ఒక్కోసారి చూసినప్పుడల్లా ఒక్కొక్క రకమైన అందం కనబడింది తనకి జానకిలో.
తనని మొదటగా ఆకర్షించింది ఆమె చిరునవ్వు.
ఆ తర్వాత రెండు మూడుసార్లు ఆమె వైపు చూశాక ఇంకోటి అనిపించింది.
ఆ పార్టీలో తెల్లటి మనుషులు చాలామంది ఉన్నారు.
కానీ పాలిపోయినట్లుండే ఆ తెలుపుకంటే కాడ్ బరీస్ చాక్లెట్ గుర్తు తెచ్చే జానకి వంటి ఛాయే ఎంతో సెక్సీగా వుంటుందనిపించింది అతనికి.
మరోసారి చూసినప్పుడు ఆమె పర్సనాలిటీ, ఎత్తయిన వక్షం -
ఇంకోసారి చూసినప్పుడు ఆమె చీర కట్టిన తీరు -
ఒకసారి విన్నప్పుడు చిన్న చిన్న వెండి గంటలు మోగుతున్నట్లు భ్రమ కలగజేస్తున్న ఆమె మృదువయిన కంఠస్వరం-
మొత్తంమీద పార్టీ ముగిసేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాంపేన్ తో మత్తెక్కిపోతే, తను మాత్రం జానకి అందంతో మైమరచి పోయాడు.
ఆ పార్టీలోనే తెలిసింది తనకి.
జానకి రఘునందన్ భార్య అని.
రఘునందన్ కి ఒక చిన్న ఇండస్ట్రీ వుంది.
తనతో పోల్చి చూస్తే అన్ని విషయాల్లో అతను బచ్చాగాడు! అంతే!
అలాంటి రఘునందన్ కి అంత అందమయిన పెళ్ళామా?
వ్యాపారం లంపటంలో పడిపోయి, తను పెళ్ళి చేసుకోలేదు ఇన్నాళ్ళూ!
ఇన్నాళ్ళకి, ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలనిపిస్తోంది తనకి!
ఈ జానకి చూశాక!
కానీ ఏం లాభం?
తనకి అంతగా నచ్చిన ఈ జానకికి ఇప్పటికే పెళ్ళయిపోయింది. తన గుండె ఉండాల్సిన చోట పెద్ద కంత ఏర్పడిపోయినట్లనిపించింది.
ఎలా? ఏం చెయ్యడం?
కావాలనుకున్నది తక్షణం స్వంతం చేసుకోవడం తనకి పుట్టుకతోనే వచ్చిన స్వభావం!
అనుకున్నది సాధించుకోవడం కోసం ఎంతయినా తెగించడం తన పద్దతి!
కానీ ఆ పద్దతులు ఈ ప్రేమ వ్యవహారంలో పనికి వస్తాయా?
అందులో ఒక వివాహిత స్త్రీతో ప్రేమ విషయంలో?
అందులోనూ వన్ సైడెడ్ లవ్ అయినప్పుడు?
మరో స్త్రీ మరో స్త్రీ అయితే మొగుణ్ణి వదిలేసి వచ్చి తనని పెళ్ళి చేసుకునేదేమో కూడా? తను ఇష్టపడుతున్నానని తెలిస్తే!
కానీ జానకి అలాంటి స్త్రీకాదు. అందరిలాంటి ఆడది కాదు.
అందుకే ఈ ఆకర్షణ! అందుకే ఈ కష్టం!
ఆ రోజునుంచే ఆ విషయం తప్ప మరో విషయం, ఆలోచించడం మానేశాడు తను.
తెలియకుండానే మద్యం ఎక్కువ తాగేస్తున్నాడని కూడా తెలిసింది. తనకి ఒక రోజున జానకి ఏ పార్టీకి హాజరయ్యే అవకాశం వుంటే తనూ తప్పనిసరిగా ఆ పార్టీకి హాజరవుతున్నాడనికూడా అర్ధమయింది కొన్నాళ్ళకి.
ఒక టీనేజ్ కుర్రాడిలా తను ఇంత తీవ్రమయిన ప్రేమలో పడిపోవడం అసహనాన్నీ, తనమీద తనకే కోపాన్ని కలిగించింది కూడా!
కానీ ఏం చెయ్యడం?
వాట్ టూడూ?
వ్యాపారం కోసం తను ఇంత డిసిప్లిన్ లో ఉంచుకున్న మనసే తన మాట వినకుండా పోతోంది ఈ విషయంలో!
వాట్ ది హెల్ టూ డూ?
జానకిని తను మొదటిసారిగా చూసిన తర్వాత మూడు నెలలకి ఇంకో పార్టీలో ఎప్పుడూ తన వైపు కన్నెత్తి చూడని జానకి తన వైపు చూసి చిరునవ్వు నవ్వినట్లు భ్రాంతి కలిగింది. తన కళ్ళని తనే నమ్మలేక పోయాడు.
అయిదు నిమిషాల తర్వాత మళ్ళీ తను ఆమె వైపు చూసేసరికి ఆమె కూడా ఓరగా తనవైపే చూస్తోంది. ఆమె పెదిమల మీద వజ్రాల మెరుపులా చిరునవ్వు!
