Previous Page Next Page 
భామ కలాపం పేజి 29

 

    "కాదు....కాదు.......దయాకర్...శవం......" అన్నాడు ఆ ముద్దల్ని చూస్తూ. అతనికి శ్వాస అందడం లేదు. రొప్పుతున్నాడు.


    "భరత్! భరత్! ఇటూ చూడండి. అవి పీచేస్! ఇందాక రూమ్ బోయ్ ని తెమ్మంటే తెచ్చి పెట్టాడు" అంది సుదీర.

 

    ఒక్క గుటక మింగి కళ్ళు నులుముకుని చూశాడు భరత్. నిజమే, అవి పీచ్ పళ్ళు! ఎర్రగా , జ్యుసిగా ఉన్నాయి. తను చేతులు ఆనించగానే నలిగిపోయి , రసం కారి, ముద్దగా అయిపోయాయి.

 

    అతను టవలుతో మొహం తుడుచుకుని మంచం మీద బోర్లా పడుకుండిపోయాడు.

 

    భరించలేనంత ఆశాభంగం కలిగింది సుదీరకి.


                                                                           --------------

 

    సాయంత్రం నాలుగున్నర అవుతుండగా లేచాడు భరత్. అప్పటికే డ్రస్ అయి, రెడీగా ఉంది సుదీర. క్రీమ్ కలర్ నూరీ డ్రెస్ బిగుతుగా తోడలని, కాళ్ళని అంటిపెట్టుకుని ఉన్న చుడిదార్ పైజమా, కుర్తా, తలలో రెండు పెద్ద సైజు హెయిర్ పిన్సు పెదిమలకి నేరేడు రంగు లిప్ స్టిక్. కనురెప్పల మీద బాదం పండు రంగులో మస్కారా.

 

    "వాట్ సర్, నిద్ర తీరిందా?" అంది సుదీర చిరునవ్వుతో. ఆమె గొంతులో ఇందాకటి విసుగూ, చికాకూ లేవు.

 

    ఉలిక్కిపడి లేచాడు భరత్.

 

    "దయచేసి మమ్మల్ని కాసేపు షికారు తిసుకేల్తారా?" అంది నవ్వుతూ.

 

    అతను లేచి గబగబ మొహం కడుక్కుని , సుదీర సెలెక్ట్ చేసి కొన్న జీన్సు, పోలియేస్టర్ స్ట్రెచ్ షర్టూ వేసుకున్నాడు. అలవాటు లేకపోవడం వాళ్ళ అసౌకర్యంగా వున్నాయి అవి అతనికి.

 

    బయట మైదానంలో కొంతమంది గుర్రాల మీద స్వారి చేస్తున్నారు. చిన్న 'పోనీ' మీద ఎక్కింది సుదీర. దాన్ని నడిపించుకుంటూ కొంచెం దూరం తిప్పుకుని వచ్చాడు యజమాని.

 

    ఇరవై రూపాయల బక్షిస్ ఇచ్చింది సుదీర.

 

    తరువాత అక్కడ వున్న సరస్సులో బొట్ షికారు చేశారు. రెస్టారెంట్ లో కాఫీ తాగారు.

 

    నెమ్మది నెమ్మదిగా మామూలు మూడ్ లోకి వచ్చాడు భరత్. అతనికే చిన్నతనం అనిపించింది. తక్కిన జంటలను చూస్తుంటే. ఇది తమ హనీమూన్. ఇలాగేనా తను భార్యతో ప్రవర్తించవలసినది!

 

    తక్కిన జంటలందరూ తమ ప్రేమను ప్రపంచానికి ప్రదర్శించాలని తహతహాలాడిపోతున్నట్లు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని, ఒకరి మీద ఒకరు వాలిపోతూ సరసంగా, సరదాగా తిరుగుతున్నారు.

 

    తన డ్యూటీ నిర్వర్తించాడానికి నిశ్చయించుకున్న వాడిలా సుదీర చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు భరత్.

 

    తన సన్నటి పొడుగాటి వేళ్ళను అతని వేళ్ళతో పెనవేసి "థాంక్స్" అంది సుదీర. ఆమె కళ్ళలో కృతజ్ఞత. కొద్దిగా నీళ్ళు తిరిగాయి కూడా. తల పక్కకి తిప్పుకుంది.

 

    ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని నడుస్తున్నారు. ఏదేదో చెబుతోంది సుదీర. పరధ్యానంగా వింటున్నాడు.

 

    హఠాత్తుగా కొయ్యబారిపోయినట్లు ఆగిపోయాడు భరత్.

