ప్రేయసిని ప్రేమలేఖల్తో, పెళ్ళాన్ని పూలతో పూజించే కలలవాడి, తోటమాలి కారాదు. తాను కోరుకున్న మగవాడు ఈ ప్రపంచాన్ని జయించాలి. జయించగలనన్న ఆత్మ విశ్వాసమున్నవాడు కావాలి. తనమీద ఈగ వాలినా సహించనివాడు కారాదు. ఈగలే వాలితే తన భార్యే ఈగల పని పట్టగలదని నమ్మేవాడు కావాలి. ఈగ వాలినా తనే అడ్డుకుంటూ తన భార్యను అల్పురాలిగా మిగిలిపోయేలా చూడకూడదు. పెద్ద ప్రమాదం వాలితే ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడేవాడు కావాలి.
ఈనాటి యువతి చూడవల్సింది ఆస్తి వున్నవాణ్ణి కాదు, ఆస్థి సంపాదించగలిగేవాడ్ని.
ఈనాటి యువతి చూడవలసింది ఆరడుగుల అందమైన మగవాడ్ని కాదు. అందమైన మనసున్నవాడ్ని.
ఏదో హారన్ పెద్దగా వినిపించడంతో ఆమె ఉలికిపాటుగా తేరుకొని తన పరధ్యానానికి తనే ఒకింత సిగ్గుపడి ఎదురుగా వస్తున్న వాహనానికి దారిచ్చింది.
నిజంగానే నువ్వు గెలిచావు త్రినాధ్-
నీ వ్యక్తిత్వంతో, నీ విజయాలతో, నీ దృఢచిత్తంతో, నీలో దాగిన అనంతమైన ఆత్మవిశ్వాసంతో నిజంగా నామీద గెలిచావు.
టీ కప్పుకు ఠికాన లేనివాడివి కాదు త్రినాధ్.
టీ కప్పులో సయితం తుఫాన్ సృష్టించగల అనితరసాధ్యుడివి- నీ జయాపజయాలే నేటి విద్యార్ధి లోకానికి నిరుపమానమైన విద్యా ప్రామాణికతలు.
ఓహ్... నువ్వు అప్పుడు అనాలోచితంగా పెట్టుకున్న ఆ ముద్దు అప్పుడు చేదు. ఇప్పుడు ఎంత తియ్యగా వుందో తెలుసా! నీ మొరటు పెదవుల ఒత్తిడికి నాలేత చిగురుటాకుల్లాంటి పెదవులు వాడిపోయాయని, మాసిపోయాయని, నలిగిపోయాయని, మలినమైపోయాయని ఎంతగానో వాపోయానానాడు- కాని ఇప్పుడు- అప్పుడు నా పెదవులకు మాత్రమే పట్టిన ఆ అదృష్టాన్ని తలచుకొని నా మిగతా శరీరభాగాలు అసూయ చెందుతున్నాయంటే నువ్వు నమ్ముతావా? నమ్మాలి త్రినాధ్... ఇది నాలో కలిగిన నిజమైన పరివర్తన... పశ్చాత్తాపంలోంచి ఉద్భవిస్తున్న పరితాపం....అసహ్యంలోంచి పుట్టుకొస్తున్న ఆరాధన. అహంలోంచి పుట్టుకొస్తున్న ఆత్మ పరిశీలన...
కారు అప్పటికి ఇంటి ముందు ఆగింది.
హారన్ ఒకసారి నొక్కి తిరిగి ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. ఒక ఆడది ఇష్టపడి తనకు ఇష్టమైన మగవాడికి దగ్గరయితే ఎంతటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది... ఎంతటి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందించగలుగుతుందో నేను రుజువు చేస్తాను త్రినాధ్.
ఈ ప్రపంచంలో మగవాడి భేదాన్ని, బాధల్ని, సమస్యల్ని మాయం చేయగల శక్తి ఒక్క ఆడదానికే వుంది.
ఇప్పుడామె పెదవుల మీద విరిసీ విరియని చిరునవ్వు.
గేట్ తీస్తున్న ఘూర్కాకి ఆమె తన పెదవుల్ని ఆర్తిగా నాలుకతో రాసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. దాహం వేసుంటుంది పాపం అనుకున్నాడు స్వామిభక్తితో.
