ఇవాళ ఎందుకో శ్రీరాం ఇంకా రాలేదు. అతను రాకపోతే ఆఫీసు నిస్సారంగా ఉన్నట్లు అనిపించింది సౌందర్యకి.
అన్యమనస్కంగానే, పెర్రీమాసన్ నవల ఒకటి అందుకుంది. వెంటనే ఒకటి స్ఫురించింది తనకి.
పెర్రీమాసన్ నవలంతా బుర్ర వేడెక్కిపోయేలా పనిచేసిన తర్వాత తన సెక్రెటరీ డెల్లా స్ట్రీట్ ని అడుగుతుంటాడు తరచుగా "డెల్లా! ఇవాళ ఫ్రీగా ఉన్నావా? అయితే నాతో వచ్చి డిన్నర్ తీసుకో!" అని.
ఇష్టంగా ఒప్పుకుంటుంది డెల్లా.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి పెద్ద హోటల్ కి వెళతారు. మెయిట్ ర్ డీ వాళ్ళని మర్యాద పురస్కరంగా ఎదుర్కొని, సీట్లు చూపించి...
చాలా ఇంగ్లీషు నవలల్లో అంతే! సెక్రెటరీ తన బాస్ తో పాటు ఝామ్మని డిన్నర్ లకీ, డాన్ స్ లకీ వెళ్ళిపోతూ ఉంటుంది.
మరి తన బాస్ శ్రీరాం? ఒక్కసారి కూడా "కమాన్ సంధూ! ఐ విల్ బయ్ యూ డిన్నర్ టుడే!" అని కారెక్కించుకుని తీసుకెళ్ళడేం?
అతని భుజం మీద వాలిపోతూ ఏ బంజారాకో, బ్లూ డైమండ్ కో వెళ్ళాలని ఎంత సరదానో తనకి!
ఇంక పుస్తకం మీద దృష్టి నిలవక, క్షణానికోసారి తలుపు వైపు చూస్తూ కూర్చుంది సౌందర్య.
మధ్యాహ్నం మూడవుతూండగా ఆఫీసుకొచ్చాడు శ్రీరాం, రేమాండ్ సూటులో మెరిసిపోతున్నాడు. మొహంలో మాత్రం కొద్దిగా అలసట కనబడుతూంది.
అతన్ని చూడగానే ఏ మాత్రం కల్మషం, కల్తీ లేని ఆనందంతో ఆమె మొహం వికసించింది.
"మీరింక రారేమో అని భయపడిపోయాను బాస్" అంది, తెరిపిన పడ్డట్లు చూస్తూ.
"ఎందుకు రాను?" అని నవ్వాడు శ్రీరాం. "నా ఆఫీసు నా ఫస్ట్ లవ్!"
"మరి మీ సెకెండ్ లవ్ ఎవరు?" అంది సౌందర్య, చిరునవ్వుతో వోరగా అతన్ని చూస్తూ.
అతను తన పేరే చెబుతాడని ఆ అమ్మాయికి చాలా నమ్మకంగా ఉంది.
"వోకే! ఇంక నీకు చెప్పక తప్పదు. నా సెకెండ్ లవ్ నా భార్య ప్రతిమ."
షాకయిపోయింది సౌందర్య.
"మీ...భార్యా?" అంది పెదిమలు తడి ఆరిపోతుండగా.
"సారీ హనీ! అర్జెంటుగా పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది సివిల్ మేరేజ్! ఎవర్నీ పిలవలేదు. అందుకే రేపు రిసెప్షన్ అరేంజి చేస్తున్నాను. ప్లీజ్ డూ కమ్!"
సౌందర్య చెవుల్లో హోరున రొద వినబడటం మొదలెట్టింది. కళ్ళ ముందు చీకటి కమ్ముతున్నట్లయింది. కాళ్ళ కింద భూమి విచ్చుకొని తను దిగబడిపోతున్నట్లయిపోయింది.
శ్రీరాంకి పెళ్ళయిపోయిందా?
ఇంకో అమ్మాయిని చేసేసుకున్నాడా?
సౌందర్య రియాక్షన్ ని అంతగా గమనించలేదు శ్రీరాం. "ఆమె డాక్టరు! స్టన్నింగ్ బ్యూటీ! రేపు చూస్తావుగా!" అన్నాడు.
సౌందర్యకి దుఃఖం వచ్చింది.
ఆ అమ్మాయి డాక్టరు! స్టన్నింగ్ బ్యూటీ!
ఆలాంటప్పుడు తనని, వో సెక్రటరీని, వో మామూలు అమ్మాయిని అతనెందుకు చేసుకుంటాడు?
సౌందర్యా! నీకు బుద్ది లేదు! యూ ఆర్ రేవింగ్ మాడ్! క్రేజీ!
లేకపోతే అతని కోసం పగటి కలలు కనడమేమిటి?
"సౌందర్యా!" అన్నాడు శ్రీరాం కంగారుగా - "ఏమయింది?"
"ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి. నాకు లీవ్ కావాలి!"
"ఉండు! డాక్టర్ దగ్గరికి తీసుకెళతాను."
"వద్దు, వద్దు! ఇంటికెళ్ళి పడుకుంటే తగ్గిపోతుంది."
"కార్లో డ్రాప్ చెయ్యనా?"
"వద్దు! వద్దు! వద్దు!" అంది సౌందర్య గట్టిగా. "నేను వెళ్ళిపోతాను."
ఆమెని పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు శ్రీరాం.
హాండ్ బాగ్ తీసుకుని, ఒక్కసారి అతని కళ్ళలోకి చూసి, "వెళ్తాను, శ్రీరాం!" అంది. "బాస్" అనలేదు. "వెళ్ళి వస్తాను" అనలేదు.
"వెళ్తాను శ్రీరాం!" అని మాత్రం అన్నది. ఆమె గొంతులో దుఃఖపు జీర వినబడుతోంది.
కొద్ది క్షణాల తర్వాత కనుమరుగై పోయింది సౌందర్య.
* * * * *
అది మొదటి రాత్రి.
మేడమీద శ్రీరాం గది అలరించేలా అలంకరించి ఉంది.
బిడియ పడుతున్న మల్లె మొగ్గలా తెల్ల చీరెలో ముడుచుకుపోయి ఉంది ప్రతిమ.
శ్రీరాం రాసుకున్న సెంటు గదంతా మృదువుగా వ్యాపించింది.
"ప్రతిమా!" అని పిలిచాడు శ్రీరాం. అతని గొంతు తమకంగా ఉంది.
సాధించగలిగాడు తను!
ఈ అద్భుత సౌందర్యరాశిని తను సొంతం చేసేసుకున్నాడు.
గాడ్ ఈజ్ గ్రేట్!
ఏ అంతఃపుర రాకుమార్తెకో ఉండాల్సిన అందాన్ని ఈ మధ్య తరగతి అమ్మాయికి ఉదారంగా ఇచ్చేశాడు దేముడు.
ఈ ప్రతిమ - తన భార్య!
అతని వళ్ళు సంతోషంతో జలదరించింది.
"ఐయామ్ సారీ!" అంది ప్రతిమ.