త్రిలోకసుందరి ఏదన్నా అంటుందేమో అని వైజయంతి కాస్త ఆగింది. ఆపిల్ల బొత్తిగా పెదవి కదిపే ప్రయత్నం వీసమంతయినా కూడా చేయలేదు.
లాభంలేదు నేనే చెప్పేస్తేపోలా! అనుకుంది వైజయంతి వెంటనే కంఠం కాస్త గంభీర్యంగా మార్చుకుని మాంచి ఫోజొకటి పెట్టింది.
"ఇవన్నీ ఎందుకు కొన్నానంటే నేను రచయిత్రిని కావాలన్న సదుద్దేశ్యంతో."
కెవ్వుమంది త్రిలోకసుందరి.
"ఇంకోసారి అరిచావంటే పీక నొక్కుతా!" అంది వైజయంతి.
"సరేలే ముందీవిషయం చెప్పు. నువ్వు రచయిత్రివి అవుతావా?"
"ఊ..."
"కధలు రాస్తావా!"
"రాస్తాను. నీ తెలివి అఘోరించినట్లే వుంది. కధలు రాయంది రచయిత్రి ఎలా అవుతారే!"
"కధలు రాయటం రావుడ్డుటే!"
"రాస్తుంటే అదే వస్తుంది. రాయగా రాయగా రాత తీయగా తీయగా రాగం అన్నారు పెద్దలు..."
"ఎవరా అన్నది?"
"ఎవరో మహానుభావులు. సరేనా, నేను కధలు రాయను."
"వైజయంతీ! నీకు నిజంగా పిచ్చిపట్టిందే. లేక చచ్చిన ఏ రచయిత్రో దెయ్యమై పట్టివుంటుంది. రచయిత్రి నవుతాను కధలు రాస్తాను అని అయిదు నిమిషాలుకాలేదు. యింతలోనే కధలు రాయనంటుంటివి. నీతీరు నన్ను భయకంపితురాలిని చేస్తున్నది."
"పిచ్చి దానా, నా ప్రతిమాట అపార్ధం చేసుకుంటున్నావు. కధలు రాయను. మొదలు పెట్టటం పెట్టటం నవలలే. మొదలుపెట్టి రాశిపాడేస్తాను అని నే అన్నదాంట్లో అర్ధమన్న మాట!"
"అన్నప్రాసన నాడే ఆవకాయ తిన్నట్లు."
"పోనీ అలాగే అనుకో."
"నవలకన్నా కధ రాయటం తేలికనుకుంటా!"
"కాదు. ప్రఖ్యాత రచయిత హరభీషణరావు ఏం చెప్పాడు. ఒక మినీకధ రాయటంకన్నా పెద్ద నవల రాయటం చాలా తేలిక అన్నారు. అందుకని నేను నవలతోనే రచన ప్రారంభిస్తాను."
"ఏం నవల రాద్దామనుకుంటున్నావ్?"
"ప్రేమనవల. ప్రేమను మించినది ఏముంది?"
"నిజమేనే వైజయంతీ! కానీ...!"
"ఇది కానీ అర్ధణాల రోజులు కావు. అనుమానంవుంటే తీర్చుకో."
"ప్రేమ నవలలు కాస్త పాతపడ్డాయి."
"ప్రేమ నిత్యనూతనం."
"అఫ్ కోర్స్ నేను కాదనటంలేదు. ప్రేమ కధావస్తువగా తీసుకుని నవల రాసేవిషయం గురించి అన్నాను. పైగా ప్రేమ రచయిత్రి యద్దనపూడి ప్రేమ విషయంలో తిరుగులేని మహాపేరుబడ్డ రచయిత్రి కదా!"
"వాక్యదోషము. వాక్యదోషము ప్రేమ విషయంలో అనకూడదు. ప్రేమ నవలలు రాసే విషయంలో అనాలి."
"అదేలేవే."
"రచయిత్రి భాష సరిగా వాడాలి."
"నీకు తెలుసో తెలియదో రైటర్స్ కి భాష సరిగా రాదు"
"అది నాకు తెలియదుగాని ప్రేమ నవలలుమట్టుకు రాయకు. ఈ మధ్య మరో రచయిత్రి యద్దనపూడిలా రాయబోయి వెల్లికిలా పడింది."
"విప్లవం గురించి రాద్దామంటే బొత్తిగా విప్లవం గురించి తెలిసి చావదాయె. పనిమనిషి ఎదురు తిరగటంకూడా విప్లవమే అంటారు. అది నాకు నచ్చదు. నచ్చని విషయాన్ని ఎలా రాయను చెప్పు" అంది వైజయంతి.