ఆమెకింకా తన ఊహ నిజమా, కాదా అన్న సందేహం తీరలేదు. నడకలో వేగం క్రమంగా పరుగుగా మారింది.
వీధినే వెళ్ళేవాళ్ళు పరిగెడుతున్న ప్రియాంకను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆమె వాటిని లెక్క చేసే స్థితిని ఎప్పుడో దాటిపోయింది.
క్రమంగా అతనికి దగ్గరవుతోంది.
అతను నడుస్తున్న రహదారి తిన్నగా చూస్తే పెద్ద ఫ్యాక్టరీ ఒకటి కనిపిస్తోంది. దూరం ఇంకా దగ్గరవసాగింది.
వీధిలైట్లు కాంతి అతని మీద రిఫ్లైక్టయి అతని సిల్ హవుట్ మాత్రమే కనిపిస్తోంది.
ఇప్పుడామె మరింత దగ్గరగా వచ్చింది.
ఆయాసంతో ఆమె ఎత్తయిన ఎద ఎగిరెగిరి పడుతోంది. ఒళ్ళంతా స్వేదంతో తడిసిపోయింది. గొంతు ఆరిపోయి దాహార్తిని చేస్తోంది. అయినా ఇవేమీ ఆమె ఉద్వేగాన్ని, ఆసక్తిని తగ్గించలేకపోతున్నాయి.
మరికొంత ముందుకు వెళ్ళగానే అక్కడితో నివాస గృహాలు ఆఖరయిపోయి ఖాళీ స్థలం కనిపించింది. ఆ ఖాళీ స్థలం మధ్యగా వున్న రోడ్డు ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గర ఆగిపోయింది.
అప్పుడామెకు ఫ్యాక్టరీ గేట్ మీదున్న నియాన్ టూబ్స్ అక్షరాలు స్పష్టంగా కనిపించాయి.
"వసుంధరా ఆటోమోబైల్స్ ప్రయివేట్ లిమిటెడ్."
ఆ వ్యక్తి గేట్ మెన్ కి సెల్యూట్ చేసి, గేట్ బుక్ లో సంతకం చేసి లోపలికెళ్ళిపోయాడు.
కొద్ది క్షణాల తేడాతో అతనే అని ధృడపర్చుకునే అవకాశం చేజారిపోయింది. ఆమె నిస్పృహతో తల విదిలించింది. ఆలోపే గేట్ మెన్ ప్రియాంకవైపు అనుమానంగా చూస్తూ "కౌన్ హై..." అంటూ దగ్గరకు వచ్చాడు.
ఆమె కొద్ది క్షణాలు తడబడ్డా చప్పున తేరుకొని "ఇప్పుడెళ్ళినతను దారిలో పర్స పారేసుకున్నాడు. పాపం అతను చూసుకోలేదు ఎవరతను?" ప్రియాంక గేట్ మెన్ కి అనుమానం రాకుండా చప్పున అబద్ధం ఆడేసింది.
"అతను తిమ్మడు..."
గేట్ మెన్ మాటలింకా పూర్తికాలేదు.
"వ్వాట్?!" అంటూ అరచిన ప్రియాంక అరుపుకి గేట్ మెన్ వులిక్కిపడ్డాడు.
తను చంపాలనుకున్న వ్యక్తి ఓ బుద్ధుడని తెల్సినప్పుడు... ఓ వివేకానంద అని తెల్సినప్పుడు కలిగే గగుర్పాటు... ఓ బోస్ అని తెల్సినప్పుడు కలిగే గగుర్పాటు... పెల్లుబికే వివేకం... ఉద్వేగమే ఇప్పుడామెలో కలిగాయి.
"ఇక్కడేం చేస్తుంటాడు...." ఆమె ఇంకా ఆ నిజాన్ని నమ్మలేకపోతోంది.
"డైలీ లేబర్...."
ఆమె ఈసారి నిజంగానే షాక్ తింది.
"మీ చైర్ మన్ ఎవరో తెలుసా? ఐ మీన్ మీ యజమాని?"
"త్రినాధ్ సాబ్."
"అతన్నెప్పుడన్నా చూశావా?"
"దేవుడ్ని ఎలా సంబోధించాలో నేర్చుకో. ఇంకెప్పుడూ అలా సంబోధించకు. వార్ని ఎప్పుడయినా చూశావా అని అడగాలి...."
అతని కళ్ళలో లీలగా కోపం.
