Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 27

 

    ఆ మూడు అక్షరాలూ అతనికి క్షణంలో త్రిమూర్త్యాత్మక మయిన పరబ్రహ్మం ప్రత్యక్షమై వరాలు యిచ్చినట్టుగా కనిపించి "హమ్మయ్య' అని సంతోషంగా నిట్టూర్చాడు.
    ఇహ ఆ తర్వాత మరో ఆలోచనకి తావివ్వకుండా గబగబా తన సూట్ కేస్ లో ఓ నాలుగు జతల బట్టలు సర్దుకున్నాడు.
    శుభ్రంగా తల దువ్వుకుని నీట్ గా తయారయ్యాడు. ఇల్లంతా నింపాదిగా తిరిగి తలుపులన్నీ భద్రంగా వేసేసి చివరికి వెంకటేశ్వరుడికి నమస్కరించి సూట్ కేను తీసుకుని బయటికి వచ్చి ఇంటికి గెట్ కి తాళం వేసి గేట్ వద్ద అలాగే కొంతసేపు నిలుచున్నాడు.
    రిక్షాలో పోదామనిపించింది. కానీ అనందం అతన్ని నడిచి పోదామంది. ఉషారుగా ఒక్కో అడుగు నూతనోత్సాహంతో వేసుకుంటూ కోస్తా అంతా గెలిచినట్టు నడవసాగాడు.
    దార్లో ఓ షాపులో శ్రీదేవికి ఓ టెర్లిన్ చీరా జాకెట్ క్లాత్ కొన్నాడు. బస్టాండ్ వద్ద రెడీమేడ్ షాపుల్లో పిల్లలిద్దరికి చేరోజత కొన్నాడు. బస్టాండ్ చేరి బస్సులో సూట్ కేస్ పడేసి టికెట్ తీసుకుని కండక్టర్ కి చెప్పి స్వీట్ స్టాల్ కి వచ్చి ఓ కేజీ మిటాయ్, రెండొందల గ్రామ్స్ జీడిపప్పు తీసుకుని వెళ్ళి బస్సులో కూర్చున్నాడు.
    కూర్చున్నాక అనుకున్నాడు.
    "ఇక ఎంత.....అంతా ఓ రెండు గంటల ప్రయాణం. బస్సులో.....తర్వాత జెట్ లో ఓ అరగంట....అంతే ......తర్వాత......శ్రీదేవి.......
    శ్రీదేవి.......బాబు.....చిన్నవాడు-మామగారు-........అత్తగారు.....బామ్మగారు.......వాళ్ళ చూపులు......వాళ్ళ మాటలు........."
    ఇహ అతనికి తర్వాత ఆలోచించ బుద్ది పుట్టలేదు. ఏమైన కానీ వెళ్లి తీరాలి.
    ఇది లైఫ్.........
    ఇది వైఫ్.......
    దీనిలో ఎవరో ఒకరు రాజీ పడాలి! నిగ్గదీసి నీలిగి కూచుంటే లాభం లేదు.......
    అంతలో బస్సు కదిలింది.
    అప్పుడు గుర్తుకి వచ్చిందతనికి......సరోజ.......
    ప్చ్.....ఇప్పుడనుకుని ఏం లాభం?
    తర్వాత చల్లగాలికి అతని కళ్ళు మూసుకుపోసాగాయ్.

