Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 28

 

      "ఇంక నువ్వేం ఆలోచించకు... మనమిప్పుడా అమ్మాయికి ఆశ్రయం కల్పించటమే మానవత్వం" అన్నాడు మాధుర్ ఓ స్థిరమైన నిర్ణయానికి వస్తూ.
   
    "సరే... నీ... యిష్టం..." అన్నాడు భార్గవ తనను తాను సరిపుచ్చుకుంటూ.
   
    ఇద్దరూ తిరిగి బయటకు వచ్చారు.
   
    మౌనిక ఆశగా వారికళ్ళలోకి చూపుల్ని మార్చి మార్చి చూసింది.
   
    "మరేం చేద్దామో నువ్వే చెప్పు" అన్నాడు మాధుర్ మౌనిక ఉద్దేశ్యం తెలుసుకుందామని.
   
    "ఉద్యోగం యిచ్చారు. ఆశ్రయం కూడా మీరే కల్పిస్తే మీకు జీవితాంతం  ఋణపడి ఉంటాను. మిమ్మల్ని యిబ్బంది పెట్టాలని నా ఉద్దేశ్యం కాదు. మరేం దారిలేక యిలా అర్దిస్తున్నాను...." అంది మౌనిక ఒకింత దీనంగా.
   
    "మా దగ్గర అప్పులు, బాధలు, సమస్యలు వున్నాయే తప్ప ఎలాంటి సౌకర్యాలు, సుఖాలు లేవు వాటిని పంచుకొని మాతో వుండగలవా?" భార్గవ ప్రశ్నించాడు.       
   
    "అన్నిటికీ సిద్దపడే వచ్చాను" మౌనిక స్థిరంగా అంది.
   
    ముగ్గురి మధ్యా కొన్ని నిముషాలపాటు నిశ్శబ్దం అలుముకుంది.
   
    "లింగబేధంతో సంబంధం లేకుండా ఒకే రకమైన సమస్యను ఎదుర్కొనే ఆడ, మగ కలిసి దాన్ని పరిష్కరించుకునేందుకు ముందడుగు వేసే ఆరోగ్యకరమైన అభివృద్ధికి మనమే పయెనీర్స్ అవుతున్నామన్న మాట. వెరీగుడ్" అన్నాడు చిన్నగా నవ్వుతూ మాధుర్.
   
    తన ప్రపోజల్ ని ఒప్పుకున్నారన్న ఆనందం మౌనికను కొద్దిక్షణాలు కదిలించి వేసింది.
   
    కృతజ్ఞతగా వారికేసి చూసింది.

                               *    *    *    *    *
   
    మౌనిక ఆ బిల్డింగ్ లోనే వుండేటట్లు ఏర్పాట్లు జరిగాయి.
   
    మౌనికను అక్కడే వుంచుకుంటే తండ్రి కేమని సమాధానం చెప్పాలి? పైగా తనకేదైనా చెడ్డ పేరొస్తే ఇంట్లో పెళ్ళి కావాల్సిన చెల్లెలు వుంది. ఎలా అని భార్గవ భయపడుతున్నాడు.       
   
    తనకే దారిలేక తను గంగాధరరావుగారు అందిస్తున్న ఆసరాని అందుకుంటున్నాడు. పైగా తన తల్లిదండ్రుల్ని ఇంట్లో వుంచుకొని ఆదరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరొకరికి ఆసరా కల్పిస్తే తనను అపార్ధం చేసుకుంటారా అని మాధుర్ మీమాంసలో పడ్డాడు.
   
                              *    *    *    *    *
   
    "మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలీటం లేదు. త్రాగుబోతైన మా అబ్బాయిని దారిలో పెట్టి ఓ ఆసరా కల్పించారు" మాధుర్ తల్లి కృతజ్ఞతా పూర్వకంగా అంది.
   
    ఆమె కళ్ళు అప్పటికే ఆనందభాష్పాలతో తడిదేరాయి.
   
