Previous Page Next Page 
సంకల్పం పేజి 28

 

      చయనులు సారధ్యంలో స్వీట్ల పంపకం... వచ్చిన అతిధులు ఒక్కొక్కరూ శుభాకాంక్షలందజేసి వెళ్ళిపోయారు.
   
    వికాస్ ఇంకా రావి అతిధి కోసం ఎదురు చూస్తున్నాడు.
   
    ఆ అతిధి లిఖిత.
   
    అదే సమయంలో గేటు ముందు ఓ ఆటో ఆగింది. ఆ ఆటోలోంచి ఓ అమ్మాయి దిగింది. ఆ అమ్మాయికో ముప్పై ఏళ్ళుంటాయి. గబగబా లోని కొచ్చింది.
   
    ఆ అమ్మాయిని చూడగానే శివమూర్తి-
   
    "రా... అమ్మా... రా.... ఏం లేటు...." అని పలకరించి "మిస్టర్ వికాస్.... షీ ఈజ్ మై ఓన్లీ ఒన్ డాటర్... ఆనంది...." పరిచయం చేశాడు శివమూర్తి.
   
    నమస్కరించాడు వికాస్. వికాస్ ని చూడగానే ఎందుకో ఆశ్చర్యపోయింది ఆనంది.
   
    "వి విష్ యూ ఎవ్వెర్ సక్సెస్ ఇన్ యువర్ న్యూ ఎసైన్ మెంట్..." ఆ ఆశ్చర్యంలోంచి తేరుకొంటూ అంది.
   
    "థాంక్యూ."
   
    "బ్యాంకాఫ్ బరోడాలో పనిచేస్తోంది. మొన్నటివరకూ బెంగుళూర్లో వుంది. రెండు నెలలైంది. యిక్కడికి ట్రాన్స్ ఫరై.... అక్కడికెళ్ళినప్పుడు ఫ్యాక్టరీ మూతపడింది. ఇక్కడ కొచ్చింది.... తెరుచుకుంది..." నవ్వుతూ చెప్పాడు శివమూర్తి.
   
    కాసేపయ్యాక ఫ్యాక్టరీ చూడడానికి ఆ గదిలోంచి బైటకొచ్చింది ఆనంది.
   
    ఫ్యూన్ రెండు కాఫీలు తెచ్చి పెట్టి వెళ్ళిపోయాడు.
   
    "శివమూర్తిగారూ! మీరు పెద్దవారు... అయినా కొన్నాళ్ళవరకూ మిమ్మల్ని యిబ్బంది పెట్టటం తప్పదు. ప్రస్తుతానికి ఎడ్మినిస్ట్రేషన్ వింగ్, పర్సనల్ డిపార్ట్ మెంట్స్ ని మీరే చూసుకోవాలి- మీకు ఒకే ఒక అసిస్టెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ని ఏర్పాటు చేయగలను. అలాగే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కి యిద్దరు....సేల్స్ డివిజన్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఓ అయిదుగురితో మన కంపెనీ ప్రారంభమవుతుంది.
   
    ప్రస్తుతం మన కమపెనీ నుంచి వచ్చే మొదటి ప్రొడక్ట్- స్ట్రీట్ రైడర్' బాడీ మాత్రమే. ఇన్నర్ పార్ట్స్, టైర్లతో సహా మనం బొంబాయిలోని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తెప్పించుకుంటాం.... 'టెస్ట్' బేసిన్ లో ఒక పాతిక కార్లనే మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం.... ఈ 'స్ట్రీట్ రైడర్' సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం వుంది."
   
    చెప్పడం ఆపాడు వికాస్. ఫైల్లోంచి కొన్ని కాగితాల్ని తీసి శివమూర్తి కిచ్చాడు.
   
    'స్ట్రీట్ రైడర్' కి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు అది.
   
    ఆ పేపర్స్ ని తిరగేసి-
   
    "15 లక్షలు అవసరం ఉంటుందా? ఎస్. ఎఫ్.సి.లోన్ యివ్వడానికి ఒప్పుకుంటే ఎంతివ్వొచ్చు?" అడిగాడు శివమూర్తి.
   
