Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 27

   

    ఆమె కప్పటికి కొద్దిగా మంట తగ్గింది.
   
    "నువ్వు మాట్లాడే మాటలు నాకు కొన్ని అర్ధం కావటం లేదు......కొయ్యకు అంటే...?"
   
    "అమ్మో నువ్వో పెద్ద జంతర్ మంతర్."
   
    అప్పుడే సర్వర్ తెచ్చిన పకోడీ ప్లేట్ ని ఆమె ముందుకు జరుపుతూ.
   
    "అదిగో మరలా మరో బేడ్ వర్డ్ అన్నావ్..... ఇప్పటికి మూడన్నావ్...." అందామె బుంగమూతితో.
   
    "సర్లే.... ముందవి తిను ఆకలేస్తుంది" అన్నాడు తను పకోడిని నోట్లో వుంచుకుంటూ.
   
    "వేరీజ్ స్పూన్...?"
   
    "ఇదేం స్టార్ హోటల్ కాదు. చేత్తో తిను..." అన్నాడు తను దారిన తను తింటూ.
   
    ఆమె అలాగే ఆత్రంగా తింటున్న మాధుర్ కేసి చూస్తూండిపోయింది.
   
    ఒకింతసేపటికి మాధుర్ తలెత్తి ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తూ- "తిను" అని కొద్దిక్షణాలాగి "సర్లే.... ఇదో ఉద్యోగం నాకు" అంటూ పకోడీ ఆమె నోటికి అందించాడు.
   
    పుట్టిన దగ్గర్నుంచీ అంతవరకూ ఆమె గోల్డ్ స్పూన్ తో, వెండి పళ్ళెంలో న్యూట్రిషన్ స్పెషలిస్ట్ పేర్చిన పదార్దాలే తినేది.
   
    అందుకే ఆమె మరింత ఆశ్చర్యపోతూ నోరు తెరిచి చప్పున కొరికింది మాధుర్ కేసి చిలిపిగా చూస్తూ.
   
    వెంటనే ఇబ్బందిగా పెట్టింది ముఖం.
   
    ఆమె దాన్ని వెంటనే బయటకు తీసి దానికేసి చూస్తూ "ఇదేమిటి ఇంత హార్డ్ గా వుంది? దీన్నేమంటారు?" అంది పళ్ళు నెప్పి పుడుతుండగా.
   
    అతను తిక్కగా అన్నాడు.
   
    "అది ఛికోరా ఢమ్... ఇప్పుడే చైనా నుంచి తెప్పించారు అది"
   
    "మరింత హార్డ్ గా వుందేం?" ఆమె అమాయకంగా అడుగుతుంటే అతనికి పిచ్చెక్కిపోతోంది.
   
    "చైనాలో బయలుదేరి ఇక్కడకు వచ్చేసరికి పదిహేడురోజులు పడుతుంది గదా! అందుకే అది ఈలోపు ఎండిపోయింది" అన్నాడు.
   
    "ఓహో..." అందామె నిజమే అని భావిస్తూ.
   
    "తిను.... ఆకలేస్తుంది" అన్నాడు మాధుర్ తన ప్లేట్ లోని ఆఖరి పకోడీ తింటూ.
   
    "ఎలా..... పళ్ళు నొప్పెడుతున్నాయి..."
   
    "నీళ్ళలో నానపెట్టుకొని తిను..."
   
    "నీళ్ళు కంటామినేట్ అయినట్లున్నాయి..."
   
    "నీళ్ళేమయినాయమ్మా..." అప్పుడే వచ్చిన సర్వర్ అడిగాడు.
   
    "కంటామినేట్ అయ్యాయి" మౌనిక చప్పున అనేసింది.
   
    "అంటే?" సర్వర్ కి అర్ధంకాక అడిగాడు.
   
    "అంటే.... నాకు తెలుగులో దాన్నేమంటారో తెలీదు.... నువ్వు చెప్పు మధు" అంది ఆమె బ్రతిమాలుతున్నట్లు.
   
    అతడికప్పటికే మతిపోయింది.
   