భ్రాంతికాదు! నిజమే!
ఆ తర్వాత ఆమె నెమ్మదిగా బాల్కనీలోకి వెళ్ళి చంద్రుణ్ణి చూస్తూ వుండడం గమనించి తను కూడా మెల్లగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఇంకెవరూ లేరు.
"వెన్నెల ఎంత వేడిగా వుందో!" అన్నాడు చిరునవ్వు నవ్వాలని ప్రయత్నం చేస్తూ కానీ ఆ మాటలు అంటున్నప్పుడు చాలా ఆక్ వర్డ్ గా ఫీలయ్యాడు తను. గొంతు బొంగురుగా వచ్చింది.
తన బాధని అర్ధం చేసుకుంటున్నట్లు ఆర్ద్రంగా చూసింది జానకి.
తర్వాత నెమ్మదిగా అంది -
వెండి గంట మ్రోగుతున్నట్టు మృదువైన స్వరంతో, "ఒక ప్రార్ధన మన్నిస్తారా మీరు?"
"భూగోళాన్ని మడిచి మీ హ్యాండ్ బాగ్ లో పెట్టెయ్యమన్నా పెట్టేస్తాను. జస్ట్ ఆర్డర్ మీ!" అన్నాడు ఉద్వేగంగా.
చిన్నగా నవ్వింది జానకి.
"అంత పెద్దవని కాదు. దయచేసి మీరు నావైపే చూడడం, నా కోసమే వస్తున్నట్లు నేనే పార్టీకి వెళితే అక్కడికి రావడం మానెయ్యండి. ప్లీజ్! నాకు చాలా ఎంబ్రాసింగ్ గా వుంటుంది. నిజానికి మన మధ్య ఏమీ లేదు కదా! కానీ మీరు అలా ప్రవర్తిస్తే అందరూ నన్ను అనుమానిస్తారు. నా భర్తకి కూడా అలాంటి అనుమానం వచ్చిందంటే నా కాపురం చెడిపోతుంది.
ఆమె మాటలు వినగానే బిగుసుకుపోయాడు తను.
ఆమె ఇంకేదో చెబుతుందని ఆశించాడు తను.
మళ్ళీ మృదువుగా అంది జానకి.
"మీరు కావాలంటే నాకంటే అందగత్తెలు, నాకంటే ఎక్కువ స్థాయిలో వున్న వాళ్ళు దొరుకుతారు. నేను చాలా మామూలు స్త్రీని. నా కోసం మీరు బాధపడడం అనవసరం!"
"అని నువ్వనుకుంటున్నావు." అన్నాడు తను అసహనంగా.
"కాదు అది నిజం! మీరు టెంపరరీ ఇన్ ఫాచ్యుయేషన్ లో ఉన్నారు. తాత్కాలికమైన ఆకర్షణవల్ల కలిగే మత్తు. నామీద మీకు ఇంత ఇష్టం ఎల్లకాలం వుండదు."
అంత బాధించే మాటలు పలుకుతున్న ఆమె పెదాలని తన పెదాలతో మూసెయ్యాలని తీవ్రంగా అనిపించింది. "నీమీద ఇష్టం నా చివరి శ్వాస ఉన్నంతవరకూ పోదు" అని ప్రపంచమంతా వినేంత గట్టిగా అరిచి చెప్పాలనిపించింది.
అంతలోనే త్వరత్వరగా అంది జానకి.
"మా ఆయన వచ్చేస్తున్నారు. నేను వెళ్ళిపోతున్నాను. దయచేసి నా అభ్యర్ధన మన్నించండి. నన్ను నామానాన బ్రతకనివ్వండి ప్లీజ్!"
తెగించి అడిగేశాడు తను.
"జానకీ! నీకోసం నేను ఎంత తాపత్రయ పడుతున్నానో నీకు అర్ధమయే వుంటుంది. కానీ నేను నీకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఇవ్వలేదని బహుశా నీకు తెలిసి ఉండకపోవచ్చు. నాకు మాత్రం బాగా తెలుసు! జానకీ! వెళ్ళిపోయే ముందు ఒక్కమాట చెప్పు! నీకోసం ఇంత తపించిపోయే నేనంటే నీకేమీ స్పందన లేదా?" దీనాతిదీనంగా వినబడింది తన గొంతు తనకే!
నిట్టూర్చింది జానకి. "పెళ్ళయిపోయిన ఆడడానికి ఏ స్పందన వుంటే మాత్రం ఏమి లాభం!" అని అంతలోనే పెదిమలకు చిరునవ్వు అతికించుకుని, అటువైపే వస్తున్న తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది.
భరించలేనంత సంతోషమా, సహించలేనంత దుఃఖమూ రెండూ ఒకేసారి కలిగాయి తనకి.
"నువ్వంటే నాకు ప్రేమ" అని పరోక్షంగా చెప్పింది జానకి.
కానీ జానకి అన్నట్లు ఎంత ప్రేమ వున్నా ఏ లాభం? ప్రేయసి వివాహిత అయినప్పుడు?
అప్పుడు వచ్చింది తనకి ఆ ఆలోచన!