ఆలస్యం పనికిరాదని నీకు నేనెప్పుడో చెప్పాను! ఫర్ ఎగ్జాంపుల.... అన్వితను నువ్వు తొమ్మిది గంటలకు సినిమా థియేటర్ దగ్గర కలుసుకుంటానని చెప్పావ్. అన్విత కరెక్ట్ గా తొమ్మిదిగంటలకు వస్తుంది. ఆమెగానీ, ఇంకెవరైనా లవర్ గానీ టైమ్ సెన్స్ ఎందుకు పాటిస్తారో తెలుసా? ప్రేమలో ప్రాధమికమయిన అంశం టైమ్ సెన్స్. నువ్వు ఏవో కారణాలవల్ల అరగంట ఆలస్యంగా వెళతావు- అన్విత వెళ్ళిపోతుంది. అది సహజం.

 

    ఎవరైనా పదినిమిషాలు, పావుగంట వెయిట్ చేస్తారు. అరగంట, గంటలు రైలుకోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చెయ్యరు. ఎందుకంటే ఇది సైకలాజికల్ పాయింట్..... టంచన్ గా టైమ్ కి తానెలా వచ్చిందో, నువ్వూ అలాగే రావాలని ఆ అమ్మాయి అనుకోవటమే.

 

    ఇక్కడ నీ విషయంలో ఏం జరిగింది?

 

    నువ్వు ప్రేమిస్తున్నట్టు అన్వితకు తెలీదు.

 

    ఆమె దొరికినప్పుడు నువ్వు చెప్పలేకపోయావు. నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఆమె అందుబాటులో లేదు. నువ్వు ఆమెకు చెప్పేశాక, ఆ అమ్మాయి తిరస్కరిస్తే నువ్వు డిప్రెషన్ కి లోనైనా అర్థం వుంటుంది.

 

    ప్రాక్టికల్ గా ఆలోచించు.....  యూ ఆర్ నాట్ ఏ డ్రీమర్.

 

    ఏ విషయంలోనూ ఆ అమ్మాయికి సమీపంగా వెళ్ళలేకపోయిన నీవు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావంటే యూ ఆర్ అన్ ఫిట్ ఫర్  లవ్.

 

    ఇక్కడ  డిప్రెషన్ అనే క్వశ్చన్ లేదు.

 

    బీ స్పోర్టివ్..... నువ్వు కరెక్ట్ ఛానెల్ లో ఆ అమ్మాయిని స్పందింప చేయగలిగితే, ఆ అమ్మాయి నీ దగ్గరకొచ్చి ఐ లవ్ యూ అని చెప్తుంది. ఇట్స్ ట్రూ..... థింక్ ఇన్ ఏ సైంటిఫిక్ వే....... వర్కవుట్ ఇన్ ఏ పాజిటివ్ వే, అప్రోచ్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే...... సైకాలజీ చెప్పేది యిదే" చెప్పాడు సుల్తాన్ విసుగును దాచుకుంటూ.

 

    "కరెక్ట్ గా స్పందింప చేయడమంటే?" అడిగాడు మధు.

 

    చెప్తాడు సుల్తాన్.

 

    "వైజాగ్, హోటలు ఖర్చులూ తడిసి మోపెడవుతుంది" అన్నాడు మధు భయపడుతూ.

 

    "తప్పదు మరి."

 

    "అవన్నీ ఫర్వాలేదు..... నువ్వు కూడా నాతో రావాలి" అన్నాడు మధు- కాసేపు ఆలోచించి.

 

    "వస్తాను."

 

    "పదివేలు సరిపోతాయా....?" భయాన్ని దాచుకుంటూ అన్నాడు మధు.

 

    "చెప్పలేం..... మీ ఊరెళ్ళి తెస్తావా? తేగలవా?"

 

    "ఎలా తెస్తావో చూడు.... రేపు సాయంత్రం మనం వైజాగ్  వెళుతున్నాం...... అంతే!" హుషారుగా చెప్పాడు మధు.

 

    సుల్తాన్ ఏం చేయాలో కూడా చెప్పాడు. తర్వాత డ్రింక్ పార్టీ అంతా హుషారుగా సాగింది.

 


                                            *    *    *

 

    ఆ రోజు ఆదివారం.

