సీతా, రత్నాకరరావు ఇద్దరూ చెరో పక్కా కూర్చుని తమ గారాల కూతురిని బతిమాలడం మొదలెట్టారు. వాళ్ళకి సుదీర ఒక్కటే సంతానం. ఆ అమ్మాయి పుట్టిన తర్వాతే ధనలక్ష్మి అందెలు ఘల్లుఘల్లు మానిపిస్తూ ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది.
చాలాసార్లు తలుచుకుని ఆశ్చర్యపోతుంటారు వాళ్ళు. ఎక్కడో ఎ రాచకుటుంబీకుల కడుపునో పుట్టవలసిన అమ్మాయి ఈ సుదీర, తమ ఇంట్లో తప్ప బుట్టింది.
అయితే, ఆమెను పుట్టించాక దేముడు తన తప్పులు తెలుసుకుని, సరిదిద్దుకున్నాడు. ఆమెకి రాజభోగాలు జరిగేందుకు వీలుగా, తమకు కుప్పలు తెప్పలుగా డబ్బు వచ్చి పడేలా చేశాడు.
సుదీర వయసుతో బాటు, తమ సంపద కూడా పెరిగింది. తాము కంటితో చూసిన, చేతితో తాకిన ప్రతిది బంగారమయింది.
"నా బంగారు తల్లి! ఏమయింది చెప్పమ్మా!" అంది సీత సుదీర తల నిమురుతూ.
ఏమి లేదన్నట్లు తల ఆడించింది సుదీర. ఆమె కళ్ళలో నీళ్ళు నిలిచి వున్నాయి.
ఉన్నట్లుండి ఏదో స్పురించినట్లు అడిగింది సీత, "భరత్ ఎప్పుడోచ్చడమ్మా?"
అయిష్టంగా మొహం పెట్టి, "వారం రోజులయింది" అంది సుదీర.
"మళ్ళీ ఎప్పుడొస్తానన్నాడు?"
అపుడు తల్లి ఒడిలో తల పెట్టి , ఏడవడం మొదలెట్టింది సుదీర.
రత్నాకరరావు అర్ధమయినట్లు తల ఉపి, కాసేపు ఆలోచనలో పడిపోయాడు. తర్వాత తన ఆఫీసు గదిలోకి వెళ్ళి బాబూలాల్ కి కబురు పంపించాడు.
అది అంచేలంచెలుగా బాబూలాల్ కి అందింది.
కబురు అందుకున్న బాబూ లాల్ తన డొక్కు అంబాసిడర్ కారులో బయలుదేరాడు.
-------------
శివాలయంలో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు భరత్.
తను తప్పు చేశాడా?
ఉహూ! కాదు! తను చేసింది సరైన పనే!
దయాకర్ చావు తర్వాత సుదీర పేరు తలుచుకున్నా , ఆమె కుటుంబం సంగతి గుర్తు వచ్చినా వణికిపోతున్నాడు తను. అలంటి అమ్మాయిని చేసుకుని తను జీవితాంతం సుఖపడగలడా? ఆ అమ్మాయిని సుఖపెట్టగలడా?
రెండు చెయ్యలేడు.
పెళ్ళి చేసుకుని ఆ అమ్మాయితో సరిగా వుండలేకపోతే తనకు ద్రోహం చేసినట్లు అవదా?
"నా శీలం నాకు తిరిగి ఇచ్చెయ్యండి" అని నిలదిసినట్లు పదునుగా, పదే పదే వినబడుతోంది సుదీర గొంతు.
నిజమే. ఆమె శీలాన్ని తను కొల్లగొట్టేశాడు. తోటలో ఆమెకి దగ్గరయిపోయి, స్వర్గ సుఖాలు అనుభవించేశాక , ఇప్పుడసలు పెళ్ళి చేసుకోనంటే అది మరింత భయంకరమైన ద్రోహం అవదా? శారీరకంగా దగ్గరయిపోయాక, ఇప్పుడు మానసికంగా దూరమైపోదామని చూస్తున్నాడా?
ఎంతటి అల్పుడు తను.
తరతరాల సంప్రదాయం అతని మనసుని మదించేస్తోంది.
ఒకవేళ అలా కాకుండా, ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే-
వెంటనే దయాకర్ శవం గుర్తు వచ్చింది. కడుపులో తిప్పినట్లయింది.
