Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 27

    ఎవరో పురుషుడిది బొమ్మ. పరమ చండాలంగా వుంది. ఆ బొమ్ నోట్లో కోరలున్నాయి. ఓ చేతిలో చీరలాంటిది వేలాడుతోంది. మరో చేతిలో పీలికలైపోయిన జాకెట్టులాంటిది వుంది.
 
    వాడి నెత్తిన రెండు కొమ్ములున్నాయి.

    బయటకొచ్చిన వాడి నాలుక పాము నాలుకలాగా రెండుగా చీలి పోయింది.

    అతను బొమ్మనంతా పూర్తిచేసి పైన బోనీకపూర్ అని రాసి, కింద బొమికల ఫకీర్ అని రాశాడు.

    ఆమెకి కేసు అర్ధమైంది.

    శ్రీదేవితో క్లోజ్ గా వుండే బోనీకపూర్ మీదున్న కసిని అతని బొమ్మను వికారంగా గీసి తీర్చుకుంటున్నాడన్నమాట. ఇక అతనితో మాట్లాడడం ఇష్టంలేక మెల్లగా వెనుతిరిగింది. అక్కణ్ణుంచి వచ్చేసినా అతన్ని గురించి ఆలోచించడం మానలేకపోయింది.

    శ్రీదేవిమీద గంగాధరం ఎందుకంత ఇష్టాన్ని పెంచుకున్నాడు? చిన్నప్పుడు ఎవరో తమాషాగా 'పోరా శ్రీదేవి మొగుడా' అని వుంటారు. అదే అతని మనసులో ముద్రపడిపోయి వుంటుంది.

    లేదూ మరో విధంగా కూడా జరిగి వుంటుంది.

    అతను బాల్యాన్ని దాటి యవ్వనంలోకి వచ్చి వుంటాడు. సహజం గానే స్త్రీలమీద ప్రేమ మొదలై వుంటుంది. అఫ్పుడు సినిమాల్లో శ్రీదేవిని చూసుంటాడు తన కలలరాణి, ఊహాసుందరి, అమ్మాయి ఎలా వుండాలోనని తను తరచూ అనుకునే విధంగావున్న ఆమె అంటే ప్రేమ పుట్టి వుంటుంది. అదలా వయసుతో కంటిన్యూ అయి పిచ్చిస్థాయికి చేరింది.

    సినిమా తెరల జిలుగులు వాస్తవంగా అలా వుండవని, అదంతా టెక్నిక్ చేసే మాయాజాలమని ఎంతమందికి తెలుసు? అమ్మాయిలూ అంతే. తనకు కాబోయేవాడు నాగార్జునలానో, చిరంజీవిలానో వుండాలనుకుంటారు అందరిలోనూ కొద్దొ గొప్పో వుండే ఈ పిచ్చి గంగాధరంలో ఇంకాస్త ముదిరింది అంతే తేడా.

    మంగళ వాయిద్యాలు చెవిన పడడంతో ఆమె ఆలోచనల లింకు తెగింది.

    వాళ్ళు శివాలయం ఆవరణలోకి అడుగుపెట్టారు. ఆ శివాలయం దాదాపు పదెకరాల స్థలంలో వుంది. గురుస్వామి అనే ఆయన చందాలు పోగుచేసి ఎంతో కష్టపడి ఆ గుడి కట్టించాడు. అందులోని నందీశ్వరుడే చిన్న దేవాలయమంత వుంటాడు.

    ఇక లింగాకారంలో వున్న శివుడు పెద్ద దేవాలయం ముందుండే ధ్వజ స్తంభంలా వుంటాడు.

    వాళ్ళు వెళ్ళేసరికి భోజనాల సన్నాహాలు జరుగుతున్నాయి. తక్కువమందిని పిలిచినట్టున్నారు. యాభై మందిదాకా వుంటారంతే.

    రఘురామయ్య ఎదురొచ్చి ఎంతో అభిమానంతో చంద్రరేఖను ఆహ్వానించాడు.

    ఆమె వెళ్ళి ఓ సిమెంట్ బల్ల మీద కూర్చుంది.

    అంతలో "హలో అక్కా! బావున్నావా? కనపడడంలేదు" అంటూ అక్కడికి వచ్చింది ప్రవీణ.

    "బావున్నాను. నువ్వే కనపడడంలేదు" అని కూర్చోమన్నట్లు సైగ చేసింది.

    ఆమె వచ్చి కూర్చుంది. ఆమెకు ఇఱవై ఏళ్ళుంటాయి.

    వర్షపు చినుకులకు ఉబ్బి, స్వచ్చంగా కనిపించే ముద్దచేమంతిలా వుంటుంది.

    ఆమె వంటిరంగు ఎరుపు, పసుపులు కలిస్తే వచ్చే వింత రంగు. నాలుగుమూరల చేమంతుల దండని ఒత్తుగాచుట్టి ఆమె పైట వెనక దాచినట్టు ఆమె ఎద ఎత్తుగా, అందంగా వుంటుంది.

    దోసపండుకు కళ్ళూ, ముక్కూ తగిలించినట్టు పసుపుపచ్చగా, ఆమె ముఖం గుండ్రంగా వుంటుంది.

    "సాయంకాలమైనా ఇల్లు కదలనిస్తే గదా మా వాళ్ళు ముఖ్యంగా మా నాన్న" అని ఆ బాధనంతా ముఖాన్ని అదోలా వంకరగా తిప్పి వ్యక్తం చేసింది.

    ఆమె తండ్రి పేరు నాగరాజు. బడిలో టీచర్. తల్లి తాయారు. ఇద్దరికీ దైవభక్తి ఎక్కువ. భార్యాభర్తల సంబంధం పిల్లల్ని కనడానికే అని నమ్మేవాళ్ళు.

    ఎవరితోనూ కలవనిచ్చేవాళ్ళు కారు. ఆటలకి పంపేవాళ్ళు కారు. సినిమా చూడడమంటే అదేదో పాపకార్యం అన్నట్టు వుండేవాళ్ళు.
 
    ఇవి చాలక సెక్స్ అంటేనే అదో పెద్దతప్పు అని, పాపపంకిలమనీ వూదరగొట్టారు. అబ్బాయిల్ని చూడడంకూడా తప్పని నూరిపోశారు. వాళ్ళతో మాట్లాడటమంటే దేవుడికి అపచారం అని అన్నారు. అలా పెరిగింది ప్రవీణ. ఆమె వీధిలో కనిపించడం అరుదు. ఊర్మిళకు దగ్గరి బంధువు గనుక తామూ వస్తున్నాం కాబట్టి ఇప్పుడు పెళ్ళికి పిలుచుకొచ్చారు.
   

 Previous Page Next Page