Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 29

 

    మొన్నటిదాకా తమకు ఇబ్బందులు ఉండేవి. వాటినే కష్టాలు అని భ్రమపడేవారు తాము.

 

    కానీ కష్టాలంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది.

 

    ఏడుస్తున్న కూతురి వైపు భయంగా చూసింది శారదమ్మ.

 

    "ఏమయింది సౌమ్య! ఏమయింది తల్లి!" అంది ఆదుర్దాగా.

 

    గద్గదికమైన స్వరంతో చెప్పటం మొదలెట్టింది సౌమ్య. సాయంత్రం శశికాంత్ తమ ఇంటికి రావడం, శోభనం గురించి అడగడం, తను వద్దన్నా చనువు తీసుకోబోవడం , తను నిరాకరించి గట్టిగా మట్లాడితే అతను కోపగించుకుని వెళ్ళిపోవడం.

 

    అంతే చెప్పింది సౌమ్య - శశికాంత్ తమ శోభనం కోసం బుక్ చేసిన హొటల్ రూంలో వేరే ఎవరో అమ్మాయితో ఉన్నడన్నా ఒక్క విషయం తప్ప!

 

    మొదటి విషయంలో ఎలా చెయ్యాలో తల్లి తనకు సలహా ఇవ్వగలదు.

 

    కానీ రెండో విషయంలో ఎవరేం చెయ్యగలరు?

 

    పైగా. ఆ విషయం చెబితే అమ్మ గుండె బద్దలైపోవచ్చు. అసలే దుఃఖంలో వుంది ఆమె.

 

    నమ్మలేని నిజాలుగా అనిపిస్తున్న ఆ సంగతులను దిగ్ర్భమ చెంది విన్నది శారదమ్మ. తరువాత కూతుర్ని గుండెకు పొదువుకుని దుఃఖిస్తూ ఇక ముందు చెయ్యవలసిన దాన్ని గురించి ఆలోచించడం మొదలు పెట్టింది.

 

    సౌమ్యా, కార్తిక్ వెళుతున్న అటో ఎక్కడ ఆగిందో గుర్తు పెట్టుకుని ఆ ఇంట్లోకి వచ్చాడు తేజస్వి.

 

    అతను ఇంట్లికి వచ్చేసరికి వెక్కిళ్ళు వినబడుతున్నాయి.

 

    సాలోచనగా కొద్దిసేపు అక్కడే నిలబడిపోయాడు తేజస్వి.

 

    ఈలోగా ఒక వంటాయన వచ్చాడు బయటి నుంచి .చిన్న కొల్లాయి గుడ్డ, పైన అంగవస్త్రం.

 

    "ప్రొద్దున ఇరవైమంది కోసం వంట చేశాను. వచ్చిన బంధువులందరూ మలక్ పేట కాలనికి వెళ్ళి ఇంకా తిరిగి రానట్లుంది. మరి రాత్రి భోజనాలు ఇక్కడే చేస్తారో, అక్కడే కానిచ్చి వస్తారో తెలియడం లేదు" అన్నాడు తెజస్వితో. అతనికి కొద్దిగా చాదస్తం ఉన్నట్లు కనబడుతోంది.

 

    "ఒక పది నిమిషాలు ఉండండి. కనుక్కుందాం" అన్నాడు తేజస్వి.

 

    "రేపొద్దున్న కందా బచ్చలి కలిపి కూర వండుకుందాం అని ఉంది గానీ, ఏది, ఈ హైదరాబాద్ నగరంలో బచ్చలి అన్నది దొరికితేనా? అందుకని పాలకూరతో సరిపెట్టేస్తున్నాను బాబుగారూ అభ్యంతరం ఏమి వుండడుకదా?" అన్నాడు వంటాయన!

 

    తేజస్వి ఏదో చెప్పేలోగా , గ్లాస్కో ధోవతిని లుంగిలా కట్టుకున్న మరో పెద్దాయన వచ్చాడు. తెల్ల షర్టుకి పెద్ద జేబు. అందులో పర్సు, మడతపెట్టిన కాగితాలు. పెన్నూ చూడగానే ఈయన చాలా సమర్ధుడు, లోక్యం తెలిసినవాడు అని అర్ధమైపోతోంది. నోట్లో తాంబూలాన్ని అరుగు కింద ఉన్న మొక్కల మధ్య ఉమ్మేసి అన్నాడు. "కందా బచ్చలి కలిపి వండితే తినే ఓపిక ఎవరికుందండి బాబూ ఈ రోజుల్లో! అవపెట్టిన అరటికాయనూ, వంకాయ కూరా చేసెయ్యండి."

 

    "అరటికాయలు ఆనాడే వండి ఉంటె బాగుండేది బాబయ్యా! ఇప్పుడన్నీ పండబారిపోయ్యాయ్" అన్నాడు వంటాయన.

 

    "పొద్దున మళ్ళీ ఎలాగో కూరలు తేవడానికి మిరియాల మండికి వెళ్ళడం తప్పదు సుమండీ! అప్పుడు తెప్పిద్దాం అరటికాయలు" అని తేజస్వి వైపు తిరిగాడు ఆ పెద్దమనిషి. "మాస్టారూ! మీ ప్రోగ్రామేమిటి? పొద్దునే మండికి మీరు వెళ్ళి రాగలరా ? అన్నాడు చనువుగా.

