ఒక్క క్షణం ఆగింది. ఆ అబ్బాయి చెంపల్ని ముద్దుపెట్టుకుంటూ.
"అసలు వీని జోకలో నాకు పొద్దుపోదు.... పనిలేకుండా వుంటే కదా ఏవేవో ఆలోచనలు వచ్చేది.... ఎప్పుడైతే ఏదో ఒక పనిలో నిమగ్నులౌతామో అప్పుడే వేరే ఆలోచనలకి తావే ఉండదు కదా డాక్టర్...."
"అవునమ్మా నిజం చెప్పావు.... నిర్వ్యాపారులకే లేనిపోని ఆలోచనలు...."
అసంబద్ధంగా ఆలోచనా రహితంగా మనిషి తయారయ్యేడంటే అతన్లో విషాద శ్రవంతులు నిత్యమూ ప్రవహిస్తూ ఉండాలి.
"ఎందుకు డాక్టర్ అలా ఉన్నారు?" ఆయనస్థితి అర్ధం చేసుకోలేకపోతోంది ప్రమీల. వచ్చినప్పటినుంచీ ఏదేదో మాట్లాడుతున్నా అంతగా వినకుండా తన ఆలోచనల్లో తాను మునిగిపోయిన డాక్టర్ గారి మనస్సులో ఏముందో ఆమె తెలుసుకోలేక పోతోంది.
ఆమె అలా ప్రశ్నించేసరికి ఉలిక్కిపడ్డట్టయి అన్నాడు నవ్వుతూ. "ఎలా వున్నానమ్మా! నీకు అన్నీ చక్కగా కుదిరాయని సంతోషంగా ఉంది. ఆఁ! ఇంతకీ మీ అబ్బాయికి ఏం పేరు పెడుతున్నావ్ ప్రమీలా?"
మాట మార్చటంలో మీరే గొప్పవారు డాక్టర్?" నవ్వేస్తూ అంది.
"మా అమ్మా, నాన్న, అత్తయ్య, మామయ్య అంతా వీరికి మా ఆయన పేరే పెడదామంటున్నారు! ఎలా చెప్పండి వాడిని ముద్దుగా నేనెలా పిలుచుకోగలను? పేరుతో ఆయన్ని నిలువగలనా? ఆయన పేరుతో వీడినెలా పిలవాలి?"
అందమైన ఆ బాబు కళ్ళు ముద్దుపెట్టుకుని డాక్టర్ వేపు చూసి అంది.
"ఆ పేరు గడియగడియకు బ్రతికినన్నిరోజులు పిలుచుకుంటూ ఎలా బ్రతుకగలను చెప్పండి? చెప్పండి డాక్టర్ మీరైనా చెప్పండి మా వాళ్ళకి!"
ఆమెకి ఆయనపై వుండే అనురాగానికి ఆమె విపులబ్ద స్థితికి వేణు మనస్సు కరిగిపోయింది. ఏం చెబుతాడు తను? మృదువైన ఆలోచనల్ని వెలిబుచ్చుతూ ఎప్పుడూ ఆయనని తల్చుకుంటూ అతి సున్నితమైన ఊహా పథంలో మెలిగే ఆమెతో ఏం చెబుతాడు?"
ఎంత ప్రేమ? మనిషిపై ఇంత అనురాగాన్ని ఎలా సృష్టిస్తున్నాడు భగవంతుడు? నిజంగా ప్రేమకి ఫలితం ఎప్పుడూ వియోగాలు విషాదాలేనా? ప్రేమించుకుని సుఖంగా జీవించిన జంట మొత్తం ప్రపంచంలో వేళ్ళ మీద లెక్క పెడతానికి కూడా వుంటాయా?
మళ్ళీ అంది. "నేను మాత్రం యిందుకు అంగీకరించను డాక్టర్. ఆ పేరు వీడికి పెట్టటం ఏమాత్రం యిష్టంలేదు. ఇప్పుడు భరించే వేదన చాలక ప్రతి గడియకూ రంపపుకోత కోరి తెచ్చుకోమంటారా? డాక్టర్."
అతను జవాబు చెప్పలేదు. అనురాగానికి హద్దెక్కడ? ప్రేమకు పరిధి ఎక్కడ? అని ఆలోచిస్తున్నాడు.