    సర్వర్ తిరిగి అడగడంతో- "నీళ్ళు కలుషితమయ్యాయని అంటోంది" అన్నాడు మాధుర్.
   
    "మనుషులే కలుషితమయిపోయారు. నీళ్ళు కాకేం చేస్తాయ్. ఒకవేళ మంచినీళ్ళిచ్చినా అవి మనిషి కడుపులోకెళ్ళి అక్కడ కుళ్ళుతో కలిసి తిరిగి కలుషితమయిపోతాయి" అన్నాడు అతను వేదాంతిలా నవ్వుతూ.
   
    "మరో ప్లేట్ చికోరా డమ్ డమ్ ప్యాక్ చేసిస్తావా?" సర్వర్ ను అడిగింది భార్గవకు తీసుకెళ్దామనే ఉద్దేశ్యంతో.
   
    అతనో క్షణం పిచ్చిచూపులు చూశాడు.
   
    తనేదో తమాషాగా చెప్పిన మాటని నిజమనుకుని అడిగేసిందా? లేక ఏడిపించడానికా?
   
    మాధుర్, సర్వర్ తనకేసి ఎందుకిలా పిచ్చిచూపులు చూస్తున్నారు"? ఆమె కర్ధం కాలేదు.
   
    "ముందు మనం త్వరగా ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి. లేదంటే వాళ్ళందరికీ పిచ్చెక్కినా ఎక్కవచ్చు" అన్నాడు ఆమెను బలవంతాన లేపుతూ.
   
    మాధుర్ రెండడుగులు అటుకేసి కదలగానే "పాపం నీకెన్ని కష్టాలొచ్చాయో... అతనికీ అన్నీ వచ్చాయి. పకోడీ మధ్యతరగతి మనుష్యులకు ఎంతో ఇష్టమైన వంటకం! ప్రతిదీ తెలీకపోయినా తెల్సినట్లు నటించు లేదంటే వాళ్ళను ఎర్రగడ్డకు పంపించాల్సి వుంటుంది. ఆరోగ్యం జాగ్రత్తమ్మా..." అన్నాడు రమణయ్య చిన్నగా.
   
    ఆమె ఆయన మాటలకు ఉలిక్కిపడి "మార చికోరా ఢమ్ ఢమ్?" అనడిగింది ఆయనకేసి చూడకుండానే.
   
    "అతనికి నువ్వు ఉడికిస్తున్నావని అనుమానం వచ్చి అన్న పిచ్చి మాటది."
   
    ఆమె ఫక్కున నవ్వేసింది.
   
    చుట్టుప్రక్కల వున్నవాళ్ళు ఆమె అలా హఠాత్తుగా నవ్వడంతో ఉలిక్కిపడ్డారు.
   
    "పాపం నీ తప్పేం లేదు. నువ్వు ఎదిగిన వాతావరణం అలాంటిది. కానీ ఇలా ప్రతీసారీ, ప్రతీచోట, ప్రతి విషయంలో నువ్విలా అందర్నీ ఆశ్చర్యపరిచావనుకో అతనికి పిచ్చెక్కినా ఎక్కవచ్చు. కొంచెం జాగ్రత్తగా వుండమ్మా... వస్తాను. ఆ... అసలు విషయం మరిచాను.... సహజీవన సౌందర్యంలాంటి మాటలు నీ అనుభవంలోంచి రావడం అంత మంచిది కాదు. అప్పుడు నీ లక్ష్యం దెబ్బతిని భావుకతని నమ్ముకోవాల్సి వస్తుంది. వస్తానమ్మా! రేపే నీ పథకంలోని మొదటి అంకం ఫలితాల్ని సాధించాలి" రమణయ్య ఎటో చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు.
   
    మౌనిక చటుక్కున లేచి అప్పటికే బిల్లు పే చేసి బయటకు వెళ్ళిన మాధుర్ ని కలిసేందుకు వడివడిగా వెళ్ళిపోయింది.
   
