Previous Page Next Page 
చిలకలు పేజి 29


    కుడి చేతికి ఒక జత బంగారు గాజులు ఉన్నాయి.
    ఎడం చేతికి లేడీస్ వాచి ఉంది.
    దాని అద్దం పగిలిపోయి ఉంది.
    "నరేంద్రా! మర్డర్ రాత్రి 1-25కు జరిగింది" కేసంతా చేతిలోకి వచ్చేసినట్టే ఉత్సాహంగా అరిచాడు అద్వయితం.
    నరేంద్ర చిరునవ్వు నవ్వాడు.
    "ఎలా తెలుసుకొన్నావని అడగవేం?" తన తెలివికి నరేంద్ర అబ్బురపడిపోతాడని ఆశించిన అద్వయితం  నీరుకారిపోయి అడిగాడు.
    "ఆమె చేతిగడియారం1-25చూపిస్తూ ఆగిపోయింది."
    "నువ్వు చూడలేదనుకున్నానయ్యా?"
    "నువ్వు చూడగలిగింది కూడా నేను చూడక పోతే నా సహకారం నీ కెందుకయ్యా?"
    "అవున్లే నిజమే!"
    నరేంద్ర భారతీ శవం పక్కగా నిలబడి తల పైకెత్తి చూశాడు.
    సన్నజాజి తీగలు అల్లుకున్న పందిరికి, ఇంటివైపున ఉనా గడలు విరిగి వ్రేలాడుతున్నాయి.
    నరేంద్ర ముఖం గంభీరంగా మారింది.
    ఓ క్షణం నొసలు ముడిచి ఆలోచించాడు.
    గబగబా మెట్లక్కి  పైకి వెళ్ళాడు.
    వెనకవైపు అర్చీ దగ్గరకు వచ్చి చూశాడు.
    ఆర్చీ వరండాలో పిట్టగోడ పక్కగా, పగిలిపోయి పచ్చగాజుల ముక్కలు పడి ఉన్నాయి. ఆ గాజుల ముక్కల్ని వంగి  నరేంద్ర చేతిలోకి తీసుకొని ఓ క్షణం చూశాడు. ఫ్యాంటు జేబులో చేసుకొన్నాడు.
    ఒక పూల కుండీ కూడా కిందపడి పగిలి పోయి ఉంది.
    పిట్టగోడ మీదగా వంగి సన్నజాజి పందిరికేసి చూశాడు పందిరి కర్రలు విరిగి ఏర్పడిన ఖాలీలోనుంచి. కిందవాకిలి మెట్లమీద పడి ఉన్న భారతి శవం  కన్పించింది.
    కింద నిలబడి ఉన్న అద్వయితం తలెత్తి పైకి చూశాడు.
    "హేయ్! నరేంద్రా! అక్కడ్నుంచి కింద పడ్డావనుకో, గోడమీదగా తిన్నగా ఈ మెట్లమీదకే" అన్నాడు ఉషారుగా ఏదో కనిపెట్టినట్టు అద్వయితం.
    "కరెక్ట్ ఇన్స్ స్పెక్టర్" అంటూ నరేంద్ర  పైగదులన్నీ చూసి కిందకు దిగివచ్చేసరికి, నల్లగా, లావుగా, ధృడంగా ఉన్న వాడొకడు ఒణికి పోతూ ఇన్స్ స్పెక్టర్ ముందు నిలబడి ఉన్నాడు.
    ఇన్స్ స్పెక్టర్ లాఠీ తిప్పుతూ గద్దిస్తున్నాడు.
    అతడే పోచయ్య అని గ్రహించాడు నరేంద్ర.
    అతడిని తేరిపార చూశాడు. కాళ్ళు గజగజ వణుకుతున్నాయి.
    "నాకేం తెలవదు బాబూ! భారతమ్మ గోర్ని నేనేం చెయ్యలేదు"
    వీపుమీద రెండు  లాఠీ దెబ్బలు పడ్డాయి.
    వాడు గోలగా అరవసాగాడు. వాడి అరుపులు విని అతడి భార్య పరుగు పరుగున వచ్చింది. శవాన్ని చూసి 'కెవ్వున' అరిచింది.
    మళ్ళీ లేచిన లాఠీ నరేంద్ర పట్టుకున్నాడు.
    "తొందరపడకు" అని పోచ్చయ్య కేసి తిరిగి "ఆ చనిపోయిన ఆమె నీకు తెలుసా పోచయ్య?" అని అడిగాడు.
    "తెలుసు బాబూ. చిన్నప్పత్నుంచీ తెలుసు. అమ్మాయి గోర్ని భుజాల మీద ఆడించే వాడ్ని"
    "ఎవరామె? శంకర్రావుకు ఏమవుతుంది?"