"జవాబు చెప్పరేం డాక్టర్.... అయినా ఎప్పుడైనా మీరు నా మాటని తీసేశారులెండి. మీరు నా మాటకి కోరిక అంగీకరిస్తారా డాక్టర్. ఏం పేరు పెడదామనుకున్నానో తెలుసా డాక్టర్? మీరు వూహించగలరా?"
తేనెలో అద్దిన గులాబి లేకుల్లాంటి ఆ బాబు పెదవులని ముద్దు పెట్టుకుని అతనివేపు తృప్తి ఒలికే నేత్రాలతో చూస్తూ_
"వేణు మాధవ్! బావుంది డాక్టర్.... నాకు జీవితాన్ని ప్రసాదించి వీడికి ప్రాణంపోసి మా వంశాన్ని, నా ప్రాణాన్ని నిలిపిన మీపై కృతజ్ఞత ఎలా తీర్చుకోగలను వేణు బాబు! ఇంతకంటే నాకు మరో వేరు మార్గం కనిపించలేదు. ప్రతిక్షణం మీ పేరుని తల్చుకొని మీరు మా జీవనజ్యోతిని మా యింటి దీపాన్ని నిలిపిన విషయం స్మరించుకుంటూ వుండటంకన్నా కృతజ్ఞత ఏముంది? చెప్పండి? నాకు మాధవుడంటే చిన్ననాటి నుంచి బుద్ధి తెలియని వయసు నుంచీ ఎంతో భక్తి. పిల్లనగ్రోవి వాయిస్తూ అల్లరిగా గొల్లపిల్లలని వెంట త్రిప్పుకుని తిరిగే నల్లని వాడంటే నచ్చని వారెవరు బాబూ! అందుకే మా అబ్బాయికి వేణుమాధవ్ అని పేరు పెట్టేశాను. ఎవరెలా పిలిచినా నేను మాత్రం అలాగే పిలుస్తాను. అయినా నా అబ్బాయి విషయంకదూ డాక్టర్. నా మాటే వినాలి.... వినాలి__ నా మాట వినేట్టు చేయండి డాక్టర్__"
అతని పాదాలకు తను నమస్కరించి ఆ అబ్బాయితోకూడా వందనం చేయించింది. నిలువునా కరిగిపోతూ అన్నాడు. "నీ మాటని మీవాళ్ళు ఎప్పుడూ కాదనరులే ప్రమీలా! భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు_ లే__"
ఆనందం వల్లనో, దుఃఖం వల్లనో నేను చెప్పలేను కానీ ఆమె కళ్ళనుండి జారిన రెండు కన్నీటి బొట్లు అతని బొటన వేళ్ళను తడిపాయి.
21
"అబ్బా!"
తల తుడుచుకుంటూ బాధగా అరిచాడు రంగా!
వేగంగా దగ్గరికి వచ్చి తలపట్టుకుని తడిమిచూసి బుడిప కట్టినచోట నిమురుతూ అన్నాడు కోపంగా వేణు.
"ఏమిటిది రంగా? యెందుకిలా చేస్తున్నావ్? నీకేదైనా కావలసివస్తే మమ్మల్ని పిలిస్తే రామా! నడుచుకుంటూ తడుముకుంటూ వచ్చి దెబ్బలు తగిలించుకోవలసిన అవసరం ఏముంటుంది చెప్పు"
బహుశ అష్టమినాటి వెన్నెలలాగా నవ్వేస్తూ అన్నాడు.
"అలవాటు కావాలి బావా! దెబ్బలు తగిలించుకోవాలి. బొప్పెలు కట్టించుకోవాలి. అనుభవం సంపాదించుకోవాలి. ఎప్పుడూ మంచంలో పడుకొని లేదా కుర్చీలో కూర్చుని అంతులేని ఆలోచనలలో మునిగి చావమంటారా? చెప్పండి బావా?"
అందమయిన తుమ్మెద రెక్కలల్లార్చి నట్టుగా కనురెప్పల్ని ఆడించి ఒక్కక్షణం ఆగి అన్నాడు.
