అతనికి నేనంటే ఇష్టమా? కేవలం స్నేహపూర్వకమయిన అభిమానమా?
అయితే?
అక్కడే ఆగిపోయాయి ఆమె ఆలోచనలు.
* * *
ఉదయం 5 గంటలకే లేచిన అన్విత టెర్రస్ మీదకెళ్ళి, భూమ్మీద నీలి తివాచీ పర్చినట్లున్న సముద్రంకేసి చూస్తూ స్కిపింగ్ చేయటం ప్రారంభించింది.
1999 సెప్టెంబర్ ఎలక్షన్స్ హడావిడి ఉదయం ఆరుగంటలకే ప్రారంభం కావటంతో అన్నపూర్ణమ్మ కూడా విసుక్కుంటూ నిద్ర లేచింది.
కాఫీ చేసుకుని, నెమ్మదిగా సిప్ చేస్తూ సింహద్వారం వరకు వచ్చింది.
సరిగ్గా అప్పుడే ఎలక్షన్స్ లో నిలబడుతున్న ఏదో పార్టీ తాలూకు జీపులు వచ్చి, సరిగ్గా ఆ ఇంటి ముందే ఆగాయి.
గోలగోలగా పార్టీ పాటలు వినిపిస్తున్నాయి. ఆ జీపులకు నలువైపులా కట్టిన మైకుల్లోంచి.
చూస్తుండగానే ఏడెనిమిది మంది వరకూ పార్టీ కార్యకర్తలు గేటు తీసుకుని లోనికొచ్చి, అన్నపూర్ణమ్మకి నమస్కరించి.
"దయచేసి మీ ఓట్లన్నీ మా పార్టీకే వేయాలి" అంటూ ముక్తకంఠంతో అన్నారు.
అసలే ఇరిటేషన్ లో వున్న అన్నపూర్ణమ్మకి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంది.
"పార్టీపరంగా అయితే తెలుగుదేశానికి, అభ్యర్థులపరంగా అయితే చంద్రబాబుకి, దేవినేని రమణకి మాత్రమే ఓట్లు వేయాలి.
ఇరవై నాలుగు గంటలూ చాలని శ్రమతో శ్రమించింది వాళ్ళిద్దరే.
విధి గోదావరి ఎక్స్ ప్రెస్ రూపంలో వక్రించకపొతే, రమణను అకాల మృత్యువు కబళించకపొతే, నందిగామ నియోజకవర్గం మరో మినీ ఇజ్రాయిల్ అయ్యేది- మిగతా ఎం. ఎల్. ఏల కు గొప్ప మార్గదర్శకుడయ్యేవాడు.
తన రాజకీయ ప్రస్థానానికి ఉత్తేజాన్నిచ్చింది నందిగామ నియోజకవర్గాన్ని రాష్టంలో నే గొప్ప అభివృద్ధికి నిలయంగా మార్చాడు.
మహాత్మాగాంధీ ఒక గ్రామం ఎలా వుండాలో, ప్రవచించిన వేదవాక్కుకు, అక్షరాల నిదర్శనం ఆ నియోజకవర్గం.
మీకు తెలుసా మా అసలు ఊరు? మాది కంచికచెర్ల దగ్గరున్న మున్నలూరు అనే గ్రామం.
అందుకే ఇవన్నీ, ఇంత వివరంగా చెప్పగలుగుతున్నాను.
వెంకటరమణ పాదం క్షణం తీరికలేకుండా మా నియోజకవర్గంలోని 128 గ్రామాలను స్పృశించింది.
కాలినడకకు కూడా వీలుకాని కొండల్ని, కోనల్ని, తుప్పల్ని తొలగించి, మంచిదారుల్ని వేయించారు.
సాగర్ కాల్వల మరమ్మతుల మహాయజ్ఞాన్ని పూర్తిచేసిన మొదటి ఎంఎల్. ఏ అతను. దళారీల బారినుండి తప్పించి రైతులకు నేరుగా ఎరువుల్ని, పురుగుల మందుల్ని అందించి, రైతులు అప్పులపాలు కాకుండా రాష్ట్రంలోనే ఆ తరహా ప్రక్రియకు శ్రీకారం చుట్టిన మొట్టమొదటి ఎం.ఎల్.ఏ ఆయన. మూడు దశాబ్దాల క్రితం డాక్టర్ కె.ఎల్. రావు ప్రారంభించిన పంపింగ్ స్కీమ్స్ ని బాగుచేయించి, కొత్త పంపింగ్ స్కీమ్ ని యుద్ధ ప్రాతిపదికపై పూర్తిచేసి, నేలతల్లి కన్నీళ్ళను తుడిచిన అపర భగీరధుడాయన.
ఎన్నెన్ని పథకాలు?
ఎన్నెన్ని ప్రణాళికలు.....?
వ్యక్తిగా మొదలై, సమూహశక్తిగా వెలిగిన నిరంతరం ప్రజ్వలన స్ఫూర్తి ఆయన.
