అలాజ్వరం తెప్పించుకోమని అతనికి ఉచిత సలహా ఇచ్చింది జెయ్ చంద్రే! 'కాకిలా కలకాలం బతికి ఏం లాభంరా! హంసలా ఒక్కరోజు బతికినా చాలు! జ్వరం తెచ్చుకో! ఇద్దరు ప్రేమికుల్ని కలుపు! ఆ తర్వాత నువ్వు నిశ్చింతగా చచ్చిపోయినా ఎవరికీ దిగులుండదు." అన్నాడు.
"సర్లేవయ్యా! జ్వరం తెప్పించుకుంటాగానీ నీ కోసం చావను" అన్నాడు శేషు తెగేసి చెబుతూ.
"చావు సంగతి తర్వాత ఆలోచిద్దాంలేగానీ ముందు నువ్వు అడ్డం పడు" అన్నాడతను తొందరచేస్తూ.
మిత్రుడిమాట మన్నించి వెంటనే విరుచుకుపడిపోయాడు శేషు.
తక్షణం ఆనందంగా రాంపండుని పిల్చాడు జెయ్ చంద్ర.
"పాపం! శేషు విరుచుకుపడిపోయాడు! పాపం!" అని ప్రకటించేశాడు సంతోషంగా.
"ఇంకా బతికే వున్నాడా?" అన్నాడు రాంపండు బద్దకంగా.
"గిలగిలా తన్నుకుంటున్నాడు పాపం!"
"పాడెకట్టేవాళ్ళు పెద్ద బజార్లో వుంటారు. అక్కడ మనకి కన్సెషన్ రేటు. కుండలేమో పాట్ మార్కెట్ లో తేవచ్చు. శ్రాద్ధంబ్రాహ్మడికి ఇప్పుడే చెప్పి వుంచడంమంచిది. గిరాకీలు చాలా వుంటాయి" అన్నాడు రాంపండు.
"బాబోయ్! వీడు చాలా ముదురు!" అనుకున్నాడతను.
"మీ అక్క లేదా?" అన్నాడు ఎటో చూస్తూ.
"లేదు!" అన్నాడు రాంపండు.
"ఎక్కడికెళ్ళింది?"
"గోరింటాకు పెట్టడానికి"
ఎప్పుడొస్తుందీ?"
"శేషుకి జ్వరం తగ్గాక" అనేసి వెళ్ళిపోయాడు రాంపండు. వెళ్తూవెళ్తూ అతను కుక్క బిస్కెట్లు లాఘవంగా లేపుకెళ్ళిపోయాడు. ఆ సంగతి జెయ్ తాలూకు ఆల్సేషియన్ కుక్క కూడా గమనించలేదు.
జెయ్ చంద్రకి జుట్టు పీక్కోవాలనిపించింది.
మర్నాటిదాకాలేని జ్వరంతో బాధపడిపోతూ అట్లాగా పడుకున్నాడు శేషు.
ఆ తర్వాత అతనికింక ఓపిక చచ్చిపోయింది.
"నాకింకజ్వరం తగ్గిపోయిందిరా!" అన్నాడు లేచి 'తుండుగుడ్డ' భుజంమీద వేసుకుని బాత్రూంలాంటి దాన్లోకి వెళ్ళబోతూ.
వెంటనే అతనికి కాలు అడ్డం పెట్టి కిందపడేశాడు జెయ్ చంద్ర.
"లేచావంటే తోలు వల్చేస్తా! సితార ఇక్కడికి వచ్చేదాకా నీ జ్వరం తగ్గడానికి వీల్లేదు" అన్నాడతను హిట్లర్ లాగా.
"ఇట్టా ఏకధాటిగా రోజుల తరబడి జ్వరం నటించడం దుర్భరంరా" అన్నాడు శేషు హడలిపోయి.
"ఒరే!" అన్నాడతను జాలిగా చూస్తూ "చరిత్ర తిరగేసి చూడు! ఎంతమంది మహానుభావులు స్నేహం కోసం ఎన్నెన్ని మహత్తరమయిన త్యాగాలు చేశారూ! నువ్వొక్క రోజు నా కోసం అడ్డంపడరా అంటే ఏడ్చి మొత్తుకుంటావేమిటీ?"
