Previous Page Next Page 
భామ కలాపం పేజి 28

 

    కారు ఎయిర్ పోర్టు ముందు ఆగింది. ఇద్దరూ కిందికి దిగారు. వినయంగా సలాం చేసి కారు తీసుకుని వెళ్ళిపోయాడు డ్రైవర్.

 

    స్మార్ట్ గా వున్న సూటులో ఇబ్బందిగా ఫీలవుతున్నాడు భరత్. సెక్యురిటి చెక్ లోకి వెళ్ళబోతూ , సంకోచంగా ఆగాడు.

 

    "సుదీరా!"

 

    "చెప్పండి డార్లింగ్!"

 

    "ఒకమాట చెబితే నువ్వేమి అనుకోవు కదా!"

 

    "సందేహంగా చూసింది సుదీర.

 

    "ఏమిటి?"

 

    "హనీమూన్ కి ఇప్పుడే వెళ్ళొద్దు మనం."

 

    సుదీర మొహంలో వెంటనే రోషం కనబడింది. "ఇప్పుడు కాక ఇంకెప్పుడు?" అంది పదునుగా.

 

    "రెండు మూడు నెలల తర్వాత అయితే బాగుంటుంది సుదీరా!"

 

    "దొంగలు పడిన తర్వాత ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లా! చాలా బాగుంటుంది! పెళ్ళి సంగతి అందరూ మర్చిపోయాక మనం హనీమూన్ వెళతామా? బిగ్ జోక్!"

 

    "దయాకర్ చావు నన్ను మానసికంగా చంపేసింది సుదీరా! కనీసం ఓ మూడు నేలలన్నా గడిస్తే గానీ కాస్త తేరుకోలేనేమో! దానికి తోడు నాన్నగారి ఆరోగ్యం కూడా బాగాలేదు."

 

    "మీది మరి సుతి మెత్తటి మనసు! ఇక్కడే వుంటే జరిగిన విషయాలన్నీ మాటిమాటికి గుర్తొచ్చి చికాగ్గా ఉంటుంది. మీ మనసు కుదుటబడాలంటే దేశమంతా తిరిగి హాయిగా ఎన్ జాయ్ చెయ్యాలి మనం. మీ నాన్నగారికి మన డాక్టర్ అంకుల్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు కదా! ఇంక భయమేమిటి? ఆయనకంటే ఎక్స్ పర్టు ఎవరున్నారు ఈ ఉళ్ళో?"


    "సుదీరా-"


    "మీరు నా చేత బతిమాలించుకోవాలని బెట్టుచేస్తున్నారు. అవునా? ఆడపిల్లను ఇలా ఏడిపించడం మీకు న్యాయమేనా చెప్పండి" అంది చిరునవ్వుతో.

 

    సుదీరను, భరత్ ని ఫార్మాలిటిస్ పూర్తీ చేసుకుని విమానం ఎక్కమని విజ్ఞప్తి వినబడింది పబ్లిక్ అడ్రెస్ సిస్టం లో.

 

    "ప్లయిట్ టికెట్స్, హొటల్ రిజర్వేషన్స్ ఇవన్ని అయిపోయాక, ఇప్పుడు మనం చేతులుపుకుంటూ ఇంటికి వెళ్ళిపోతే అసహ్యంగా వుండదు? మీరు వర్రీ కావద్దు! ఐ విల్ మేక్ యూ అల్ రైట్! రండి!" అంది చొరవగా చెయ్యి పట్టుకుంటూ.


    మరికొద్ది నిమిషాల తర్వాత విమానం బెంగుళూరు వైపు దూసుకుపోవడం మొదలెట్టింది.

 

    నీలగిరి కొండల్లో వుంది ఉటీ. ఎయిర్ కండిషన్డ్ టవర్ లా వుంటుంది ఈ ఊరు. హొటల్ రూములో నుంచి చూస్తే, ఒక మేఘం కిటికీ లెవల్లోనే మెల్లిగా తేలుతూ వస్తున్నట్లు కనబడుతుంది. అయితే బాగా దగ్గరకి వచ్చేశాక ఇంక కనబడదు. రోడ్డు మీద స్నేహితులు కర స్పర్శ చేసి ఆలింగనం చేసుకున్నట్లు తాకుతూ పోతాయి. మేఘాలు కంటికి కనబడకుండానే!


