ఆలోచనలు అన్నీ ఆమె చుట్టూరా తిరుగుతున్నాయ్. ఏ పని చేయటానికి మనసు పోవడంలేదు. మనసంతా ఆమె ఆక్రమించుకుని కూర్చుంది.
ప్రతిక్షణము ఉలికిపడుతూ శరీరంలో ప్రతిఅణువూ దగ్ధమౌతోంటే బాధతో ఆమెని గురించి ఆలోచిస్తూ గడుపుతున్నాడు. ఎదురుగా వున్న పేషెంట్ లో ఆమె కనిపిస్తూ ఎందుకిలా చేశావు వేణూ, అని అడుగుతోంది.
స్టెతస్కోప్ అతని గుండెపై గుచ్చుకుంటూ అందులోంచి అంటోంది విరజ.
"నీ మనసెంత మంచిది వేణూ! స్నేహానికి అనురాగానికి చిహ్నానివే. అలాంటి నీవు ఎలా అడిగావు వేణూ! అలా అడగలేదని చెప్పవూ?"
భారమైన మనస్సుతో తల పట్టుకుని కూర్చుంటే రెండు చేతులలోంచి కర్ణపుటాలు ధ్వనించేట్టు అడుగుతోంది.
"నేను నీదాన్నే వేణూ! నేనూ, నా శరీరం, నా మనసు, నా సర్వస్వం నీదే. నీ పాదాలవద్దే అర్పిస్తాను. కానీ, కానీ వచ్చే జన్మవరకూ ఆగు, ఈ జన్మలో నీకా అదృష్టం లేదు. నేను నీతో కలసి మెలసి వుండలేను. నన్ను మన్నించు వేణూ."
భరింపరాని వేదనతో అనుకున్నాడు. "విరజా! ఎంత బాధ పెట్టా నిన్ను. నన్ను.... నన్ను భగవంతుడు కూడా క్షమించడు. కానీ నీవు మన్నిస్తావు విరజా! నమ్ము నమ్ము. నన్ను నమ్ము విరజా. నీ మాటకి మనసుకి భంగం రానీను. మన స్నేహం చిరకాలం వర్ధిల్లాలి అంతే విరజా. అంతే."
అలాగే దుఃఖంతో విచారకరమైన వదనంతో వెళ్ళి పడుకున్నాడు.
"భోజనానికి లేవండి బావా!"
దగ్గరగా వచ్చి గుండెలపై చేయివేసి మెల్లగా నిమురుతూ అంది. మెల్లిగా ఆ చేయిని తొలగించి మరోవేపు తిరిగి పడుకుంటూ అన్నాడు. "ఆకలిగా లేదు సావిత్రీ! నీవు భోజనం చెయ్.
"చిలిపిగా నవ్వుతూ అంది" ఎందుకు బావా! ఎక్కడైనా మధ్యలోనే వేశారేమిటి ఓ డోసు....
చిరాగ్గా అన్నాడు. ఎక్కడా అవలేదు. ఎక్కడైనా అయుంటే ఆకలిగా లేదు. అనే ఖర్మ పట్టలేదింకా. నిజంగా తినబుద్ధి కాలేదు.
"మరి ఆకలి కాలేదంటారేం? రండి బావా!" చేయి అందుకుని లాగ ప్రయత్నిస్తూ అంది.
ఆ చేతిని అలాగే విసుగ్గా లాక్కుని అన్నాడు" వెళ్ళు సావిత్రీ! నాకు మనసేం బావులేదు. కోపం తెప్పించవద్దు."
ఆశ్చర్యపోయింది. ఏనాడు అలక, కోపం ఎరుగని తన బావ ఇలా అంటున్నాడేమో అని. అంతలోనే ఆమె స్త్రీత్వం మేల్కొంది. మరుక్షణం దాని చెల్లెలు మొలకెత్తింది.
"వెడతాన్లెండి.... మనసులో ఏదో పెట్టుకుని ఎవరిమీదో కోపాన్ని యింట్లో ప్రదర్శిస్తే మేమేం చేస్తాం? ఏదైనా తెలిపితేనే కదా తెలిసేది?
నిరసనగా అన్నాడు. "అవును నీలాంటివాళ్ళకి చెబితేనేకానీ తెలీదు. ఒక్కసారి చెప్పినా తెలీదు. అర్ధం లేకుండా విసిగించకు సావిత్రీ. వెళ్ళు! ప్లీజ్!"