 

    ఏడున్నరకల్లా మైదానం నారాయణ ఇంటి ముందు హీరోహోండా ఆగింది.

 

    "మనస్తే సార్!" విష్ చేస్తూ దిగాడు మధు.

 

    ఆ సమయంలో మైదానం నారాయణ స్కూటరుతో కుస్తీలు పడుతున్నాడు హెడ్ లైట్ ఒక పక్కన పడుంది.

 

    దానిపక్కన ఏభై తాళాల గుత్తి. ఒక ఇనుప చువ్వకి కట్టబడి ఉన్నాయి. ఒక్కొక్క తాళాన్ని స్కూటరు కీ హోల్లో పెట్టి చూస్తున్నాడు మైదానం నారాయణ.

 

    అన్ని తాళాలతో స్కూటరుని ఎందుకు హింసలు పెడుతున్నాడో అర్థం కాలేదు మధుకి.

 

    "ఈ స్కూటర్ ఏ కాలంది సార్" అడిగాడు మధు.

 

    "నా పెళ్ళప్పుడిది. లేంబ్రట్టా..... ఆ రోజుల్లో దీనిని బ్లాక్ లో కొన్నానయ్యా" అన్నాడాయన.

 

    "లేంబ్రట్టా స్కూటర్ ని నవతాళ్, గాడ్రేజ్, గోల్డ్ డోర్ తాళాలతో తీస్తే వస్తుందా? ఇలాంటి కిస్ తో బీరువాలు అవి తీస్తారు.... స్కూటర్లు కాదు" అన్నాడు మధు.

 

    "అక్కడే ఉంది నీకూ, నాకూ తేడా. ఇది లేంబ్రట్టాయే కాదనను- కానీ దానికి ఫిక్స్ చేయించిన కప్ప ఆ కంపెనీది కాదన్న మాట. ఇంకో లేంబ్రట్టా వాడు దీనిని దొంగిలించకుండా..... నేన ఆరేళ్ళక్రితం 'గిన్' ఫారెన్ కంపెనీ కప్ప వేయించా...... ఆ తాళం పోయింది. అందుకని ట్రై చేస్తున్నా" చెప్పాడాయన.

 

    'ఏడిసినట్టే వుంది' మనసులోనే అనుకున్నాడు.

 

    "మా డాడీ మీకు ఫోన్ చేశారా?" సడెన్ గా అడిగాడతను.

 

    "భీమవరం సోమరాజుగాడా? చెయ్యలేదు. మాకెందుకు చేస్తాడు..... చెయ్యడు.... వాడెప్పుడైనా ఫోన్ చేయాలి..... చచ్చాడే....." అంటుండగానే ఫోన్ మోగిన శబ్ధం వినిపించింది.

 

    "భీమవరం సోమరాజే ఫోన్ చేసుకుంటాడు......వెళ్ళండి- ఆయన చెప్పేది జాగ్రత్తగా వినండి" అన్నాడు మధు.

 

    ఫోన్ సిసీవరు అందుకుని-

 

    ఎవరు? ఏమిటని అడక్కుండానే-

 

    "ఏరా- సోమరాజూ! నువ్వు కరోపతివే కాదనను. నీ పిలక నా దగ్గరుంది. ఆ విషయం గుర్తుంచుకో. మీ వాడికి మార్కులు తగ్గించేశానంటే నీ పని సఫా" అన్నాడు నారాయణ.

 

    "అది కాదయ్యా మగడా..... నీ కోపాలు, తాపాలూ తర్వాత. ఇది ఎస్.టి.డి. పెదపాడు నుంచి చేస్తున్నాను. విషయం ఏంటంటే..... మా వాడికి నువ్వు అర్జంటుగా పదివేలివ్వు" అన్నాడు అవతలి వ్యక్తి.

 

    "ఒక కోటీశ్వరుడికి అప్పిచ్చే స్థాయికి నేనెదగడం ఈ క్షణంలో నాకు ఆనందంగా, చాలా ఆనందంగా వుంది. ఒరేయ్ సోమరాజూ! పదివేలేంటి...... పదిహేను వేలిస్తాను. వడ్డీ ఇవ్వొద్దులే" అన్నాడు నారాయణ.

