"శనివారం రాత్రి రామకృష్ణా బీక్ లో కొండచాటున సంధ్య, నారాయణరావులు ఏం చేశారు?"
ఇలాంటివే చాలా రాతలు కనిపించేసరికి సంధ్య కోపంతో ఊగిపోయింది.
"రబ్బిష్......ఇలాంటి రాతల్ని నేను సహించనుగాక, సహించను. భరించనుగాక భరించను .....ఇలాంటి వెధవరాతలన్నీ ఎవరు రాసారో నాకు తెలుసు" ఉక్రోషంగా తైమని గెంతింది సంధ్య.
"ఎవర్రాసారని నీ అనుమానం" పక్కనే వున్న క్లోజ్ ఫ్రెండ్ అనుపమ అడిగింది.
"మామూలు రాతలన్నీ, జుత్తుల జిన్నాలాంటి తెలుగు అక్షరాలూ రానివాళ్ళు రాసుంటారుగానీ, ఈ వెధవరాతలన్నీ డీప్గా రాసి.....నన్ను హర్ట్ చెయ్యాలని చూస్తున్నదెవరో తెలుసా ఆ నారాయణరావ్.. అతగాడి వేలితో అతగాడి కన్నే పొడవకపోతే నా పేరు సంధ్య కాదు...." అంటూ ఆటోని పిల్చి ఎక్కి కూర్చుంది.
ఆటోలో కూర్చున్నాక అడిగింది సంధ్యను, అనుపమ.
"ఏం చేస్తావ్? అతగాడి వేలితో అతగాడి కన్నే ఎలా పొడుస్తావ్?"
"ఇప్పుడే ఆలోచిస్తున్నాను కదా.....డోన్ట్ కన్ ఫ్యూజ్ మీ" విసుక్కుంది సంధ్య. కమలాక్షితో సంబంధం వుందని ఆరోపించి, అతగాడి కారెక్టర్ మీద దెబ్బకొట్టాలని ప్రయత్నించి విఫలమయిన సంధ్య, ఈసారి నారాయణరావుని దారుణంగా దెబ్బకొట్టాలని నిర్ణయించుకుంది.
జరుగుతున్న కథనంతా అన్నయ్య అయిన సిరిపురం దాదాకు చెప్పి, శుభ్రంగా నారాయణరావుని తన్నించెయ్యాలని నిర్ణయించుకుంది సంధ్య.
ఆవేశంగా ఇంటికెళ్ళిన సంధ్యకు వాళ్ళన్నయ్య సిరిపురం దాదా కన్పించలేదు.
"ఏమయ్యాడు వీడు.....సమయానికి దొరికిచావడు....."
"దాదా ఊరెళ్ళాడు ఏదో కాంట్రాక్టు పనిమీద.....రెండ్రోజుల్లో వస్తాడు" సిరిపురందాదా అసిస్టెంట్ మర్రిపాలెం మహాలింగం చెప్పాడు.
సరిగ్గా సమయానికి అన్నయ్యదాదా కూడా లేకపోవడంతో విల విల్లాడిపోయింది సంధ్య.
* * * *
ఊళ్లోకి తెల్లటికారు ఛళ్ మంటూ ప్రవేసించేసరికి రచ్చబండ దగ్గర కూర్చున్న జనమంతా పరుగులెత్తడం ప్రారంభించారు.
వాళ్ళ ఊర్లోకి కారు అనే ఘనపదార్ధం రావడం అదే మొదటిసారి-
"సుబ్బారావుగారి ఇల్లెక్కడ....." రోడ్డుపక్కన నిలబడి విచిత్రమైన జంతువును చూస్తున్నట్టుగా చూస్తున్న ఒకవ్యక్తిని కారు డ్రయివర్ అడిగాడు.
"మా వూళ్ళో చాలామంది సుబ్బారావులున్నారుగానీ, ఇల్లెక్కే సుబ్బారావు లెవరూ లేరు" అతి తెలివిగా చెప్పాడు ఆ వ్యక్తి.
"ఏడ్చినట్టే వుంది. పట్నంలో చదువుకుంటాడే.....నారాయణ రావు తండ్రి.....సుబ్బారావు ...." మళ్ళీ చెప్పాడు డ్రయివర్.
"ఓహో ఆ నారాయణరావు తండ్రా.....కాంతమ్మ కొడుకా.....చూడండి....ఎదురుగా గుడి కనిపిస్తోందా. ఆ గుడిదగ్గర కుడి పక్కకు తిరిగి అక్కడ ఎవరి గొంతు గట్టిగా వినిపిస్తుందో వాళ్ళింటికెళ్ళండి" చెప్పాడు ఆ వ్యక్తి.
"నారాయణరావు ఇంట్లో వాళ్ళంతా అరుస్తుంటారల్లే వుంది" వెనకసీట్లో కలెక్టరు వేషంలో కూర్చున్నదాదా జోకేసాడు.....డ్రయివర్ కెందుకో నవ్వు రాలేదు-నవ్వలేదు.
మరికొద్దిసేపటికి కారు గుడిదగ్గిర ఆగింది.
గుడికి ఎడమవేపున పెద్ద విశాలమైన ఇల్లుంది-ఆ ఇంట్లోంచి సుప్రభాతం శ్లోకాల్లా బిగ్గరగా వినిపిస్తున్న తిట్లని వింటూ ఆశ్చర్యపోయాడు దాదా.
"ఇడియట్.....నాలెడ్జ్ లెస్ బ్రూట్.....లెట్ హిమ్ కమ్......అయ్ కిల్ హిమ్" నారాయణరావు బామ్మ, వరండాలో బాసింపట్టు వేసుకుని అరుస్తోంది.
