"నేను ఎట్లా వస్తాను హరీన్? ఎక్కడికి వస్తాను?"
"నాతొ కలిసివస్తావు నాయకా! నిన్ను అంతం చెయ్యాలని చూస్తున్న వాళ్ళకి దూరంగా వెళ్ళిపోదాం మనం?"
సంతోషం లేకుండా నవ్వాడు నాయకుడు.
"అది సాధ్యం కాదు హరీన్!"
"ఎందువల్ల?"
"వెళ్ళందరికి నాయకుడిని నేను. వీళ్ళకి తప్పొప్పులు చెప్పవలసినవాడిని. న్యాయమేమితో, ధర్మమేమిటో వివరించి చెప్పవలసినవాడిని నామీద జరిపించబడిన ఒక తప్పు నుంచి తప్పించుకోవడానికి మరో తప్పు ఎలా చేస్తాను హరీన్! ఒకవేళ నావాళ్ళు ఏదో మాయలోపడి నాకు శిక్ష విధించినా, ఆత్మ బలిదానం చేసి వీరికి మార్గదర్శకుడిని కావలసిన వాడిని. చావుకి వెరచి నేనే వెన్నుచూపి పారిపోతే ఇంక ధర్మం ఎలా నిలబడుతుంది హరీన్! నీ అభిమానాన్ని మాత్రమే నా మనసులో దాచుకుంటాను. కానీ నాకు మాత్రం చావైనా బతుకైనా నా వాళ్ళతోనే. శుభంగా వెళ్ళు నాయనా!"
హరీన్ కళ్ళు చెమర్చాయి.
ఆనాగరికుడైనా ఈ మనిషిలో ఎంతటి ఔన్యత్యం వుంది.
ఆ తర్వాత నాయకుడి ఆశీర్వచనాలు అందుకుని అటూ ఇటూ ఒకసారి చూసి, కరుణ వున్న గుడిసెవైపు సాగిపోయాడు హరీన్.
22
విశ్వనాధం ఇంట్లో -
తన గదిలో పాలరాతి నీలమీదే దిగాలుపడి కూర్చుని వుంది వరలక్ష్మి. జరిగిపోయింది ఏమిటో ఆమెకు చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. ఆరోజున అయన మొదలు నరికిన చెట్టులా విరుచుకుపడిపోయారు.
అప్పుడు ప్రియంవద అక్కడే వుంది. డాక్టరు కూడా వచ్చారు.
కానీ ఆతర్వాత ఏమయిందో తనకి తెలియదు. ఆరాటంతో మతి స్థిమితం లేకుండా పోతోంది తనకి.
ఎక్కడున్నారు అయన? ఇంట్లోనే వున్నారా? లేక ఆయన్ని హాస్పిటల్లో చేర్చారా? చేరిస్తే ఏ హాస్పిటల్లో చేర్చి వుంటారు?
ఆయనని కనిపెట్టి వుండటానికి ప్రియంవద వుంది కదా? ఇంక తనకేందుకీ ఆరాటం?
అయినా మనసు సరిపెట్టుకోలేకపోయింది వరలక్ష్మి. ఆమెకి తెలుసు - ప్రియంవద అయన పక్కన వుంది కాబట్టే తనకి ఈ ఆరాటం అని.
ప్రియంవద అయన ప్రాణాలతో చెలగాటం ఆడుతుందేమోనని! అలా కలవరపడుతూ కూర్చున్న వరలక్ష్మికి కిందనుంచి గలగల నవ్వులు వినబడ్డాయి.
లేని ఓపిక తెచ్చుకుని, బాల్కనీ దగ్గరికి నడిచి తొంగి చూసింది వరలక్ష్మి.
ఇంటి వెనకవైపున వున్న సర్వెంట్స్ క్వార్టర్స్ దగ్గర చేరి మాట్లాడుకుంటున్నారు ఆ ఇంటి నౌకర్లు.
"మన దొరసానమ్మ భలే తెలివైనదిరోయ్!" అంటున్నాడు తోటమాలి.
"ఏ దొరసానమ్మ?" అన్నాడు వంటవాడు.
"నీ మొహం! ఏ దొరసనమ్మా అంటావేమిటి? ఈ ఇంట్లో వున్నది ఒకే దొరసానమ్మ. దొరగారి చిన్నపెళ్ళాం. పెద్దావిడ పాపం మన పనిమనిషి కంటే హీనంగా బతుకుతోంది గదా?"
"అవునవును........ఇంతకీ దొరసానమ్మ తెలివి సంగతేమిటి?"