 

    "వెళతాను" అన్నాడు తేజస్వి వెంటనే.

 

    "ఆ వెళ్ళేది ఒక్క అడుగు ముందు వెళితే, పాలక్యాన్ ఆర్డర్ చేశాను. అదికూడా తీసుకురావచ్చు.

 

    "ఆ సంగతి నాకు వదిలెయ్యండి అన్నాడు తేజస్వి.

 

    అంతలో మరో చిన్నపిల్ల పరిగెత్తుకు వచ్చి తేజస్వి చెయ్యి పట్టుకు వెళ్ళాడింది. 'ఇదిగో! నా డాలి బొమ్మని చూరు మీద దాచేశాడు పండూ! తిసివ్వవా?" అంది.

 

    నవ్వి "పద" అని కదిలాడు తేజస్వి.

 

    తేజస్విని చూసి చూడగానే ఇతను మనవాడు మంచివాడు అని తెలియని సిక్సి త్ సెన్స్ ఏదో ఫ్లాష్ చేసినట్లు స్పురిస్తుంది చాలా మందికి. అతన్ని గురించి ప్రత్యకంగా అలోచించి ఏర్పరచుకున్న అభిప్రాయం కాదది. తమకి తెలియకుండానే అతనికి దగ్గరైపోతారు. నిష్కల్మషంగా ఉంటాయి అతని చూపులు. అతన్ని చూడగానే ఆడవాళ్ళకి పమిట సర్దుకోవాలనిపించదు. తమ తోబుట్టువు సమక్షంలో ఉన్నట్లే స్వేచ్చగా ఫీలవుతారు. అతనికి పని ఒప్పగించడానికి సంకోచించరు పెద్దవాళ్ళు. ఇతను మన కుర్రాడే. చెబితే తప్పేమిటి? అనిపిస్తుంది వాళ్ళకి. అతన్ని సాయమడగడానికి సంశయించరు చిన్నవాళ్ళు.

 

    అందరికి అలా తలలో నాలుక లాగా ఉండేవాళ్ళు వుంటూనే వుంటారు అక్కడక్కడా.

 

    ఒక నడివయస్సు స్త్రీ వచ్చి తమకు తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్స్ గురించి తేజస్విని అడగడం మొదలెట్టింది.

 

    పాలలో పంచదార కలిసిపోయినట్లు అట్టే ప్రయత్నం లేకుండానే కలిసి పోయాడు తేజస్వి.

 

    దుఃఖంతో ఉన్న సౌమ్యకి ఆమె తల్లికి , సానుభూతి వాక్యాలు చెప్పి, వాళ్ళ కష్టాల్ని మళ్ళీ గుర్తు చెయ్యదలుచుకోలేదు అతను. తను చేయ్యదలుచుకున్నది చేతల్లో చూపిస్తాడు అంతే
    

    అతను ఆ రాత్రి ఇంటికి వెళ్ళేసరికి ఒంటిగంట అయింది.

 

    మళ్ళీ పొద్దున్నే నాలుగున్నరకి లేచి పాల క్యాన్ తీసుకొచ్చి, మీర్ మండికి వెళ్ళ వలసిన డ్యూటీ ఉంది అతనికి.

 

    ఆ రూంలో అతను ఒంటరిగా ఉంటాడు. స్వయం పాకం.

 

    ఇవాళ సౌమ్య వాళ్ళ ఇంటిలోనే భోజనం చేసి వచ్చాడు కాబట్టి వంట చేసుకోనవసరం లేదు.

]
    అంత సందడిలో నుంచి బయటికి వచ్చి పడుకున్న తరువాత అప్పుడు అతనికి గుర్తు వచ్చింది తన ఒంటరితనం!

 

    ఈ ఒంటరితనం ఈ రోజుది కాదు.

 

    ఈ ఏటిది కూడా కాదు!

 

    పుట్టినప్పటినుంచి అనుభవిస్తూనే ఉన్నాడు ఈ ఒంటరితనాన్ని.

 

    అనాధగా పుట్టాడు తను. అనాధాశ్రమంలో పెరిగాడు.

 

    చిన్నిలాగా!

 

    బహుశా అందుకేనేమో చిన్నీ అంటే తనకి జాలి. అంత అభిమానం.

 

    చిన్నీ గుర్తు రాగానే ఒక సంఘటన మనసులో మెదిలింది తేజస్వికి.

 

    ఒక రోజున తను అనధాశ్రమానికీ వెళ్ళాడు. వెళ్ళేసరికి చిన్నీ వాడి ఫ్రెండ్ గోపి టెలిఫోన్ అట ఆడుకుంటున్నారు. అగ్గిపెట్టెల లోపల ఉండే డొప్పలు రెండు తీసుకుని వాటిని ఒక దారానికి అటు కొసన ఒకటి , ఇటు కొసన ఒకటి కట్టి వాటిని చెవి దగ్గర పెట్టుకుని టెలిఫోన్ లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు.

 

    అది చూచి, నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు తను.

 

    కానీ దగ్గర కెళ్ళాక వాళ్ళ మాటలు వింటుంటే తన నవ్వు మాయమై పోయింది. గుండె నీరు కారిపోతే కళ్ళు తడితడిగా అయిపోయాయి.

 Previous Page Next Page