"చెయ్యొదులు...చిన్నపిల్లాడ్ని తీసికెళ్ళినట్టుగా, తీస్కెళుతున్నావేం. ఎవరైనా చూస్తే బావుండదు" అంటూ ఆ చేతిని విడిపించుకుని, ఆమె కళ్ళవేపు చూసాడతను.
"ఏంటీ కళ్ళవేపు చూస్తున్నావ్....కళ్ళవేపే కాదు మొత్తం నా వేపు చూడు...ఎలాగున్నానో చెప్పు" కవ్విస్తూ అంది హిమకుంద.
ఓరకంట ఆమెవేపు చూసాడతను.
వైభవ్ పూలచీరలో, వయ్యారంగా, స్నిగ్ధంగా ఉంది, ముగ్ధలా హిమకుంద.
'ఏంటీవేళ, వీరవనితలా చీర కట్టావ్..." వెక్కిరింతగా అడిగాడతను.
"ఏం ఆడపిల్లను కానా...చీరకట్టగూడదా. అస్సలు, నీటేస్తేంటో తెల్సుకుందామని ఆవాళ చీర సెటప్పిచ్చా....బ్యాగీస్ లోనూ, జీన్సుతోనూ నన్ను చూసి చీదరించుకుంటావు గదా.....అందుకని__డూ యూ లైక్ మీ..." ముఖమ్మీద పడుతున్న జుత్తును వెనక్కి తోసుకుంటూ అడిగింది హిమకుంద విలాసంగా.
అరముగ్గిన బాదంకాయలా పిల్ల బాగానే ఉంది. కానీ...కాంప్లిమెంటిస్తే నెత్తికెక్కేస్తుందేమో మెల్లగా గొణుక్కున్నాడు సమర్ధు.
"ఏమిటీ బౌద్ద భిక్షువులా మంత్రాలు జపిస్తున్నావు....ఆన్సరు టుది పాయింట్..."
"ఏ పాయింటూ...కారు బాడీ చూడాలి నన్నెళ్ళనీ..." ముందుకెళ్తూ అన్నాడతను.
"కారుబాడీ...తర్వాత చూద్దువుగాని....ముందు నా బాడీ చూడు- ఏం నచ్చలేదా..." అతని మీద, మీద కొస్తూ అంది.
"మీదకొచ్చావా....ఈ గోళ్ళతో నీ బుగ్గని గీరేస్తాను..."
"గోళ్ళతో బుగ్గలమీద, శరీరమ్మీద గీరితే శృంగారశాస్త్రంలో ఏవంటారో తెలుసా....మహానుభావా ....నఖక్షతాలంటారు. కానీయ్."
"సిగ్గులేదు నీకు- అస్సలు నువ్వు నా వెంట ఎందుకు పడుతున్నావ్ చెప్పు" చికాగ్గా మొహంపెట్టి అడిగాడతను.
"నాకొకటిచ్చెయ్! వెళతా!"
"ఏంటి అది"
"ఫోటోకి ఫోజు... ఆ ఫోటోతో పెయింటింగ్ వేసుకుంటా.....బాబ్బూబూ- నీకేమిమ్మన్నా యిస్తా-నా కోరిక తీరుద్దూ."
"అంతా బాగానే వుందికానీ, ఆ ద్వంద్వార్ధపు డైలాగులే బాగులేవు. ఆ నఖక్షతాలు, కోరిక తీర్చడం, అసలే మా గాలి గాడిది- గాలి వాయిస్ ఇప్పటికే మనిద్దరిమధ్యా ఏదో ఉందనుకుంటున్నాడు వాడు."
"ఏం...ఏదయినా ఉందనుకుంటే, తప్పా."
"నాకంత లీజర్ లేదు. నాకు చాలా పనులున్నాయి."
"దేనికి లీజర్ లేదు."
"అదే- అదేదో ఫోటో అన్నావుకదా! అస్సలు నాకు తెలీకడుగుతాను. నన్నే పట్టుకున్నావేంటీ దెయ్యప్పిల్లలాగా!"