"సారీ... వార్ని ఎప్పుడైనా చూసావా?"
"అంత అదృష్టమా? నా సర్వీస్ అయ్యే లోపలన్నా చూడగలనో, లేదోనని అప్పుడప్పుడు బెంగపడుతుంటాను."
"వారి ఫోటోనైనా చూడలేదా?" ప్రియాంకకు పిచ్చెక్కిపోతున్నట్టుగా వుంది.
"ఆ అదృష్టమూ లేదు. మా చైర్ మన్ గారి ఫోటోలు ఇంతవరకూ ఎక్కడా ప్రచురించబడలేదు."
అప్పుడు అనుకుందామె. అందుకే తమ చైర్ మెన్ డైలీ లేబర్ గా వచ్చి తన కంపెనీలోనే వర్క్ చేస్తున్నా గుర్తించలేకపోవడం జరిగిందని.
"తిమ్మడు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు?"
"దాదాపు రెండు సంవత్సరాలవుతోంది. మధ్య మధ్య డ్యూటీ ఎగ్గొడతాడు. లేకుంటే ఎప్పుడో పర్మినెంట్ అయ్యేవాడు...." గేట్ మెన్ జాలిపడ్డాడు.
ఇప్పుడతనికి నువ్వనుకునే తిమ్మడే నీ యజమాని అని చెప్పినా నమ్మడు. పైపెచ్చు మీదపడి కొట్టినా కొట్టగలడు. ప్రియాంక ఇలా ఆలోచిస్తున్నంతలో అక్కడికో జీప్ వచ్చి ఆగింది. అందులోంచి నలుగురు ధృడకాయులు దిగి నిర్లక్ష్యంగా గేట్ మెన్ పర్మిషన్ లేకుండానే లోపలికెళ్ళిపోయారు.
గేట్ మెన్ దిగాలుపడి చూడడాన్ని గమనించిన ప్రియాంక "వాళ్ళెవరు? నీ పర్మిషన్ లేకుండానే లోపలికెళ్ళిపోయారు?" అంది ఆశ్చర్యపోతూ.
"ఈ మధ్యనే దాపురించారు. ఈ సిటీలో పేరుమోసిన గూండా గ్రూప్ అది. రేపు జీతాల రోజు, మామూళ్ళ గురించి మా ఉద్యోగులకు గుర్తు చెయ్యడానికి వచ్చారు...." అన్నాడు ఒకింత నిస్పృహగా.
"మరి మీరు ప్రతిఘటించవచ్చుగా? లేదంటే మీ యాజమాన్యానికి తెలియపర్చవచ్చు. అదీ కాదంటే పోలీస్ కంప్లయింట్ ఇవ్వొచ్చు..."
ఆ విషయంలో వాస్తవానికి ఆమెకు సంబంధం లేకపోయినా కొద్దిపాటి అసహనానికి గురైంది.
అతను మరింకేం మాట్లాడకుండా గేటువైపు వెళుతూ అంతలోనే చటుక్కున వెనుదిరిగి "తిమ్మడి పర్స్ ఇలా ఇచ్చి వెళ్ళు. నేనిచ్చేస్తాను" అన్నాడు.
ఆమె అనుకోకుండా ఇరుకున పడిపోయింది. తన దగ్గర తన వాలెట్ వుందే తప్ప మరేమీ లేదు.
అంతే! అతను మరో అడుగు తనవేపు వేస్తుండగానే సర్రున వెనుదిరిగి ఏమీ వినిపించనట్లే వేగంగా వచ్చిన దారినే వెళ్ళిపోయింది.
గేట్ మెన్ విస్మయంగా చూస్తూ గేట్ కేసి సాగిపోయాడు.
* * * *
రాత్రి రెండు గంటల సమయం.
వీధులన్నీ నిర్మానుష్యంగా వున్నాయ్.
ఆమె ఒక రిక్షా మాట్లాడుకొని దానికి గూడు వేయించి దానిలో కూర్చుని వుంది. ఎవరైనా చూడాలని ప్రయత్నించినా ఆమె ముఖం మాత్రం కనిపించదు. ఇప్పుడా రిక్షా ఫ్యాక్టరీ గేట్ కి అరకిలోమీటరు దూరంలో రోడ్డువారగా ఆగివుంది. రిక్షావాలా రోడ్డువార అరుగుమీద కూర్చుని బీడీ వెలిగించుకున్నాడు. ఆమె మధ్య మధ్య రిక్షాలోంచి వంగొని ఫ్యాక్టరీ గేట్ వేపు చూస్తోంది.
