"త్రినాధ్ సెంటిమెంటల్. అందుకే వెనుకంజ వేస్తున్నాడు. నేనయితేనా... ఇంజనీర్ తాట వలిచేసి వుండేవాడినీపాటికి" బోస తన సహజ ధోరణిలో ఆవేశపడ్డాడు.
"అది కాదు బోస్... మనం కొద్దిరోజులు బాస్ ని నీడలా వెంటాడాలి. మనకన్నా నమ్మకస్తులైన వాళ్ళు ఆయనకెవరున్నారు? వాళ్ళే ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీల్లోని ప్రతి అంగుళం గురించి రహస్యంగా సమాచారాన్ని అందిస్తున్నారు. ఇది నాకు బాధ కలిగిస్తోంది. మంటల్లో దూకమన్నా దూకటానికి మనం సిద్ధంగా వున్నామే! మనల్ని కాదని మరెవరో అంతరంగిక కార్యదర్శులకు పని అప్పగించటం నిజంగానే నాకు అసూయగా వుంది."
గుప్తా మాటలకి బోస్ ముందు ఆశ్చర్యపోయి తర్వాత నవ్వేశాడు.
"అనుమానం పుట్టనే కూడదు. పుడితే మొగ్గలోనే త్రుంచేయాలి. ఇది నా పద్ధతి. ప్రతి రాత్రి ఎనిమిది గంటల తర్వాత బాస్ ఎక్కడకు వెళుతున్నాడన్న విషయంపై కూడా చాలామంది అనుమానాల్ని వ్యక్తి చేస్తున్నారు. అయినా బాస్ పై నాకు గొప్ప విశ్వాసం. నా విశ్వాసానికి నేను బేస్ చూపించలేకపోవచ్చు. బహుశా ఆయన్ని అర్ధం చేసుకునే స్థాయికి మనం ఎదగలేదని నాకనిపిస్తోంది. ఆయన్ని పరీక్షించితే మనకు పుట్టగతులుండవు. ఇకపోతే మనకన్నా విశ్వాసపాత్రులెవరున్నారని అడుగుతున్నారే? అంటే మీలోనూ ఇగో డవలప్ అవుతోందని అర్ధమవుతోంది. అదంత మంచిదికాదు. మీరు పెద్దవాళ్ళు. మా త్రినాధ్ కి ముఖ్య సలహాదారులు. అందుకే నిగ్రహించుకుంటున్నాను" అనేసి ఆవేశంగా బయటకెళ్ళిపోయాడు.
* * * *
ప్రియాంక కారు వసుంధరా ఇండస్ట్రీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మెయిన్ గేట్ కి దగ్గరవుతుండగానే త్రినాధ్ కారు గేట్లోంచి బయటకు వచ్చి ఆ వైపుకు సాగిపోయింది.
త్రినాధ్ కారును ప్రియాంక గుర్తుపట్టింది. వెంటనే దాన్ని వెంబడించసాగింది.
వెనగ్గా వచ్చిన ప్రియాంక తల్లి కారు కూడా కూతురు కారును వెంబడించసాగింది.
రాత్రి 8-30 కావస్తోంది. రోడ్లన్నీ వీధిలైట్ల కాంతి ప్రవాహంలో మునిగి వున్నాయి.
మెయిన్ రోడ్ లో కొంతదూరం ప్రయాణించిన త్రినాధ్ కారు చటుక్కున కుడివైపు సందులోకి తిరిగింది. ప్రియాంక ట్రాఫిక్ ను తప్పించుకుని వచ్చేసరికి కుడివైపు సందులో మూడో ఇంటిముందు త్రినాధ్ కారు కనిపించింది.
ఓ క్షణం ప్రియాంక ఆశ్చర్యపోయింది.
ఆ వీధి అతి సాధారణంగా వుంది.
ఆ వీధిలోని ఇళ్ళు కూడా మధ్యతరగతి మిధ్యాజీవుల ఆశాసౌధాల్ని వెక్కిరించే పెంకుటిళ్ళు.
తాత్కాలికంగా ప్రియాంక తన పగను మర్చిపోయింది.
త్రినాధ్ మీద హేళనతో మొదలయిన ప్రియాంక ఆలోచనలు ద్వేషంగా మారాయి. ద్వేషంలోంచి త్రినాధ్ సామర్ధ్యాన్ని గుర్తించే వివేకాన్ని సంతరించుకున్నాయి. అప్పుడప్పుడు ఆ వివేకం అవివేకంగా, ఆవేశంగా రూపాంతరం చెందేవి. అలాంటి ఆవేశాన్ని, కోపాన్ని మూటగట్టుకుని అపరకాళికగా వెంటాడిన ప్రియాంకలో ఇప్పుడు సహజ సిద్ధమైన అసూయ పుట్టుకొచ్చింది హఠాత్తుగా.