"అసలు నీగురించి నాకు తెలీదు గురూ! నీ కండలున్నాయి చూసావూ- యంగ్ మహమ్మదాలీ కండల్లా ఉంటాయి. నీ ఛాతుంది చూసావూ నాలాంటి ఆడపిల్ల హాయిగా తలపెట్టుకుని పాడుకోడానికి వీలుగా ఉంటుంది. నీ చేతులుంటాయి చూసావూ ఆ చేతుల్తో నువ్వు కౌగలించుకుంటే."
"స్టాప్...స్టాప్....దిస్ నాన్సెన్స్ నాకంత తీరుబడి లేదుగానీ నువ్వెళ్ళిరా."
"అలా చీదరించుకోకయ్యా మగడా! ప్రేమెప్పుడూ ఇలా చీదరింపులతో మొదలై చిలకరింపులదాకా వెళుతుందట. నువ్వు ఇన్ డైరెక్టుగా నన్ను కావాలనుకుంటున్నావ్! అవునా - పోనీలే వొర్రీగా ఉన్నావు కదా! రేపు ఈవెనింగ్ ఠంఛన్ గా నా టైముకొస్తా. ఒక్క టెన్ మినిట్స్ నా కోసం స్పేరు చేసావంటే?"
"అయితే ఒక షరతు."
"అడుగు."
"నీ ఫోటోలకు నేను ఫోజిస్తా! ఆ తర్వాత నన్ను వదిలెయ్యాలి. సరేనా!"
"ఓకే...ఆ తర్వాత నిన్ను నేను పూర్తిగా మర్చిపోతాను. నీ గురించి ఎవరయినా అడిగినా అలాంటి పేరుగల వ్యక్తి నాకు తెలీదని, అతన్నెవప్పుడూ చూడలేదని చెప్పేస్తాను-సరేనా" అంటూ నవ్వుతూ అతని పిర్రమీద ఒక్కటిచ్చి, తన కారువేపు పరుగుతీసింది.
"ఇది పిల్లకాదు" కామెంట్ చేశాడు సమర్ద్.
"నేనప్పుడే చెప్పాను. గోస్ట్ చైల్డు అని- ఏంటీ నిన్ను అంత తొందరగా వదిలేసింది."
"ఒక మంత్రం వేసానులే- అందుకు అలా వెళ్ళిపోయింది." కారు మీద జోరుగా, హుషారుగా వెళ్ళిపోతున్న అమ్మాయి వేపే కళ్ళప్పగించి చూస్తూ__
"అబ్బాయ్! ఆ అమ్మాయ్ అడ్రస్సేమిటో తెలుసా" అని అడిగాడు ముసలాయన.
"ఇంకో ప్రశ్న వేసావంటే నోరు కుట్టేస్తాను, పద, నీ కారు సంగతి చూద్దాం" ముసలాడ్ని ముందుకు తోసాడు గాలిబాబు.
"అలాంటి వ్యక్తి నాకు తెలీదని, అతన్నెప్పుడూ చూడలేదని చెప్పేస్తాను" అని యాదృచ్చికంగా హిమకుంద నోటివెంటవచ్చిన ఆమాట భవిష్యత్తులో కీలకమయిన సంఘటనకు కారణమవుతుందని ఆమెకు తెలీదు.
౦ ౦ ౦
అప్పుడు సమయం రాత్రి రెండుగంటలు దాటింది.
"పబ్ లోంచి అలిసిపోయిన మొఖంతో, చేత్తో గిటారుతో బయట కొచ్చాడు సమర్ద్.
"బండి తియ్" గాలిబాబు హీరోహోండా స్టార్టు చేయగా, వెనక కూర్చున్నాడు సమర్ద్. పది నిమిషాలయ్యాక రాజ్ భవన్ రోడ్ చౌరస్తాలో ఇరానీ రెస్టారెంట్ ముందు ఆపాడు.
లోనికెళ్ళి కూర్చొని- వేడి వేడి ఛాయ్ తాగుతున్నారిద్దరూ.