                                                           15
    గడపలో అడుగు పెట్టబోతూ వుండగా అతని మనసులో ఓ విధమయిన సంకోచం బయల్దేరింది.
    ఊరికి వచ్చి వూరి ముందట సంకోచించినట్టుగా వుందనుకుంటు గడపదాటి హాల్లోకి వెళ్ళాడు. అంతవరకూ ఎవరూ అతనికి ఎదురుగా రాలేదు. అది ఓ విధంగా బావుందనుకుంటూనే ఆశ్చర్యపోయాడు.
    హల్లో బెంచిపై సూట్ కేస్ ని పెట్టేసి కుర్చీలో కుర్చ్జో బోతుండగా సరోజ అటుగా వచ్చి అతన్ని చూసి సగం ఆశ్చర్యం, సగం సంభ్రమంతో అంది "బావా!"
    కుర్చోబోతున్న వాడల్లా ఆగి అతను ఆశ్చర్యపోతూ అడిగాడు "నువ్వెప్పుడోచ్చావ్ సరోజా!"
    పకపక నవ్వి "సరి! మాయింట్లో నన్నే కుశల ప్రశ్నలు వేశావ్ గానీ తమరెప్పుడుదయచేశారు?"
    తనూ నవ్వి అన్నాడు "చూస్తున్నావ్ గా యిప్పుడే"
    "అయితే ఓ క్షణం ఆగండి. కాళ్లు కడుక్కునెందుకు నీళ్ళు తెస్తాను."
    రివ్వున బాణం దూసినట్టుగా పరిగెత్తిపోయింది.
    ఎవరో మాటాడుతున్నట్టుగా వినిపించి కొట్టు గది ముందు మంచం వేసుకుని పడుకున్న బామ్మగారు "ఎవరే" అని చిన్న సైజు గావు కేక పెట్టింది.
    అతని చేతికి నీళ్ళు అందిస్తూ బామ్మగారి కేకకి సుమారు అదే స్థాయిలో జవాబిచ్చింది సరోజ "మాధవ్ బావవచ్చారు బామ్మా"
    ఆ కేక వినిపించవలసిన వాళ్ళందరికీ వినిపించాలనే సరోజ ఉద్దేశం. అది ఫలించింది కూడా!
    అలాగే ఆయాసపడుతూ వచ్చేసి ఓ స్తంబానికి అనుకుని కూలబడుతూ అంది బామ్మ "ఏం మాధవా! ఇప్పుడేనారావటం?"
    కాళ్లు కడుక్కుని వచ్చిన సరోజ చేతికందించిన టవల్ తో ముఖం కాళ్లు తుడుచుకుంటూ "ఇప్పుడే మామ్మగారు " అన్నాడు ముక్తసరిగా.
    అప్పుడే వచ్చిన అత్తగారూ భుజం నిండుగా పైట కప్పుకుంటు ప్రశ్నించింది. "కులాసానా బాబూ?"
    తలెత్తి చూసి "కులాసేనండి" అన్నాడు.
    "ఏం నాయనా, ఇప్పటికి రావాలనిపించిందా?" సమయం చూసుకుని బామ్మగారు వదిలించి బాణం.
    ఇలాటి దేప్పులకి అన్నీ సిద్దమై వచ్చిన వాడిలా అమెగారి ప్రశ్నకి తనేమి అనలేదు.
    "నీవు వూరుకో బామ్మా"
    మనవరాలి గద్దింపుకి మండిపడుతూ "ఏమిటి సరోజా వూరుకోవటం? అమ్మాయ్ ప్రసవించిందని జాబు వ్రాస్తే ఒకటికి రెంటికి కూడా జవాబులేదు. నామ కరణానికి రమ్మని మళ్ళీ వ్రాస్తే అందుకీ సమాధానం లేదు రాలేదు. ఇప్పుడు ఈ రోజుకి కొడుకుని చూడాలని దిగబడితే నాకెలా వుంటుంది? ఒళ్ళు మండదూ. ఆ కోపంతో ఏదో పెద్దదాన్ని ఓ మాట దండించరాదటే?"
    "పోనీ లేండత్తయ్యా" అతని అత్తగారు యింకా ఏదో అనబోయింది.
    "నీవు వెళ్ళి  వంటపనిచూడు......పో"
    అత్తగారి అజ్ఞాని పాలించిదామె, ఇన్నేళ్ళు వచ్చినా, ఇన్నేళ్ళు కాపురం చేసినా కూతుళ్ళు ప్రాజ్ఞులైనా ఇంకా ఆవిడకి కోడరికం తప్పలేదు.
    "కాదు మాధవా! ఆఖరికి పెద్దబ్బాయికి ఏదో కాస్త సుస్తి చేసి నిన్ను చూడాలని అంటున్నాడని వ్రాసినా నీవు రాకపోయావేమయ్యా? జవాబు కూడా రాయలేదెందుకని?"
    అతడు దానికి జవాబు యివలేదు.
    నోరు నొక్కుకుంటు విస్తుబోతుఅంది. మళ్లీ "ఏమిటో ఈకాలం పిల్లలే అతి చిత్రమయిన మనుషులు. ఏదో యిష్టం వచ్చినట్టు చేసేయ్యటం. ఏదయినా దండిస్తే మౌనంగా వుండటం, అంతా చిత్రం!"
    "నీకు చిత్రంగానే వుంటుందిలే బామ్మా"

 Previous Page Next Page