మనసు పాదరసం లాంటిది. అది ఎటు వంచితే అటు వంగుతుంది. ఉష్ణాన్ని, శీతలాన్ని సమాన వేగంతో అందుకుంటుంది. అదే వేగంతో వదులుతుంది.
భర్తగారి ఎత్తిపొడుపులోని వ్యంగ్యాన్ని గమనించింది. బాణానికి బాణం వదలటం శౌర్యవంతుల లక్షణం. తగ్గితే గొప్ప తగ్గిపోదూ?
"అవునులెండి. మేమేం బియ్యేలు, ఎమ్మేలు చదివామా ఏమన్నానా మాకు చెప్పినా అర్ధం కావటానికి. మీతో తిరుగుతూ మీ మనసుని అర్ధం చేసుకోవటానికి మా యోగ్యత ఎంత?"
మాటకి మాట తెగులు.... అస్త్రాలకన్నా శస్త్రాలకన్నా పదునైన వేగవంతమైనవి ఎదుర్కోలా.... అతని మనసు భగ్గుమంది. ఛీ.... ఛీ.... ఏం మనుషులు? మండే మంటలో ఇంకొంచెం ఆజ్యం పోయటంతప్ప మరేమీ చేయలేరు.
"నన్ను చంపకు సావిత్రీ! వెళ్ళు.... వెళ్ళు నన్ను విసిగించకు. అంతకంటే ఏమీ చెప్పలేను. నీవు బియ్యే, ఎమ్మే చదివినా చదవకపోయినా నీవనుకునే వాళ్ళతో సమానం కాలేవు. ఎందుకా ఏడ్పు వెళ్ళు యిక.
మనిషి అప్రయత్నంగా నోరు జారేడు.
"ఏడ్పు కాకపోతే మరేముంది బావా! నేను తగనని తెలిసి నన్ను కట్టుకుని మరొకరితో పోల్చి యిప్పుడు తగనంటే ఏం చేయను? చెప్పండి? పోనీ నన్ను చంపెయ్యండి.... మీ మనస్సుకి అప్పుడైనా శాంతి లభిస్తేచాలు...."
పళ్ళు కొరుకుతూ లేచి కూర్చొని రెండు చేతులూ ఆమె గొంతు చుట్టూ చేర్చి ఫిట్ వచ్చిన వారి మాదిరి అన్నాడు.
"నిజంగా చచ్చిపో.... అలా అయితే నిన్ను నా జీవితంలో మరచిపోలేను. నా జీవితం సుఖంగా శాంతంగా ఉంటుంది అప్పుడైనా...."
ఆమె జవాబు చెప్పకుండా కన్నీరు కారుస్తోంది. ఎలాంటి వారిలోనైనా ఓ రాక్షసుడు వుంటాడు. ఇదిగో ఇలాంటి సమయంలో బయటకు వస్తాడు. అయితే దాని జీవితం ఒక్క క్షణమే! ఒక్కసారిగా స్మృతివచ్చినట్లయితే ఆ చేతులు తొలగించి దగ్గరగా తీసుకుంటూ అన్నాడు.
"ఎందుకిలా పిచ్చిగా ప్రవర్తించి నన్ను పిచ్చివాడిని చేస్తావు సావిత్రీ! మనసు బాగా లేనపుడు పలుకరించి తిట్లుతిని నీవు బాధపడి నన్ను బాధ పెడతావెందుకు? ఎంత చెప్పినా అర్ధం చేసుకోలేవు.... బావంటే పిచ్చి అభిమానం తప్ప మరేమీ తెలియదు నీకు. నాకు కోపం తెప్పించవద్దు సావిత్రీ! నేను కోపంలో పశువుకన్నా హీనంగా తయారవుతాను. నా బంగారు సావిత్రీ ఇంకెప్పుడూ కోపం తెప్పించవు కదూ?"
తలూపుతూ అంది "మీకు కోపం తెప్పించి మీతో నాలుగు చీవాట్లు తింటే తప్పేంవుంది బావా! తిట్టింది నా బావేగానీ మరొకరు కాదుగా? పాపిష్టిదాన్ని బాధ పడుతున్న మిమ్మల్ని యింకా బాధించాను. లేవండి బావా కొంచెం ఎంగిలి పడుదురు కానీ....?
ఆమెని అలాగే హృదయానికి హత్తుకుని కన్నీరు తుడుస్తూ అన్నాడు.