"గురూ.... నాదో చిన్న డౌటు- లవ్వుకి మాగ్నెట్ అంత పవరుందంటావా?" అడిగాడు గాలిబాబు.
"అంతకంటే, ఎక్కువే ఉంటుంది."
"ఆ పవర్ లేడీస్ ని ఎట్రాక్టు చేసినంత ఎర్లీగా, పురుషపుంగవుల్ని ఎట్రాక్టు చేయదా?"
"ఎందుకొచ్చిందా డౌటు?"
"అదే ఆ దెయ్యపిల్ల! నీకోసం జాతరలో అమ్మోరు పూనిన దానిలా తిరుగుతుంటే, నువ్వసలు పట్టించుకోవేం."
"ఆ అమ్మాయి మనకో కస్టమర్ అంతే. కస్టమర్సుని కారు మెకానిక్ లు ప్రేమించడం సినిమాల్లో జరుగుతాయి. లైఫ్ లో జరగవు."
"అంటే, ఆ అమ్మాయంటే నీకిష్టమేనా."
"వద్దురా! అత్యాశలకు పోవడం మంచిదికాదు. ప్రేమా, దోమా కాదు-నేను లైఫ్ లో చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయ్" ఛాయ్ డబ్బులిస్తూ అన్నాడతను.
"ఉన్నాయ్- ఏవున్నాయ్? గిటారు, ఆ పబ్."
"ఆ పబ్ లు, ఈ గిటారు నీకు చాలా సెటైరుగా కనిపించినా నేను నిరంతరం ఆ పబ్ ల్ని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నానో నీకు అతి త్వరలో అర్ధమవుతుంది." సీరియస్ గా అన్నాడు సమర్ద్. గాలిబాబుతో సమర్ద్ సీరియస్ గా మాట్లాడడం అదే మొదటిసారి. గాలిబాబు సమర్ద్ లో కొత్త సమర్ద్ ని చూశాడు అప్పుడే.
౦ ౦ ౦
"మైడియర్ ముగ్గురు బ్రదర్స్__
జీవితంలోగానీ, సమాజంలోగానీ, జైల్లోగానీ అనుకోని సంఘటనలు జరుగుతాయి. మనకు ఎలాంటి విషాద, వినోదకర సంఘటన ఎదురయినా ధైర్యంగా ఎదుర్కోవాలి" ఉపన్యాసం ప్రారంభించాడు జైలర్ ఆందోళన రావు.
"పిచ్చి నాబుజ్జీ! పాయింట్ చెప్పరా" గొణుక్కున్నాడు పోతురాజు.
"మీతో కలకాలం కలసి మెలిసి ఈ జైల్ ని, సమిష్టిగా డెవలప్ చెయ్యాలనుకున్నాను. మీరడిగిన కోర్కెలన్నిట్నీ తీర్చి, మీ కళ్ళల్లో మెరిసే ఆనందాన్ని నా కళ్ళతో తనివితీరా చూద్దామనుకున్నాను." భారంగా నిట్టూర్చి పోతురాజు దగ్గరకొచ్చి నక్క, గాడిద కలగలిసిన నవ్వొకటి నవ్వాడు. ముందుకు నడుస్తూ మిగతా ఇద్దరి కళ్ళల్లోకి చూసి, మళ్ళీ తన సీట్లో కూర్చున్నాడు.
"వీడికి సడన్ గా ఎయిడ్స్ వచ్చిందేమో" పక్కవాడి చెవిలో అన్నాడు సేతురాజు.
"మీకు టెన్షన్ పెరిగిపోతోంది కదూ! చెప్తా- అప్పుడెప్పుడో మీ ముగ్గురి మంచితనాన్ని, మొదట్లో గుర్తించిన వాడినయినా నేను మీ గురించి ప్రభుత్వానికి రికమెండ్ చేసిన విషయం మీకు తెలుసు."
"మనకు పెద్ద శిక్ష పడుంటుందిరా!" ఆనందంగా అన్నాడు సేతురాజు.