 

    అక్కడ కొంతమంది పిలలు కలిసి పిశాచాలుగా భయంకరమైన అట ఆడుతున్నారు. వాళ్ళ పాదాల దగ్గర ఒక మనిషి తల! దాన్ని కాలితో అటూ ఇటూ తోస్తూ ఆడుతున్నారు. ఒక పిల్లవాడు కాలితో బలంగా తన్నాడు దాన్ని. అది ఆకాశంలోకి ఎగిరి వేగంగా భరత్ వైపు వచ్చింది.

 

    గజగజ వణికే చేతులతో దాన్ని పట్టుకున్నాడు భరత్.

 

    అది దయాకర్ తల! నోరు తెరిచే ఉంది! నోట్లో నుంచి వస్తున్న చావుకేక నిశ్శబ్దంగా ఇంకా వినబడుతూనే వుంది.

 

    "దయాకర్!" అన్నాడు భరత్ విహ్వలంగా.

 

    "బాల్ పిల్లలకి ఇచ్చెయ్యండి" అంటోంది సుదీర.

 

    "నేనివ్వను! దయాకర్ తలని కాళ్ళతో తంతూ అడుకుంటారా వీళ్ళు. దెయ్యపిల్లలూ! నేను ఇవ్వను! నేను ఇవ్వను!" అన్నాడు భరత్ అరుస్తూ.

 

    "భరత్!" అని బలంగా అతని భుజం పట్టుకు కుదిపింది సుదీర. "మీ చేతిలో ఉన్నది ఫుట్ బాల్! పిల్లలూ అడుగుతున్నారు. ఇచ్చెయ్యండి!' అంది విసురుగా.

 

    ఒక్కసారిగా పీడకలలో నుంచి మేల్కొన్నవాడిలా చూసి, ఫుట్ బాల్ ని ఆ పిల్లలకి ఇచ్చేశాడు భరత్.

 

    అక్కడున్న అందరూ వాళ్ళ వైపే చిత్రంగా చూస్తున్నారు. సిగ్గుతో ఎర్రగా కందిపోయింది సుదీర మొహం. "ఇక వెళ్దాం రండి!" అని కోపంగా వెనక్కి తిరిగింది.

 

    ఆ రాత్రి నూట నాలుగు డిగ్రీల జ్వరం వచ్చింది భరత్ కి.


                                                                                     ------------

 

    రెండు రోజుల తర్వాత.

 

    వాళ్ళ రూం దగ్గరగా ఉన్న వరండాలో బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశాడు వెయిటరు వేడి వేడి ఇడ్లి, కొబ్బరి చట్ని, దోశె, కాఫీ.

 

    అక్కడ కూర్చున్న తక్కిన అమ్మాయిల మొహల్లోకి వెదుకుతున్నట్లు చూసింది సుదీర. మీగడ తరగలు తిన్న పిల్లి పిల్లల్ల్లా అరమోడ్పు కళ్ళతో ఉన్నారు వాళ్ళు. శరిరాలలోని టెన్షన్ విడుదల అయిపోయి, ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నట్లు ఉన్నారు. వురికే అనవసరంగా నవ్వులు నవ్వుతున్నారు.

 

    "మీకు దడుపుడు జ్వరం తగ్గిపోయినట్లేనా?" అంది సుదీర భరత్ చెయ్యి పట్టుకుని చూస్తూ. ఆ ప్రశ్నలో పరామర్శకంటే, చిరాకూ, ఆరోపణఎక్కువ వినబడుతున్నాయి.

 

    
    "సారీ సుదీరా?!" అన్నాడు భరత్.

 

    బలవంతంగా నవ్వింది సుదీర. "ఇవాళ ఊరంతా తిరిగి చూద్దామా? ఓపికగా ఉందా మీకు?"

 

    "వెళదాం!" అన్నాడు భరత్.

 

    స్నానాలు చేశాక, మెల్లిగా నడుస్తూ వెళ్ళారు.

 

    "ఇదే నేను చిన్నప్పుడు చదివిన కాన్వెంటు" అంది. పెద్ద తోట మధ్యన ఉన్న బిల్డింగుని చూపిస్తూ.

 

    "అలాగా!" అని ఊరుకున్నాడు భరత్.

 

    అంతేనా? అంతకంటే ఎక్కువ కుతూహలం  చుపడెం? అనిపించింది సుదీరకి. బోర్డింగులలో ఉండే అమ్మాయిలు కొంతమంది ఏంటో అల్లరిగా, ఎంత నాటిగా ఉంటారు! ఎన్ని తమాషాలు చేస్తారు. ఇవన్ని గుచ్చి గుచ్చి అడగాలని ఆడపిల్లల తాలూకు అందమైన సీక్రెట్స్ తెలుసుకోవాలని ఇతనికి కోరిక లేదా?