2-10 నిమిషాలు...
2-15 నిమిషాలు...
కాలం ఆ నిశీధి నీరవంలో కరిగిపోతోంది.
సరిగ్గా 2-30కి కొందరు వ్యక్తులు ఫ్యాక్టరీ గేట్ లోంచి బయటకొచ్చి ఇటుకేసి రానారంభించారు.
ఆమె రిక్షావాలాను పిలిచింది.
అతను వచ్చి అంతకుముందే ఆమె ఇచ్చిన సూచన ప్రకారం రిక్షాకి చెయిన్ వేస్తున్నట్లు నటించసాగాడు.
వాళ్ళు బాగా దగ్గరగా వచ్చారు.
ఆమె రిక్షాకి వెనుక వున్న చిన్న కర్టెన్ ని కొద్దిగా తొలగించి చూసింది.
త్రినాధ్ మరో నలుగురితో కలిసి మాట్లాడుకుంటూ వస్తున్నాడు.
అందరూ కాకీ దుస్తుల్లో వున్నారు.
వారి కంపెనీ యూనిఫామ్ షర్ట్స్ పై 'వి' అనే ఇంగ్లీష్ అక్షరం ఎరుపు రంగులో స్పష్టంగా కనిపిస్తోంది.
వారి ధోరణిలో వారు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వార్ని కొంచెం ముందుగా పోనిచ్చి రిక్షాను పోనివ్వమని సైగ చేసింది. రిక్షా కదిలింది నెమ్మదిగా.
ముందు వాళ్ళు-
వెనుక రిక్షా-
అరకిలోమీటరు నడిచాక బస్ స్టాండ్ లోకి దారితీశారా వ్యక్తులు. రిక్షాను బయటే ఆపేసి కూర్చుందామె.
అరగంటకు త్రినాధ్ ఒక్కడే బయటకొచ్చి తిరిగి నడక సాగించాడు.
అలా పావుగంట సాగిన అతని నడక ఓచోట మలుపు తిరిగింది.
రిక్షాలో త్రినాధ్ నే ఫాలో అవుతూ వస్తున్న ఆమె ఆ వీధిని, ఆ వీధిలో వున్న త్రినాధ్ కారుని గుర్తుపట్టింది.
రిక్షా చెయిన్ తెగిపోయినట్లు తిరిగి నటించాడు రిక్షావాలా.
త్రినాధ్ సరాసరి ఆ ఇంట్లోకి వెళ్ళి పదినిమిషాలకు తిరిగి వచ్చాడు.
తిరిగి వస్తుండగా ఓ క్రీనీడలో వున్న రిక్షాలోంచి తొంగిచూసింది ప్రియాంక.
త్రినాధ్ ఇప్పుడు సూట్ లో వున్నాడు. ప్రియాంకకు ఆ నగ్నసత్యం మ్రింగుడుపడలేదు వెంటనే. కోట్లకు కోట్లున్నా పగలు రాజా జీవితం.... రాత్రిళ్ళు తిరుగి అట్టడుగు జీవితం... విచిత్రమైన సంఘటన- రెండు సంవత్సరాలుగా మరోకంటికి తెలీకుండా అతను గడుపుతున్న ద్వంద్వ జీవితం-?"
తను కళ్ళారా చూడకుంటే తనూ నమ్మేది కాదు... అంతటి అద్భుతమైన వ్యక్తి త్రినాధ్. ఆమెలో ఇప్పుడు అప్పటి ఆవేశం లేదు- అప్పటి కోపతాపాలు లేవు- అప్పటి అసూయాద్వేషాలు లేవు... అప్పటి అహం లేదు.... అప్పటి ఆత్మవంచన లేదు... ఆమెలో అంతకాలం గూడుకట్టుకున్న కల్మషం మొత్తం కడిగేసినట్లయింది.
ఒకే ఒక బలవత్తరమైన సంఘటన ఆమె ఆలోచనల్ని పూర్తిగా మార్చివేసింది.
త్రినాధ్ కారు ముందుకు సాగిపోయింది. ఆమె అలాగే ఆలోచిస్తూ తన కారు వద్దకు వెళ్ళి రిక్షావాలాకు వందరూపాయలిచ్చేసి కారెక్కింది.
