Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 28

మామ్మగారికి అక్కర్లేని గొడవలు వుండవు. పూజసామాన్లు చింతపండు వేసి పరపరా తోముతూ "శక్తీ.... నువ్వు ఆ మూడురోజులూ ఈ చేద ముట్టుకోకు. నీకు నమ్మకం లేకపోయినా మాకోసం" అంది.
ఆమె మాట్లాడకుండా మీనాక్షికి నీళ్ళుతోడి పోసింది.
మామ్మగారి చేతిలో ఆ దేవుళ్ళవీపులు పెచ్చురేగిపోతున్నాయి. ఉప్పూ, చింతపండూ ఇంకాస్త వేసి రుద్దుతూ వాళ్ళ మిలమిలలు చూసి మురిసిపోతోంది.
"ఏం శక్తీ.... అస్సలు నువ్వు ఇంట్లోకి చేరాకా ఒక్కసారీ కూర్చోలేదే?" మీనాక్షి విడ్డూరంగా చూస్తూ అడిగింది.
"అవును.... నేనూ గమనించలేదేమిటి చెప్మా!" మామ్మగారు చింతపండు చెయ్యి బుగ్గన పెట్టుకుని ఆశ్చర్యపడింది.
శక్తి కుంకుడుకాయలు గిన్నెలోకి ఎత్తుతూ తలెత్తి చూసింది. వాళ్ళిద్దరూ కుతూహలంగా తనవంకే చూస్తున్నారు. ఆమెకికూడా సందేహం వచ్చింది. బావిపళ్ళెంమీద సెటిలై వేళ్ళు ముడుస్తూ "పన్నెండు, పదమూడు, పద్నాలుగు.... అమ్మో! పదిరోజులు మించేపోయాయి. నేనూ గమనించలేదు మామ్మగారూ" అంది.
"ఆ....!!" మామ్మగారు నోరు యింకా పెద్దగా తెరిచి ఆశ్చర్యపోయింది.
"ఇంకేం? నీళ్ళోసుకున్నావన్నమాట "మీనాక్షి సంబరంగా అరిచింది.
"మా తల్లే... మా తల్లే...." మామ్మగారు దగ్గరకొచ్చి మెటికలు విరిచి ముద్దు పెట్టుకుంది.
"కానీ మామ్మగారూ.... ఇది అదేనా?" దిగులుగా అడిగింది శక్తి.
"అదేనే పిచ్చితల్లీ....ముఖం చూడు నిమ్మపండులా నిగనిగలాడుతోంది" అంది మామ్మగారు.
"మరి మొదటి బిడ్డ అప్పుడే వద్దు..."
ఇంకో బిడ్డ అసలే వదఅంటున్నారు కదా!" శక్తి సందేహంగా అంది.
"అంటారే తల్లీ! అప్పటివాళ్ళు కడుపునిండా కంటే అన్నపూర్ణ అన్నారు. ఇప్పటి వాళ్ళు గొడ్రాలిగా వుండు అవార్డులిస్తాం అంటున్నారు" మామ్మగారు అక్కసుగా అంది.
"కొంచెం ఆగాల్సింది" అంది శక్తి.
"ఇప్పుడు అనుకొని ఏం లాభం? అప్పుడు వుండాలి ఆ తెలివి..." వేళాకోళం చేసింది మీనాక్షి.
"నే చెపితే విన్నాడా?" విసుగ్గా అంది శక్తి.
"ఏం చెప్పావు?" అడిగింది మీనాక్షి.
శక్తి చెప్పబోయి ఆగిపోయి "నయమే చెప్పాను కాదు.... ఛీ....పాడు" అంటూ లోపలికి వచ్చేసింది.
మీనాక్షీ, మామ్మగారు నవ్వడం ఆమెకి వినిపిస్తూనే వుంది.
                                                              * * *
"రావయ్యా.... రా.... ముందు ఈ చక్కర నోట్లో వేసుకో ఆ తరువాత తియ్యని కబురు విందువుగాని" మామ్మగారు ఇంద్రనీల్ కి ఎదురెళ్ళి నానా హైరానా పడిపోతూ, ఆనందంతో దొర్లిపోతూ, గుప్పెడు చక్కెర అతని నోట్లో పోసింది.
"ఎందుకూ?" ఉక్కిరిబిక్కిరౌతూ అడిగాడు.
"ఆ....! పక్కింట్లో ఆవు చూడి కట్టింది" అందావిడ.
"ఓహ్! వెరీగుడ్" సంతోషంగా అన్నాడు ఇంద్రనీల్.