అప్పుడామెకు కొన్నేళ్ళ క్రిందట సైంటిస్ట్ తన నుంచి డిఫర్ అవుతూ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. "నువ్వు గెలవటం అసంభవం- త్రినాధ్ గెలుపు సంభవం. తను గెలిచినా నిన్ను తన కాళ్ళ దగ్గరకు రప్పించుకుని నీలోని అహాన్ని, ఇగోని అణగద్రొక్కేస్తాడే తప్ప నిన్ను తన హృదయేశ్వరిగా చేరదీయడు. ఎందుకంటే ఇప్పటికే ఆ స్థానం కోసం మరొకరు ప్రయత్నిస్తున్నారు.
సైంటిస్ట్ అప్పుడా మాటలు నిజంగానే అన్నాడో, లేక కోపంతో అన్నాడో తెల్సుకునేందుకు సిన్సియర్ గా తను ప్రయత్నించింది. అయితే మొదటి తన అనుమానం హిందూమీద. కొద్దిరోజుల పరిశీలనలోనే తన అనుమానం నిజం కాదని తేలిపోయింది. అప్పటికి తను సంతృప్తి చెందినా అప్పుడప్పుడు త్రినాధ్ పందాన్ని వయలేట్ చేసి మరో అమ్మాయికి చేరువవుతున్నాడా అన్న సందేహం కలగక మానలేదు.
కాలగమనంలో త్రినాధ్ తనకు మేనత్త కొడుకే అని తెల్సిన దగ్గర్నుంచి అతనిపై తన ఆలోచనలు మరింత పెరిగాయి.
ఇప్పుడు తిరిగి తన అనుమానం నిజమేననిపిస్తోంది. మాట తప్పినందుకు నిలదియ్యాలి. తనకున్న నిజాయితీ నీలో ఎందుకు లోపించిందని కడిగి పడెయ్యాలి. అప్పటివరకు ఆమెలో ప్రజ్వరిల్లిన పగ, ప్రతీకారం, ద్వేషం స్థానానే ఇప్పుడు అసూయ, ఉక్రోషం చోటు చేసుకున్నాయి.
చిత్రమైనది స్త్రీ మనస్తత్వం అని ఆమె మరోసారి ఋజువు చేసింది.
క్షణాల్లో కారును మెయిన్ రోడ్ లోకి రివర్స్ చేసి, కార్ ని లాక్ చేసి ఒంటరిగా ఆ వీధికేసి సాగిపోయింది.
కూతురు కారునే ఫాలో అవుతూ వచ్చిన ప్రియాంక తల్లి రోడ్ కి ఆ వేపున ఆగిపోయింది. ఇప్పుడామె కారులోంచి దిగి ఒంటరిగా ఇటుకేసి రాసాగింది.
ప్రియాంక ఉక్రోషంగా, వడివడిగా త్రినాధ్ కారు ఆగివున్న ఇంటికి దగ్గరవుతుండగానే ఆ ఇంట్లోంచి ఓ వ్యక్తి బయటకు వస్తూ కనిపించాడు.
ప్రియాంక చటుక్కున త్రినాధ్ కారు వెనుక దాగింది.
దూరం నుంచి వీధిలాటి వెలుగులో కూతురినే గమనిస్తున్న ఆమె ఆశ్చర్యపోయింది.
తన కూతురు మనస్తత్వం తనకు బాగా తెలుసు. ఆ ప్రకారమే కారులోనే సరాసరి త్రినాధ్ ని చేరుకుని చటుక్కున కాల్చి పడెయ్యాలి. కాని కారును రివర్స్ చేసుకురావటం, ఒంటరిగా తిరిగి ఆ వీధిలోకి వెళ్ళటం- త్రినాధ్ కారు వెనుక ఎవరో వ్యక్తి రావటం చూసి దాక్కోవటం అంతా చిత్రంగా అనిపించింది.
ఆమె మోముపై పట్టిన చెమటను పైట చెంగుతో అద్దుకుని ఒకింత ప్రశాంతతను పొందింది. అంటే... ప్రియాంక ఆవేశాన్ని ఏదో ఆలోచన మ్రింగేసింది. ఆలోచనంటూ తనక కూతురు అంతరంగాన్ని ఆక్రమిస్తే తొందరపాటు పనిచేయదు.
అదలా వుంచి త్రినాధ్ కారు ఇక్కడెందుకు ఆగినట్లు? ఓ వీధి లైట్ కి వెనుక వేపున నించుని శ్రద్ధగా కూతుర్నే గమనించసాగిందామె.