"భార్య అంటే యిలా వుండాలి. నవరసాలు ఒలికించాలి అప్పుడే జీవితంలో ఉంటుంది...."
ఆమె నవ్వింది వెన్నెలలాగా! అతని భుజాలపై చేతులు వేసి ముఖంలోకి చూస్తూ అంది "భర్త అంటే కూడా...."
ఆమె మాటని పూర్తి చేయనివ్వకుండా మూసేశాడు పెదాలతో.
20
"నమస్తే డాక్టర్!"
ముద్దులొలికే కుమారుడిని ఎత్తుకుని నవ్వుతూ పలకరించింది ప్రమీల.
బొద్దుగా, ఎర్రగా, మెరిసే కళ్ళతో నల్లటి వెంట్రుకలతో ఎంత అందంగా వున్నాడు బాబు! బలంగా వుండటంతో మరీ అందంగా వున్నాడు. ముంజేతుల మడతపడింది. అబ్బ ఎంత బొద్దుగా ఉన్నాడు? బోసి నవ్వులు నవ్వుతూ కేరింతలు కొడుతూ గట్టిగా చేతులు జాపి వూపుతూ క్రొత్త పాత అనేది లేకుండా పలుకరిస్తున్నట్టు నవ్వుతూ ఎంత బావున్నాదీ పాపాయి?
ఏ విధమైన భావాలు ముద్రితమవని మనస్సులో అనురాగం ప్రేమ అనేది తప్ప మరేది ఎరుగని గుండెతో ఎంత నిర్మలమైనవి పసి జీవితాలు? ఏళ్ళు పెరిగే కొద్దీ ఒక్కో అనుభవం మనిషికి కల్మషాన్ని ప్రసాదిస్తోంది ప్రపంచం. అంతే కానీ అతనిలో ప్రేమ జ్యోతి వెలిగించటం లేదు.
నిశితంగా ఆమె ముఖంలోకి చూశాడు. అప్పటికీ ఇప్పటికీ ప్రమీలలో యెంత మార్పు?
ఒకరోజు జీవితమే వద్దనుకుని మాతృత్వమే అక్కర్లేదనుకుని విసుగెత్తిన ప్రమీల ఈ రోజు ప్రమీల తన ముద్దుల తనయుడిని ఎత్తుకుని సుదూరమైన జీవన పధంలా ఆ అబ్బాయిని ఆలంబనంగా చేసుకుని బ్రతకాలని అనుకుంటూ భవిష్యత్ ని గూర్చి బంగారుకలలు కంటోంది.
యెంత చిత్రమైంది మానవ జీవితం! కోరుకున్నప్పుడు దూరంగా పోయి వద్దనుకున్నప్పుడు వద్దకు చేరుతూ మనిషిని అన్ని విధాలా ఆడిస్తూ ఆనందిస్తూ యెప్పుడూ ఓ కొత్తదనాన్ని చేకూర్చే జీవితం ఎంత విచిత్రమైంది?
"డాక్టర్!"
ఆలోచనల్ని అవతలకి నెట్టి అన్నాడు. "ఏమ్మా ప్రమీలా ఏమిటి విషయం? ఇంటికి వెళతావా?"
సిగ్గు పడుతూ అంది. "అవును డాక్టర్! మా అబ్బాయిని ఇక్కడే ఉంచితే దిష్టి తగులుతుంది. ఈ నెల రోజుల్లోనే యెన్నెన్నిసార్లు అబ్బాయి ఉలిక్కున్నాడో మీకేం తెలుసు? చివరికి దిష్టిసోకి మొన్న చూశారు కదూ ఎంత వేడి చేసిందో.... అందుకే ఇక వెళ్ళిపోతాను డాక్టర్...."
"కానీ...."
"నాకు తెలుసు డాక్టర్! మీ అనుమానం మావారు లేని ఇంట్లో అడుగుపెడితే తిరిగి ఆయన స్మృతులు నన్ను గాబరాపెట్టి మరేం చేస్తాయోనని కదా మీ అనుమానం. కానీ డాక్టర్ అప్పుడు నాకు దగ్గరగా యెవరూ ఉండేవారు కాదు. ఇప్పుడో మా ఆయన ప్రతిబింబం....అచ్చు రూపు నా మనసు ఇదిగో మీ యెదురుగా ఉన్నాడు చూడండి వీడు.... వీడున్నాడు.... అంతకంటే ఏం కావాలి?"