 

    తనతో కలిసి నలుగురు ఉండేవారు తమ రూములో. వాళ్ళకి తనే రింగ్ లాడర్. ఒకసారి సరదాకి నాన్నగారి హవాన సిగార్ ఒకటి తెచ్చి అంటించి నోట్లో పెట్టుకోగానే, కొరబోయి దగ్గు వచ్చింది. దాన్ని విసిరి కొట్టింది తను. అదే సమయానికి కాలం మూడిన కప్పు ఒకటి తూములో నుంచి దూరి లోపలికి వచ్చింది. సిగార్ రాకెట్ లా వెళ్ళి తెరచుకుని వున్న దాని నోట్లో ఇరుక్కుపోయింది. నోట్లో వెలుగుతున్న చుట్టతో కప్పు గందరగోళంగా ఎగురుతూ హాస్టల్ అంతా తిరిగి భీభత్సం సృష్టించింది. ఆడపిల్ల లందరూ భయభ్రాంతులై మంచాల మీద ఎక్కి నిలబడి కేకేలేశారు. ఒక సిస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి. ఎగురుతున్న కప్పని, దాని నోట్లో వెలుగుతున్న సిగార్ ని చూసి బిత్తరపోయింది. తరువాత తేరుకుని విచారణ చేసి గాంగ్ లీడరు సుదీరకి చివాట్లు వేసింది.

 

    మరోసారి లైట్లు పోయినప్పుడు కాండిల్స్ తెచ్చి.........

 

    అలాంటి అల్లరి పనులన్నీ అతనికి చెప్పాలని, అతను చెప్పినవి తను వినాలని ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళు తెలుసుకోవాలని, ఇద్దరూ ఒకరి కొకరు గురువులై, ఒకరి కొకరు శిష్యులై లోతుపాతులన్నీ తరచి చూడాలని ఇతనికి లేదా?

 

    ఎంత ప్రయత్నించినా మాములుగా ఉండలేకపోతున్నాడు భరత్.

 

    రాత్రి డిన్నర్ టైములో.

 

    అందరి మొహాలు కుతూహలంగా పరికించి చూసింది సుదీర.

 

    ఆ తెల్లగా వున్న జంట ఉడిపి నుంచి వచ్చి ఉంటారు.

 

    ఆ చామనఛాయగా ఉన్న పళ్ళేత్తు అమ్మాయి, నల్లగా ఉన్న అబ్బాయి ప్రం మెడ్రాసు విత్ లవ్ అని చూడగానే తెలిసిపోతుంది. ఓవర్ యాక్షన్ చేస్తూ, పెద్దగా మట్లాడుకుంటున్నారు వాళ్ళు.

 

    మొదటి జంట పేరు మిస్టర్ అండ్ మిసెస్ పుట్టన్న ఆని, రెండో జంట పేరు మిస్టర్ అండ్ మిసెస్ నెడుంజెలియన్ అని మనసులోనే తమాషాగా పేర్లు పెట్టింది సుదీర.

 

    పక్కనే కూర్చుని ఉన్నారు సర్జార్జిల జంట. రోజు మక్కి ది రోటి, పుదినా చెట్నీలతో బాటు, ఒక చికెన్ ని కూడా లాగించేసి , ఒక క్వార్టరు విస్కీ ఖాళీ చేసేలా కనబడుతున్న ఆ సర్దార్జీకి ఈ సాత్వికాహారం అంతగా రుచించినట్లు లేదు. అతను తన సర్దారిణితో అదే అంటున్నాడు.

    
    "నాన్ వెజ్ తిని అయిదురోజులయింది!"

 

    "అబద్దాలు చెప్పకు!" అంటోంది ఆ అమ్మాయి అతని వేపు అల్లరిగా చూస్తూ. వాళ్ళు పంజాబిలో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడడం రాకపోయినా , పంజాబీ అర్ధం అవుతుంది సుదీరకి. "గురుదయాళ్ సింహ జీ! తమరు ముప్పొద్దులానాన్ వెజ్ తింటూనే ఉన్నారు. పొద్దున్న పూట నా బుగ్గలు, మధ్యాహ్నం పూట........." ఆ అమ్మాయి గొంతు గుసగుసగా మారిపోయింది.

 

    పెదిమల కింద నవ్వు తొక్కిపట్టింది సుదీర. మరెవ్వరికి అర్ధం కాదులే అన్న భరోసాతో విచ్చల విడిగా మాట్లాడేస్తోంది పంజాబీ అమ్మాయి.

    
    భరత్ రియాక్షన్ కోసం అతని వైపు చూసింది సుదీర.

 Previous Page Next Page