* * * *
త్రినాధ్ కారు సరాసరి వెళ్ళి ఇంటిముందాగింది. అప్పటికి తల్లింకా మేల్కొనే వుంది. ఫాస్ట్ ప్లోర్ లో ముందువేపు గదిలో లైట్ వెలిగే వుండడాన్ని త్రినాధ్ గుర్తించాడు.
ఒక్క క్షణం బాధపడ్డాడు.
తల్లింకా మేల్కొనే ఉందంటే తనను విశ్వసించటం లేదు. తల్లిగా కొడుకు బాగును కోరుకోవచ్చు. ఎంత ఎదిగినా కొడుకు తల్లి దృష్టిలో చిన్నవాడిగానే కనిపించాలిగాని, చెడ్డవాడిగా కాదు.
అతను నిట్టూరుస్తూ కారును గ్యారేజీలో పెట్టి లోపలకు వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని నిస్త్రాణంగా తలను టేబుల్ పైకి వాల్చాడు.
ఇప్పుడతని కళ్ళ ముందు గంటక్రితం ఫ్యాక్టరీలోకి దౌర్జన్యంగా ప్రవేశించి "రేపు జీతాల రోజు- నా మామూళ్ళు దృష్టిలో వుంచుకోండ"ని పొగరుగా ఓ గూండా హెచ్చరించిన సంఘటనే కదలాడుతోంది.
నిస్సహాయులైన తన సిబ్బంది, దౌర్యన్యానికి ఎదురు తిరగలేని తన సిబ్బంది గుడ్లనీళ్ళు కక్కుకోవటం తను కళ్ళారా చూశాడు. వాళ్ళ కళ్ళ లోతుల్లో సన్నని విషాదఛాయ-
అప్పటికప్పుడే వాడ్ని అక్కడికక్కడ సమాధి చేయాలన్నంత ఆవేశం ముంచుకొచ్చింది. ఆ పని చేసుంటే తను కార్మికుల దృష్టిని తప్పక ఆకర్షించి వుండేవాడు. దాని మూలంగా తనెవరన్న ఆసక్తి బయలుదేరుతుంది. అప్పటికప్పుడు కాకపోయినా మరికొన్ని రోజులకన్నా తనెవరన్నది వారికి తెలిసిపోతే తన ఆశయం నెరవేరదు.
కానీ.... వాణ్ణెలాగయినా మొగ్గలోనే త్రుంచేయాలి... తప్పదు... మరోసారి తను తిమ్మడు అన్నా కావాలి. లేదా త్రినేత్రుడన్నా కావాలి. వాడి స్థాయికి తను తిమ్మడయినా చాలు.
త్రినాధ్ రూమ్ లో ఫోన్ మ్రోగింది.
ఉలిక్కిపడి టైమ్ చూసుకున్నాడు.
తెల్లవారుఝాము ఐదుగంటలవుతోంది.
ఒకింత ఆశ్చర్యపోతూనే ఫోన్ ఎత్తి-
"ఎవరు?" అన్నాడు.
ఆవైపు కొద్ది క్షణాల మౌనం.
"ఎవరు...?" మరలా ప్రశ్నించాడు త్రినాధ్.
సన్నటి నవ్వు జలపాతంలా జాలువారిన భావన... ఆ వెంటనే "గుర్తుపట్టలేదా? నువ్వు ముద్దుగా పిల్చుకునే నీ బి.ఎం.ని. అంటే తెలుసు.... చెప్పావుగా... బుజ్జిముండ... నీ మేనకోడల్ని... వరసైన దాన్ని... వగరు... పొగరు వున్నదాన్ని..." ఆవైపు మరలా నిశ్శబ్దం.
త్రినాధ్ పెదవుల మీద చిరునవ్వు.
దానికి శబ్దం లేదు... రాలేదు... కనుక ఆవైపున్న ప్రియాంకకు తెలీలేదు.
"నేను నీకు బాకీ వున్నాను. ఏమిటో కనుక్కో చూద్దాం. రేపు ఉదయం మరలా ఫోన్ చేస్తాను..." ఆవైపున ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది.
మరోసారి నవ్వుకున్నాడు- ఆ నవ్వు వెనక ఒకింత ఆశ్చర్యం కూడా తొంగిచూసింది.
