"నేచెబుతాకానీ, ఓసారి చూడనీ అలా పడుకో ఎన్నో నెలవచ్చిందో ఏమిటో చూస్తాను" వచ్చిన పని నెరవేర్చడానికి అంది అరుణ.
'సూసేదేముంది? అయిదోనెల నాకు తెలియదా ఏమిటి సూడండి కావలస్తే డాక్టరమ్మగారు' వీరడు ఉత్తరం పంపినట్లు మా నాంతో అనకండేం? అదిగో మా అమ్మొస్తున్నాది. నేను చెప్పినట్లు అనకండేం?" పడుకుంటూ అంది ఆ యువతి.
అరుణ పరీక్షచేసి అయిదు నెలలుకూడా నిండిపోయాయి అని నిశ్చయించుకుంది. ఇలాంటి స్థితిలో మందులు మాకులు ఇచ్చి గర్భ విచ్చేదనం చేస్తే అసలు పెద్ద ప్రాణానికే ముప్పు అసలు ఇలాంటి పని చేయడం తన వృత్తిధర్మానికి విరుద్దం అసలుసంగతి తెలియక తను వచ్చిందిగాని. ఈ సంగతి తెలిస్తే ముందే రాకపోను. వృత్తిధర్మానికి, చట్టానికి విరుద్దమయిన పనితను చేయదు. చేతనయితే ప్రాణం పోయాలి గాని, తీయడం తమపని గాదు. ఈకేసులో తనుచేసే సహాయంఏమన్నా ఉంటే, ప్రెసిడెంట్ గారికి' ఆమెకి పెళ్ళి చేసి పంపేయమని చెప్పడంవరకే. తన చేతిలో ఉన్నది ఆయనకినచ్చచెప్పడంవరకే.
"డాక్టరమ్మగారూచూశారా? మా కొంప ఎలా ముంచిందో సూశారా? తమరు పుణ్యంగట్టుకుని ఏదో చేయండి" ప్రెసిడెంట్ భార్యగదిలోకి వస్తూ అంది.
"లాభంలేదండీ అయిదునెలలు కూడా నిండిపోయాయి. ఇప్పుడేం చేసినా పెద్దప్రాణానికే ముప్పు అయిన అలాంటి మందులు అవి ఈయడం నావల్లగాదు. అలాంటివి మేం ఈయకూడదు.
ప్రెసిడెంట్ భార్య వెర్రిముఖం వేసుకు చూసింది. ప్రెసిడెంట్ గారు గదిలోకి వచ్చేశారు, అరుణ ఎంతకీ బయటికి రాకపోవడం చూసి, వస్తూనే కూతురివైపు ఏహ్యమైన చూపొకటి విసిరాడు. అది అరుణ దృష్టినపడకపోలేదు.
"డాక్టరమ్మగారూ: త్వరగా ఏదో ఒకటి చేసేయండి ఇప్పటికే చాలా ఆలస్యంఅయిపోయింది. ఊళ్ళో బుర్రెత్తుకుతిరగలేను నలుగురికి తెలిసిందంటే."
"క్షమించండి, అలాంటి పని చేయడంనావల్ల కాదు. డాక్టరయిననేను ఆపని చేయకూడదు. అసలు ఇప్పుడు మీరు అలాంటిపనులు ఏమన్నా తల పెట్టడం అమ్మాయికే ముప్పు, ఆరోనెలకూడా వచ్చింది."
"సావనీండి, అది సస్తే నాకేం బాధలేదు. మీరు మందిచ్చేయండి. ఆపైన ఏది జరిగితే అది జరుగుతుంది. అంతేగాని, ఇది చేసినపని నలుగురిలో బయటపడితే ఈ ఊళ్ళో ముఖం సూపించలేను. డాక్టరమ్మ గారూ ఇవి సేతులుకావు. మీమీద నమ్మకం ఉంచి, నాకీసాయం చేస్తారని మిమ్మల్ని పిలుసుకొచ్చాను" కూతురేమయినా ఫరవాలేదుపరువు ముఖ్యం అన్నట్లుగబగబ అన్నాడు.
"క్షమించండి నేను అలాంటిపని చేయను. అయినా, మీ అమ్మాయి దీనికి ఎంతమాత్రం ఒప్పుకోవడంలేదు, అయినా రెడ్డిగారూనేనొకటి చెబుతాను వింటారా? మీ అమ్మాయికి చిన్నతనంలో నే భర్త పోయాడు కాపురం చేయలేదు. పాపం, బ్రతుకంతకాలం ఇలాగే గడిపేయమంటారా అరుణ అమ్మాయిని విధవావివాహాలు ఎందరోచేస్తున్నారు ఈ రోజుల్లో మీ అమ్మాయిని చేసుకుంటాననుముందుకొచ్చిన ఆ వీరడికిచ్చి పెళ్ళిచేస్తే హాయిగా వాళ్ళిద్దరూ బతుకుతారు. పెళ్ళిచేస్తే మీ పరువు బజారెక్కుతుందన్న భయం కూడా ఉండదు."
