ఆ మాటకు చివుక్కున తలెత్తి ఆమె వైపు చూశాడు అభినవ్.
"సీ మైడియర్ బిల్డన్ ఫ్రెండ్. ఆర్ట్ ఈజ్ ఆర్ట్ ఫర్ సేక్ అనే నమ్మకం నుంచి చాలా కాలం క్రితమే ఇండియన్ ఆర్టిస్టులు బయటికొచ్చేశారు. మీరు బాగా ఇష్టపడి, ప్రేమించే రాజా రవివర్మ భారతీయ చిత్రకళలోని వైవిధ్యానికి ఆధ్యుడు కూడా. అలనాటి రాజులు, రాణులు బొమ్మలు వేసినందుకు ఆయన్ని బిజినెస్ మేన్ అంటారా? ప్రతి కళాకారుడికి గుర్తింపు అవసరం అవకాశం వచ్చినప్పుడు ఆ గుర్తింపును తన ఎదుగుదలకు కళాకారుడు వుపయోగించు కోవాలి. కాదంటారా?"
ప్రశ్నించిందామె.
ఆ ప్రశ్నలో అపారమైన జీవిత సత్యం వుంది.
అభినవ్ కనుల ముందు ఒక్కసారి రాజా రవివర్మ మెదిలాడు.
కేరళకు చెందిన రవివర్మ గొప్ప చిత్రకారుడని చాలామందికి తెలిసినప్పటికీ అంతకుమించిన వివరాలు ఎక్కువమందికి తెలియవు. రవివర్మ త్రివేండ్రం సమీపంలో ఉన్న కిలిమనూర్లో 1848లో జన్మించాడు. ఒక రాక వంశానికి చెందిన రవివర్మ పధ్నాలుగో సంవత్సరంలో చిత్రించిన కొన్ని చిత్రాల్ని చూసి ట్రావెంకూర మహారాజు మెచ్చుకుని ప్రత్యేకంగా ఒక ఆర్ట్ సెంటరును ఏర్పాటు చేసి యూరోపియన్ ఆర్ట్ బుక్స్ ను విరివిగా తెప్పించాడు.
రవివర్మ పెయింటింగ్స్ మీద గల పాశ్చాత్య ప్రభావానికి అసలైన కారణం అదే. 1870 ప్రాంతంలోనే తైలవర్ణ చిత్రలేఖనంలో అద్భుతమైన చిత్రకారుడిగా పేరు పొందాడు రవివర్మ. ఆ రోజుల్లోనే అతి గొప్పదైన 'వీర శృంఖం' అనే బిరుదునిచ్చి ట్రావెంకూర్ మహారాజు రవివర్మను సత్కరించాడు. ఒక భారతీయ చిత్రకారుడికి పెద్ద ఎత్తున అలాంటి గౌరవం అభించడం అదే ప్రధమం.
1888 ప్రాంతంలో బరోడా మహారాజు రవివర్మ వేసిన 14 వర్ణ చిత్రాలకు యాభై వేల రూపాయలను కానుకగా యిచ్చాడు. ఇప్పటి రేటుతో చూస్తే అది కొన్ని కోట్ల రూపాయలతో సమానం. రవివర్మ చిత్రాలన్నీ చాలా నిండుగా వుంటాయి. ఈయన చిత్రాలన్నీ భారత పురాణ ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలే. దేవుళ్ళ బొమ్మలకు ఆకృతి కల్పించిన మొట్టమొదటి చిత్రకారుడు రవివర్మ అని చాలామందికి తెలీదు.
ఏక్షన్ స్టిల్స్ ను చిత్రంగా మలచడం రవివర్మతోనే ప్రారంభమైంది. ఇందుకు ఉదాహరణ రవివర్మ చిత్రించిన జటాయువు రెక్కల్ని ఖండించి, సీతను ఎత్తుకెళుతున్న రావణబ్రహ్మ దృశ్యం.
సీత నిస్సహాయత, జటాయువు ఆశక్తత, రావణుని క్రౌర్యం కళ్ళకు కట్టినట్టుగా ఈ చిత్రంలో మనకు కన్పిస్తాయి. ఇందులో సీతముఖం మనకు కన్పించదు.
దానికి కారణం సీత పాత్రను చిత్రించడానికి రవివర్మ తన మేనకోడలు కంజూతిని మోడల్ గా ఎంచుకున్నాడని చరిత్రకారులు చెప్తారు. తన మేనమామ తనను చిత్రిస్తున్నప్పుడు ఆమె సిగ్గుపడి తల పక్కకు తిప్పుకుందని ఆ భంగిమ నచ్చిన రవివర్మ అలాగే సీతను చిత్రించాడంటారు.
కానీ ఈ దశ్యాన్ని బాగా చూస్తే జటాయువు రావణుడు ఖండిస్తున్న సమయంలో విధ్వంసాన్ని చూడలేక సీత తల పక్కకు తిప్పుకున్నట్లుగా వుంటుంది. అలాగే జటాయువు రెక్క వూడి పడుతున్న దృశ్యం. ఒక అద్భుతమైన ఫోటోగ్రఫీలా మన కళ్ళకు కన్పిస్తుంది.