    "నాదేం లేదమ్మా మీ కొడుకులో అమోఘమైన తెలివితేటలున్నాయి. ఏదో ఒక చిన్న ఆధారం నాకుంది. దారిమాత్రం నేను చూపించాను. అతనిలో పట్టుదల వూపిరిపోసుకుంది. మీ కొడుకు ప్రయోజకుడైతే నా సంస్థ నిలబడుతుంది. ఆ విధంగా నా స్వార్ధం కూడా దాగుందిగా?" గంగాధరరావు అభిమానంగా అన్నాడు.
   
    "మా అబ్బాయిలో వచ్చిన మార్పుని మేమే నమ్మలేకపోతున్నాం. మీరు ఎంత కాదన్నా మీ మూలంగానే మావాడు బాగుపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. మాకు కడుపుకోత లేకుండా చేసిన గొప్పవారు మీరు" మాధుర్ తండ్రి కంఠం జీరబోయింది.
   
    ఆ వృద్ద దంపతుల కళ్ళలో తొంగిచూసిన ఆనందాన్ని గంగాధరరావు, ఆయన భార్య ఓ మంచి పని తమ మూలంగా జరిగిందన్న సంతృప్తిని ప్రోది చేసుకున్నారు.
   
    రమణయ్య సాయంత్రం వరకు మౌనిక కోసం ఎదురుచూసాడు. ఆమె రాకపోయేసరికి అక్కడే సెటిల్ అయిపోయి వుంటుందని వూహించి సాధిస్తావమ్మా... నువ్వు తప్పక విజయం సాధిస్తావు' అని మనస్సులోనే అనుకున్నాడు.
   
    ఇప్పుడు అతని ఆలోచాలు మరో వేపుకి మరలాయి.
   
    భరద్వాజ యిక్కడే వున్నాడు. గంగాధరరావు ఫరమ్ దెబ్బతినటానికి ఆ భరద్వాజే కారణం ఇప్పుడు ఆ దెబ్బతిన్న సంస్థని తిరిగి నిలబెట్టే ప్రయత్నంలో మాధుర్ వున్నాడు. ఆ మాధుర్ దగ్గరకు మౌనిక చేరింది.
   
    మౌనిక ఎవరయింది. భరద్వాజకు తెలిస్తే ప్రమాదం. జె.జె. ఎంఫైర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆమెకుండే సెక్యూరిటీ ఇప్పుడు వుండదు. దాన్ని అదనుగా తీసుకుంటే? ఆ ఆలోచన రాగానే ఉలిక్కిపడ్డాడు రమణయ్య.
   
    తప్పదు..... జె.జె. ఎంఫైర్ ఎం.ఇ.డి. లాంటి మరో అమ్మాయి ఈ నగరంలో వుందని తను గాలి వార్త పుట్టించాలి.
   
    అది రెండు విధాలుగా మౌనికకే సహకరిస్తుంది. దానికి ముహూర్తం రేపే అనుకున్నాడు రమణయ్య ఓ నిశ్చయానికి వస్తూ.
   
                                *    *    *    *    *
   
    మరో రెండురోజులకు...
   
    కల్పనా ఎడ్వర్ టైజింగ్ ఏజెన్సీ బిల్డింగ్ అందంగా ముస్తాబైంది.
   
    'మేడిసన్ ఎవెన్యూ' అనే పేరును ఖాయం చేసారు.
   
    ప్రపంచ ప్రచార రంగానికి మక్కాలాంటిది మేడిసన్ ఎవెన్యూ.
   
    ప్రపంచంలోని మల్టీనేషనల్ కంపెనీ ఏదైనా మేడిసన్ ఎవెన్యూలో క్లైంట్ కావాలసిందే. పారిశ్రామిక వస్తూత్పత్తులకు నడకను, పరుగును పోటీలో గెలిచే శక్తియుక్తుల్ని ప్రసాదించేది మేడిసన్ ఎవెన్యూ ఒక్కటే.
   