త్రినాధ్ ఎందుకీ ద్వంద్వ జీవితాన్ని గడుపుతున్నట్టు...? తననుకుంటున్నట్టు శారీరక శ్రమ నుంచి దూరం కాకూడదనా? లేక గత జీవితానికి గౌరవం ఇవ్వటానికా? తన కష్టార్జితంతోటే తను బ్రతకటానికా? అలా అనుకుంటే వసుంధరా పారిశ్రామిక సామ్రాజ్యానికంతటికి అతనే కదా సృష్టికర్త! అది అతను నిర్మించుకున్న సౌధమే కదా? ఇవేవి కాదనుకుంటే తన ఫ్యాక్టరీల్లో ప్రబలే అసంతృప్తిని ముందే పసిగట్టి చర్య తీసుకోటానికా?
ఊహు- అదీకాదు....
అదే అయితే... తాను 20 నిమిషాల క్రితం విన్న మాటలకర్ధం-
"తప్పదు. యాజమాన్యం మన సమస్యల్ని గుర్తించటం లేదు. కనుకే సమ్మె నోటీస్ అనివార్యం-" ఈ మాటలు త్రినాధే స్వయంగా తన ప్రక్కనున్న వ్యక్తులతో అంటూండగా తను రిక్షాలో వుండి స్పష్టంగా వింది.
తనే తన కంపెనీలో సమ్మెకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నాడు.
ఏమీ అర్ధం కావడంలేదు... ఆ సంఘటనలకు ఎలాంటి లింక్ కదిపి ఆలోచించినా త్రినాధ్ అర్ధం కావడంలేదు.
ఒకవేళ తన కంపెనీ సిబ్బందికి జీతం పెంచాలనుకుంటే త్రినాధ్ కి ఒక్క క్షణం చాలు. ఒక్క సంతకం చాలు. సమ్మె అనివార్యం అంటున్నాడంటే తన కంపెనీలోనే తను జీతాలు పెంచాలనుకునే మంచి పనికి ఎవరో అడ్డుపడుతున్నట్లుగా భావించాలా? కాని త్రినాధ్ కి అడ్డుపడే ధైర్యం ఎవరికి వుంది...?
గజిబిజిగా అల్లుకుపోయిన ఊహలు ఒక కొలిక్కి రాక నిస్పృహగా తల విదిలించి డ్రైవింగ్ మీద దృష్టిని కేంద్రీకరించింది. ఆమె కళ్ళ ముందిప్పుడు త్రినాధ్ రూపమే కనబడుతోంది.
ఆరడుగులున్న అందగాడు కాదు. కొండల్ని సయితం పిండి కొట్టగల మొరటుతనం పోనీ కనీసం ఎరుపా? కాదు. తెలుపా? అసలే కాదు. నల్లని నలుపు- చిక్కని నలుపు. అందమైన వంకీల జుత్తా? కానే కాదు. బిరుసెక్కిన చిట్టడవిలాంటి జుత్తు. నవలా హీరో అసలే కాదు. మరి...?
నల్లటి అతని మోములో ఏదో రాజసం-
ఆ మోములోని ఆ లోతైన కళ్ళలో దృడ సంకల్పం...
తెలివితేటల్ని ప్రతిబింబిస్తూ కోటేరులాంటి ముక్కు-
విశాలమైన ఛాతి-
ఉక్కుముక్కల్లాంటి బారైన చేతులు...
పట్టుదలకు ప్రతిరూపమైన బిగించిన మొరటు పెదవులు- ఏమిటో ఈ విచిత్రమైన ప్రత్యేకతలు-
తను త్రినాధ్ ప్రక్కనుంటే కాకి ముక్కుకు దొండపండని ఖచ్చితంగా కామెంట్ చేస్తుందీ లోకం. కాని మేధస్సు, పట్టుదల, లక్ష్యశుద్ధి, శ్రమించటం, పగ, ప్రతీకారం, మానవత్వం ఇవే మనిషి వ్యక్తిత్వానికి వెనుక నిలిచేవి అని లోకం గుర్తించినప్పుడు- బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం, స్థయిర్యం గొప్పవని భావించినప్పుడు తను కాకిముక్కు అవుతుంది.
తను కోరుకునే మగవాడు ఓటమే ఎరుగనివాడు కాకూడదు. ఓటమిలోంచే విజయాన్ని దక్కించుకునేవాడు కావాలి.