ఇలాంటి చిత్రీకరణే మహాభారతంలో సైరంధ్రీ వేషంలో వున్న ద్రౌపది చిత్రంలో కూడా కన్పిస్తుంది. అక్కడ కూడా సైరంధ్రీ ముఖం కన్పించకపోయినా హావభావాలు స్ఫుటంగా కన్పిస్తాయి.
అలాగే మోడలింగ్ వ్యవస్తకు కూడా ఆధ్యుడు రాజా రవివర్మ పురాణ పాత్రలే కాదు కంటి ఎదురుగా తిరుగాడిన వ్యక్తులను కూడా రవివర్మ ఎంతో హృద్యంగా చిత్రీకరించాడు. ఉదయ్ పూర్ కు చెందిన రాయ్ పన్నాలాల్ మెహతా చిత్రం చూస్తే ఒక చిత్రానికి ప్రాణం పోయడం అంటే ఏమిటో తెలుస్తుంది. పేదరికం అని పేరు పెట్టి ద్రిమ్మరుల బొమ్మలిని కూడా రవివర్మ వేశాడు.
ఆ బొమ్మల్లో పాత్రలు బక్కచిక్కి వుండవు. దానికి కారణం రవివర్మకు పేదరికం తెలీదని చాలామంది విమర్శలు విమర్శించారు. కానీ రవివర్మకు పేదరికం తెలుసు. కానీ హృదయవిదారకతను చిత్రీకరించడానికి అతని మనసు అంగీకరించలేదని కొంతమంది వాదిస్తారు.
రవివర్మ చిత్రించిన చిత్రాలలో అదుగో నాన్న వచ్చాడు అనే చిత్రం చాలా గొప్ప ప్రశంసలు పొందింది. ఆ చిత్రంలో ఆయన కూతురినే మోడల్ గా వుపయోగించుకున్నాడని అంటారు. 1893లో ఆ చిత్రాన్ని రవివర్మ చిత్రించాడు.
రవివర్మ చిత్రాలకు అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి గల కారణం, ఆయన చిత్రాల్లో ప్రధానంగా కనిపించే భారతీయ సౌందర్యం, రంగుల కలయిక. అంతవరకూ రంగుల మేళవింపులో నిష్ణాతులైన పాశ్చాత్య చిత్రకారులు సైతం రవివర్మ చిత్రాల్లోని రంగుల కలయికను చూసి అద్భుత స్పందనకు గురయ్యేవారు.
ప్రఖ్యాత చిత్రకారుడు బాబూరావ్ పద్వేలేకర్ రవి వర్మ చిత్రాలను ప్రశంసిస్తూ రవివర్మ వజ్ ఎ మాస్టర్ ఆఫ్ కలర్స్ అన్నాడు. రంగుల్లోంచి కాంతుల్ని ఉత్పత్తి చేయడం, రవివర్మ చిత్రాలను బాగా పరిశీలన చేసిన వారికే కన్పిస్తుంది.
దాదాపు వందేళ్లు దాటినా ఈనాటికి కూడా రవివర్మ చిత్రించిన చిత్రాల్లో రంగులు చెరిగిపోక, మాసిపోక వున్నాయంటే అందుకు పూర్తిగా అతని ప్రతిభే కారణం. ప్రస్తుతం రవివర్మ ఒరిజినల్ చిత్రాలు త్రివేండ్రం లోని శ్రీ చిత్ర ఆర్ట్ గ్యాలరీలోను, ఢిల్లీలోని ఆర్ట్ గ్యాలరీలోనూ వున్నాయి.
రవివర్మ చిత్రాల్లోని స్త్రీలు కట్టుకొనే చీరకట్టును చూసి ఆనాటి మహారాజులు, యువరాజులు అలా చీర కట్టుకోడానికి ప్రయత్నించారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. 1894 ప్రాంతాల్లోనే రవివర్మ చిత్రాలు ఒక్కొక్కటి యాభై వేల రూపాయలకు పైగా అమ్ముడుపోయేవి. వీదేశీయులు ఆ చిత్రాలు తమకు కావాలని కోరడంతో తన చిత్రాలను ప్రింట్ చేసుకుని అమ్మడానికి బొంబాయిలో ఒక ప్రెస్ పెట్టాడు రవివర్మ. ఒక చిత్రకారుడు పెట్టిన మొట్టమొదటి ప్రెస్ అది. ఆ ప్రెస్ ద్వారా చాలా నష్టపోయాడు రవివర్మ.
దేవతలకు రూపాన్నిచ్చిన మొదటి చిత్రకారుడు రాజా రవివర్మ. ప్రస్తుతం మనం గోడలకు, పూజా మందిరాల్లో పెట్టుకునే సరస్వతి, లక్ష్మి, కృష్ణుడు వగైరా దేవుళ్ళ పటాలన్నీ పందొమ్మిదో శతాబ్దం చివరిలో రవివర్మ చిత్రించిన చిత్రాలే! భారతీయ చిత్రకళ ప్రాథమిక అంశాలకు పాశ్చాత్యుళ మెలకువలను జోడించి ఆయిల్ పెయింటింగ్స్ గీసిన మొదటి వ్యక్తి రవివర్మ.