ఏం చెయ్యాలి? ఏం చెయ్యగలడు? ఏది ధర్మం? ఏది సబబు?
హృదయం శతకోటి ముక్కలయిపోయినంత వ్యధ! అశాంతి.
అతనికి మనశ్శాంతి కరువైనప్పుడు వెంటనే గుర్తొచ్చేది నృత్యం.
నృత్యం ద్వారా తన శరీరంలో టెన్షన్ కి విడుదల దొరుకుతుంది. మనసు తేలికవుతుంది.
గుడి నిర్జనంగా ఉంది.
భరత్ లేచాడు.
అడుగు వేసి ముద్ర పట్టబోయేటంతలో గుడి ముందు అంబాసిడర్ కారు ఆగింది. బాబూ లాల్ దిగాడు.
అతను మాటల మనిషి కాడు. చేతల మనిషి, మాట్లాడవలసివస్తే మొరటుగా మూడు ముక్కలలో చెప్పదలచుకున్నది చెప్పేస్తాడు.
"దేఖో భేటా! నువ్వుగాని సుదీరమ్మని పెండ్లి చేసుకోకుంటే , నీ చెల్లెలికి కూడా దయాకర్ గాడికి పట్టిన గతే పడుతుంది! శోచాయించుకో!" అని చెప్పేసి , నోటినిండా ఉన్న జర్దాపాన్ ని తుపుక్కున ఉమ్మేసి వెళ్ళి కారెక్కాడు బాబూ లాల్.
నిశ్చేష్టుడయి చూస్తూ ఉండిపోయాడు భరత్
----------
పదిమంది పోలీసు కానిస్టేబుల్స్ ఆరోడ్డు మీద ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. వందల కొద్ది కార్లు ఆ వీధిలో, ఆ పక్క వున్న నాలుగైదు వీధుల్లో కూడా కిక్కిరిసి పోయి వున్నాయి.
రత్నాకరరావుకి, సీతఃకి స్మగ్లింగ్ దగ్గర నుంచి డ్రగ్స్ అమ్మకం దాకా , దోపిడిల దగ్గర నుంచి వ్యభిచారపు కొంపలదాకా నాటు సారా తయారి దగ్గర నుంచి నాటు బాంబుల తయారి దాకా అన్ని రకాల వృత్తులతో, అన్ని రకాల సమాజ వ్యతిరేక శక్తులతో కూడా సంబంధం ఉంది.
ఆ మురికి నదులన్నీ ప్రవహించి , చివరికి చేరుకునేది రాజకీయ మహా సముద్రం.
అందుకనే ఆ పెళ్ళికి స్మగ్లర్లు, రాజకీయ నాయకులు, గుండాలు , మంత్రులు, మాంత్రికులు, తాంత్రికులు అందరూ వచ్చారు.
పెళ్ళికి రానిదల్లా సదాశివరావు ఒక్కరే! పెళ్ళి రోజునే హార్ట్ ఎటాక్ వచ్చి తగ్గింది ఆయనకి. హాస్పిటల్ లోనే వున్నారు.
పెళ్ళికి సీతాదేవి, రత్నాకరరావుల అనుచరులు చందాలు వసూలు చేశారు. సారాదుకాణాల వాళ్ళు, పడుపుకొంపల యజమానులూ, పిక్ పాకెట్ గాంగుల బాసులూ, అందరూ తమ వంతు 'నజరానా' సమర్పించుకున్నారు.
పెళ్ళి తంతు మొదలైనప్పటినుంచి పూర్తయేదాకా మొత్తం విడియో ఫిల్ముగా తీసే ఏర్పాట్లు జరిగాయి.
ఆ పెళ్ళిలో డబ్బు అసభ్యంగా నగ్న నృత్యం చేసింది. పెళ్ళిలో ఒక వేడుక జరిపించాడు రత్నాకరరావు. ఫెళఫెళలాడే సరి కొత్త వందరూపాయల నోట్ల కుప్పగా పోసి అల్లుడితో అన్నాడు. "లెక్కపెట్టు బేటా! సరిగ్గా అరగంట టైము. కరెక్టుగా అమౌంట్ చెప్పావంటే అదంతా నీకే ఇచ్చేస్తా!"
అసలే జివచ్చవంలాగా ఉన్నాడు భరత్. దానికి తోడు ఈ అట! అతను అన్ని నోట్లను ఒక్కసారిగా ఎప్పుడూ చూడను కూడా లేదు.