ఆవిడ నుదురు కొట్టుకుని "అబ్బా! పక్కింట్లో అయితే నీకెందుకు చెప్తానూ? నీ యింటిలోనే నీ సొంతపెళ్ళాం నిన్ను తండ్రిని చేస్తోంది" అంది.
"ఆ!" అని ఇంద్రనీల్ ఆవిడ్ని అమాంతం ఎత్తేశాడు.
లోపల్నుంచొస్తున్న తాతగారు, "తండ్రిని చేస్తున్నది మీ ఆవిడ....మా ఆవిడ కాదు! దాన్ని వదిలిపెట్టు" అన్నాడు.
"నెమ్మది నాయనా....వదిలిపెట్టమన్నారని అమాంతం వదిలెయ్యకు" భయంగా అరిచిందావిడ.
ఇంద్రనీల్ ఆవిణ్ణి నెమ్మదిగా దింపి "శక్తి ఏదీ?" అన్నాడు.
"బ్యాంక్ లో వుంటుంది వెళ్ళు" అందావిడ.
బ్యాంక్ లో...
"ఏమిటీ అంత కంగారుగా అడుగుతున్నారూ? శక్తి ఈవేళ సెలవు పెట్టింది. వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళింది అనుకుంట!" అంది తార.
ఇంద్రనీల్ ఆమె వాక్యం పూర్తవగానే "థాంక్స్" అంటూ పరుగులాంటి నడకతో బయటికి వచ్చి ఆటో ఎక్కి గోపాలరావుగారింటికి పోనిచ్చాడు.
ఇంటికి పెద్దతాళం కప్ప వేళ్ళాడుతోంది.
ఉస్సూరుమని నిట్టూరుస్తూ నిలబడి వుండగా, పక్కింటావిడ వచ్చి మీరు శక్తిమతి భర్తకదూ?" అంది.
అతను నీరసంగా తలవూపాడు.
"శక్తీవాళ్ళు మాలతీ నర్సింగ్ హోంకి వెళ్ళారు. తాళంచెవి యిచ్చారు. కావాలా?" అంది.
"అక్కర్లేదు థాంక్స్" అని మళ్ళీ హుషారుగా ఇంద్రనీల్ మాలతీ నర్సింగ్ హోంకి వెళ్ళాడు.
నర్సింగ్ హోంనిండా పేషెంట్లు బిలబిలలాడుతూ వున్నారు.
మాలతి అటుగా వస్తూ ఇంద్రనీల్ ని గుర్తుపట్టి "హాయ్..." అంది.
ఇంద్రనీల్ కూడా "హాయ్..." అని "శక్తి వచ్చిందా డాక్టర్?" అన్నాడు.
"శక్తి వచ్చిందిగా.... ఆ అబార్షన్ ఇప్పుడే చేశాను" అని చెప్పి నర్స్ పిలవగానే "ఎక్స్ క్యూజ్ మీ, ఇప్పుడే వస్తా" అంటూ అటు వెళ్ళిపోయింది మాలతి.
ఆమె మాటలకు ఇంద్రనీల్ తను నిలబడ్డ భూమి పాతాళంలోకి కుంగిపోతున్నట్లుగా అనిపించింది.
"ఆ మధురమైన విషయం విన్నప్పటినుంచీ ఎన్ని గాలిమేడలు కట్టుకున్నాడూ! తనకంటూ ఎవరూ లేని ప్రపంచంలో తను సృష్టించిన ఓ బుల్లిప్రాణి! తన రక్తం.... తన అంశ జన్మించి 'నాన్నా!' అని పిలుస్తుందని ఆశ పడ్డాడు. రంగుల కలల్లో తేలిపోయాడు. స్వర్గం చేతికి అందినంతగా మురిసిపోయాడు. కానీ.... శక్తి.... ఇలా చేసిందేమిటీ? ఎవరు నేర్పిన బుద్ది ఇదీ? మాతృత్వాన్ని కాలదన్నుకునేంత మూర్ఖురాలా ఆమె? ఎంత మొండిగా చేసినా తనేం అనలేదే కానీ ఇంత ముఖ్యమైన విషయం కూడా తనతో సంప్రదించకుండా స్వయం నిర్ణయం తీసుకుంటుందా! ఆ ప్రాణిమీద తనకి హక్కేం లేదా?
అతని గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. దవడ కండరం బిగుసుకుంది. రక్తం చిందుతుందా అన్నంతగా ముఖం ఎర్రబడింది.

 Previous Page Next Page