    "అయిదు లక్షలు.... ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎస్.ఎఫ్.సికి. సబ్ మిట్ చేశాను" చెప్పాడు వికాస్.
   
    "సబ్ మిట్ చేశావా? యూ ఆర్ టూ ఫాస్ట్...." మెచ్చుకోలుగా అని "అయితే మనకిప్పుడు కావల్సింది పది లక్షలు.... టెన్ లాక్స్..." ఆలోచనలో పడ్డాడు శివమూర్తి.
   
    "ప్రస్తుతం మన దగ్గరున్న మిషనరీలో పనికిరాణి వాటిని అమ్మేస్తే ఓ లక్ష రూపాయలు రావొచ్చు... అందుకు ఆక్షన్ పెడదాం. ఏమంటారు?"
   
    "ఓ.కె. యాజ్ యూ లైక్..." అంగీకారం తెలిపాడు శివమూర్తి.
   
    "జనవరి... అంటే ఇంకా మూడు నెలలే టైముంది. అవుతుందా?"
   
    "అవుతుంది... ఆ కాన్ఫిడెన్స్ నాకుంది..." దృఢంగా చెప్పాడు వికాస్.
   
    పది లక్షలు కావాలి...
   
    పది లక్షలు కావాలి...
   
    ఎలా... ఎలా... ఎలా...   
   
    "ఎస్.ఎఫ్.సి.ఫైవ్ లాక్స్ లోన్ ఇవ్వొచ్చా-"
   
    "ఇస్తుందనే నమ్మకం... అలా ఇస్తేనే వాళ్ళ పాత బాకీని తీర్చగలం." లేదంటే తీర్చలేననేగా...? వ్యాపారంలోని మెళుకువల్ని ప్రదర్శించటము వికాస్ లో మొదలయింది. ఎర వేసి చేపను పట్టటాన్ని ప్రారంభించాడు.
   
    అదే సమయంలో గేటు దగ్గర ఓ ఫియట్ కారు ఆగింది. అందులోంచి దిగింది లిఖిత.
   
    అటూ ఇటూ చూస్తూ లోనికొచ్చింది లిఖిత.
   
    లిఖితను చూడగానే వికాస్ కళ్ళు ఆనందంతో మెరిశాయి.
   
    "లిటిల్ బిట్ లేట్.... మీ ప్రిమిసెస్ చాలా బావుంది...." అంటూ ఆఫీసు గదిలోకి అడుగుపెట్టింది.
   
    శివమూర్తికి పరిచయం చేశాడు లిఖితను వికాస్.
   
    లిఖితను చూడగానే ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది శివమూర్తికి.
   
    ఫ్యూను కాఫీ తెచ్చిచ్చాడు ఆమెకు.
   
    "అంచెలంచెలుగా ఆ ఫైలు అసలువాడికి వెళ్ళేసరికే ఆరునెలలు పడుతుంది... నువ్వేమో జనవరి నాటికి మన ప్రోడక్ట్ మార్కెట్ లో ఉండాలంటున్నావ్" శివమూర్తి అన్నాడు తిరిగి విషయంలోకి వస్తూ.
   
    "ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రోడక్ట్ జనవరి నాటికి మార్కెట్ లో వుండాలి" అంటూ లేచి-
   
    "రండి.... మిస్ లిఖితా.... ఫ్యాక్టరీ చూద్దురుగాని.... ఒన్ మినిట్ సర్...." అని శివమూర్తితో చెప్పి బయటికొచ్చాడు.
   
    ఇద్దరూ హాల్లో నిలబడ్డారు.
   
    చుట్టూ కలయచూస్తూ-
   
    "ఓ నెల రోజుల్లో దీని స్వరూపం మారిపోతుందన్న మాట...." నవ్వుతూ అంది లిఖిత.
   
    "మార్చాలి కదా మరి...." అని షెడ్లవేపు నడుస్తున్న సమయంలో చయనులు, ఆనంది ఎదురొచ్చారు. వారిద్దరినీ పరిచయం చేశాడు వికాస్.
   