ఆందోళనరావు సడన్ గా గొంతుపెంచి__
"మీ సత్ప్రవర్తనకు మెచ్చిన ప్రభుత్వం మీ ముగ్గుర్నీ ఈవేళ సాయంత్రమే విడుదల చెయ్యమని స్పెషల్ మెసెంజర్ ద్వారా ఆర్దర్సు పంపింది" పెద్దగా నవ్వుతూ అన్నాడు.
ఆ మాటకు పోతురాజు ముఖం వెల వెల బోయింది. ఆ తర్వాత మిగతా యిద్దరి ముఖాలు వెల వెల పోయాయి.
"అందుకా నీ ఆనందం. మమ్మల్నెలాగయినా జైలునుంచి పంపించడానికి వేసిన ప్లానుతో సక్సెస్ అయ్యావన్నమాట" పోతురాజు మనసు మూలిగింది బాధగా.
"ఈ సందర్భంగా మీకోసం నేనే స్వయంగా ఓ పార్టీ ఏర్పాటు చేస్తున్నా అని అనగానే__
జైలర్ అన్నయ్యా! నీనుంచి మమ్మల్నిదూరంచెయ్యకన్నయ్యా!" అంటూ ముగ్గురూ భోరుమన్నారు.
"అలా ఏడవకండి. నా హృదయం అసలే చిన్నది. కరిగి కింద పడిపోతుంది. మీరలా బాధపడతారనే నేను మొదట్లో అంత పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చింది. "జైలరు కాళ్ళను చుట్టేసిన ఆ ముగ్గుర్నీ లేవనెత్తాడు ఆందోళనరావు.
వాళ్ళ కన్నీళ్ళను తుడిచాడు.
౦ ౦ ౦
ఉరిస్థలం వేదికగా, సన్మాన వీడ్కోలు సభ ఏర్పాటు చేయబడింది.
జైలరు ఆందోలనరావు ఆనందాన్ని మనసులో ఉంచుకొని, దుఃఖాన్ని నటిస్తూ, బొటబొటా కన్నీరు కారుస్తూ-
ఉపన్యాసం చేసి "ఎప్పటికయినా మీరు మాతృసంస్థలోకి రావాలని కోరుకుంటున్నాను" అని ముగించాడు.
తర్వాతః ఉపన్యాసం వీర్రాజు మొదలెట్టాడు.
"ప్రియమైన జైలు మిత్రులారా....మనకు కూడు, గూడు, నీడనిచ్చే ఈ జైలు మనకు పవిత్ర దేవాలయం. జైలర్ ఆందోళనరావు మనరావుడు, దేవుడు...
దేవుడ్ని వదిలి వెళ్ళిపోతే ఎంతబాద కలుగుతుందో మాకంత బాధ కలుగుతోంది. అయినా మ ఉగ్గురి తరపునా, నేనొక వాగ్దానం చేస్తున్నాను....ఎన్ని కష్టానష్టాలెదురయినా, పిక్ పాకెట్ దగ్గర్నుంచి మర్డర్ వరకుప్లాన్ చేసి, సక్ససై మళ్ళీ ఇదే జైలుకి, నేలరోజుల్లోపల వస్తామని మీఅందరితో కలిసి మెలసి జీవిస్తామని వాగ్దానం చేస్తున్నాను"
"వీర్రాజు, పోతురాజు, సేతురాజు జిందాబాద్"
జిందాబాద్....జిందాబాద్"
"ఖైదీల యూనియన్ జిందాబాద్"
"ప్రపంచ ఖైదీలారా ఏకంకండి"
నినాదాలు మిన్నుముట్టాయి. బాల వృద్ద ఖైదీలందరూ ఆ ముగ్గురికీ దండలువేసి, వీడ్కోలు పలికారు.
ముగ్గురూ ముషిరాబాద్ మెయిన్ రోడ్ మీదుగా నడుచుకుంటూ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకూ వచ్చి జంక్షన్ లో నాలుగువేపులా చూస్తూ నిలబడ్డారు.