    బెంగుళూరు నుంచి ఉటీ వెళ్ళే బస్సు ఎక్కి ఎక్కగానే హనీమూన్ వాతావరణం సగం వచ్చేసినట్లు కనబడుతుంది. ప్రయాణికులలో ఎక్కువ భాగం కొత్తగా పెళ్ళయిన జంటలే ఉంటారు. భర్త దగ్గర అప్పుడప్పుడే సిగ్గు తెరలు వీడుతుండగా, మెడలో కొత్త మంగళసూత్రాలూ, వంటిమీద కొత్త చీరలతో మెరిసిపోయే అమ్మాయిలు, వాళ్ళని అనుకుని హీరోల్ల్లా కూర్చుని వున్న అబ్బాయిలూ, బస్సు పయనించే దొవంతా ఎటు చూసినా పచ్చటి చెట్లు.

 

    చాలా రొమాంటిక్ గా వుంటుంది అక్కడి వాతావరణం. మన్మధుడు ఆ ఉరికి మునిసిపల్ చైర్మన్ ఏమో అనిపించేటట్లు.


    హొటల్లో దిగగానే వేడినీళ్ళ స్నానం చేసి, హీటర్ అమర్చిన డైనింగ్ హాల్లో కూర్చుని వెచ్చగా భోజనం చేశారు.

 

    భోజనం చేసి గదిలోకి రాగానే పళ్ళు బ్రష్ చేసుకోవడం మొదలెట్టింది సుదీర. పూర్తయ్యాక అద్దంలో నుంచి భరత్ ని చూసింది. అతను మంచం మీద కళ్ళు మూసుకుని ఉన్నాడు.


    "ఒకసారి కళ్ళు మూసుకోండి ప్లీజ్!" అంది సుదీర. అంటే కళ్ళు తెరవమని అర్ధం.

 

    "ఎందుకు?"

 

    గులాబిమొగ్గలా వున్న నాలుక బయట పెట్టి వెక్కిరించింది సుదీర.

 

    ఇంకా కళ్ళు మూసుకునే వున్న భరత్ కి అది కనిపించలేదు.

 

    "ఎందుకేమిటి? ఆడపిల్లలు బట్టలు మార్చుకుంటున్నప్పుడు మగవాళ్ళు చూడకూడదు" అంది పమిటని పెదిమలతో పట్టుకుని. జాకెట్ హుక్సు విప్పబోతూ, పమిట జారిపోకుండా భుజం దగ్గర జాకెట్ కి పెట్టిన పిన్ను వంకరపోయి, తియ్యడానికి రావడం లేదు. చీర, పిన్ను తాలూకు మెలికలో చిక్కుకు పోయింది.

 

    "ప్లీజ్! మీరు కొంచెం సాయం చెయ్యాలి. గట్టిగా లాగితే చిరిగిపోతుందేమో! కొత్త చీర!" అంది సుదీర.

 

    భరత్ లేచాడు.

 

    ఓరకంటితో అతన్ని చూసింది సుదీర. ఆరడుగుల రెండంగుళాల పొడుగు ఉంటాడు అతను. అతని నడకే నృత్యంలా వుంటుంది. నడకే కాదు, అతను ఏ పని చేసినా నృత్యభంగిమలాగే వుంటుంది.

 

    ఆ రోజు, గార్డెన్ లో కూడా - అతనితో తను ఏకమై పోతుంటే అతని కదలికలు మన్మధుడు నృత్యం చేస్తున్నట్లే అనిపించాయి.

 

    అది గుర్తు రాగానే సుదీర ఉపిరి బరువయింది.

 

    దగ్గరగా వచ్చాడు భరత్. సంకోచిస్తూ జాకెట్టుని, పమిటని కలిపి పట్టేసుకున్న పిన్నుని తియ్యడానికి ప్రయత్నించాడు.


    రాలేదు.

 

    "పోన్లెండి! జాకేట్టే విప్పెస్తాను." అంటూ జాకెట్ విప్పేసింది సుదీర. బ్రా దానిని అనుసరించింది.