8-30కే ఆ వీధంతా నిర్మానుష్యంగా వుంది. ఆ వీధి నిర్మానుష్యాన్ని చుట్టేసిన నిశ్శబ్దం... ఆమెకా అనుభవం వింతగా అనిపించింది.
తన భర్త దుర్మార్గాన్ని, రాక్షసత్వాన్ని త్రుంచేసి అతనినో మనిషిని చేయగల సమర్ధత త్రినాధ్ కి వుంది. ఆడపిల్ల తల్లి కళ్ళకద్దుకొని తన కూతుర్నిచ్చి పెళ్ళి చేసేందుకు తగిన అర్హత త్రినాధ్ కుంది. తన ఆడబిడ్డ వసుంధరాదేవికి జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పాలంటే ప్రియాంక త్రినాధ్ కి భార్య కావాలి.
ఆమె అక్కడే అలాగే నిలబడి ఆలోచిస్తుండగా ప్రియాంక చటుక్కున కారు వెనుక నుంచి లేచి నిలబడింది.
అప్పటికే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి ఆ వీధి చివర వరకూ వెళ్ళిపోయాడు. ప్రియాంక వడివడిగా ఆ ఇంట్లోకి వెళ్ళిపోవటాన్ని చూసిన ఆమె, నీడలోంచి బయటకొచ్చి ఆ ఇంటికేసి సాగింది.
ప్రియాంక ఓసారి నలువేపులకు పరికించి చూసి కాలింగ్ బెల్ నొక్కింది. ఎంతకీ రెస్పాన్స్ లేకపోవటంతో మరోసారి నొక్కింది. లాభం లేకపోయింది. మరోసారి... మరోసారి... ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటంతో అనుమానంగా క్రిందకు చూసింది.
చిన్న తాళంకప్ప వేలాడుతూ కనిపించింది.
ఆమెకంతా అయోమయంగా అనిపించింది. త్రినాధ్ కారు ఆ ఇంటి ముందాగటం తను చూసింది. అందులోంచి ఓ వ్యక్తి ఈ ఇంటిలోకి వెళ్ళటం చూసింది. త్రినాధ్ వచ్చిన కారులో అతనొక్కడే వున్నాడు. అతనే కారుని డ్రైవ్ చేసుకొచ్చాడు. కనుక కారులోంచి దిగి ఈ ఇంటిలోకి వెళ్ళిన వ్యక్తి ఖచ్చితంగా త్రినాధే. ఇప్పటి త్రినాధ్ కోటీశ్వరుడు.
ఇలాంటి పేద ఇంటితో అతనికి మాత్రం సంబంధం వుండకూడదు.
ఏమిటంతా గజిబిజిగా వుంది!
కొద్దిక్షణాల క్రితం ఈ ఇంటితో అతన్ని కట్టిపడేసిన ఆడది వుండి వుండవచ్చని అనుమానించింది. తీరా ఇప్పుడది నిజం కాదని తేలిపోయింది.
మరింతకు ముందు ఈ ఇంట్లోంచి కాకీ బట్టలేసుకున్న వ్యక్తి ఒకరు బయటకు వెళ్ళగా తను చూసింది.
సూట్ లో వచ్చిన త్రినాధ్ లోపలకు వెళ్ళటం, కాకీ బట్టలేసుకున్న వ్యక్తి బయటకు వెళ్ళటం... ఇంటికి తాళం వుండటం...!!
ఆమెలో అప్పటికప్పుడు ఆసక్తి పెరిగిపోయింది.
అంతే! వెనుకా ముందు చూడకుండా ఆ ప్రక్కనే వున్న చిన్నరాయిని చటుక్కున చేతిలోకి తీసుకొని తాళం మీద గట్టిగా ఒక దెబ్బ వేసింది.
ఫలితం కనిపించలేదు.
మరో దెబ్బ... మరో దెబ్బ. చుట్టుపక్కల ఎవరన్నా చూస్తారేమోనని భయంగా కూడా వుంది ప్రియాంకకు. ఏదయితే అదే అవుతుందని ఆఖరిసారిగా బలంగా వేసింది. తాళం వూడిపోయింది.
నలువేపులకోసారి చూసి, ఎవరూ లేరని నిర్ధారించుకుని చటుక్కున తాళం తీసి లోపలకు వెళ్ళి గడియవేసి కొద్ది క్షణాలు ఆగిపోయింది.
కొంత స్థిమితపడిన తదుపరి లోపలకు చూసింది పరిశీలనగా.
