Previous Page Next Page 
విరిజల్లు పేజి 27


    తుచ్చమయిన ఈ దేహంపై మీకు ఆశ యెందుకు వేణూ. ఈ రక్తమాంసాలపై భ్రమ యెందుకు!
    పవిత్రమయిన ఆత్మ నిర్గమిస్తే దీన్ని కాకులు పొడుస్తాయ్. కుక్కలు చీల్చివేస్తాయ్.... అగ్ని దహిస్తుంది.... వాయువు తోడౌతుంది.... జాలం తనలో కలుపుకుంటుంది. పాంఛభౌతికమైన ఈ దేహంపై ఆశ యెందుకు?
    రంగురంగుల శరీరాలతో రకరకాల ఆకర్షణతో చిత్ర విచిత్రంగా ఆ భగవానుడు ఈ రంగు బొమ్మలని సృష్టిస్తాడు. సామాన్యులు వాటిని చూచే భ్రమిస్తారు.... కానీ నీవు కూడానా వేణు.
    నేను ఎప్పటికి నీదాన్నే....ఆ ఒక్క మాట చాలదా వేణు! వెనుకటి జన్మలో నేను నీ యిల్లాల్నే! అందులో అబద్ధంలేదు. రాబోయే జన్మలో నిన్నే దైవంగా పూజించేట్టు వరం పొందటానికి హరిహర తపస్సు చేస్తాను. నిజం వేణు. నాకీ జన్మకల్లా వుండే కోరిక అదే.
    నీకు పండంటి కుర్రాడు కలుగ బోతున్నాడు. బంగారం కంటే పసందయిన భార్య ఉంది.... ఇంకా ఎందుకలా చెప్పు!
    ఆమెకు ఎంతో అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నిజంగా ఆలోచించు. నేనే నీ మాట వింటే మనం తప్పు చేస్తే ఆమె కెంత బాధ!
    మీ యిల్లాలి మనస్సు మీరు గ్రహించుకున్నారు? బహుశా అందులో మీ తప్పు ఏమీ వుండబోదని మీ సంసారిక జీవితం సాఫీగా సుఖంగానే సాగుతున్నదనుకుంటాను.
    అన్ని విషయాలలో అదృష్టవంతులు మీరు ఆ అదృష్టాన్ని కాలదన్నుకుని ఈ అదృష్టహీనని కావాలను కోవటం ఎందుకు? పనికిరాని శరీరం మీద వ్యామోహం ఎందుకు వేణు! నీవు డాక్టరువి రకరకాల శవాల్ని కోసి చూసి ఉంటావు. మాంసకండరాలు తప్ప ఏముంది ఈ దేహంలో? పై పై రంగులు, అంతేకానీ మరేముంది? సామాన్యుడిలా నీవు భ్రమపడితే ఎలా వేణు?
    అంతరంగంలో అనంతరంగం వెలుగుతూ వుంటుంది. ఆ అంతరంగాన్ని చూసేకదా ఈ దేహానికి ప్రాధ్యానత. వట్టి మట్టి బొమ్మలకి ప్రాధాన్యత ఎప్పుడూలేదు వేణూ!
    నీ సన్నిధికి రాకుండా ఉండలేను. వస్తే నీ ప్రేమ వాత్సల్యానికి మనసు పొంగకుండా ఉండదు. కానీ నీ కోరిక వింటూంటే మాత్రం శరీరంలో అణువణువూ అక్కడే చచ్చిపోతుంది. ఏం చేయను వేణూ!
    నన్ను అర్ధం చేసుకో. నేను పెళ్ళికాని దాన్ని అయినా మనసా నీకే నీవు పెళ్ళి అయిన వాడివి. సంఘంలో గౌరవనీయులుగా పరిగణింపబడే మనం సామాన్యుల్లా చరించితే దానికి భద్రత ఏముంది! తప్పుకాదా వేణూ!
    అయినా ఎందుకింత వ్యామోహం నా మీద? తెలియక అడుగుతాను. అందంగా ఉంటే చిత్తం ఎందుకు చలించాలి? వద్దు వేణూ! ముఖ్యంగా నీవంటి డాక్టర్లకి అదివద్దు.
    ఒక్క మాట.... నన్ను మన్నిస్తావు కదూ__ఎప్పటిలా చిన్నప్పటి నీ విరజలా నన్ను చూస్తానంటేనే నీ దగ్గరకి మళ్ళీ వస్తా....లేక నాలో నీకు యవ్వనమే కనిపిస్తే యిక రాను రాకుండా ఉండలేనని తెలుసుకదా నీకు__రాకుండా ఏం చేస్తాను.... ఎలా ఉండగలను?
    అసలు యీ శరీరం మిగిలితే కదా నీవద్దకు రావటం? రాకపోవటం అనేది ఉండట....ఆ స్థితే సంభవిస్తే త్వరగా వీలయితే అంత త్వరగా యీ శరీరాన్ని త్యజించి మరో జన్మని వెతుక్కుంటూ అప్పుడు ఎప్పుడూ నీ వద్దే వుండేలా కోరుతాను....
      నీ మనస్సును అర్ధం చేసుకునో చేసుకోకో నాకు కలిగిన వ్యధని నీకు తెలుపుకున్నను. మన్నించు వేణు! నీ మనసుకి బాధ కలిగిస్తున్నాను.