ఆయన చనిపోయాక, ఆయన ఆఫీసు రూమ్ ని, ఆయన తమ్ముడు ఉమామహేశ్వరరావు సర్దుతుంటే, ముఖ్యమంత్రిని అడాగాలనుకున్న 28 ప్రాజెక్టులకి సంబంధించిన ఫైల్స్ కనిపించాయట.
అదీ నాయకుడంటే....
అదీ ప్రజా ప్రతినిధి అంటే....
ఓట్లు సమయంలో జెండాలు పుచ్చుకొని రావటం- ఎలక్షన్స్ అయిపోగానే ఎలుకలు కలుగుల్లోకి దూరిపోయినట్లు, ఎం. ఎల్.ఎ క్వార్టర్స్ లోకి దూరిపోవటం, నియోజకవర్గ ప్రజల్ని మర్చిపోవటం, పైరవీలు చేసుకోవటం- పైసలు సంపాదించుకోవటం, మాట్లాడితే ఢిల్లీ పరుగెత్తటం తప్ప మరేదైనా చేస్తున్నారా? అసెంబ్లీ సమావేశాలప్పుడు తప్ప, మిగతా సమయాల్లో ఎంఎల్ ఏలు ఎక్కడుండాలి? ఎక్కడుంటున్నారు? గెలిపించిన పిచ్చి ప్రజలు, పలు సమస్యలతో గ్రామాల్లో నలుగుతుంటే, గెలిచినా ఎంఎల్ ఏలు హైదరాబాద్ లో తిష్టవేసి, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల కొం పైరవీలు చేసుకోవటం, కుటంబాల్ని రాష్ట్ర రాజధానికి మార్చి, పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్స్ లో చేర్పించి లక్షలు, కోట్లు గడించటం.... ఇదా న్యాయం.....?
సిగ్గు లేదూ ఓట్లు అడగటానికి 36 సంవత్సరాలు పరిపాలించారు రాష్ట్రాన్ని ఎం సాధించారు? ఇచ్చిన సమయం చాలలేదా? సిగ్గు లేకుండా మరలా ప్రజల ముందుకొస్తున్నారు.........?
దేశం మొత్తం మీదే దేవినేని వెంకటరమణలాగా పనిచేసిన ఎంఎల్ ఏ గానీ, చంద్రబాబులా రాత్రింబవళ్ళు పనిచేసే ముఖ్యమంత్రిగాని చూపించగలరా? ఒక్కరంటే ఒక్కర్ని....?
ప్రజలకు కావలసింది పనిచేసే నాయకుడు- పబ్బం గడుపుకెళ్ళే స్వార్థపరులు కారు.
ప్రజలు తెలివిమీరిపోతున్నారు- దశాబ్దల తరబడి మాయమాటలకి మోసపోవటానికి సిద్ధంగా లేరు...." దులిపి పడేసింది అన్నపూర్ణమ్మ.
వచ్చినపార్టీ కార్యకర్తలు షాక్ తిని దిష్టిబొమ్మలా మిగిలిపోయారు.
లేచిన వేళావిశేషం అనుకుంటూ కాళ్ళకు బుద్ధి చెప్పారు.
* * *
సాయంత్రం నాలుగున్నర దాటింది.
మబ్బులేసిన ఆకాశం సర్కస్ గుడారంలా వుంది.
మెయిన్ గేట్ ముందు మారుతీకారు ఆగడం, అందులోంచి పొడవాటి వ్యక్తి ఠీవిగా నడుచుకుంటూ లోనికిరావడం గమనించింది అన్విత.
డోర్ వరకూ వచ్చిన అతను-
"మే ఐ కమిన్" అని అన్నాడు.
"ఎస్" అంది అన్విత.
"నేనెవరో చెప్పుకోచూద్దాం...." అన్నాడతను వచ్చి సోఫాలో ఆమెకు కొంచెం దూరంలో కూర్చుంటూ.
ఏకవచనంతో పిలవడం, అన్ని కుర్చీలుంటే సోఫామీదే కూర్చోవడంతో చిర్రెత్తుకొచ్చింది అన్వితకు.
"అనూ..... మార్చిపోయావా? నేను అనురాగ్ ని."
అనురాగ్!
మేనమామ కొడుకు.
"అమెరికాలో వుండాలి కదా... ఇక్కడ..."
"అదేంతే! అమెరికాలో ఆవకాయ వ్యాపారం ఫెయిలైంది. ఇక్కడ కంప్యూటర్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మూడేళ్ళయింది. రెండుసార్లు ఢిల్లీ వచ్చినప్పుడు మీ ఇంటికొచ్చాను నువ్వు లేవు."
ఇక్కడ చెయ్యాల్సిన బిజినెస్ అక్కడ....... అక్కడ చెయ్యాల్సిన బిజినెస్ ఇక్కడ చేస్తే అంతేమరి..... అనుకుంది అన్విత.
