"మా అన్నయ్య అలా ఎప్పుడైనా శ్రమని అనుకుంటాడా? అర్ధరాత్రైనా ఏ అవసరం పడినా పిలిస్తే పరిగెత్తుకు వస్తాడు. ఆయన లేకుంటే ఆయన పెళ్ళాన్ని మేం ఈ మాత్రం చూసుకోవద్దూ" ఆప్యాయంగా అంది.
"నువ్వు లేకపోయినా నీ మంచితనం ఆ లోటు భర్తీ చేసింది నీల్" అనుకుంది శక్తి.
శక్తికి ఆ మాటా ఈ మాటా చెబుతూ వడ్డించి కడుపునిండా పెట్టింది మీనాక్షి.
"మొత్తానికి మీ అన్నయ్య డ్యూటీ నువ్వు చేశావు" అంది శక్తి.
"ఇంకోటి మాత్రం నావల్లకాదు వదినమ్మా!" కిసుక్కున నవ్వింది మీనాక్షి.
ఆమె భావం అర్ధమై శక్తి సిగ్గుపడింది.
"అన్నయ్య ఏ వూరెళ్ళాడూ?" గిన్నెలు సర్దుతూ మీనాక్షి అడిగింది.
మళ్ళీ శక్తి మనసంతా వ్యాకులమైపోయింది. కొత్తగా పెళ్ళయినప్పుడు భర్త కనుమరుగైది భార్య ఆరాలు తీస్తుంది. కానీ తానా భాగ్యానికి నోచుకోలేదు. అతనికి ఎవరున్నారో, ఎవరు లేరో కూడా తెలీదు. అసలు రాకపోతే?
ఆమె గుండె గుభిల్లుమంది.
తనెలా బతుకుతుందీ? ఈ స్త్రీవాదం, స్వేచ్చా, స్వాతంత్ర్యం అన్నీ జానేదో.... అతను లేకుండా తను ఎలా వుండగలదు?
"నిన్ను చూడకుండా ఎక్కువరోజులు వుండలేడులే.... ఎల్లుండి తిరుగుటపాలో రాడూ! నే వస్తా.... తలుపేసుకో భయం అయితే చెప్పు నేనిక్కడే పడుకుంటా" అంది.
"వద్దు నాకేం భయంలేదు. థాంక్స్ మీనాక్షీ" అని ఆమెని పంపి తలుపేసుకుంది శక్తి.
'నువ్వు లేనప్పుడు నీ వియోగంలోని బాధ తెలిస్తే, నువ్వు వున్నప్పుడు నీ సామీప్యంలోని సౌఖ్యం యింకా బాగా అర్ధమవుతుంది' అనుకుంది.
"రా... రా....నాన్నా! శక్తి వచ్చింది" అంది ఆనందంగా సుమతి.
శక్తి తనతో తెచ్చిన పండ్లూ, బిస్కెట్లూ వున్న బుట్ట అక్కకి అందిస్తూ "ఏంటక్కా....ఇలా అయిపోయావేంటీ? వంట్లో ఎలా వుందీ?" అంది.
సుమతి చాలా నీరసంగా, చెక్కిళ్ళు లోనికి పీక్కుపోయి కన్పిస్తోంది. కళ్ళుకూడా గాజుగుడ్డలా నిర్జీవంగా వున్నాయి.
లోపలనుంచి తండ్రి వచ్చి, "అలా వుండక ఇంకెలా వుంటుంది? డాక్టర్ చెప్పింది అస్సలు రక్తం లేదని. ఈ పరిస్థితిలో ప్రెగ్నెన్సీ మంచిది కాదనికూడా చెప్పింది. పైగా మళ్ళీ ఆడపిల్ల పుడితే భర్త వూర్కోడనే మనోవ్యధ ఒకటీ" అన్నాడు.
శక్తి అసహనంగా "నీకే ఓపిక లేదు. ఈ స్థితిలో మరో జీవిని మోస్తావా? ఆ పుట్టేవాళ్ళు మాత్రం ఏమంత ఆరోగ్యంగా వుంటారనీ? పద.... మాలతి దగ్గిరికివెళ్ళి తీయించేసుకుందువుగాని" అంది.
"ఆయన వూర్కోడు" బేలగా అంది సుమతి.