 

    "నువ్వొద్డంటే నేనూరుకుంటానేంటి? ఇస్తాలేరా, మళ్ళీ ఫోన్ చేస్తా ఉంటా" అన్నాడు అవతలి వ్యక్తి.

 

    మైదానం నారాయణ రిసీవర్ క్రెడిల్ మీద పెట్టి ఛాతీ విరుచుకుంటూ బైటికొచ్చాడు.

 


                                            *    *    *

 

    "లోకల్ కాల్ చేసి, ఎస్.టి.డి. కాల్ అంటారేంటిసార్?" అడిగాడు టెలిఫోన్ బూత్ కుర్రాడు సుల్తాన్ ని.

 

    "అదంతే. చూడబ్బాయ్..... మనం ఇప్పుడు పందెం పెట్టుకుందామా? పందెంలో నువ్వు గెలిస్తే నీకు ఒక కాల్ కి బదులు పది కాల్స్ డబ్బులిస్తా. నేను గెలిస్తే ఇవ్వనన్నమాట" అన్నాడు సుల్తాన్.

 

    "మరీ కష్టమైన ప్రశ్నలు వేయకూడదు" పొతే రూపాయే పోతుంది. వస్తే పదిరూపాయలొస్తాయన్న ఆశతో ఒప్పుకున్నాడు ఆ కుర్రాడు.

 

    "స్వయంవరం సినిమా చూశావా?"

 

    "కొత్త హీరో వేణుయేనా?"


    

    "అందులో వేణు ఎన్ని డ్రెస్సులు వేశాడు? రెండు నిమిషాల్లో చెప్పాలి" గబగబా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు ఆ కుర్రాడు.

 

    "మొత్తం ఏభై సార్" అన్నాడు కాసేపయ్యాక.

 

    "కాదు."

 

    "కరెక్టు సార్."

 

    "నువ్వు కరెక్టు కావచ్చు. కానీ అది నాకు తెలియాలి కదా. అంచేత నేను రేపు ఆ సినిమా చూశాక నీకు డబ్బులిస్తా. సరేనా?"

 

    "సరే సార్!" ఒప్పుకున్నాడు ఆ కుర్రాడు బిత్తరపోతూ. సుల్తాన్ టెలిఫోన్ బూత్ లోంచి బయటికొచ్చాడు.

 

    
                                       *    *    *

 

    "యూ ఆర్ లక్కీ మధూ! సరిగ్గా టైమ్ కి ఇంట్లో డబ్బులున్నప్పుడే మా ఫ్రెండ్, మీ న్నాన భీమవరం సోమరాజు ఫోన్ చేశాడు" అన్నాడు నారాయణ.

 

    "సండేనాడు మీరు రెస్ట్ తీసుకునే టైమ్ లో ఫోన్ చెయ్యడం ఏమిటి? మా నాన్నకు ఎప్పుడు ఫోన్ చెయ్యాలో తెలీదు."

 

    "పోనీలేవయ్యా..... వడ్డీ కూడా ఇస్తానన్నాడు. ఈ మధ్య మీ నాన్న మారిపోయినట్టున్నాడే" అన్నాడు నారాయణ.

 

    "వడ్డీ గురించి మాట్లాడొద్దన్నానే" సుల్తాన్ ని తలుచుకుని అన్నాడు మధు.

 

    నారాయణ లోపల్నుంచి రెండు కట్టల్తో వచ్చి-

 

    "ఇదిగో ఇది పదివేలు. ఇది అయిదువేలు. స్కూటర్ రిపేర్ కని వుంచిన డబ్బు" అన్నాడు నారాయణ.

 

    "రిపేర్ కి పదిహేను వేలా...... దాని బదులు కొత్త స్కూటర్ కొనుక్కోవచ్చు కందడీ" ఆ డబ్బును తీసుకుంటూ అన్నాడు మధు.

 

    "సెంటిమెంటయ్యా..... సెంటిమెంట్. రిపేర్ కి వచ్చిందని లేంబ్రట్టాని వదిలేస్తావ్. కానీ పెళ్ళాన్ని వదలలేవు గదా! అదన్నమాట. లైఫే పెద్ద లేంబ్రట్టా. రిపేర్లు తప్పవు. ఇంతకీ ఈ డబ్బుతో నువ్వేం చేస్తావ్?" అని తలెత్తి అడిగాడు నారాయణ.   

 Previous Page Next Page