    ప్రచార రంగంలో ఏ అద్భుతమైన ఐడియా వూపిరి పోసుకున్నా అక్కడే. ఏది పురిటి నొప్పులు పడ్డా... దేనికి బారసాల జరగాలన్నా అక్కడే. బ్రతికి బట్ట కట్టాలన్నా అక్కడే.
   
    అలాంటి ప్రసార గవాక్షపు పనితనాన్ని ప్రవేశపెట్టాలానే మాధుర్ ఆ పేరును ఎన్నుకున్నాడు.
   
    ఆ సంస్థకు గంగాధరరావు చైర్మన్ అయితే మేనేజింగ్ డైరెక్టరు మాధుర్. భార్గవ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అయితే, మౌనిక మీడియా ఎగ్జిక్యూటివ్ గా ఒక ఆకారాన్ని పొందింది.
   
    గంగాధరరావు నిండా మునిగిన వాడికి చలేమిటన్న తెగింపుతో మరికొంత అప్పుచేసి మాధుర్ కిచ్చాడు.
   
    ఆ డబ్బు తీసుకుంటున్నప్పుడు మాధుర్ కళ్ళు చెమర్చాయి.
   
    రక్తసంబంధంలోనే ఐదు రూపాయలివ్వాలంటే అరవైసార్లు ఆలోచించే అల్పులున్నారు.
   
    స్నేహం ముసుగులో వెన్నుపోటు పొడిచే దౌర్భాగ్యులున్నారు.
   
    తిన్న చేతినే కరిచే రాక్షసులున్నారు.
   
    పాలు తాగి రొమ్ము గుద్దే విశ్వాస ఘాతుకులున్నారు. వారి వరసనే గంగాధరరావులాంటి ఉత్తములూ వున్నారు.
   
    వేదాంతిలా నవ్వుకున్నాడోసారి మాధుర్. తను తలుచుకుంటే ఓవర్ నైట్ లో మాధుర్ ని బిలీనీర్ ని చేయగలదు. కాని చేయలేని నిస్సహాయతలో వుంది మౌనిక.
   
    "సంస్థను నిలబెట్టి, మీ మాటను దక్కించి, ఆగిపోయిన పాప పెళ్ళి నా చేతులమీదుగా ఘనంగా జరిపిస్తాను. మీరిక నిశ్చింతగా వుండండి...." అన్నాడు మాధుర్ కృతజ్ఞతగా.
   
    గంగాధరరావు వేదాంతిలా నవ్వాడే తప్ప ఏమీ మాట్లాడలేదు.
   
    'If you are successful, remember that some where, some time, some one gave you a lift or an idea that started you in the right direction remember, also, that you are indebted to life until you help some less fortunate person, just as you where helped.'
   
    తను ఎప్పుడో విన్న ఓ అద్భుతమైన కొటేషన్ గుర్తుకొచ్చింది మాధుర్ కి.
   
    కొద్దిక్షణాలు వారిమధ్య నిశ్శబ్ధం అలుముకొంది.
   
    "మీరేమీ అనుకోనంటే... ఈమె..." మాధుర్ ఒకింత ఫీలవుతూ ఏదో చెప్పబోయాడు.
       
    గంగాధరరావు నవ్వాడు.
   
    "భార్గవ నాకు అంతా చెప్పాడు. మీమీద నాకు నమ్మకం వుంది. మీమీద మీకుంటే చాలు. అప్పుడు మీరేది చేసినా అది తప్పుగా పరిణమించదు. ధైర్యంగా ముగ్గురూ ముందుకు సాగిపోండి" అన్నాడు గంగాధరరావు ఆ ముగ్గురివేపు ఆశీర్వదిస్తున్నట్లు చూస్తూ.
   
    ఒకింతసేపు ఆగి మరలా అన్నాడు-
   
    'While others may side- track your ambitions not a few times, remember that discouragement most frequently comes from within.'

 Previous Page Next Page