"కళ్ళతోపాటు కర్ణేంద్రియాలు, వాటితోపాటు కాళ్ళూ పోతే అన్నీ పోగొట్టుకుని కదలకుండా కూర్చొని వుండగలను. కానీ యిప్పుడెలా బావా? బరువుగా కాళ్ళు లాగుతూ వుంటే కదల్చకుండా ఒకచోట ఎలా పడివుండను? అయినా ఈ రోజంటే మీరున్నారు! అక్కయ్యుంది. రేపటి సంగతి ఆలోచించండి? ఇలా ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళేమిటి, ఎన్నేళ్ళు మీకు బరువుగా వుండాలి చెప్పండి? నా బ్రతుకు ఇక ఎప్పుడూ పరాధీనంగా వుండాల్సిందేనా!
అతను చెప్పే ఒక్కోమాట విషలిప్తమయిన శరంలా గుచ్చుకుని నిజాన్ని వెలికితెస్తున్నా అతన్ని మళ్ళించడానికని కోపంగా అన్నాడు.... అదే లౌక్యం.... బ్రతుకుల్ని దిద్ది తీర్చే బంగారు బాట....
"నీకు అనవసరమయిన ఆలోచనలు ఎక్కువయ్యాయి రంగా.... నిజంగా దెబ్బలు వేయాలి. అప్పుడు చదువుకోకుండా అల్లరిగా తిరుగుతున్నా నాకు కోపం వచ్చేది కాదు. కానీ యిలా అనవసరంగా మనసుని పాడుచేసుకొని లేనిపోని దుఃఖాన్ని తెచ్చుకుంటే మాత్రం నేను సహించలేను రంగా! ఎదుటివారిని గాయపరిచే మాట పొరపాటున కూడా బయటికి రానివ్వరాదు. మన దుఃఖం మనం దాచుకోవాలి.... అంతే మందికి పంచితే....
నిట్టూర్పుతో కూడిన మందహాసంతో అన్నాడు. "విపరీతమయిన అభిమానంతో అంటున్నారు మీరు. అంతకుమించి మరేమీ లేదు. కానీ నేను చెప్పిన దానితో నిజం వుందో లేదో మీ మనసుకి తెలియదా బావా! పోనీలెండి ఎదుటివారి మనసుని నొప్పించవద్దన్నారు. అందులో మీవంటి వారి మనసును నొప్పించడం మరీ దోషం. ఇహ ముందు జాగ్రత్తగా మాట్లాడుతాను__
ఎందుకో అతనిగొంతు బొంగురుపోయింది. ప్రేమగా అన్నాడు వేణు.
"రంగా వివేకాన్ని ఎప్పుడూ మంచి మార్గంలో పెట్టాలి. పెడమార్గంలో ప్రసరించటానికి ప్రారంభిస్తే ఇక దాన్ని ఆపుకోవటం కష్టం. ఆలోచనల్ని సద్వినియోగం చెయ్ రంగా...."
"ఏం చేయమంటారు బావా?"
ఆ బావ ఏం జవాబు చెప్పగలడు?
"ఏనాడో చూసిన విరిగిన గులాబీరేకు ముళ్ళే కంటికి కనిపించకున్నా మనసుకు కనిపించి గుండె నీరైతే దాన్ని ఆనాడు మాటలలో చెప్పలేకపోయానని, ఇప్పుడు చెబుదామంటే ఆలోచన అందినా అక్షరాలు అందడంలేదు. పెన్ పట్టుకుని రాద్దామంటే రాసిన లైన్ మీదే రాస్తానేమోనని భయం. పైగా మనసు పరిగెత్తినంత వేగంగా చేయి పరుగెత్తదు.... నాకు ఎవరు రాసిపెడతారు చెప్పండి...."
"అదేం మీ విరజక్కయ్య లేదా!"
"నిజం! మరిచిపోయాను బావా! ఆ విషయం అడగటానికే ఇప్పుడు వచ్చాను. ఆవిడ రావటంలేదు యెందుకని? ఈ రోజయినా చెప్పి పంపరా బావా? సూర్యోదయం లేకుంటే విరజ కనిపించదు. మా విరజక్కయ్య లేకుంటే నా మనసూ వికసించదు బావా!"
"సరే...."
అంతకంటే అతనేమీ అనలేకపోయాడు.
* * * *
తల వంచుకుని వచ్చి కూర్చుంది. ఆమె ముఖం మ్లానంగా వుండి. నిర్విణ్నుడవుతూ పిలిచాడు వేణు.