Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 28

 

    షాంపేన్ పొంగుతున్నట్లు శశికాంత్ నవ్వు వినబడింది సౌమ్యకి.

 

    వింటూ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది సౌమ్య. తరువాత నిదానంగా అంది.

 

    "మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్?"

 

    "ఐ యామ్ శశికాంత్ పార్టనర్" అంది ఉజ్వల.

 

    ఆ తరువాత, నాలుగు పెదిమలు కలిసి చేసిన ఒక్క శబ్దం. "ప్చ్" అని తరువాత క్లిక్ మన్న శబ్దంతో లైన్ డెడ్ అయిపొయింది.

 

    ఆ శబ్దం ఏమిటో అర్ధం చేసుకోలేనంత చిన్న పిల్లకాదు సౌమ్య. ఒక్కసారిగా ఉపిరాగిపోయినట్లయింది ఆమెకి. ఒంట్లో ఉన్న రక్తం అంతా తలలో చేరినట్లు తల బరువెక్కిపోయింది.

 

    ఫోన్ కాల్ కి డబ్బులివ్వబోతే షాపు ఓనరు తీసుకోలేదు. బయటకు వచ్చేసింది సౌమ్య. కలలో నడుస్తున్నట్లు నడిచింది.

 

    ఆ విధిలో మూడు స్ట్రీట్ లైట్స్ పాడయిపోయాయి. అక్కడంతా చిమ్మచికటిగా ఉంది.

 

    అక్కడిదాకా రాగానే ఇంక కళ్ళు తిరగడం మొదలెట్టాయి సౌమ్యకి. సొమ్మసిల్లిపోయినట్లు ఒళ్ళు తులింది.

 

    అపుడు- రెండు బలిష్టమైన హస్తాలు ఆమెని చుట్టేశాయి.

 

    బరువెక్కిపోతున్న కనురెప్పలను తెరిచి చూసింది సౌమ్య.

 

    సోలిపోతున్న తనని పడిపోకుండా పట్టుకుని ఉన్నాడా వ్యక్తీ . ఎవరతను?

 

    'నేను తేజస్విని మేడమ్! మీ కంపెనీలో మెడికల్ రిప్రేజేంటేటివ్ ని ఎలా  వుంది మీకు?" అన్నాడు తేజస్వి.

    
    అస్పష్టంగా పెదిమలు కదిలించింది సౌమ్య. ఒకసారి తనవైపు తాను చూసుకుంది. అతని చేతుల్లో ఒరిగిపోయినట్లు ఉంది. తను మొహమాటంగా లేచి నిలబడి దూరంగా జరిగిపోయింది సౌమ్య.

 

    హటాత్తుగా తన మంగళసూత్రం బిగుతైపోయి తన మెడని నోక్కేస్తున్నట్లు భావన కలిగింది.

 

    తల తిప్పి చూసింది సౌమ్య.

 

    తన మంగళసూత్రం అతని రిస్టువాచ్ చెయిన్ కి చిక్కుబడిపోయింది జడకి కిందగా.

 

    "ఓహ్ సారీ! అని, ఒంటిచేత్తోనే ఆ చిక్కుని తప్పించాబోయాడు తేజస్వి. కుదరలేదు. తప్పని సరై రెండో చేతిని ఆమె చుట్టూ పోనిచ్చి వాచ్ ని చేతినుంచి  తీసేశాడు.

 

    చేతినుంచి విడివడి వచ్చేసింది వాచ్. కానీ మంగళసూత్రాన్ని వదలలేదు. బరువుకి కిందకి జారి ఆమె గుండెల మధ్య లాకెట్ లా వేళ్ళాడుతూ ఉండిపోయింది. దాన్ని అందుకోవడానికి అప్రయత్నంగా చేతిని ముందుకు చాచిం అంతలోనే సంకోచంగా ఆగిపోయాడు తేజస్వి.

 

    వెనకనుంచి వేగంగా అటో ఒకటి వస్తున్న శబ్దం వినబడింది. సెకండ్ల తరువాత వాళ్ళ పక్కన ఆగింది ఆ అటో. దానిలోనుంచి తల బయటకి పెట్టి చూశాడు కార్తిక్, శశికాంత్ కజిన్.

 

    సరిగ్గా అటో ఆగిన సమయానికి తేజస్వి చెయ్యి ఆమె గుండెల దగ్గర నుంచి వెనక్కి వస్తోంది. పమిట సరిగా వేసుకుంటుంది సౌమ్య.

 

    ఆ స్థితిలో ఉన్న వాళ్ళిద్దరిని చిత్రంగా చూశాడు కార్తిక్. తరువాత ఏదో అర్ధం చేసుకున్నట్లు "సారీ!" అని ఆటోని పోనిమ్మన్నాడు.

 

    "హలో! దేర్!" అన్నాడు తేజస్వి. కదులుతున్న ఆటోని నిలుపుతూ "ఈమె కొద్దిగా సిక్ అయ్యారు. ఇంటిదాకా దిగబెట్టడానికి కాస్త సాయం చేస్తారా?"

 

    కార్తిక్ ఒకసారి తేజస్విని ఎగాదిగా చూసి తరువాత సౌమ్యతో అన్నాడు "ఏమయింది వదినా!"

 

    "కొద్దిగా కళ్ళు తిరిగాయి. అంతే ఈ సందు చివరిలోనే ఇల్లు. వెళ్ళిపోగలను" అంది సౌమ్య.

 

    "ఆటోలో వెళ్ళిపోవడం బెటరు" అన్నాడు తేజస్వి.

 

    ఒకసారి సందిగ్ధంగా చూసి, తరువాత అటో ఎక్కింది సౌమ్య.

 

    "ఈయన -?" అన్నాడు తేజస్వి ప్రశ్నార్ధకంగా కార్తిక్ వైపు చూస్తూ.

 

    "ఇతను కార్తిక్! మా వారి కజిన్. ఈయన తేజస్వి. మన కంపెనీలో రిప్రజెంటేటివ్" అంది సౌమ్య ముక్తసరిగా.

 

    "మీరు వెళ్ళండి నేను నడిచి వస్తాను" అన్నాడు తేజస్వి.

 

    అటో కదిలింది. సౌమ్యని ఇంటి దగ్గర దింపాడు కార్తిక్. ఇంట్లోకి వచ్చి కూర్చొని కాసేపు మాట్లాడాలని ఉంది అతనికి. కానీ చాలా సీరియస్ గా ఉన్న సౌమ్య మొహం చూసి ఆ ప్రయత్నం విరమించుకుని అదే ఆటోలో వెళ్ళిపోయాడు.

 

    ఇల్లు చేరాక ఇక కార్తిక్ గుర్తులేడు సౌమ్యకి. తేజస్వి కూడా గుర్తులేడు.

 

    ఆమెకి గుర్తున్నదల్లా తను చేసిన ఫోన్ కాల్.

 

    అది అందుకున్న ఒక అమ్మాయి గొంతు.

 

    అంతే!

 

    మళ్ళీ శరీరం ఒక్కసారి నిలువెల్లా కంపించినట్లయింది , సౌమ్యకి. ఒక మూల ముడుచుకుని పడుకున్న తల్లి కనబడింది.

 

    వెంటనే తల్లిని చేరి రోదించడం మొదలెట్టింది సౌమ్య.

 

    ఎందుకిలా అయిపొయింది తమ జీవితం?

 Previous Page Next Page