    "అరి మేనకోడలేనండి. అమ్మా, అయ్యా లేరండి. అమ్మాయి గోరు ఇక్కడే పెరిగారండి" అని ఆగాడు.
    "అమ్మాయిగార్ని మీ అయ్యాగారు ఎలా చూసేవారు?"
    "ఆరిదేముందయ్య." ఎప్పుడూ బయటే తిరిగే మగవాడు అమ్మగారు  మాత్రం బాగా చూసేవారు కాదండీ"
    "సరి! సరి! ఈమె ఇక్కడికి ఎప్పుడొచ్చింది?"
    "నాకు తెలియదండి"
    "తెలియదా?" లాఠీ ఎత్తాడు ఇన్స్ స్పెక్టర్.
    "తె....తెలుసండి. అర్థరాత్రి కాడ వచ్చారండి. నన్ను వచ్చి  లేపారండి. వెళ్ళి తలుపు తీసానండి"
    "టైం చెప్పగలవా?"
    "టైం చూడలేదండి. మంచి నిద్రలో ఉన్నానండి. నేను ఇంటి తలుపులు తేశానండీ"
    "ఒక్కతే వచ్చిందా?"
    "అవునండీ"
    "ఆమె లా అర్థరాత్రి వస్తే నీకు ఏమనిపించింది?"
    "ఏమీ అనిపించలేదండి. ఆరు వస్తారని మా బాబుగారు మొన్ననే చెప్పారండి. ఆరు విఅజయవాడ వెళ్ళారండి అమ్మాయిగార్ని తీసుకోస్తానని చెప్పి"
    "మరి మీ బాబుగారు రాలేదా?"
    "రాలేదండి."
    "ఆమెను అడగలేదా?"
    "అడిగాసండి. ఆరికి ఏదో పనుండి విజయవాడలోనే ఉన్నారనీ, రేపు తెల్లారేసరికివస్తారనీ చెప్పారండి. కృష్ణా ఎక్స్ ప్రెస్ బండి బాగా లేటుగా వచ్చిందని కూడా చెప్పారండి"
    "మరి నీ భార్య ఆమెకు తోడుగా పడుకున్నదా?"
    "నా పెళ్ళాం ఇక్కడ లేదండి దాని నాన్న చచ్చిపోతే పిల్లల్ని తీసుకొని పుట్టింటికి ఎల్లిందండి. ఎల్లి పది రోజులు అయిందండి"
    నిలువెల్లా గజగజ వణికిపోతూనే చెప్పుకుపోతున్నాడు.
    "ఎవరూ లేరు. అర్థరాత్రి ఆడపిల్ల వంటరిగా వచ్చింది. నువ్వే ఆమెను కిందకు తోసేసి చంపేసి  ఉంటావు?"
    "అయ్యబాబోయ్ నేను చంపలేదండి. ఆర్ని చంపితే నాకేమొస్తుందండి?"
    నిజమే! ఆమెను చంపితే ఇతడికి ఏం వస్తుంది అనుకున్నాడు నరేంద్ర.
    "ఏమొస్తుందో చెప్పిస్తాను. కటకటాల వెనక్కు నెత్తి బొక్కలు ఇరగతన్నితే ఏమొస్తుందో చెప్పవు కక్కేస్తావు"
    పోచ్చయ్య ఒకసారిగా ఇన్స్ స్పెక్టర్ కాళ్ళమీదపడి పోయాడు.
    "లేరా. లేచి నిల్చో" వీపుమీద లాఠీతో పొడిచాడు ఇన్స్ స్పెక్టర్.
    "చచ్చారో బాబూ!" అని ఒక్కసారి లేచి నిల్చుని ఏడ్వసాగాడు.
    "నోరు మూస్తావా లేదా?"
    "పోచయ్యా! ఏడవకు నేను అడిగే ప్రశ్నలకు నిజం చెప్పు.నీకేం భయంలేదు" అన్నాడు నరేంద్ర.
    "అమ్మాయిగోర్ని నేను చంపలేదు బాబయ్యా"
    "మీదే ఊరు"
    "విజయవాడండి. పెద్దబాబుగారుండగా మా అయ్య వచ్చాడండి అప్పుడు నాకు పదేళ్ళు. అప్పట్నుంచి ఈరి దగ్గరే ఉన్నానండి"
    "శంకర్రావుకు నమ్మిన బంటువన్నమాట"
    "ఆరి ఉప్పు తిని బతుకుతున్నామండి"
    "అంత అర్థరాత్రి ఆమె స్టేషన్ నుంచి ఒక్కతే వచ్చిందా? ఎలా వచ్చింది. ఆతోలోనా, కార్లోనా?"