    చయనులు వేపు ఆశ్చర్యంగానూ, ఆనందివేపు అలవోకగానూ చూసి విష్ చేసింది లిఖిత.
   
    "రండి" అంటూ ముందుకు తీసికెళ్ళాడు ఆమెను వికాస్.
   
    "రియల్లీ ఏ గుడ్ ప్లేస్.... ఓపెన్ ప్లేస్ లో మంచి లాన్ ను డెవలప్ చెయ్యండి..." తిరిగొస్తున్నప్పుడు సలహా యిచ్చింది ఆమె.
   
    ఓ అరగంట తర్వాత ఆనందితో పాటు బైటకొచ్చాడు శివమూర్తి.
   
    "నేను సాయంత్రం కలుస్తాను మిమ్మల్ని.... ఏదో ఒకటి డిసైడ్ చేద్దాం...మీన్ వైల్.. టెలీఫోన్ డిపార్ట్ మెంట్ వాళ్ళని, ఎలక్ట్రిసిటీ వాళ్ళని కలవాలి" చెప్పాడు వికాస్.
   
    "సీ యూ" శివమూర్తి కారెక్కడ ఆనంది వికాస్ తో చెప్పింది.
   
    ఎందుకో లిఖిత ఆనందివేపు అసలు చూడలేదు.
   
    'తనకు కావాలి' అనుకుంటున్న మగవాడి దగ్గర ఇంకో ఆడపిల్ల వుండడం ఏ ఆడపిల్లా సహించలేదు కాబోలు...
   
    చయనులకి చేయాల్సిన పనులన్నీ పురమాయించి, లిఖితతో బయటి కొచ్చాడు వికాస్.
   
    "ఈ అకేషన్ని సెలబ్రేట్ చెయ్యరా..." కారు దగ్గర కొస్తూ అడిగింది లిఖిత.
   
    "ఎట్లా చెప్పండి..."
   
    "డాల్ఫిన్ హోటల్లో డిన్నరివ్వండి...." నవ్వుతూ అంది లిఖిత.
   
    "నా రూంలో ఉదయాన్నే వంట చేసుకొని వచ్చారా...." తళతళా ఎండలో వెండి మువ్వలు మెరిసినట్టు నవ్వింది లిఖిత.
   
    "లేదు... డాల్ఫిన్ పార్టీ.... తప్పదు..."
   
    వాళ్ళిద్దరూ కారులో వెళ్ళి కూర్చుంటూన్నప్పుడు లిఖితవేపు చయనులు చూడడం వారిద్దర్లో, ఏ ఒక్కరూ గమనించలేదు.
   
    వికాస్ పక్కన లిఖిత కాదు చయనులుకి కనిపించింది.
   
    అతని కూతురు!   
   
    తండ్రితో కారులో వెళ్తున్న-
   
    ఆనందికి పదేపదే వికాస్ రూపం గుర్తుకొచ్చింది.
   
    "వికాస్... ఎక్కడివాడు డాడీ" శివమూర్తిని అడిగింది ఆనంది.
   
    "ఇక్కడి వాడే... ఏం..."
   
    "ఏం... లేదు... బెంగుళూర్లో ఏవైనా కొన్నాళ్ళున్నాడా..."
   
    "లేదే.... ఇక్కడే జింఖానాలో పనిచేసేవాడు...."
   
    వికాస్ గురించే ఆలోచిస్తుంది ఆనంది.
   
    అదే... పొడుగు... అదే ముక్కు... అదే తీరు... అవే కళ్ళు.... వికాస్ ని చూసినప్పటినుంచీ ఆనందికి విచిత్రంగా, విషాదంగా ఉంది.
   
    బెంగుళూరు ఆమెకు 'సిటీ ఆఫ్ గార్డెన్స్' కాదు.
   
    'సిటీ ఆఫ్ గార్డెన్స్'.
   
    బెంగుళూరు గతం ఆమెకొక 'బ్రోకెన్ డ్రీమ్'.
   
    విరిగిపోయిన కల, అంతెత్తు లేచి కిందపడి పగిలిపోయిన ముత్యపు అల!

 Previous Page Next Page