 

    ఆ అమ్మాయి బంగారపు రంగులో వుంటుంది అని తేలిగ్గా వర్ణించేస్తారు. కానీ, నిజమైన రంగుబట్టలు పూర్తిగా వేసుకుని వున్నప్పుడు తెలియదు. నగ్నంగా ఉన్నప్పుడు గానీ శరీరపు రంగులోని అతి సున్నితమైన ఛాయలు, వాటి తేడాలు అర్ధం కావు.

 

     సూర్యుడు చూసే భాగాలు మరో చాయలో వుంటాయి.

 

    సుదీర అసలే తెలుపు. అందులోను చలిదేశంలో పెరిగి వచ్చింది. గులాబి రంగులో వుంటాయి ఆమె చెంపలు. జాకెట్టు వేసుకున్నంత మెరా చాలా తెల్లగా ఉంది శరీరం. దానికి కాంట్రాస్టులా కొన్ని చోట్ల చీకటిలాంటి నలుపు, మోకాళ్ళ దగ్గరా, మోచేతుల దగ్గరా ముదురు గోధుమరంగు. కొన్ని చోట్ల పోక చెక్క రంగులో వుంది. మరి కొన్ని చోట్ల నిగనిగలాడే ఎర్రటి ఎరుపు.

 

    ప్రకృతి కన్యను పోలి వుంది సుదీర. మహోన్నతశిఖరాలూ, అంతు తెలియని లోయలు, పరిశిదించబడని చిక్కటి అడవులూ, ఇసుక తిన్నెలు, బిలాలు, మైదానాలు.

 

    ఆమె అందం చూసేవాళ్ళకి ఉన్మాదం రేకెత్తించేలా వుంది.

 

    కానీ, భరత్ కి అలాంటి ఆలోచనే రాలేదు.

 

    సుదీరని చూస్తుంటే దయాకరే గుర్తు వస్తున్నాడు. ఇంటికి నాలుగు మూలలా నాలుగు ఖండాలుగా పడి వున్న దయాకర్.

 

    సుదీర అతన్ని అల్లుకుపోయి , పెదిమలు అందించడానికి మునికాళ్ళ మీద నిలబడింది.

 

    ఆ భంగిమ, కాటందుకోవడానికి పడగ ఎత్తుతున్న తాచులా కనబడింది భరత్ కి.

 

    ఆ ప్రయత్నంగా వెనక్కి అడుగు వేశాడు.

 

    "నన్నెందుకిలా పనిష్ చేస్తున్నారు?" అంది సుదీర మొహమాటంగా నవ్వుతూ. "నేనే నోరుతెరచి అడగాలని పంతమా?"

 

    భరత్ మొహనికంతా చెమట పట్టేసింది. "సుదీరా!" అన్నాడు రొప్పుతూ.

 

    "భరత్! మై లవ్!" అంది సుదీర తమకంగా.

 

    అతను వెనక్కి వెనక్కి అడుగులు వేస్తున్నాడు.

 

    "ఏంటి డియర్ ఇది?" అంది సుదీర గారంగా, ఆరోపణగా.

 

    అతనికి టేబుల్ తగిలింది. ఆసరా కోసం చేతులు దానికి ఆనించాడు.

 

    మెత్తగా తగిలింది ఏదో.

 

    ఉలిక్కిపడి చూశాడు భరత్.

 

    మాంసం ముద్దలు ఎర్రగా రక్తం స్రవిస్తూ-

 

    విహ్వలంగా చూస్తున్నాడు భరత్. మాంసం ముద్దలు, శవం.

 

    అతనికి కడుపులో తిప్పి, జీర్ణకోశం ఉవ్వెత్తున లేచి గొంతులోకి వచ్చేసినట్లు అనిపించింది.

 

    పరుగున బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయి సింక్ దగ్గర తల వాల్చేశాడు.

 

    "ఏమిటి? ఏమయిందండి?" అంది సుదీర కంగారుగా.

 

    ఏమి లేదన్నట్లు నీరసంగా తల ఉపాడు.

 

    "చూస్తేనే వాంతి వచ్చేటంత అసహ్యంగా ఉన్నానా నేను?" అంది రోషంగా.

 Previous Page Next Page