Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 27

 

    అవును మూర్ఖత్వమే తండ్రిపోయిన దుఃఖంలో ఉన్న తనని కోరడం అంటే అది బలాత్కారం లాంటిదే అని అతనికి తెలియదా?

 

    ఇదంతా చూస్తుంటే మ్యారేజ్ అంటే లిగలైజ్ద్ రేప్ అని ఎవరో అన్నది నిజమేనేమో అనిపిస్తోంది.

 

    కాపురం ముందే ఇలా ఘర్షణతో మొదలయితే, ఇక ముందున్న జీవితం ఎలా గడుస్తుంది?

 

    వివాహం అన్నది చట్టబద్దమైన బలాత్కారం అనుకున్నట్లు, కాపురం అంటే తప్పనిసరి రాజి అనుకుని సరిపెట్టుకుపోవాలి కాబోలు.

 

    రాజీ పడాలి. లేకపోతే బతుకు బజార్లో పడాలి.

 

    అంతకంటే వేరే మార్గం ఏముంది ఆడదానికి?

 

    అప్రయత్నంగానే లేచి నిలబడింది సౌమ్య. షెల్ఫు మీద ఉన్న చిల్లర తీసుకుని "ఇప్పుడే వస్తాను" అని అస్పష్టంగా తల్లితో చెప్పి, బయటకు నడిచింది.

 

    సందు చివర్లో ఉన్న మెడికల్ షాపు నుంచి శశికాంత్ కి ఫోన్ చేసి, వచ్చి తనని తీసుకెళ్ళమని చెప్పాలి. హొటల్ కైనా, మరెక్కడికైనా సరే అతని ఇష్టం.

 

    షాపులో అడుగుపెట్టిన సౌమ్యని చూడగానే ప్రసంనవదనంతో పలకరించాడా షాపు ఓనరు. ఆమె శశికాంత్ భార్య అని అతనికి తెలుసు.

 

    శశికాంత్ తో పెళ్ళయిన ఈ మూడు రోజుల్లోనే ఫేమస్ అయిపొయింది సౌమ్య.

 

    "ఈమె మీకు తెలుసా? మిసెస్ శశికాంత్" అన్నాడు షాపు ఓనరు తెజస్వితో గుసగుసగా.

 

    "తెలుసు అని సౌమ్యని పరిశీలనగా చూశాడు తేజస్వి.

 

    ఈ కొద్ది రోజులలో ఆమెలో వచ్చిన మార్పు అతనికి ఆశ్చర్యం కలిగించింది.

 

     కంపెని ట్రాన్స్ ఫర్ డీల్ సెటిల్ అయేటప్పుడు శశికాంత్ తో కలిసి హొటల్ కి వచ్చింది ఆమె. అప్పుడు వెన్నెల్లో స్నానం చేసివచ్చిన కన్నె పిల్లలా కనబడింది.

    
    ఇవాళ......

 

    పెనుగాలుల్లో చిక్కుకున్న పూలవానలాగా-

 

    జాలితో నిండిపోయింది అతని మనసు. అయినా ఆమెని పలకరించలేదు అతను. పలకరించడానికి ఇది అనువైన స్థలం కాదని తెలుసు అతనికి. తను పలకరించగానే, ఒకవేళ ఆమె దుఃఖం ఆపుకోలేక ఏడ్చేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి.

 

    అక్కడే నిలబడి వున్న తేజస్విని గమనించలేదు సౌమ్య. ఆ మాటకి వస్తే అసలు దేన్నీ గమనించే స్థితిలో లేదు ఆమె మనసు. డేంజర్ సిగ్నల్ లా కనబడుతున్న ఎర్రటి టెలిఫోన్ తప్ప మరేమీ ఆమె దృష్టికి అనడం లేదు.

 

    ముందుగా శశికాంత్ ఆఫీసు నంబర్ కి ఫోన్ చేసింది సౌమ్య.

 

    తరువాత అతని ఇంటికి రింగ్ చేసింది.

 

    రెండుచోట్లా లేడు శశికాంత్.

 

    ఫోన్ డిస్ కనెక్ట్ చేసి, రిసీవర్ చేతిలోనే ఉంచుకుని ఆలోచించింది సౌమ్య. ఎక్కడ ఉంటాడు శశికాంత్ ? ఆ హోటల్లోనే ఉండి ఉండొచ్చా?

 

    
    నుదురు చిట్లించి , ఆ హొటల్ పేరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది సౌమ్య. తరువాత డైరక్టరీ చూసి, హొటల్ కి రింగ్ చేసింది.

 

    ఆపరేటర్ లైన్ లోకి రాగానే "మిస్టర్ శశికాంత్ మీ హోటల్లోనే ఉన్నారా?" అంది.

 

    "జస్ట్ ఏ మినిట్ మేడమ్!" అన్నాడు ఆపరేటర్. రిసేప్షనిస్టూని సంప్రదించి చెప్పాడు "ఎస్ మేడమ్! రూం నెంబర్ సిక్స్ టీ నైన్."

 

    "కనెక్షన్ ఇస్తారా?"

 

    "ష్యూర్ మేడమ్"

 

    ఆ కొద్ది క్షణాల విరామంలో వడివడిగా కొట్టుకున్నాయి సౌమ్య గుండెలు. తన భయం చూస్తే తనకే చిరాగ్గా వుంది ఆమెకి. తను మాట్లాడ బోతోంది తన భర్తతోనే అతను ఆజ్ఞాపించినట్లు చేస్తానని చెప్పడానికే ఈ ఫోన్ కాల్. దానికి ఇంతగా భయపదిపోవడం దేనికి తను?

 

    లైన్ లో క్లిక్ క్లిక్ మన్న శబ్దాలు.

 

    తరువాత ఒక స్త్రీ కంఠం వినబడింది.

 

    "హలో!"

 

    ఆ గొంతులో అసహనం అహంకారం.

 

    అ గొంతు ఉజ్వలదని సౌమ్యకి తెలియదు. శశికాంత్ తో పాటు అతని రూంలో మరొక స్త్రీ ఉండవచ్చని సౌమ్యకి తట్టలేదు. రిసెప్షన్ లో వున్న అమ్మాయి ఎవరో మాట్లాడతోందనుకుంది.

 

    అందుకని "హల్లో రూం నెంబర్ సిక్స్ టీ నైన్ , కనెక్షన్ ఇస్తారా?" అంది కంపిస్తున్న గొంతుతో.

 

    "ఇదే రూం నంబర్ సిక్స్ టీ నైన్ , ఎవరు కావాలి మీకు?" అంది ఉజ్వల.

 

    "శశికాంత్ ఉన్నారా?"

 

    "మీరెవరు?"

 

    "నా పేరు సౌమ్య."

 

    లైన్ లో ఉన్నది సౌమ్య అని తెలియగానే, స్పిరిట్ లాంపు అంటించినట్లు సన్నని మంట రాజుకుంది ఉజ్వల గుండెలో. తన పెదిమలని అందుకోవడానికి ముందుకు వంగుతున్న శశికాంత్ ని వారిస్తూ, "శశికాంత్ మునిగిపోయేంత పనిలో వున్నారు. మళ్ళీ ఫోన్ చెయ్యండి" అంది నిర్లక్ష్యంగా.

 Previous Page Next Page