అదే సమయంలో బెడ్ రూం లోంచి బయటికొచ్చిన అన్నపూర్ణమ్మను చూడగానే నమస్కరించాడు. కుశలప్రశ్నలు వేశాడు.
"నువ్వేంటి ఇక్కడ?" అడిగిందామె.
"మీ మనవరాలికోసం వచ్చేశాను" అన్నాడు జోగ్గా.
అనురాగ్ మీద సాప్ట్ కార్నర్ వుంది అన్నపూర్ణమ్మకు- అన్వితను, అనురాగ్ కిచ్చి పెళ్ళిచేస్తే ఇద్దరూ అమెరికాలో వుంటారనే ఆశతో, దానికి ఒక కారణం అమెరికా అంటే అన్నపూర్ణమ్మకు వుండే ఇష్టం.
"వచ్చేస్తే ఇచ్చేస్తారేంటి..... అనకాపల్లిలోనూ, అగనంపూడిలోను వుండేవాళ్ళకి అన్వితను చచ్చినా ఇవ్వను" ఖరాకండీగా చెప్పేయడంతో ఏం చెప్పాలో తెలీక వెర్రివాడిలా నిలబడిపోయాడతను.
వచ్చే నవ్వును ఆపుకోడానికి ప్రయత్నిస్తోంది అన్విత.
"మంచోడే కానీ..... డబ్బు మనిషి..... ఫోజెక్కువ" అంది అన్నపూర్ణమ్మ చిరాగ్గా.
* * *
సాయంత్రం సరిగ్గా ఆరున్నరకి డాక్టర్ అనంత్ వచ్చాడు. అప్పుడే కొమ్మకు పూచిన సంపెంగపువ్వులాంటి అమ్మాయి.
"మీట్ మిస్ శ్రావణి..... మై ఓన్లీ డాటర్...... మొన్ననే ఫస్టే ఇంటర్ ఎగ్జామ్స్ రాసింది. ఈవిడ అన్విత- ఈరోజు నుంచి నీ ఫ్రెండ్. ఆవిడ....."
"నాన్నమ్మగారూ....." అంది శ్రావణి.
కాఫీలయ్యాక అందరూ. నేచర్ క్యూర్ హాస్పిటల్ కి వెళ్ళారు. ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనంత్.
తన అసిస్టెంట్ పరశురామ్ ని పరిచయం చేశాడు.
"పిన్నిగారూ! ఇక నుంచి మీ రెస్పాన్స్ బులిటీ అంతా పరశురామ్ డే. గుడ్ డాక్టర్. ఫారిన్ రిటర్డ్న్...."
పరశురామ్ కి ముప్ఫై ఏళ్ళుంటాయి. హేండీక్యాప్డ్..... కుడికాలుకి చిన్నప్పుడు పోలియో సోకడంవల్ల, హేండ్ స్టిక్స్ సాయంతో నడుస్తాడు. మనిషి అందంగా, ఆరోగ్యంగా వున్నాడు.
అన్నపూర్ణమ్మను పరిచయం చేస్తున్నప్పుడు అతని చూపులు అన్విత మీదే వున్నాయి.
అన్వితను కూడా పరిచయం చేశాడు డాక్టర్ అనంత్.
"మిస్ అన్విత..... మా పరశురామ్ కి పిన్ టు కంప్యూటర్ చిప్..... దేనిమీదైనా అనర్గళంగా మాట్లాడగలడు. నీకే డౌటోచ్చిన హికెన్ క్లారిఫై విత్ అవుట్ ఎనీ రిఫరెన్స్" చెప్పాడాయన.
గౌరవంగా నమస్కరించింది పరశురామ్ కి అన్విత.
ప్రైమరీ టేస్ట్ లు గంటలో ముగిశాయి.
అనంత్ హాస్పిటల్లోనే వుండిపోయాడు. కారుని పరశురామ్ డ్రైవ్ చేస్తున్నాడు.
దారిలో చెప్పాడు పరశురామ్.
"మీకు కారు కావాలంటే నాకు ఫోన్ చేయండి...... లేకపోతే నా రెండు కార్లలో ఒకటి మీ దగ్గరుంచమంటే వుంచేస్తాను. డాక్టర్ అనంత్ గారు చెప్పారు" అన్నాడు పరశురామ్.
నాన్నమ్మ వైపు చూసింది అన్విత.
"అవసరమయినప్పుడు ఫోన్ చేస్తాం బాబూ!" అందామె.
వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు డాక్టర్ పరశురామ్.
ఆరోజు రాత్రి శ్రావణి అక్కడే వుంది.
తనుతన ఫ్రెండ్స్ వైజాగ్, భీమిలి...... కైలాసగిరి కొండమీద శివాలయం, ఏరాడకొండ, సింహాచలంలో సంపెంగ తోటలు గుర్తుకు తెచ్చుకుంటూ-
"ఒక్కో సండే- ఒక్కో ప్లేస్ చూద్దాం- సరేనా?" ఉత్సాహంగా అంది శ్రావణి.
చిర్నవ్వుతో తలూపింది అన్విత.