"ఆవిడే అనుకుంటాను సార్......నారాయణరావు బామ్మ....." డ్రయివర్ అన్నాడు.
"చూడు డ్రయివర్ రావుడు..... నువ్వు దిగి ఆవిడతో కలెక్టర్ గారొచ్చారని చెప్పు. ఆ తర్వాత ఠీవిగా దిగి నేనొస్తాను" బేక్ సీట్లో కూర్చున్న దాదా అన్నాడు.
డ్రయివర్ ఠీవిగా దిగగానే కళ్ళద్దాలు సర్దుకుంటూ బామ్మకాంతమ్మ అతగాడివేపు చూసింది.
"మేడమ్....మీతో మాట్లాడ్డానికి కలెక్టరుగారొచ్చారు-" చెప్పాడు డ్రయివర్.
కళ్ళద్దాల్లో తేరిపార చూసింది కాంతమ్మ.
"నాతో మాట్లాడ్డానికి కలెక్టర్ వచ్చాడా.....గవర్నర్ రాలేదా" అలా అడుగుతున్న కాంతమ్మవేపు చూస్తూ విస్మయం చెందాడు డ్రయివర్.
ఆవిడకు బాగా నమ్మకం......భర్త బతికున్న రోజుల్లో కలెక్టరు గారుగానీ, గవర్నర్ గానీ తన ఇంటికి వస్తారని.....కానీ ఏవో కారణాల వల్ల అప్పట్లో వాళ్ళకి రావడానికి కుదరలేదు. తను చచ్చిపోయేలోపు, ఎప్పుడయినా కలెక్టరయినా, గవర్నరయినా తమ యింటికి వస్తారన్న ఆశ నిజమయినందుకు ఆమె చాలా ఆనందపడిపోయింది.
గాభరాగా లేచి "వెల్ కమ్ కలెక్టర్ సాబ్.....హార్టిలీ వెల్ కమ్ కలెక్టర్ సాబ్...." అలా ఇంగ్లీషులో ఆహ్వానం పలుకుతున్న కాంతమ్మ వేపు బెరుగ్గా చూస్తూ కారులోంచి కిందకు దిగాడు కలెక్టర్ వేషంలోని దాదా.
"రావయ్యా కలెక్టరూ......రా ... నువ్వెప్పటికయినా వస్తావని.....నాకు తెల్సు. రా కూర్చో....." కూర్చోమన్నట్టుగా నేలమీద చాపను చూబెట్టింది కాంతమ్మ.
"నేనొస్తానని ఈవిడకెలా తెల్సు.....ఈ ముసిల్ది నిజంగా దేవాంతకురాల్ల వుందే....." ఒకపక్క ఆశ్చర్యపోతూనే మరొక పక్క, తను అసలు కలెక్టరు కాదని, దొంగ కలెక్టరని కూడా ఈవిడ పోల్చేసిందా అని బెంగ పట్టుకున్న దాదా, బిక్కచచ్చిపోయి చాపమీద మఠం వేసుకుని, బుద్దిగా ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్లా కూర్చుండిపోయాడు.
"గవర్నరెప్పుడొస్తున్నారు....." సడన్ గా అడిగింది ముసలావిడ ఆ ప్రశ్న తనను కాదనుకున్నాడు దాదా.
"నిన్నేనయ్యా యంగ్ మేన్....." బోసిపళ్ళతో నవ్వుతూ అంది ఆవిడ.
"గవర్నరా..... ఆయన కూడా వస్తానన్నాడా......?" అయోమయంగా ప్రశ్నించాడు దాదా.
"వస్తారుకాదా.... ఎందుకురారు.....మీ ఇంటావిడ, వాళ్ళంతా బాగున్నారయ్యా..... ఎంతమంది నీకు పిల్లలు........" సడన్ గా టాపిక్ మార్చేసి, అడుగుతున్న కాంతమ్మ ముఖంలోకి చూశాడు దాదా బిత్తరపోతూ.
వైజాగ్ లో తన పేరు చెపితే పిట్టలు నీళ్ళు తాగవు.....పిల్లలు పాలు తాగరు. అలాంటప్పుడు ఈవిడేంటి యిలా? ఆవిడ అడిగిన ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్ధం కావడంలేదు దాదాకు.
"పెళ్ళాం పిల్లలు గురించి చెప్తే-గుటకలు మింగుతావేమయ్యా" గదమాయించిందావిడ.
"నాకా.....నాకింకా పెళ్ళికాలేదు....." అని చెప్పేశాక.....తను కలెక్టర్ వేషంలో వున్నానని గుర్తుతెచ్చుకున్న వాడై....
"ఓహో....పెళ్ళి గురించి అడిగారా__ఇంకేదో అనుకున్నాను. చూడండి బామ్మగారు.....నాకు ఓకే ఒక్క పెళ్ళాం..... ఆ పెళ్ళానికి ఓకే ఒక్క కూతురు.....ఆ పిల్ల విషయమై మీతో మాట్లాడ్డానికే నేనిక్కడకు వచ్చాను" అన్నాడతను.
"ఏవైంది నీ కూతురికి......జబ్బు మనిషా?"
"జబ్బుమనిషా__అలాంటిదేం లేదు బామ్మగారూ, శుభ్రంగా సలక్షణమైన పిల్ల. సిన్మాయాక్టరు రోజాలా వుంటుంది. రోజా అంటే మీకు తెల్సి వుండకపోవచ్చు. ఇటీవలకాలంలో గ్లామర్ హీరోయిన్" ఏదో చెప్పబోయిన దాదా మాటలకు అడ్డంగా వచ్చింది కాంతమ్మ.