అరుణ మాటలు పూర్తికాకుండానే కూతురి వంక క్రోధంగా మింగేసేట్టు చూశాడాయన. "ఈ కూతలన్నీ డాక్టరమ్మ గారి దగ్గర కూడా కూశావా?"
ఆ అమ్మాయి ఏం భయపడలేదు. అరుణ దగ్గరుందన్ననిబ్బరంతో గాబోలు నిర్లక్ష్యంగా "ఆ ఆ డాక్టరమ్మ గారితో అంతా సెప్పాను. సస్తాగానీ నేనేంమందులు మింగను. రోజూ నన్ను కొట్టిసంపుతున్నావని కూడా చెప్పాను. వీరన్నితన్ని తగిలేశావనికూడా సెప్పాను" అని కసిగా అంటూంది ఆ అమ్మాయి. తండ్రిరహస్యాలన్నీ బయట పెట్టేసిన విజయగర్వం ఆమె మొహంలో తొంగిచూస్తూంది.
"నోర్ముయ్' సంపేస్తాను. నోరెత్తావంటే ఎదవ పనిచేసి సిగ్గులేకుండా ఇంకా పేల్తన్నావు. ఆన్ని ...... ఆన్ని...... ఆ వీరిగాడిని తన్నడం కాదు. ఈసారి కనిపిస్తే ఉప్పుపాతరవేయిస్తా" ఎర్రటి కళ్ళతోరౌద్రంగా అరుణ దగ్గిరున్నట్టే గుర్తులేక కూతురి మీదికి వెళ్ళాడు అరుణకే అతని అవతారం చూస్తే భయం వేసింది.
"రెడ్డిగారూ వినండొకమాట. మీ ఇంటివిషయం నాకనవసరమే అనుకోండి. అయినా ఆ అమ్మాయి అంతా చెప్పింది. నా సలహాఏమిటంటే ఇదేదో నలుగురికి తెలియకముందే అరుణ వీరన్ని పిలిచి అమ్మాయి పెళ్ళి చేసేయండి. ఆ పిల్ల కోరికా తీరుతుంది. మీ పరువూ మిగులుతుంది.
"డాక్టరుగారూ: "ఈసారి ప్రెసిడెంట్ గారి కోపం అరుణ మీదికి తిరిగింది" డాక్టరుగారూ మీరు మందిస్తారని పిలిచాను కానీ, దాని మాటలుపట్టుకుని నాకు సలహాలీయడానికి కాదు. వీరిగాడు...... ఆ వెధవ కమతగాడికి నా కూతుర్నిచ్చి పెళ్ళి సేయాలా? ఈ మొగుడు సచ్చిందానికి ఈ వెధవ బుద్దులేం? తిని కూకోలేక కండతిమ్మిరెక్కి పాలేరుగాడితో సరసాలా: ఎదవముండని సంపేత్తాను. సిగ్గుమాలినఎదవపని సేయడమేకాక, ఇంకా ఆన్ని పెళ్ళాడతదట. "కన్న కూతుర్ని ఇంకో పరాయిమనిషి ఎదటే బండబూతులు తిడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడే అతన్ని చూస్తూంటే అరుణకిఅసహ్యం వేసింది. అనవసరంగా వీళ్ళగొడవల్లో తను ఇరుక్కోవడం......అసహాయకరమైన ఈ వెధవ గోల తనకెందుకు? వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుని ఆ అమ్మాయివంక చూసింది అరుణ. ఆ అమ్మాయి కళ్ళలోవేడికోలు, అభ్యర్ధన నీటమునిగేవాడు గట్టున ఉన్న మనిషిని రక్షించమని ప్రాధేయపడేప్రార్ధన. తండ్రికి ఏదో నచ్చచెపుతుందన్న నమ్మకంతో ఉన్న ఆమెని చూస్తే, అరుణ అడుగుముందుకు పడలేక ఆఖరిసారిగా నచ్చచెప్పిచూద్దామని నిర్ణయించుకుంది.
"రెడ్డిగారూ, మీరు ఆవేశం తగ్గించుకుని కాస్త స్థిమితంగా ఆలోచించుకోండి. జరిగింది ఎలాగో జరిగింది. ఇప్పుడింక ఏదన్నా చేసే స్టేజి దాటిపోయింది. మీ అమ్మాయికి పెళ్ళిచెయ్యడం కంటే మీ పరువు కాపాడుకోవడానికి మరో మార్గం లేదు."
"ఈల్లేదు, సచ్చినా ఆ వెధవకి నా కూతుర్నీయను. మా దెలాంటివంశమో తెల్సానా దగ్గిర పాలికాపువోడికిచ్చి కూతురి పెళ్ళి చేస్తానా: మళ్ళీ ముఖం ఎట్టా ఎత్తుకు తిరుగుతాను వీల్లేదు. డాక్టరమ్మ గోరూ మందిచ్చేయండి ఏదెట్టా జరుగుతుందో అట్టా జరుగుతుంది. ఇది మొండిఘటం, ఏంకాదులెండి, దీన్నిమించిన మొండిఘటంలా ఉంది ఆ పిండం" న్యాయం, చట్టం అన్న భయంలేకపోతే కూతుర్ని హత్యచేయడానికి వెనకాడని కసి, ద్వేషం ఆయన మాటలలో కనిపిస్తున్నాయి.