                                                                                            ఎప్పటికీ నీ
                                                                                                విరజ    


                                                               19


    మురళీకి ఉత్తరం అంతా చదివి వినిపించి దాన్ని కాల్చేస్తూ అన్నాడు. అతని కళ్ళు ఎర్రగా వుబ్బి ఉన్నాయి.
    "ఈ ఉత్తరంతోపాటు విరజ భయం కూడా యిలాగే మండిపోవాలి. ఏదయినా నీ మనస్సులో కల్మషాలు ఉంటే అవీ దీనితో పాటే దగ్ధమైపోవాలి. విరజ లాంటి స్త్రీ స్నేహం పూర్వజన్మ సుకృతంలో లభ్యమైంది. అలాంటి దాన్ని కోరుకుంటారేగానీ అవివేకంగా ఎవరూ పోగొట్టుకొనరు.
    ఒక్కక్షణం ఆగి "ఎంత బాధ పడిందో పాపం....నాతో చెప్పలేక మనసుని అణచుకోలేక ఆ సందిగ్ధావస్థలో యెంతగా వ్యధ చెందిందో__ నేనెంత పాపిని మురళీ...."
    మిత్రుని ముందు బహిరంగంగా యేడ్వటం ఒక్కటే తక్కువ.
    "మంచివాళ్ళు కూడా తప్పులు చేస్తారు వేణూ! కానీ దిద్దుకోవటంలో వుంది వాళ్ళ వివేకం అంతా__"
    "కాదు మురళీ: ఆమె రాసింది చూడు కొన్ని మాటలు, బొమ్మలా కూర్చున్నానని_నా గుండెను చీల్చివేస్తున్నాయ్. నిప్పులో సజీవంగా మనిషిని పడవేసినా అంత బాధ కలగదేమో_యెంత క్రూరుడివి మురళీ__ ఆమెను యెంతగా నొప్పించానూ_యెంత దుఃఖించిందో__"
    నెమ్మదిగా వీపుపై తట్టి అన్నాడు. "జరిగిపోయిందాన్ని గురించి బాధపడితే లాభమేమిటి? ఇకముందు ఏం చేయాలో నిర్ణయించుకో వేణూ!
    నిర్ణయించుకోవటం యేముంది మురళీ. ఆమె చెప్పింది కదా నా మనసు విప్పి ఆమె పాదాలముందు పరుస్తాను. ఆమె యిష్టమే నా యిష్టమని ఆమె యిష్టానికి వ్యతిరేకంగా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనని ఋజువు చేస్తాను నన్ను నమ్ముతుంది, నన్ను నమ్మలేకుంటే ఇంకెవర్నీ నమ్మలేదు. అది నిజం మురళీ__ఆమెకి నాపై యెంత మనసుందో తెలుసుకోవటానికి ఆ పునర్జన్మ ప్రసక్తి చాలదూ? ఆ విషయం అంత సున్నితంగా మృదువుగా చెప్పటం యెవరికి చేతనవుతుంది? యెంత నాగరికత లేకపోతే అలా వ్రాయగలుగుతుంది? నేను నీదాన్నే వేణూ అనింది. ఆ మాట చాలదూ నన్ను స్వర్గంలో తిప్పటానికి__"
    "నిజమే వేణూ! కాని ఆమెని చాలా బాధపెట్టావు. అందుకుమాత్రం నిన్ను క్షమించరాదు__"