"దొరని ఆస్పత్రిలో చేర్చింది. అస్పత్రికేమో వకీలునీ తీసుకెళ్ళింది. ఇంటికేమో డాక్టర్ని తెచ్చుకుంటుంది. అయన జబ్బు మంచం దగ్గరికి వకీలూ, తన పడక మంచం దగ్గరికి డాక్టరునూ. చిత్రంగా లేదూ?"
అందరూ నవ్వారు.
"ఇంతకీ ముసలాయన ఉంటాడా........ఉడతాడా?" అంది పనిమనిషి.
"ఆ విషయం చిలక జ్యోతిష్యం అడగాల్సిందే! ఆ సంగతి చిలకే సరిగ్గా చెప్పగలదు' అన్నాడు తోటమాలి. "చిలక" అన్న పదాన్ని నొక్కి పలుకుతూ.
మళ్ళీ నవ్వులు.
సీసం కరగించి చెవుల్లో పోస్తున్నంత బాధ కలిగింది వరలక్ష్మికి - ఆ మాటలు వింటుంటే.
ఎంత చెడ్డా అయన తన భర్త. అయన ఉప్పుతిని బతుకుతున్న వీళ్ళు ఆయన్ని గురించి ఎంత చులకనగా మాట్లాడుకుంటున్నారు.
ఆస్పత్రిలో అయన ఎలా వున్నారో? ప్రియంవద ఏమేం పన్నాగాలు పన్నుతోందో?
ఒక్కసారి తను వెళ్ళి చూసిరాగలిగితే?
వికలమైన మనసుతో మేడమెట్ల దగ్గరికి వచ్చింది వరలక్ష్మి.
మెట్ల దగ్గరకు వచ్చీ రాగానే ఆమెకి కనబడ్డాయి.
ఒక్కొక్క మెట్టు మీదా ఒక్కొక్క కాలభైరవుడి విగ్రహంలా కూర్చుని వున్న కుక్కలు?
ఎన్నో జాతుల జాగిలాలు అవి!
ఒక అల్ఫేషియన్, ఒక డాష్ హవుండ్ ఒక కూలీ, ఒక డాబర్ మాన్, ఒక గ్రేహ వుండ్, ఒక పెకింగీన్........
రకానికొకటి చొప్పున వున్నాయి అవి.
అవన్నీ ప్రియంవద పెంపుడు కుక్కలు.
పోలీసు కుక్కలకంటే తీక్షణమైన శిక్షణ ఇవ్వబడింది వాటికి. వరలక్ష్మిని చూడగానే బద్దవిరోధిని చూసినట్లు భౌ భౌ మని గుండెలవిసేలా మొరుగుతూ మీదికి ఉరికాయి కుక్కలన్నీ ఒక్కుమ్మడిగా.
శిలా విగ్రహంలా నిలబడి పోయింది వరలక్ష్మి.
ఆమె కాలు ముందుకి కదిపితే , కండలు పీకేసేలా వున్నాయి ఆ కుక్కలు.
అప్పుడు గుర్తొచ్చాడు ఆమెకి హరీన్.
హరీన్ గనక ఇప్పుడు ఇక్కడ ఉండి వుంటే ఎలా వుండేవి పరిస్థితులు?
అన్నిటికీ నేనున్నానని నిలబడేవాడు హరీన్.
ఆమె గుండె గొంతుకలో కొట్టాడినట్లయింది. కన్నకొడుకుని కళ్ళారా చూసుకోలేకపోతోంది తను. ఆస్పత్రిలో ఉన్న భర్తని ఒక్కసారి చూసి రాలేకపోతోంది.
ఏం బతుకు ఇది.
హరీన్ .........తన హరీన్ -
ఎన్ని సినిమాలలో ఎంతమందికి కొడుకుగా నటించాడో! ఎంత మందిచేత ఆదరంగా 'నాయనా' అని పిలిపించుకున్నాడో! ఎంతమందిని అభిమానంగా 'అమ్మా' అని పిలుస్తున్నాడో!
అంతమందికి పట్టిన ఆ అదృష్టం కన్నతల్లి అయిన తనకు లభించకపోవడం -
దురదృష్టంకాక మరేమిటి?
ఆమె మాతృహృదయం రోదించింది.
"హరీన్.........నా తండ్రి! ఎక్కడున్నావు నాయనా?"
* * *
అక్కడ - ఆ మహానగరంలో.
ఒకానొక స్టుడియోలోని ప్రొజెక్షన్ రూంలో ఏకాంతాన్ని వెదుక్కుంటూ నిస్తేజంగా కూర్చుని వున్న మధుమతి మదిలో కూడా సరిగ్గా అదే ఆలోచన మెదులుతోంది.