"ఇందాకనే చెప్పాను. ఈ విషయంలో నేనేం చెయ్యలేనని. అలాంటి పని నేనుచేయలేనువస్తాను."
రెడ్డిగారు కలవరపడుతూ అరుణకి అడ్డంగా వచ్చి నిల్చున్నారు.
"ఇలానట్టేట్లో వదిలేసివెళ్ళిపోతానంటే ఎలా, డాక్టరుగారూ? మీరేదో తోవచూపిస్తారని మిమ్మల్నిపిలిచాను. నా పరువు మీ చేతుల్లో పెట్టాను. ఇలా వదిలేసి వెళ్ళిపోతే నాపరువేం అవుతుంది మిమ్మల్నినమ్మి పిలిచాను.
"మీపరువు నా ద్వారా బజారుకెక్కదులెండి. ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి.
నేనేసహాయపడలేను. వెళ్ళనివ్వండి నాకోసం అక్కడ పేషెంట్లు కాచుకుని ఉంటారు" అడ్డుగా నిలుచున్నా రెడ్డిగారిని అసహనంగా చూస్తూ అంది అరుణ.
"ఊహు ఇదేదో తేల్చేస్తేకాని మిమ్మల్ని వెళ్ళనిచ్చేదిలేదు" రెడ్డిగారు ముఖం కఠినంగా మారుతూంది. అంతవరకు తెచ్చిపెట్టుకున్న సౌమ్యం అణకువ నటన అని తెలిసిపోతూంది.
"వెళ్ళనీయరూ? ఏమిటి మీరనేది?" అరుణకికోపంతోపాటు విస్మయం కూడా కలిగింది. ఎంత ధైర్యం: తనక్రింద పాలేరు వాడిని ఆజ్ఞాపించినట్లు మాట్లాడుతాడేమిటి తనతో?
"అవును మిమ్మల్ని పిలిచినా గుట్టంత మీకు తెల్సాక మీరు ఏం చెయ్యలేనని వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనిస్తానా?"
"వెళ్ళిపోనీయక ఏం చేస్తారు? ఇదేం జబర్ధస్తీనా నా కిష్టం లేని పని చేయనంటేదానికి ఈ రాద్దాంతం ఏమిటి?' అరుణకి కోపం కట్టలుతెంచుకుంటూ వస్తూంది. తీక్షణంగా చూసింది. "నేనీ ఊరికి ప్రెసిడెంట్ ని అన్నమాట మరిచిపోకండి. నన్నుకాదని ఇంతవరకు ఈ ఊళ్ళో ఎవరూ బ్రతకలేదు" క్రూరంగా చూస్తూ అన్నాడు రెడ్డిగారు.
"ఆపండి మీ బెదిరింపులు, ప్రెసిడెంట్ అవచ్చు, మినిష్టర్ అవచ్చు మీరు. నన్ను శాసించడానికి మీరెవరు మీ క్రింద నేను పనిచేయడం లేదని గుర్తుంచుకోండి. దారి వదలండి. లేకపోతే చాలా అనర్ధాలు జరుగుతాయి. ఇంతవరకు ఏదో పెద్దమనుషులని అనుకున్నాను. మీ నిజస్వరూపం తెలిసింది. మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి."తీక్షణంగా అని రెడ్డిగారి చేయి తోసేసి వెళ్ళిపోయింది గది అవతలకి అరుణ. "హు పాముతోచలగాటం" కర్కశంగా అన్నాడు వెనకనించి. అరుణ నిర్లక్ష్యంగా నవ్వి బాగ్ తీసుకుంది చేతిలోకి.
"రెడ్డిగారూ, మిమ్మల్ని పోలీసులకి అప్పగించగలను నేను. ఇలా బెదిరిస్తున్నారనేకాదు, చట్టవిరుద్దమైన అబార్షన్ చేయించడానికి మీ అమ్మాయిని బలవంతపెడుతున్నారని పోలీసులకి రిపోర్టు ఇస్తాను. ఆమెనిరోజూ హింసిస్తున్నారని అన్నీ చెప్పి మిమ్మల్ని పోలీసులకి అప్పచెపుతాను. మర్యాదగా మెసలడం నేర్చుకోండి. బెదిరింపులు నాకూ వచ్చు. బెదిరింపుకాదు. మళ్ళీ ఆ అమ్మాయికి అబార్షన్ కి ఏమన్నా ప్రయత్నించితే పోలీసులకి రిపోర్టు వెడుతుంది వస్తాను,"
చేతకాని కోపంతో నిప్పులు కక్కుతున్న రెడ్డిగారిని, తెల్లబోయిచూస్తూన్న ప్రెసిడెంట్ భార్యని, బాగా శాస్తి జరుగుతూందన్నట్లు సంతోషం ముఖంలో కనిపిస్తూంటే మెచ్చుకోలుగా చూస్తున్న రెడ్డిగారి కూతుర్ని వదిలివిసవిస మెట్లు దిగి వెళ్ళిపోయింది అరుణ.