అప్పటివరకు అతను ఫ్యాక్టరీలో చేసిన పనికి అతనికి అలసటగా లేదు-
చేయవలసిన పనుల గురించి ఆలోచనలతోటే అలసి వున్నాడు.
ఇప్పుడా అలసట లేదు అతనిలో.
ఆలోచిస్తూ బట్టలు మార్చుకుంటుండగా మరలా ఫోన్ మ్రోగింది. ఫోన్ ఎత్తాడు.
"చిన్న క్లూ అయినా ఇవ్వకుండా నేను నీకు బాకీ వున్నాను అంటే బావోదు కదా? చిన్న క్లూ ఇస్తాను.
నువ్విచ్చావ్.
నేనివ్వలేదు.
చిరిగిన నా జాకెట్ కి కారణం...
నీ మొరటయిన వేళ్ళే...
ఆడదానిలో ఆడతనం వుంటుంది.
సౌకుమార్యం వుంటుంది. సున్నితత్వం వుంటుంది.
తిరిగి అవే మగవాడిలో వుండడాన్ని-
ఆడది ఇష్టపడదు... బై..." ఆవైపున తిరిగి ఫోన్ పెట్టేసిన శబ్దం.
త్రినాధ్ తిరిగి ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు.
మరలా ఫోన్ మ్రోగింది.
త్రినాధ్ ఫోన్ ఎత్తాడు.
"బాకీ తీర్చుకునే ఆ క్షణాలు నాకు అత్యంత మధురం. అవెప్పుడొస్తాయో అని అభిసారికలా నిరీక్షిస్తున్నాను. నాకు నీ బాకీ తీర్చుకునే అవకాశం ఇవ్వవూ... ప్లీజ్... డార్లింగ్... మరలా ఆ వైపున ఫోన్ పెట్టేసిన శబ్దం.
అదేమిటయి వుంటుందన్న ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే తెల్లవారిపోయింది.
కూతురు తెల్లవారుఝామున లోపలకు రావడం- తిరిగి అంతలోనే బయటకు వెళ్ళడం- మరలా అరగంటాగి రావడం ఆమెకి ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
ప్రియాంక గడపలోనే నిలబడి వున్న తల్లిని చూసి రవ్వంత సిగ్గు పడుతున్న ధోరణిలో తల వంచుకుంది.
ఆమె అప్పటికే కూతురి మానసిక స్థితిని అంచనావేసి వాత్సల్యం పొంగుకురాగా కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని పైకి తీసుకెళ్ళింది.
ఇద్దరి మధ్యా కొద్దినిమిషాల నిశ్శబ్దం....
అంతకుముందే బయటకెళ్ళి త్రినాధ్ కి ఫోన్ చేసి వచ్చినట్లు తల్లికి చెప్పాలనుకుంది. కాని గొంతుకేదో అడ్డుపడ్డట్టుగా ఆగిపోయింది ప్రియాంక.
"ఇప్పుడిక నీమీద నాకు నమ్మకం కుదిరిందమ్మా. అందుకే గతాన్ని నీముందుంచబోతున్నాను..." తల్లి కంఠంలో తొంగిచూసిన ఆప్యాయతను ప్రియాంక గుర్తించగలిగింది.
"ఇప్పుడు నువ్వు, నేను, మీ నన్న, మీ అమ్మ అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతా నీ బావ త్రినాధ్ ది" తల వంచుకుని వున్న ప్రియాంక చివాలున తలెత్తి తల్లివైపు అర్ధం కానట్లుగా చూసింది.
"నిజమే... నాకు నిజం తప్ప కథలు చెప్పడం రాదనే నీ తండ్రి నాకీ మగ్గిపోయే శిక్ష విధించారు. మీ నాన్న నీకు చెప్పిన వాళ్ళ నాన్న- అంటే నా మామగారి వీలునామా కరక్టే. అలాగే మీ మేనత్త వసుంధరాదేవి కులాంతర వివాహం చేసుకున్న మాటా వాస్తవమే. అలా అని ఆమె కానిపనులు చేయలేదు. అప్పట్లోనే గ్రాడ్యుయేషన్ చేసింది మీ మేనత్త. యుక్తా యుక్తాలు, విచక్షణా జ్ఞానం గురించి మరొకరితో చెప్పించుకునే స్థాయి కాదు ఆమెది. ధైర్యంగా త్రినాధ్ తండ్రిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అయితే మీ నాన్న వాళ్ళ నాన్నతో ఊరంతా వసుంధర గురించి చెడుగా అనుకుంటున్నారని చెప్పి మీ తాతగార్ని మానసికంగా కృంగదీశారు. చివరి దశలో ఆస్తి అంతా తన పేర తిరిగి వ్రాయమని, పాత వీలునామాను రద్దు చేయమని మీ తాతగార్ని చిత్రహింస పెట్టారు. దాంతో ఆయన చనిపోయారు.