అంతే... ఆమె జీవితంలో ఎప్పుడూ అంత ఎగ్జయిట్ కాలేదు.
అప్పటివరకూ ఆమెలో సుడులు తిరిగిన ఆలోచనలు, ఆవేశం అంచనాలన్నీ తల్లక్రిందులయిపోయాయి.
అక్కడ కనిపించిన దృశ్యం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది.
కొద్దిక్షణాలు ఆమె మెదడు పనిచేయటం ఆగిపోయింది.
క్షణాల్లో తేరుకుని ఆ ఇల్లంతా పరిశీలనగా చూసి వడివడిగా బయటకొచ్చి తాళం వేలాడదీసి అంతకు ముందు ఆ ఇంటిలోంచి వచ్చిన వ్యక్తి వెళ్ళిన దిక్కుకేసి దూసుకుపోయింది.
కూతురు ఓ ఇంటిలోకి వెళ్ళటం, పదినిమిషాలకు బయటకు వచ్చి ఆ వీధివైపు వేగంగా వెళ్ళిపోవడం ఆశ్చర్యం కలిగించింది.
ఆమె ఆలోచనల్నుంచి తేరుకుని ఆ ఇంటి ముందుకెళ్ళి అటూ, ఇటూ ఓసారి పరికించి చూసి, తాళం చటుక్కున తీసి లోపలకు వెళ్ళి తలుపు దగ్గరగా వేసి లోపలకు చూసింది.
బహుశా ఆమె జీవితంలో ఏనాడూ అంతటి ఉద్వేగానికి గురయి వుండదు.
చిన్న ఇల్లు... మొత్తం మూడే గదులు... మెయిన్ గదిలో ఇప్పుడు ప్రియాంక తల్లి నిలబడి వుంది. ఎదురుగా ఖరీదైన సూట్ వేలాడదీసి వుంది. క్రింద నేలమీద బాటా అంబాసిడర్ షూస్ విడిచి వున్నాయి. మరికొద్ది దూరంలో కాకీబట్టలు నాలుగుజతలు హేంగర్స్ కి వేలాడదీసి వున్నాయి. అతి సాధారణంగా వున్న ఆ ఇంటిలో పెద్దగా వస్తువులేం లేవు. గోడలకు ఓ ప్రక్క కార్మికుడి డ్రస్ లో త్రినాధ్... ఆ ఫోటోకి ప్రక్కనే మరో చిత్రపటం వుంది. అందులో ముప్పై సంవత్సరాల వయసున్న యువతి... ఆమె కళ్ళలో అద్భుతమైన్ తేజస్సు... ఆ ప్రక్కనే మరో ఫోటో... అందులో తన కూతురు ప్రియాంక... ఎక్కడో ఎప్పుడో ప్రియాంకకు తెలీకుండా తీసిన ఫోటో... తన కూతురులో ఇంతటి అందం, అద్భుతమైన లావణ్యం దాగున్నాయా అన్నంత అందంగా వుంది.
మొత్తం అర్ధమయిపోయిందామెకు.
ఆమె కళ్ళు ఆనందంతో, తృప్తితో చమర్చిపోయాయి. చంపలేవమ్మా... నువ్విప్పుడు త్రినాధ్ ని. చంపలేవమ్మా... అందుకు కారణం నువ్వు గాని నిజం తెలుసుకున్నాక నిగ్రహాన్ని, ఆలోచనల్ని ఆశ్రయించే నీ వివేకం కాని కావమ్మ- శత్రువులోని మాలిన్యాన్ని, కాఠిన్యాన్ని సైతం తన వినూత్నమైన జీవన విధానంతో కడిగివేయగల త్రినాధ్ విశిష్టమైన వ్యక్తిత్వమమ్మా...
దుర్మార్గుడైన భర్త- ఆ భర్త వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కొడుకు... అహాన్ని, పొగరునే తన వ్యక్తిత్వానికి ఆసరా చేసుకున్న కూతురు... ఈ ముగ్గురూ సంవత్సరాలుగా తనను మానసికంగా పెట్టిన చిత్రహింసకు చరమగీతమే ఈ అపూర్వ దృశ్యం.
ఆమె వెనుదిరిగింది.
* * * *
దాదాపు పరిగెడుతున్నట్టుగానే వుంది ప్రియాంక నడక. మొత్తానికి ఐదు నిమిషాలు ఆ విధంగా ప్రయాసపడ్డాక కనిపించాడో వ్యక్తి దూరంగా. అతను ఒకింత వేగంగానే నడుస్తున్నాడు.
ఆ వీధిలో కొద్దిగా జన సంచారం వుండడంతో ప్రియాంక స్థిమిత పడింది.