"నాకిట్లా మహత్తరమైన త్యాగాలూ అవీ చేసేసి చరిత్రలో నిలబడిపోవాలని లేదురా?" అన్నాడు శేషు ఆవలిస్తూ.
అతనలా అంటుండగానే సితార సుడిగాల్లా గదిలోకి వచ్చేసింది. "ఏం శేషూ! జ్వరమా?" అంది ఆదుర్దాగా.
"అవును! విషజ్వరం" అన్నాడు జెయ్ చంద్ర.
"ఎప్పట్నుంచీ?"
"నిన్నట్నుంచి"
"మరి నాతో చెప్పలేదేం?"
"రాంపండుతో చెప్పానుగా!"
"రాంపండు నాతో అట్లా చెప్పలేదే?"
"మరేం చెప్పాడు?"
"మీకు పిచ్చెక్కిందని చెప్పాడు"
"నిజంగా చెప్పాడా?"
"ఇంకా ఇలా చెప్పాడు"
"ఏమని?"
"అవన్నీ చెబితే ఇప్పుడు మీకు జ్వరమొచ్చేస్తుంది" అంది సితార. ఆమె కళ్ళు నవ్వుతో మెరుస్తున్నాయి.
నవ్వుతున్నా కూడా ఆమె మొహం ఎందుకో అసహజమైన ఎరుపు రంగుకి తిరిగి వుండడం గమనించాడు అతను.
"ఏమైంది?" అన్నాడు ఆత్రంగా.
నీరసంగా నవ్వింది సితార "నాక్కూడా జ్వరం" అంది "నిజం జ్వరమే!" అంది.
"ఎప్పట్నుంచీ?" అన్నాడు అతను మళ్ళీ.
"నిన్నట్నుంచి!"
"అరెరెరె! మరిప్పుడెలాగ?" అన్నాడు అతను ఆదుర్దాగా.
"నన్ను మీ అమ్మగారి దగ్గరికి తీస్కెళ్ళండి. ఆవిడ గొప్ప డాక్టరు కదా! ఆవిడ నాకు ఓ ఇంజెక్షనిచ్చేస్తుంది. ఆ తర్వాత నేనింక ఈ లోకంలో వుండను. అప్పుడింక అందరి ప్రాబ్లెమ్సూ వరసబెట్టి తీరిపోతాయి" అంది సితార నెమ్మదిగా.
"సితారా! సితారా! ఏమిటది? ఎందుకలా మాట్లాడుతున్నావు?" అన్నాడు జెయ్ చంద్ర బాధగా.
అతి విషాదంగా నవ్వింది సితార. తర్వాత కంపిస్తున్న స్వరంతో అంది -
"మా బీదలగతి అంతే జెయ్ చంద్రబాబూ! మా కష్టాలు మావి. మీ సుఖాలు మీవి. మనవి రెండు లోకాలు. ఈ రెండులోకాలూ రైలుపట్టాల్లా సమాంతర సరళ రేఖలు. ఎప్పటికీ కల్సుకోవు జెయ్ చంద్రబాబూ!"
"సితారా!"
"మిమ్మల్ని నొప్పిస్తున్నాను జెయ్ చంద్రబాబూ! నాకు నిష్క్రతిలేదు. కానీ ఇంతకంటే నాకు వేరే మార్గమూ లేదు. మీ జీవితం నుంచి నేను శాశ్వతంగా తప్పుకుంటున్నాను."
"సితారా!" అన్నాడు అతను.
"జెయ్ చంద్రబాబూ! వచ్చే జన్మలోనైనా నేను మీ పాదధూళి రేణువుగా పుడితే అదే చాలు" అని వెనక్కి తిరిగింది సితార.
గట్టిగా ఆమె జడ పట్టుకుని ఆపాడు అతను.
"ఈ బెంగాలీ డైలాగులు చాల్చాలుగానీ, ఏం జరిగిందీ! అది చెప్పు."