"తీయించామని చెప్పక్కర్లేదు. పోయింది అందాం" అన్నాడు తండ్రి.
"అబద్దం ఎందుకు నాన్నా? ఆయనకి తన కొడుకు ఎంత ముఖ్యమో నీకు నీ బిడ్డప్రాణం అంత ముఖ్యం కాదా? అన్నింటికీ అంత భయపడ్తా వెందుకూ? వదిలి పెట్టేస్తాడనా? వదిలెయ్యమను.... అంతగా అయితే ఇక్కడే వుండిపోతుంది" అని విరుచుకుపడింది శక్తి.
"అలా అంటే ఇంకోపెళ్ళి చేసుకోవడానికి సిద్దంగా వున్నాడు మీ బావ" బాధగా అంది సుమతి.
శక్తి అక్కవైపు జాలిగా చూసింది.
నాలుగురోజులు పెంచిన పిల్లిపిల్ల దూరం అయితేనే బెంగపడతాం. అలాంటిది తాళి కట్టించుకొని తననే నమ్మి వచ్చి కాపురం చేసే ఆడదాన్ని ఎన్నేళ్ళయినా సరే అవకాశం వస్తే వదిలేద్దాం అని చూసే ఈ టైపు మగాళ్ళని ఏం చేస్తే వాళ్ళకి బుద్ది వస్తుందీ?
"ఏం వదిలెయ్యడు.... అంతా బెదిరింపు" అంది.
సుమతి కొంగు నోట్లో కుక్కుకొని వెక్కిళ్ళు పడుతూ "నీకు తెలీదు.....ఈ మధ్య ఇంటికికూడా సరిగ్గా రావడంలేదు. ఎవర్తోనో తిరుగుతున్నాడని విన్నాను" అంది.
"ఇలాంటివన్నీ చూస్తేకానీ నమ్మకూడదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అని వదంతి పుట్టిస్తారు" అంది అక్కని వూరడిస్తూ శక్తి.
"నేనూ ఓసారి యిద్దరూ కలిసి ఆటోలో ఎక్కడం చూశాను" అంది సుమతి.
ఆమె ఇంకేం మాట్లాడలేనట్లు చూసింది.
గోపాలరావు మనవరాలిని ఒళ్ళోకి తీసుకుని విచారంగా కూర్చుని కనిపించాడు.
"ఇంక లాభంలేదు! నువ్వు రేపు మాలతి దగ్గరికి నడవాల్సిందే! ఈ పిల్లచాలు చక్కగా పెంచి పెద్ద చెయ్యి" అంది శక్తి.
"కానీ..." భయంగా చూసింది సుమతి.
"ఇప్పుడు తలమీద పెట్టుకుంటున్నాడనా, రేపు తంతాడని భయపడటానికి! నే చెప్పినట్లు విను" అంది శక్తి.
సుమతి తండ్రివైపు చూసింది.
"శక్తి చెప్పింది సరిగ్గానే వుంది" అన్నాడాయన.
"రేపు సాయంత్రం నేను ఇదే సమయానికి వస్తాను. ఓ చీరా, జాకెట్టూ, దుప్పటీ బుట్టలో పెట్టుకుని రెడీగా వుండు. నేను ఇప్పుడే మాలతికి ఫోన్ చేసి మాట్లాడ్తాను" అంది శక్తి.
శక్తి వచ్చేటప్పుడు అంత నీరసంలోనూ లేచి బొట్టుపెట్టడం మర్చిపోలేదు సుమతి.
'ఈ పసుపుకుంకాల దగ్గరే ఎక్స్ ప్లాయిట్ అవుతున్నారీ ఆడవాళ్ళు' అనుకుంది శక్తి.
* * *
శక్తి బావిదగ్గర కుంకుడుకాయలు కొడుతుంటే వచ్చింది మీనాక్షి.
"శక్తీ... నేను ముట్టుకోకూడదు కానీ, నా బక్కెట్లో కాసిని నీళ్ళు తోడి పొయ్యి" అంది.
ప్రతినెలా మీనాక్షి చేసే ఈ ఎగ్జిబిషన్ శక్తికి ఒళ్ళుమంట. ఆ సమయంలో ఇంద్రనీల్ వెళ్ళి వంటసాయం చేసొచ్చి శక్తిచేత తిట్లు తిన్నాడు కూడానూ.