    "నాకు తెలియదు బాబూ! నేనేం చూడలేదు. అమ్మాయిగారికి తెలిసిన ఇల్లేగదా వచ్చారనుకున్నాను, నన్ను వారు లేపెంత వరకూ నాకేం తెలియదు. ఆరు వచ్చినట్టు కూడా తెలియదు.
    "నిజం చెప్పు!"
    "నిజమే బాబూ!" నిలువెల్లా వణికిపోతున్నాడు.
    వాడు ఏదో దాస్తున్నాడనిపించింది నరేంద్రకు.
    నరేంద్ర ఇన్ స్పెక్టర్ని చూశాడు.
    "వాడిలా చెప్పడు నరేంద్రా! నిజం నేను కక్కిస్తాగా " అన్నాడు ధీమాగా అద్వయితం.
    నరేంద్ర పోచయ్య క్వార్టర్స్ చూడటానికి వెళ్ళాడు.
    నరేంద్ర వచ్చేసరికి పోచయ్య  ఏడుస్తున్నాడు.
    "నిజంగా నాకేం  తెలియదు. నేను అమ్మాయిగోర్ని చంపలేదు." అంటున్నాడు.
    ఇన్ స్పెక్టర్ లాఠీ తిప్పుతున్నాడు. నరేంద్రను చూసి లాఠీదించాడు.
    "ఏమైనా క్లూ దొరికిందా"
    నరేంద్ర నవ్వాడు.
    "ఆ క్వార్టర్స్ లో ఏం దొరకలేదు."
    "అంటే ఈ ఇంట్లో దొరికిందా? నరేంద్రను అనుమానంగా చూశాడు అద్వయితం.
    "ఇన్ స్పెక్టర్ ఇక నాపని అయిపోయింది. ఇక శవాన్ని పరీక్షకు పంపించవచ్చు. ఆ శవాన్ని తీసేలోగా వేలుముద్రల ఎక్స్ పర్ట్ ను  పిలిపించి ఆమె ముఖంమీద  చేతులమీద ఉన్న వేలిముద్రలు ఫోటో  తీయించండి" అన్నాడు నరేంద్ర.
    "అయితే ఉండు. లోపలకెళ్ళి యస్. ఐ.ని రమ్మని ఫోన్ చేస్తాను. నిన్ను ఇంటి దగ్గర దించి నేను ఫింగర్ ఫ్రింట్ ఎక్స్ పర్ట్ ను తీసుకొస్తాను" అని అద్వయితం లోపలకు వెళ్ళాడు.
    నరేంద్ర పోచయ్యను దూరంగా తీసుకెళ్ళి ఏవేవో ప్రశ్నలు వేశాడు.
    "ఇక వెళ్దామా?" అద్వయితం బయటికి వచ్చి అన్నాడు." ఏ మంటున్నాడు?" పోచయ్యతో మాట్లాడివస్తున్నా నరేంద్రను ప్రశ్నించాడు
    "ఏమీ చెప్పడం లేదు"
    "వాడు అలా చెప్పడు లే"
    "వాడు ఈ హత్య చేసి ఉంటాడని నేను అనుకోవడం  లేదు"
    "నాకూ అలాగే అన్పిస్తుంది. అయితే ఏదోదాస్తున్నాడు. ఆ శంకరరావుగాడే చంపి బయటికి వెళ్ళిపోయి ఉంటాడు"
    "ఏడవుతోంది. ఇక వెళదాం" అన్నాడు ఆవలిస్తూ నరేంద్ర.
    "ఏడు కొండలూ! మీరిద్దరూ యస్ ఐ. వచ్చేంతవరకూ వాడు. బయటికి వెళ్లకుండా చూడండీ" అన్నాడు ఇన్స్ స్పెక్టర్ అద్వయితం.
    "యస్ సార్! అంటూ శాల్యూట్  కొట్టాడు ఏడుకొండలు.
    నరేంద్ర, అద్వయితం, మరోసారి చుట్టూ కలియ చూసి, తోటంతా తిరిగి గేటు దగ్గరకు వచ్చారు.
    అప్పుడే ఒక కారు వచ్చి ఆగింది.
    కారులో నుంచి శంకర్రావు దిగాడు.
    ఇన్స్ స్పెక్టర్నూ, నరేంద్రనూ చూసి ఓ క్షణం  నిర్దాంత పోయాడు.
    "ఏమిటిలా వచ్చారు?"
    "పనుండే వచ్చాంలే. మీరెక్కట్నుంచి వస్తున్నారు?" అన్నాడు అద్వయితం కటువుగా.
    "సికింద్రాబాద్ స్టేషన్ నుంచి, నర్సాపూర్ లో వచ్చాను. అసలు ఇంతకూ ఏమైంది?"

 Previous Page Next Page