                               *    *    *    *    *
   
    "ఇంతకీ నీ పరిస్థితి ఏమిటి... ఎక్కడుంటావు? నీకేదైనా ఇల్లు వుందా"? నీ వాళ్ళెవరయినా వున్నారా?" తిరిగి రాగానే మాధుర్ మౌనికను అడిగిన తొలి ప్రశ్నది.
   
    క్షణకాలం ఆమెకేం చెప్పాలో తోచలేదు.
   
    "చెప్పు... సందేహించకు...." అన్నాడు భార్గవ.
   
    "నాకెవరూ లేరు.... నేనో అనాధను.... వెనుక ఎవరయినా వుంటే మిమ్మల్నెందుకు యిబ్బంది పెడతాను....? గది కూడా లేదు" అంది మౌనిక ఒకింత విచారాన్ని మోముపై పలికిస్తూ.
   
    "కనీసం నీ లగేజీ అయినా వుందా? ఐ మీన్ బట్టలు, సామాను అవి" మాధుర్ ఆశ్చర్యపోతూ అడిగాడు.
   
    "ఒక సూట్ కేసుంది. అదీ నిన్ననే ఎవరో దొంగిలించారు."
   
    "కట్టుబట్టల్తో వచ్చావా?" భార్గవ విస్తుపోతూ అడిగాడు.
   
    అవునన్నట్లు తలాడించింది మౌనిక కోపంగా.
   
    "మా తల్లే... గొప్ప పని చేశావు. ఇప్పుడేమిటి దారి?" మాధుర్ ఏం చేయాలో తోచక అన్నాడు.
   
    భార్గవ మాధుర్ కి సైగచేశాడు లోపలకు రమ్మన్నట్లుగా.
   
    "ఎక్స్యూజ్ మీ..." అంటూ మాధుర్ భార్గవ వెనకే లోపలకు వెళ్ళాడు.
   
    తన భవితవ్యంపై ఓ నిర్ణయం తీసుకునేందుకే వాళ్ళు లోపలకు వెళ్ళారని భావించి ఒకింత సర్వెస్ గా ఫీలయింది.
   
    "నాకెందుకో అనుమానంగా వుంది. ఎవరూ లేరంటుంది. ఒంటరి దాన్నంటోంది. నిజంగానే ఒంటరిదైతే ఇంతకాలం ఎలా నెగ్గుకొచ్చింది? పైగా పెళ్ళయినట్లు లేదు. ఇప్పుడామె పరిస్థితి చూస్తుంటే మనతోనే వుండాలనుకున్నట్లుగా వుంది" సందేహంగా అన్నాడు భార్గవ.
   
    "మరేం చేద్దాం?" మాధుర్ ప్రశ్నించాడు.
   
    "పంపించేయటం మంచిదేమో అనిపిస్తుంది."
   
    "ఛా....ఛా... ఏ అండాలేని ఒంటరి ఆడపిల్ల మన ఆశ్రయం కోరి వస్తే, నిర్దయగా అలా వెళ్ళి పోమ్మనటం మానవత్వ మనిపించుకోదు. పైగా ఆ అమ్మాయి మోములో అమాయకత్వం, మంచితనం, స్వచ్చత కనిపిస్తున్నాయి" మాధుర్ భార్గవకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు.
   
    "కావచ్చు.... కాని రేపు ఈ లోకం మనల్ని వేలెత్తి చూపితే?"
   
    "వెధవ లోకం, మనం చేసేది మంచని మనకనిపిస్తే చాలు. మానవత్వంతో చేసామని మన ఆత్మసాక్షికి అనిపిస్తే చాలు. ఈ లోకం విమర్శించటానికే కానీ చిన్న కష్టమొస్తే ఆదుకొనేది కాదు. మనకోసం మనం బ్రతకాలి. మన ఆలోచనలకే మనం విలువ యివ్వాలి. ఎవరో ఏదో అంటారని అయినా, భయపడి ఒక మంచిపని చేయాలిగాని-చెడ్డపని కాదు" మాధుర్ స్థిరంగా అన్నాడు.
   
    భార్గవ ఒకింతసేపు మౌనంగా వుండి ఏదో ఆలోచిస్తూండి పోయాడు.

 Previous Page Next Page