గత్యంతరం లేని స్థితిలో మీ నాన్న తిరిగి చెల్లెలి దగ్గరకు చేరాడు. వసుంధరాదేవి, ఆమె భర్త మీ నాన్నలో పరివర్తన తీసుకురావాలని విశ్వప్రయత్నం చేశారు. ఫలితం కనిపించలేదు. విచ్చలవిడిగా సుఖపడాలంటే డబ్బు కావాలని, ఆ డబ్బును త్వరగా సంపాదించాలంటే మోసాలు చేయాలన్నదే మీ నాన్న సిద్ధాంతం. అవన్నీ తెలిసి త్రినాధ్ తండ్రి మీ నాన్నను బయటకు గెంటేశారు. కోపంతో కాదు- అలాగన్నా బాగుపడతాడని ఆశించి. ఈలోపు వీలునామా ప్రకారం మీ నాన్నకు పెళ్ళి చేయవల్సిన సమయం ఆసన్నమయింది. వెంటనే మీ నాన్న గురించి ఎంక్వైరీ చేయగా ఆయన ఏదో కేసులో ఇరుక్కుని జైలులో వున్నట్లు తెలిసింది. త్రినాధ్ తండ్రి తన పలుకుబడి అంతా ఉపయోగించి మీ నాన్నను జైలు నుంచి విడిపించారు..."
ఏదో చప్పుడవడంతో ఆమె చెప్పడం ఒకింతసేపు ఆపింది.
ఎన్నో సంవత్సరాల చేదు నిజాల అనుభవాల దొంతరలు ఆమె మనోనేత్రం ముందు కదలాడుతూ ఆమెను దుఃఖభాజకం చేస్తున్నాయి.
దేని వలన శబ్దం వచ్చిందన్న విషయమై ఎక్కువ శ్రద్ధ కనపర్చలేదా ఇద్దరూ ఆ క్షణం.
ఆమె తిరిగి చెప్పడం ప్రారంభించింది. ఆ తెల్లవారుఝాము నిశ్శబ్దంలోంచి అప్పుడే నిద్రలేచాడు సుదర్శన్ రావు. ప్రక్కనే కూతురు, భార్యా లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
"జైలు నుంచి వచ్చినా మీ నాన్న ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు విసుగొచ్చిన మీ మేనత్త మీ తాతగారు వ్రాసిన ఆస్థిని తిరిగి వీలునామా క్రింద వ్రాసి ఎక్కడో పెట్టుబడిగా పెట్టింది. తన అన్న సుదర్శన్ రావు అల్లరి చిల్లర వ్యవహారాలు మానేసి నీతి, నిజాయితీలతో బ్రతుకుతున్నట్టు రుజువైన రోజునే ఆస్థిని అప్పగించాలని తిరిగి కండిషన్ పెట్టింది. ఇకపోతే గతిలేని పరిస్థితుల్లో తిరిగి చెల్లెలి ఇంటికి చేరి మంచిగా నటించసాగాడు మీ నాన్న. అది నిజమైన మార్పని నమ్మిన త్రినాధ్ తండ్రి బాగా చేరదీశారు మీ నాన్నను. ఓసారి త్రినాధ్ తండ్రి ఏదో వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళుతూ పవర్స్ నీ తండ్రికిస్తూ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి వెళ్ళారు. అక్కడికీ నీ మేనత్త తన అన్నాను నమ్మవద్దని భర్తను హెచ్చరించింది. అందుకాయన సుదర్శన్ రావులో ఇంకా మార్పురానట్టయితే, దొంగకు తాళాలు ఇస్తున్నాను. కనుక ఇప్పుడైనా మార్పు వస్తుందనే సదుద్దేశంతో విదేశాలు వెళ్ళారు.