అది రాక్షస వినోదంలా కనబడింది భరత్ కి. జుగుప్స కలిగింది.
అందరూ తనని నవ్వు మొహాలతో చూస్తూ ఉంటె, చిరాగ్గా నోట్లు లెక్కపట్టడం మొదలెట్టాడు. నోట్లు సరికొత్తవి కావడం వల్ల అతుక్కుపోయి వున్నాయి. లెక్కపెట్టడం కుదరడం లేదు. నిమిషాలు గబగబ పరిగెత్తి పోతున్నాయి.
భర్త ఇబ్బంది గమనించింది సుదీర. తమాషాగా పమిట నడుం చుట్టూ బిగించి, నోట్లు తనే అందుకుని చకచక లెక్కపెట్టడం మొదలెట్టింది. ఒకటి....రెండు.....మూడు నాలుగైదారేడేనిమ్మిత్తోమ్మిది పది.........ఇరవై......వంద......
ఆమె పొడుగాటి వెళ్ళు నాజుగ్గా కందీరీగ రెక్కలంతా వేగంగా కదులుతున్నాయి.
"తొంభైతొమ్మిది వేల తొమ్మిది వందలు- " అంది విజయ గర్వంతో. గడువు ముగియడానికి ఇంకా సమయముంది.
"శభాష్!" అంటూ మరో వంద నోటు అందించి, 'దీనితో సరిగ్గా లక్ష . హాయిగా హనీమూన్ ఎన్ జాయ్ చేసిరండి. సుదీరమ్మా! హనీమూన్ నుంచి తిరిగి వచ్చాక నీ మొగుడికి ఒంట్లు సరిగ్గా నేర్పించు." అన్నాడు రత్నాకరరావు.
నవ్వి, "థాంక్స్ డాడ్!" అంది సుదీర.
జేబులోంచి ప్లేన్ టిక్కెట్లు, హొటల్ రిజర్వేషన్ పేపర్సు తీసి అందించాడు అతను.
తర్వాత అల్లుడు ! మాట!" అంటూ భరత్ భుజం మీద చెయ్యి వేసి పక్కకి తీసుకెళ్ళాడు. "పెళ్ళయి పోయింది గదా ఇక నీ యిష్టమొచ్చినట్లు ఆడోచ్చనుకుంటున్నావేమో! నేను చాలా దుర్మార్గపు మనిషిని. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినావో, నరికి ఉప్పు పాతరేస్తా! ఏదో తను మోజు పడిందిగదాని ఈ పెళ్ళి జరిపించాను. అమ్మాయి దగ్గర నుంచి ఏమైనా కంప్లయింటు వచ్చిందా. నిజంగా నీ పెళ్ళి జరిపిస్తా!" అని మెల్లిగా చెప్పి, తర్వాత నవ్వుతూ పెద్ద గొంతుతో "ఇంక హనీమూన్ ప్రయాణం కండి!" అన్నాడు.
బయట సరికొత్త మారుతి డీలక్స్ ఎయిర్ కండిషన్డ్ కారు నిలబడి వుంది. అది అయన తన కూతురికి పెళ్ళి సందర్భంగా ఇచ్చిన చిరుకానుక. దానికి అందంగా రంగురంగుల కాగితపు రిబ్బన్లు అతికించి ఉన్నాయి. బెలూన్లు కట్టి వున్నాయి. ఒక నౌకరు రెండు పెద్ద సూట్ కేసులు తీసుకొచ్చికార్లో పెట్టాడు.
బయటికి రాగానే కనబడ్డ దృశ్యం భరత్ మనసుని కలిచి వేసింది. స్వాతంత్ర్యం వచ్చి ముప్పయ్ ఎనిమిదేళ్ళు గడిచినా, కూటికి గుడ్డకి, గూడుకి గతిలేకుండా బతుకుతున్న భారత పౌరులు కొందరు పందిరి బయట పందులతో కలిసి ఎంగిలి విస్తళ్ళ మీదికి ఎగబడుతున్నారు.
బంగారు ముద్దలా వున్న జరి చీర కట్టుకుని ఉంది సుదీర. ఆమె మొహంలో అనందం, అలసటా రెండూ కనబడుతున్నాయి. తల వెనక్కి వాల్చి, సీటుకి జేరగిలబడింది. ఏదో చెప్పాలని నోరు తెరచి- డ్రైవర్ ని చూసి ఆగిపోయాడు భరత్.