    "ఏం చేయను మురళీ అనాలోచితంగా కొన్ని కొన్ని మాటలు బయటపడుతూ వుంటాయ్.... వాటి అర్ధం బహిరంగంగా ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. నాకు తెలుసు యిలా అవుతుందని. తెలుసంటే తెలుసని కాదు. తర్వాత ఏదో ఒకసారి ఊహ అలా వచ్చేసింది. మనసు బయట పెట్టేవరకే గౌరవం ఉండేది తర్వాత అంతా గంగాభవానీ పాలే. అందుకే మనసులో దాచుకుని ప్రేమించటం కన్న మరో దివ్యమైంది లేదు. ఆమెను చాలా బాధ పెట్టాను. కన్నీటితో కాళ్ళు కడిగినా దోషం తీరదు. నా శిరసు వలచి యిచ్చినా తప్పు తగ్గిపోదు. ఆలోచితమయిన కార్యాలు ఎప్పుడూ అంతరంగాన్ని చిత్రహింస పెడతాయి. స్థిత ప్రజ్ఞత్వం లేని వాడిని ఏం చేయను? ఏం చేయను మురళీ!
    "ఆమె మళ్ళీ వచ్చాక క్షమాపణ చెప్పుకో.... ఆమె ఎప్పుడయితే క్షమిస్తుందో అప్పుడే ఆమె బాధ తొలిగినట్లు. నీ దోషం తగ్గినట్లు. వివరంగా నీ మనసు వెల్లడిచెయ్. భాషకందని భావాన్ని వెలువరించు."
    అతను మాట్లాడలేదు. శ్రావణమేఘాలు పోతరించిన ఏనుగుల్లా కుమ్ముకుంటున్నాయి. వాటి మదగంధం యిప్పుడో అప్పుడో నేల రాలేట్టుంది.
    దిగంతాలకి అవతల ఏముందోనని చూస్తున్నట్టుగా చూస్తూ అన్నాడు.
    ఆమె వద్దకు వెళ్ళడానికి జంకుతోంది మనస్సు. ఎలా ముఖమెత్తి చూపాలి? ఎలా పలుకరించాలి? మనసులోని భావం మాటగా మారేవరకూ అర్ధం మారిపోయిందని ఎలా చెప్పాలి? తప్పుగానిదైనా చిన్న తప్పు లాంటిది మానవుడికి ఎంతగా క్రుంగదీస్తుంది మురళీ? మేరువంత మనిషయినా తప్పు చేసేసరికి కృంగి అణువంత అవుతాడు. మనిషి నిలబడటానికి కృంగిపోవటానికి మనసే కారణం, ఎంత చిత్రం మురళి?"  
    ఉన్న విషయాల్నే తరచి తరచి బాధపడటం కొందరి వ్యక్తుల ప్రత్యేక లక్షణం. దోషం వున్నా లేకపోయినా దోషారోపణ జరిగేందుకయినా అవకాశం ఇచ్చేట్టు చేశామేనని కుమిలిపోయేంత సున్నిత మనస్తత్వం గలవారికి అనుక్షణం మోసాలతో ముఖస్తుతి మాటలతో నక్క వినయం ప్రదర్శించే మానవులతోనే ఈ ప్రపంచం నిండివుందన్న విషయం తెలీదు. అందుకే వాళ్ళలో అషుస్పష్టం కాని అమృతమయమైన మనస్సుంటుంది.
    "వర్షం వచ్చేట్టుంది పద మురళి."
    "రానివ్వు కొంచెం శాంతి అయినా చిక్కుతుంది బాగా నానితే."
    నవ్వి అన్నాడు "నానిపోతామని కాదు నా భయం, త్వరగా వెడదామని, ఇక మనసుని మళ్ళించుకో ఆ విషయాల్నుండి. ఇంతగా ఉత్తరం వ్రాసినా ఆమె మరీ అంత నిర్దయురాలు కాదులే! నిన్ను అర్ధం చేసుకుంటుంది కూడా. ఆమెకు ఒకమాట కావాలి. నీ నుండి అంతే! మరేమీ అక్కర్లేదు, అందుకోసమే ఉత్తరం రాసింది. ఏ విషమైన బంధాలూ లేని అనుబంధం కావాలి. అంతే.
    భారమైన మనసుతో ఇళ్ళకి వెళ్ళారు. అలాగే నర్సింగ్ హోంకి వెళ్ళి ఫార్మల్ గా అన్నీ చూచాడు. ఒక్కమాట అయినా మాట్లాడలేదు. నిర్విరామంగా రౌండ్సు ముగించుకుని వచ్చాడు. ప్రమీల ఏదో చెప్పబోతే మళ్ళీ వస్తానని చెప్పి వచ్చాడు.

 Previous Page Next Page